వచ్చిందే పెళ్ళాం - శింగరాజు శ్రీనివాసరావు

Vachinde Pellam

"అయ్యా. ఇప్పటికి మీ అబ్బాయికి వందకు పైగా సంబంధాలు చూశాను. మా మాట్రిమొనిలో ఇన్ని సంబంధాలు ఇన్ని సంవత్సరాలుగా చూసినవారు లేరు. సంవత్సరానికి వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషను ఫీజు కట్టడానికి మీకు విసుగులేకున్నా, కట్టించుకోను నాకు సిగ్గుగా ఉంది. బిగ్ బాస్ అంత పాపులారిటీ వచ్చిందయ్యా మీ సంబంధానికి. ఇక మావల్ల కాదు. ఇక మాకు ఫోను చెయ్యకండి" అని విసురుగా ఫోను పెట్టేశాడు ప్రముఖ మాట్రిమొని నిర్వాహకుడు చంచలరావు.

"ఓరి వీడి విసురు తగలెయ్య. గూబ అదిరింది. ఏమిటో వీడి జాతకం మరీ పాతికేళ్ళకే ఎవరు పెళ్ళి చేసుకుంటున్నారని కొడుకు భీష్మించుకుంటే, తీరికగా మూడు పదుల వయసులో మొదలుపెట్టాము సంబంధాలు చూడడం, నలభైలో పడ్డా పెళ్ళిపీటలు ఎక్కే అదృష్టం పట్టలేదు వీడికి" అని మనసులో మదనపడ్డాడు మన్మథరావు తండ్రి పరాంకుశం.

**************

ఇక అసలు కథలోకి వస్తే పరాంకుశానికి అంకుశం లాంటి కొడుకు మన్మథరావు. తల్లి ఆండాళు కనుసన్నలలో పెరిగి, ఆమె ప్రతిరోజూ పొగిడే పొగడ్తలను నిజమనుకుని, తనకు తనే సుప్రీమ్ హీరోగా, నవమన్మథుడుగా ఫిక్సయిపోయాడు. కాకి బిడ్డ కాకికి ముద్దనే నానుడి వినక. చేసేది బ్యాంకు ఉద్యోగం, అదీ గ్రామీణబ్యాంకులో గుమాస్తాగిరి. ఈ మధ్య ఆడపిల్లల తల్లిదండ్రులు 'క్విక్ మనీ విత్ ఫారెన్ ట్రిప్' అనే ఉద్దేశ్యంతో సాఫ్ట్ వేరు సంబంధాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ విషయం అలా పక్కనబెడితే, మన మన్మథరావుకు మూడు పదుల వయసు రావడంతోనే సంబంధాలు చూడడం మొదలెట్టింది ఆండాళు. కానీ ఎక్కడా ఎవరూ మొగ్గలేదు. 'ఆ బ్యాంకు వాడికేమిస్తాములే' అని తప్పుకున్నారు. అలా మొదటి అయిదు సంవత్సరాలలో ఓ పాతిక సంబంధాలు చూసినా తెగలేదు, తెల్లవారలేదు. నాకు " నచ్చిందే నా పెళ్ళాం" అనే పక్కీలో సాగింది మన్మథరావు పెళ్ళిచూపుల తతంగం.

కొడుకు చర్యలకు విసిగిపోయాడు పరాంకుశం. సరిగ్గా సంవత్సరం క్రితం జరిగిన సంఘటన మనసులో మెదిలింది పరాంకుశానికి.

***************************

"ఎన్నాళ్ళు ఇలా ఊడగొట్టిన నాగలిలా ఉంటావురా. "గంతకు తగ్గ బొంత" అని నీకు తగిన అమ్మాయితో సర్దుకుని పెళ్ళి చేసుకోరా" బ్రతిమలాడాడు కొడుకును పరాంకుశం.

"నేను అదే గదా చేస్తున్నాను నాన్నా. ఏదీ నా అందానికి తగ్గ అమ్మాయి దొరికితే కదా" ముందువైపు రెపరెపలాడుతున్న జుట్టును సర్దుకుంటూ

"అవును. నిజమే కదండి. నా కొడుకు పక్కన నిలబడితే చిలకలా ఉండాలి. కాకిలా కాదు. నా కొడుకు రాజకుమారుడండీ. వాడికి యువరాణి లాంటి పిల్ల కావాలి. నా చేతిలో నాలుగు రాళ్ళు పడాలి" కొడుకును సమర్థించింది ఆండాళ్ళు.

"మీరు మారరే. వీడి పెళ్ళి చూడాలని ఎదురుచూసి చూసి మా అమ్మ పోయింది. కాస్త రంగు తక్కువయినా, నా మనవడు హరనాథ్ అంత అందగాడని మురిసిపోయిన మీ అమ్మ, వీడికిక పెళ్ళియోగం లేదని దిగులుపడి, రేపో మాపో రాలిపోయేటట్టుంది. మొన్నటికి మొన్న బస్టాండులో నిల్చుని వుంటే, ఎనిమిదేళ్ళ కుర్రాడిని వెంటబెట్టుకుని వచ్చింది ఒక అమ్మాయి. 'అంకుల్ బాగున్నారా' అంటే, ఎవరా అని వెర్రిముఖం వేసుకుని చూస్తుంటే తనే చెప్పింది. 'నేను అంకుల్. మీరు తొమ్మిదేళ్ళ కిందట మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి నన్ను చూడడానికి వచ్చారు. నేను నచ్చలేదని వెళ్ళారు. ఆ మరుసటి వారమే మరో పెళ్ళిచూపులు జరగడం, నేను నచ్చడం, నా పెళ్ళి వెంటనే జరిగిపోవడం జరిగింది. అప్పటిదాకి ముడిపడని నా పెళ్ళి మీరు చూసిపోగానే జరిగింది. ఏమైనా మీ పాదం మంచిది అంకుల్. మాకు శుభం జరిగింది. ఇంతకూ మీకు కోడలు వచ్చిందా?' చకచక చెప్పి నావైపు చూసింది. ఏ సమాధానం చెప్పాలో అర్థంగాక వెర్రినవ్వు నవ్వాను. ఆ అమ్మాయికి అర్థమయిందేమో మరి, 'ఏముందిలెండి. చిన్నగా కుదురుతుంది. ఈ లోపల మీ పాదం ఇంకెంతమందిని పెళ్ళికూతుర్లను చేసివుంటుందో. ఉంటాను అంకుల్' అని వెటకారం చేసి మరీ వెళ్ళింది. తలకొట్టేసినట్టనిపించింది." మనసులో ఎంతో బాధను దాచుకుని మాట్లాడాడు పరాంకుశం.

తండ్రి మాటలతో కొంచెం చలనం కలిగింది మన్మథరావులో. ఒక నాలుగైదు సంబంధాలలో ఎదురైన చేదు అనుభవం అతడిని బాధపెట్టాయి. మరీ ఒకమ్మాయయితే ముఖానే అడిగేసింది. "ఏం చూసి చేసుకోమంటావు. ఆరడుగులున్నావు కానీ అత్తెసరు ఉద్యోగం. గట్టిగా ముప్ఫైవేలు రావు. అవి నా పై ఖర్చులకే చాలవు. నీ జన్మలో ఫారిన్ చూడలేవు. అప్పు చేసి తప్ప సొంత డబ్బుతో కారు కొనలేవు. ఇంతోటి వాడివి, ఇన్నాళ్ళు ఇన్ని సంబంధాలు చూడాలా. ఏదో పల్లెటూరి పిల్లను చూసి ముడిపెట్టుకో. నలభైలో పడబోతున్నావు. నాకు ఇంకా ముప్ఫై రెండే. మన మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ. ఏదో పాతిక లక్షల ప్యాకేజి అయితే ఒప్పుకునేదాన్నేమో. ఇప్పుడు సారీ" అంటూ మెత్తగా చెప్పుతో కొట్టినట్టు చెప్పి వెళ్ళింది.

అది మొదలు మన్మథరావు ఆలోచనలలో మార్పు వచ్చింది. కానీ తల్లిని కాదనలేక పోతున్నాడు.

*********************

మాట్రిమొని వాడు ఫోను చేసినప్పటి నుంచి ఆలోచనలో పడ్డాడు పరాంకుశం. వెతకగా వెతకగా బాగా సీనియరయిన పెళ్ళిళ్ళ బ్రోకరు నెంబరు దొరికింది. ఫోనుచేసి వస్తున్నాని చెప్పి, కావలసిన వివరాలు మొత్తం తీసుకుని కొడుకుతో పాటు బయలుదేరాడు పరాంకుశం.

"రండి. రండి. కూర్చోండి" అని ఆహ్వానించాడు పెళ్ళిళ్ళ బ్రోకరు వరదయ్య. వచ్చి కూర్చున్నారు తండ్రీ, కొడుకులు.

"ఇంతకూ పెళ్ళి ఎవరికి?"

"పెళ్ళి వీడికేనండి. ఇవిగోనండి మీరు కోరినవన్నీ" అని తను తెచ్చిన కవరును అతనికి ఇచ్చాడు పరాంకుశం.

" ఇతనికా" ఆశ్చర్యార్థకంగా చూసి, బయోడేటా చూస్తూనే ఉలిక్కిపడ్డాడు వరదయ్య.

"ఏమిటి మీకు నలభై సంవత్సరాలు దాటాయా? ఇన్నాళ్ళు ఏంచేశారండి"

" వెతుకుతూనే ఉన్నాం. కానీ ఎవరూ నచ్చలేదు"

" ఏమండీ ముప్ఫై సంవత్సరాలలోపేనండీ 'నచ్చిందే పెళ్ళాం' అని భీష్మించుకోవడం. ఆ వయసు దాటితే ఇక 'వచ్చిందే పెళ్ళాం' అని సర్దుకుని పెళ్ళి చేసుకోవాలి. ఇలా అన్నానని ఏమీ అనుకోకండి. అసలే ఆడపిల్లలు తక్కువగా ఉన్న రోజులివి. ఇదిగో ఈ సాఫ్ట్ వేరు ఉద్యోగాలొచ్చిన తరువాత ప్రేమ వివాహాలెక్కువయి పోయి మాకు కూడ గిరాకీలు తగ్గిపోయాయి. కాకపోతే గుడ్డిలో మెల్లగా విడాకుల కేసులు కూడ పెరిగిపోవడం వలన, మేము కూడ అటు దారి మళ్ళించుకున్నాం. ఇప్పుడు నా దగ్గర ఓ పాతిక విడాకుల సంబంధాలున్నాయి. అవి కూడ మంచి సంబంధాలే. అమ్మాయిలు కూడ అటు ఇటుగా మీ అబ్బాయికి సరిపోయే వయసు వారే. ఏమంటారు?" చెప్పి చిత్రంగా నవ్వాడు వరదయ్య.

"అదేమిటండీ. మీరేదో పేరున్న వారనొస్తే ఇలా రెండో పెళ్ళి సంబంధాలు చెప్తారేమిటి. ఇదేనా మీ మాట్రిమొని గొప్పతనం" కోపగించుకున్నాడు మన్మథరావు.

"కోప్పడకండి సార్. మా మాట్రిమొనిని అందరూ 'వెంటిలేటర్ మ్యారేజిబ్యూరో' అంటారు. ఎలాగైతే మనిషి రోగం చివరి దశకు వచ్చాక సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి వచ్చి, వెంటిలేటరు మీదకు చేరి, ఎలాగోలా బ్రతికి బట్టకడతాడో, అలాగే మీలా పదేళ్ళయినా సంబంధం కుదరక నాదగ్గరికి వచ్చి పదిరోజులలో ఒక ఇంటివారైన వారే అందరూ. అదే నా ప్రత్యేకత. ఏతావాతా నే చెప్పొచ్చేదేమిటంటే, మీకు పెళ్ళి వయసు దాదాపు ముగిసినట్టే. లేటు వయసులో లేతపిల్ల దొరకడం దుర్లభం. నేనింతకు మునుపే చెప్పాను కదండీ. వచ్చిందే పెళ్ళాం అనుకోవాలని" తన చాకచక్యమంతా ఉపయోగించి మాట్లాడాడు వరదయ్య.

నోట మాట రాలేదు తండ్రీ, కొడుకులకు. ఇంకా ఏదైనా మాట్లాడితే, విధవలను, పిల్ల తల్లులను చూపేలాగున్నాడని భయపడిపోయారు. మరల ఫోను చేస్తామని లేచారు.

"ఇప్పటిదాక నా సమయాన్ని తిన్నదానికిగాను వెయ్యి రూపాయలు ఇచ్చి బయలుదేరండి" అని హుకుం జారీచేశాడు వరదయ్య. చేసిన తప్పుకు లెంపలేసుకుని డబ్బు కట్టి బయటపడ్డారు.

******************

" ఓరేయ్. నీకో శుభవార్త. బేతంశెట్టి సుబ్బారావు మామయ్య ఇప్పుడే వచ్చిపోయాడు. వాళ్ళమ్మాయి సువర్చలను నీకు అడగడానికి వచ్చాడు. ఇన్నాళ్ళూ మన తాహతుకు తగనని ఊరుకున్నాడట. నీకింకా పెళ్ళికాలేదని ఆనోట, ఈనోట విని వచ్చాడు. ఏమంటామోనని భయపడుతూనే అడిగాడు. దాని వయసు ముప్ఫై దాటిందట. కట్నమిచ్చుకోలేక కొంత, అమ్మాయి నచ్చక మరికొందరు చూసి వెళ్ళిపోయారట. మనం ఊరు దాటిన తరువాత ఎవరినీ పట్టించుకోలేదు కదా. ఏదో దూరపు చుట్టమని వదిలేశాం. పాపం అతనే వెతుక్కుంటూ వచ్చాడు. 'ఆలస్యం అమృతం విషం' అని మిమ్మల్ని అడక్కుండానే మాట ఇచ్చేశాను." చెప్పాడు పరాంకుశం, అప్పుడే గుడినుంచి వచ్చిన తల్లీ కొడుకులతో.

"అబ్బా ఆ పిల్ల అమ్మోరులా ఉంటుంది కదండీ. ఎలా ఒప్పుకున్నారు. మేమొచ్చేదాకా ఆగలేకపోయారా" అడ్డుపుల్ల వేసింది ఆండాళు.

"అమ్మా" పిడుగులా కేకపెట్టాడు మన్మథరావు. ఆండాళు చేతిలో కవరు సోఫాలో పడేసి చెవులు మూసుకుంది ఆ అరుపుకు.

"అమ్మా. ఇక నువ్వు మాట్లాడకు. నాన్నా, నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను. వెంటనే ఫోను చేసి ముహూర్తాలు పెట్టమని చెప్పండి" అని తల్లి వైపు తిరిగి " ఇప్పుడు నాకు "నచ్చిందే పెళ్ళాం" కాదే, అసలు నన్ను చేసుకోవాలని ముందుకు " వచ్చిందే పెళ్ళాం". అర్థమయిందా." అంటూ విసవిసా వెళ్ళిపోయాడు మన్మథరావు.

ఈ ఏడుపేదో ముందే ఏడిస్తే పదేళ్ళ మనవడు ఉండేవాడు కదా అనుకున్నాడు మన్మథరావు. అందమైన కోడలు వస్తుందనుకుంటే, నీకూ మీ నాన్నలాంటి అదృష్టమే పట్టిందికదురా అనుకుంది తారు రంగుకు తీసిపోని ఆండాళమ్మ.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ