వైద్యుడి ఎంపిక - దార్ల బుజ్జిబాబు

Physician's choice

విజయపురి రాజ్యానికి రాజు విక్రమసేనుడు. అతడి వద్ద పనిచేసే ఆస్థాన వైద్యుడు అకస్మాత్తుగా చనిపోవడంతో కొత్త వైద్యుడిని నియమించ దలిచారు. అర్హత, అనుభవం ఉన్న వైద్యుడు కావాలని దండోరా వేయించారు. నలుగురు ధరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఒకడిని మాత్రమే తీసుకోవలసి ఉంది. వారిని పరీక్షకు పిలిచారు. రాజు వారికి పరీక్షపెట్టి అర్హతలు ఉన్నవారిని తీసుకుంటాడు. అయితే వేటకు వెళ్లిన రాజు అంతఃపురానికి చేరుకోక పోవటంతో సాయంత్రానికి వాయిదావేశారు. సాయంత్రం అయినా రాజు రాలేదు.

"అడవిలో ఏదో జరిగి ఉంటుంది. లేకుంటే రాజు ఎప్పుడో మందిరానికి చేరుకునేవాడు" అని మంత్రి ఆందోళన పడుతుండగా రాజుపై జంతువులు దాడి చేసినట్టు వేగులు కబురు పంపారు. అంతఃపురంలోని పరివారమంతా రాజును వెదకటానికి వెళ్లారు. వచ్చిన వైద్యులను విశ్రాంతి తీసుకోమని చెప్పి మంత్రి కూడా అడవిలోకి వెళ్ళిపోయాడు. దివిటీలు పట్టుకుని రాత్రంతా వెదికారు. రాజు, ఆయనతో పాటు వెళ్లిన భటులు గాయాలతో పడివున్నారు.

గాయపడిన వారిని అంతః పురానికి చేర్చారు. వారికి చికిత్స చేయమని ఆస్థాన వైద్యుని ఉద్యోగం కోసం వచ్చిన వారిని కోరారు. వారు చికిత్స మొదలు పెట్టారు. వారి ప్రక్కన మంత్రి కూడా ఉన్నాడు. రాజు అపస్మారక స్థితిలోనే వున్నాడు. తగిలిన దెబ్బలకు కట్లు కట్టాలని శరీరమంతా పరీక్షించారు. ఎక్కడా బలమైన గాయాలులేవు. తలకు బలమైన గాయం అయితేనే తెలివి కోల్పోయే అవకాశం ఉంటుంది. తలపై కూడా ఎలాంటి గాయాలు లేవు.

వారిలో ఒక వైదుడు ఇలా అన్నాడు. "మహా మంత్రి! ఇది వైద్య శాస్త్రానికి అంతుచిక్కడం లేదు. గాయాలు కాకుండ తెలివి కోల్పోవడం అరుదు. ఎలా జరిగిందో రాజు లేస్తే గాని తెలియదు" అన్నాడు. "ఒక్కోసారి భయం వల్ల కూడా ఇలాంటి స్థితిలోకి వెళ్లవచ్చు. ఈ స్థితి నుండి మేల్కొల్పడం చాలా కష్టం. రాజుకు మెలుకువ రావటానికి ఎన్ని రోజులైన పట్టవొచ్చు" అన్నాడు ఇంకో వైద్యుడు. ఇలాంటి సంఘటనలు చాలా చూసాను. ప్రాణం ఉంటుంది. శ్వాస మామూలుగానే ఆడుతుంది. కానీ నిర్జీవంగానే ఉండిపోతారు. ఇలాంటివి మాములు విషయాలే. రాజు కోలుకుంటే కోలుకోవొచ్చు లేదా ఇలాగే ఉండిపొచ్చు. యాభై శాతం అవకాశాలు ఉన్నాయి. అంతా ఆ దేవుడి దయ" అన్నాడు మరో వైద్యుడు.

నాలుగో వైద్యుడు మౌనంగా వున్నాడు. మంత్రి అతడి వంక చూసాడు. వైద్యుడు మరోమారు రాజు నాడిని పరీక్షించాడు. ఎలాంటి అనారోగ్యం కనిపించలేదు. " మంత్రివర్యా! మరేం భయం లేదు. రాజు తెల్లవారేసరికి కోలుకుంటారు. నిచ్చింతగా ఉండండి. నేను హామీ ఇస్తున్నాను. ధైర్యంగా వెళ్లి హాయిగా పడుకోండి" అన్నాడు. మంత్రి ప్రాణం స్థిమిత పడింది. వెళ్ళిపోయాడు. వైద్యులు కూడా వారికి ఏర్పాటు చేసిన విడిదికి వారు వెళ్లిపోయారు. తెల్లవారింది. రాజు పరిస్థితి ఎలా ఉందొ చూడాలని ఆతృతగా వచ్చాడు మంత్రి. అప్పటికే నాలుగో వైద్యుడు వున్నాడు. మంత్రి ఆశ్చర్యపోతూ "అప్పుడే వచ్చారేం?" అన్నాడు. "నేను రాత్రే వచ్చాను. రోగిని వదిలి వెళ్లడం వైద్య ధర్మం కాదు. క్షణక్షణం రాజు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు రాజుపై ఏ దాడి జరగలేదు. శరీరంలో ఎలాంటి మార్పు లేదు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా వున్నాడు. కాబట్టి తప్పకా కొలుకుంటారు" అన్నాడు వైద్యుడు. చప్పట్లు కొడుతూ లేచాడు రాజు.

"అమాత్యా! ఇతడినే ఆస్థాన వైద్యుడుగా నియమించండి. వైద్యుడెప్పుడు రోగికి అనుకూలమైన మాటలే చెప్పాలి. రోగి పరిస్థితి గమనిస్తూ ఉండాలి. పనిలో అంకితభావం ఉండాలి. చివరి వరకు రోగి స్వస్థతపై ఆశ వదులుకో కూడదు. ఈ గుణాలన్ని ఇతడిలో ఉన్నాయి" అన్నాడు. రాజు ఆజ్ఞ ప్రకారం మంత్రి అతడినే ఆస్థాన వైద్యుడుగా నియమించాడు. మిగిలిన ముగ్గురిని ఇంటికి పంపారు. వైద్యుడు నియామకం కోసం రాజు, మంత్రి కలిసే ఈ వేట నాటకం ఆడారనే విషయం వారిద్దరికీ తప్ప మరెవరికి తెలియదు.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల