కాశీ రాజకుమారి కథ - వెంకటరమణ శర్మ పోడూరి

Kasi Raja Kumari Katha

వైజాగ్ లో ఇంజనీరింగ్ చదువుతున్న శ్రీకాంత్, నాలుగు రోజులు శలవలు వస్తే, కాకినాడ లో ఇంటికి వచ్చాడు. అతను వచ్చేటప్పటికే తండ్రి ఆఫీసు కు వెళ్ళిపోయినట్టున్నాడు. తల్లి వంట ఇంట్లో ఉన్నట్టుంది. ఎప్పటిలాగే అతని తాత గారి గది లోంచి మాటలు వినపడుతున్నాయి. సత్సంగం అప్పుడే మొదలయింది అన్న మాట అనుకున్నాడు.

తల్లిని పలకరించి, స్నానం చేసి బట్టలు మార్చుకుని హాలు లొకి వచ్చి కూర్చున్నాడు. అతని మనసులో దారిలో చూసిన ఎక్సిడెంట్ మనసులో మెదలుతోంది. పాపం వాళ్ల తప్పు లేకపోయినా, నడివయసు

దంపతులు వెడుతున్న స్కూటర్ని, వెనకనుంచి లారీ గుద్దడం తో అక్కడి కక్కడే చనిపోయారు.అధ్యారోపం, అపవాదం , ఆభాస వంటి పదాలు తో నిండిన సంభాషణలు తాత గారి గదిలోంచి వస్తూనే ఉన్నాయి. సత్సంగం అయిన తరువాత తాత గారితో మాట్లాడాలి అనుకున్నాడు.

**************

అతని తాత గారు కృష్ణయ్య గారు వేదాంతానికి సంబంధించిన ప్రస్థాన త్రయాన్ని ఔపోసన పట్టి, ఆధ్యాత్మికం గా ఉన్నత స్థితి సాధించారాని, వేదాంతం లో ఆసక్తి ఉన్న వా ళ్ళు అందరూ అనుకుంటారు. అందుకే ఆయన దగ్గరికి వచ్చి శాస్త్ర విషయాలలో సందేహాలు తీర్చుకోవడం మాత్రమే కాకుండా, ఒక్కొక్క గ్రంధం గురించి ఆయన చేత వివరణ చెప్పించు కుంటూ ఉంటారు.

వాళ్ళు మాట్లాడుకునే చాలా సంస్కృత పదాలు శ్రీకాంత్ కి ఎప్పుడూ బోధ పడవు. మామూలు మాటలలో వేదాంతం మాట్లాడుకోకూడదా అని అతను తరుచు అనుకోవడం కద్దు.

అతను పేపర్ చదివి క్రింద పెట్టాడు. పేపర్ లో చాలా మటుకు ప్రపంచం లో జరిగిన ఉపద్రవాలు గురించే. ఒక చోట విమానం కూలితే, ఇంకోచోట నదులు పొంగి, పడవలు మునిగి అనేకమంది మరణించిన విషయాలు. మనము వాటిని వార్తలు గా చదివి పేపర్ పక్కన పెట్టినా, ఆయా కుటుంబాలలో ఎంత విషాదం?

సత్సంగం అయింది కాబోలు, అయిదారుగురు శిష్యులతో బయటికి వచ్చారుక్రిష్నయ్య గారు . శిష్యులు ఆయనకి వినమ్రంగా నమస్కరించి వెళ్లిపోయారు.

" ఎరా ఎన్ని రోజులు శలవలు? ఆలా విచారం గా ఉన్నావేమిటి ?" అన్నారు ఆయన మనవడిని పలకరించి పక్కన కూర్చుంటూ.

శ్రీ కాంత్ తల్లి కళ్యాణి మామ గారికి, కొడుక్కి కాఫి తెచ్చి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది.

" తాత గారూ నాకో సందేహం. అసలు ప్రపంచంలో అన్ని కష్టాలు ఎందుకు ఉండాలి? భగవంతుడు వాటిని ఎందుకు జరగనిస్తాడు? అవన్నీ లేకుండా అయన చేయ లేడా ? " అడిగాడు శ్రీకాంత్

" చాలా పెద్ద ప్రశ్న వేశావు రా ? దీనికి జవాబు నేను రాత్రి చెబుతాను. ఈ లోపులో నువ్వు వెళ్లి స్నేహితులతో గడిపి రా " అని లేచి లోపలికి వెళ్లారు క్రిష్నయ్య గారు.

**************

స్నేహితులతో గడిపి రాత్రి ఇంటికి రాగానే శ్రీకాంత్ కి తాత గారు రాత్రి చెబుతానన్న మాట గుర్తుకు వచ్చింది. భోజనాలు అవగానే ఆయనని అడిగాడు

" ఓహో అదా ? ప్రపంచం ఎందుకు అలా ఉందని అడిగావు కదా ? నీకు ఒక కథ చెబుతాను విను

కాశీ రాజుకు ఒక కొడుకు పుట్టాడు . ఆ రాజకుమారుడు ఆరు సంవత్సరాలు వయసు లో రాజ్యం లో ఏవో ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలలో పిల్లలు వివిధ వేషాలు వేశారు. రాజకుమారుడు కూడా పాల్గొన్నాడు. అతనికి ఒక చక్కటి అమ్మాయి గా వేషం వేశారు. ఆ వేషం తో అతనుకూడా పాల్గొన్నాడు అందరూ మెచ్చుకున్నారు అతను ఆ అమ్మాయి దుస్తులలో ఉండగా, ఆస్థాన చిత్రకారుడు ఓకే చిత్రం గీశాడు. అందులో అమ్మాయి చాలా అందంగా ఉంది. మంత్రి గారు రాజకుమారుడి చిన్నప్పటి రాజకుమారి చిత్ర పటాన్ని, కోటలోనే పాత వస్తువులని భద్ర పరిచే వస్తు శాలలో భద్రపరిచాడు

కొన్ని సంవత్సరాలు గడిచాయి.

రాజకుమారుడు పెద్ద వాడయి ఇరవై సంవత్సరాల యువకుడు అయ్యాడు. ఒక రోజు కోటాలో మంత్రి గారితో కలిసి అన్ని ప్రదేశాలు తిరుగుతూ పురావస్తు శాల కి వెళ్ళాడు. అక్కడ మిగతావి అన్ని చూస్తూ తాను చిన్నప్పుడు వేసిన వేషం యొక్క పటాన్ని చూశాడు. చిన్నప్పుడు జరిగినది పూర్తిగా మరిచి పోయాడు. పటంలో ఉన్న సంవత్సరం బట్టి , చాలా అందం గా ఉన్న రాజకుమారి ఇప్పటికి పెద్దది అయి ఉంటుందని అనుకుని,

" ఈ రాజకుమారి ఎవరో కనుక్కోండి మంత్రి గారు " అని ఆజ్ఞాపించాడు "

అలాగే ప్రభు. ఎందుకో తెలుసుకోవచ్చా ? " అని అడిగారు మంత్రి కుతూహలంగా

" ఈమె చాలా సౌందర్యం గా ఉంది. ఇప్పటికి పెద్దది అయి ఇంకా అందంగా ఉండి ఉండాలి . నేను ఈమెనే వివాహం చేసుకుంటాను.” అన్నాడు వ్యామోహం వ్యక్త పరుస్తూ .

అతనిలో అనేక భావోద్రేకాలిని గమనించారు మంత్రి గారు.

అప్పుడు మంత్రి గారు రాజకుమానుని తో " ప్రభూ ఆమె ఎవరో కాదు మీరే ! " అని రాజకుమారుడు మరిచిపోయిన గతాన్ని వివరించారు

ఆదివినగానే రాజకుమారుని లో అన్ని భావోద్వాగాలు అణగిపోవడం మంత్రి గమనించాడు" అని చెప్పి కథ ముగించారు కృష్ణయ్యగారు.

" ఈ కథ కి ప్రపంచం లో జరిగేవాటికి సంబంధం ఏమిటి తాతయ్యా ?" అడిగాడు శ్రీకాంత్

" ఆ రాజకుమారుడిలాగే అసలు విషయం తెలియక నువ్వు ప్రపంచం లో జరిగేవాటి గురించి భావోద్రేకాలకి గురిఅవుతున్నావు" అన్నారు క్రిష్నయ్య గారు

" కథలో అయితే రాజకుమారుడే ఆ చిత్రం లో ఉన్న రాజకుమారి. మరి ఇక్కడ ?" అడిగాడు శ్రీకాంత్ అర్థం కాక

" నువ్వు రాజకుమారుడి వయితే, రాజకుమారిప్రపంచం అన్న మాట . అంటే నువ్వే ప్రపంచానివి."

" నేనే ప్రపంచానినా ? అర్థం కాలేదు తాత గారు " అన్నాడు విస్మయం తో

"ప్రపపంచంలో ఉన్నదే నీలో ఉంది. నీలో ఉన్నదే ప్రపంచంలో ఉంది" అన్నారు అయన నవ్వుతూ.

“ అదెలాగా ? వివరిస్తారా ?” అడిగాడు శ్రీకాంత్.

" ఒక పనిచేయి. నా గదిలో టేబుల్ మీద కొన్ని కాగితాలు ఉన్నాయి, వాటిలో ఒక కథ ఉంది . అది తెచ్చుకుని చదువు" తరవాత మాట్లాడుదాము " అన్నారు కృష్ణయ్యగారు

" ఎప్పుడో ఎందుకు? ఇప్పుడే చదువుతాను " అని లేచి వెళ్లి ఆ కాగితాలు తెచ్చుకుని చదవడం మొదలు పెట్టి పది నిమిషాలలో పూర్తి చేశాడు

" ఇదేమి కథ తాత గారు? " అన్నాడు ఆయనకేసి చూసి

" ఏమిటి అభ్యంతరం? " అడిగారు అయన నవ్వుతూ "

ఏముంది కథలో ? బాగా డబ్బు ఉన్నవాళ్ల కుర్రాడు. చదువు బాగా చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయినిపెళ్లి చేసుకున్నాడు, అందమయిన పిల్లలు పుట్టారు . వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. అతని చేసిన వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాడు . అంతా సుఖంగా ఉన్నారు "

" పాఠకుడుగా నువ్వు ఏమి ఆశిస్తావు ?" అడిగారు నవ్వుతో

" కథ కానీ , నవల కానీ, కొన్ని కష్టాలు, సమస్యలు ఉండాలి, అవి తీరిన తరువాత, కష్టాలనుండి బయట పడాలి. కథ అంటే అలా ఉండాలి కదా ? " శ్రీకాంత్

" చూశావా ? ప్రపంచంలో ఏవి ఉన్నాయో అవే నువ్వు నీకు తెలియకుండా కావాలని అనుకుంటున్నావు. "

" అయినా నేను ప్రపంచం ఒకటి ఎలా అవుతాము?" అడిగాడు శ్రీకాంత్

" రాత్రి పడుకున్నప్పుడు నీకు కల వస్తోంది. అందులో నువ్వు వేరేగా ఉండి , నీ చుట్టూ ఒక ప్రపంచాన్ని చూడటం లేదూ ?" నువ్వే చూ సేవాడి గాను, చూడబడే ప్రపంచంగాను మారుతున్నావన్న మాట ?" అవునా ?" అడిగారు అయన.

" అది కల మాత్రమే కదా !, మెళకువలో నేను వేరు ప్రపచం వేరు కదా ? " అడిగాడు శ్రీకాంత్

" మెలకువ కూడా కల లాంటిదే, ఇందులోంచి మెలకువ రావాలనే నాదగ్గరికి వచ్చే శిష్యులు ప్రయత్నం చేస్తున్నారు. వేదాంత రహస్యాలు అర్థం చేసుకుంటే నువ్వు కూడా మెలకువ తెచ్చుకోవచ్చు." అన్నారు క్రిష్నయ్య గారు నవ్వుతూ

" అయితే నేను చదువు, ఉద్యోగం మానేసి అవి తెలుసుకోవాలా ? "

" ఏమీ అక్కరలేదు అన్నీ చేస్తూ తెలుసుకోవచ్చు. ఎప్పుడయినా ఎవరయినా తెలుసుకోవచ్చు. ప్రా రంభించడమే ముఖ్యం "

"అయితే నేను కూడా మీ శిష్యుడినే రేపటినుంచి" అని లేచి అయన కాళ్ళకి దండం పెట్టాడు

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి