అత్యాశకు పోతే - సరికొండ శ్రీనివాసరాజు‌

If greedy

రామయ్య మోతుబరి రైతు. అతని కష్టానికి తగ్గట్టుగా మంచి ఆదాయం వచ్చేది. పెద్ద ఖరీదైన ఇంటిని కూడా కట్టించాడు. రామయ్యకు ఇద్దరు కుమారులు. సోమయ్య, భీమయ్యలు. సోమయ్యకు పెళ్ళి అయింది. రామయ్య అనే అవసాన దశలో తన పెద్ద పొలాన్ని, ఇంటిని రెండు సమ భాగాలుగా చేసి, కుమారులకు పంచినాడు. సోమయ్య భార్య కాంతమ్మ గయ్యాళి. సోమయ్యతో గొడవ పడి, భీమయ్య పేరు మీద ఉన్న పొలాన్ని, ఇంటి భాగాన్ని కూడా సోమయ్య పేరు మీద రాయించుకుంది. అమాయకుడైన భీమయ్యను ఇంటి నుంచి వెళ్ళగొట్టించింది. క్రమంగా సోమయ్యలోనూ స్వార్థ బుద్ధి పెరిగింది.

భీమయ్య ఏడుస్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ రెండు మూడు ఊళ్ళు దాటి, ఒక ఊరిలో ఒక కిరాణ దుకాణం ముందు చేరాడు. దుకాణంలో చిరుతిళ్ళను అడిగాడు. తీసుకున్నాక డబ్బులు లేవని ఏడుపు మొదలు పెట్టాడు. షాపు యజమానికి తన కథను చెప్పుకున్నాడు. ఆ యజమాని పేరు ఈశ్వరయ్య. ఈశ్వరయ్య జాలిపడి భీమయ్యను తన దుకాణంలో పనిచేయమన్నాడు. భీమయ్య అమాయకుడైనా తెలివైన వాడే. నిజాయితీగా పనిచేస్తూ తన మాటతీరుతో ఆ దుకాణానికి జనం ఎక్కువగా వచ్చేలా చేశాడు. ఆ దుకాణానికి లాభాలు పదిరెట్లు పెరిగాయి. ఈశ్వరయ్య ఆ దుకాణం బాధ్యత పూర్తిగా భీమయ్యకు అప్పజెప్పి, తాను వేరే వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ వ్యాపారం కూడా మంచి లాభాల బాటలో నడిచింది. ఇప్పుడు ఈశ్వరయ్య కోటీశ్వరుడు. మంచి ఖరీదైన ఇంటిని కట్టించాడు. తన కూతురు హైమవతిని భీమయ్యకు ఇచ్చి పెళ్ళి చేశాడు. తన ఖరీదైన ఇంటిని భీమయ్య పేరున రాసి ఇచ్చాడు.

కొన్నాళ్ళ తర్వాత ఈ విషయం తెలిసిన వారి ద్వారా సోమయ్యకు తెలిసింది. సోమయ్య తమ్ముని ఆచూకీ తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత తమ్ముని చూచిన ఆనందాన్ని నటిస్తూ కపట ప్రేమను వ్యక్తం చేస్తూ తమ్మునిపై పడి ఏడ్వసాగాడు. ఈశ్వరయ్యకు తన అన్నను పరిచయం చేశాడు భీమయ్య. తన భార్యకు తన అన్నను పరిచయం చేశాడు. ఇంతలో ఈశ్వరయ్య ఇంట్లో మరో అమ్మాయి కనబడింది. ఎంత అందంగా ఉంది అనుకున్నాడు సోమయ్య. భీమయ్య "అన్నయ్యా! వదిన ఎలా ఉంది?" అని అడిగాడు. "ఇంకెక్కడి వదిన తమ్ముడూ! నన్ను అన్యాయం చేసి, వెళ్ళిపోయింది." అంటూ మొసలి కన్నీరు కారుస్తూ అబద్ధం చెప్పాడు. "ఎలా జరిగింది?" అని అడిగాడు భీమయ్య. బోరున ఏడ్చాడు సోమయ్య. భీమయ్య మళ్ళీ ఏమీ అడగలేదు. సోమయ్య తరచూ తమ్ముని దగ్గరకు వస్తూ పోతున్నాడు.

ఒకరోజు సోమయ్య ఈశ్వరయ్యతో "మీ మొదటి అమ్మాయి పెళ్ళి చేసి, ఉన్న ఇల్లు రాసి ఇచ్చారు. మరి మీ రెండో అమ్మాయి కోసం ఇల్లు ఉందా? ఉంటే అది మొదటి ఇంటికన్నా ఖరీదైనదా? ఏమీ లేదండీ! కుతూహలం కొద్దీ అడిగాను." అన్నాడు. "ఓ నువ్వు ఊహించలేనంత గొప్ప ఇల్లు ఉంది. నువ్వు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు అనుకో." అన్నాడు ఈశ్వరయ్య. మళ్ళీ ఇలా అన్నాడు. "నువ్వు కానీ మా రెండో అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నావా ఏంటి?" అని. సోమయ్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. "మౌనం అర్థాంగీకారం. వెంటనే మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్ళి చేస్తా. నిన్ను కళ్ళు తిరిగి పడిపోయేలా చేసే ఆ రెండవ ఇంటిని నీకు రాసిస్తా! కానీ ఒక షరతు. ఇప్పుడు నీ పేరు మీద ఉన్న ఇంటినీ, పొలాన్ని మొత్తం మీ తమ్ముని పేరున రాసి ఇవ్వాలి. ఎందుకంటే మీ తమ్ముని ఇల్లు మామూలుదే కదా! అవి కూడా ఉంటే మీ తమ్మునికి తగిన న్యాయం జరుగుతుంది." అన్నాడు ఈశ్వరయ్య. ఇంట్లో భార్యకు కూడా తెలియకుండా పత్రాలన్నీ తెచ్చి, ఆస్తి మొత్తం తమ్ముని పేరున రాసి ఇచ్చాడు.

"పెళ్లి నిరాడంబరంగా ఎక్కువ మంది జనాన్ని పిలువకుండా జరగాలి‌." అన్నాడు సోమయ్య. సోమయ్య కోరుకున్న విధంగా, అతనికి నచ్చిన అమ్మాయితో అతి నిరాడంబరంగా పెళ్ళి జరిగింది. ఆ తరువాత సోమయ్య తన కొత్త భార్య పేరున ఉన్న ఇంటిని తనకు రాసి ఇవ్వమని పోరు పెట్టాడు. ఈశ్వరయ్య ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంటిని చూడగానే సోమయ్య కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. తేరుకున్నాక "మోసం! నన్ను అమాయకుని చేసి, నా భవిష్యత్తు అంధకారం చేస్తారా? ఎంతో పేదవాళ్ళు నివసించే పూరి గుడిసె ఇది. నీ రెండో కూతురికి మరీ ఇంత ద్రోహం చేస్తారా?." అన్నాడు. అప్పుడు ఈశ్వరయ్య "నాకు ఉన్నది ఒకే కూతురు. మా పనిమనిషిని చూసి, నువ్వే కదా పెళ్ళి చేయమని కోరింది. నీ చరిత్ర అంతా నాకు తెలుసు. ఒకప్పుడు తమ్ముని మోసం చేసి, వెళ్ళగొట్టావు. నీ భార్య బ్రతికే ఉందని తెలుసుకున్నాం. ఆస్తి కోసం రెండో పెళ్ళికీ సిద్ధపడ్డావు. అందుకే నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడేటట్లు చేశాను. నువ్వు ఎక్కడ ఉన్నా గూఢచారుల ద్వారా నీ వివరాలు తెలుసుకుంటాం. ఈ అమ్మాయికి అన్యాయం జరిగితే నువ్వు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది." అన్నాడు ఈశ్వరయ్య. సోమయ్య అత్యాశకు అతనికి తగినశాస్తి అయింది. సోమయ్య భార్య కాంతమ్మకూ తగినశాస్తి జరిగింది ‌

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం