ఆపన్నహస్తాలు - దినవహి సత్యవతి

Helping Hands

అది ఒక మహానగరం. దేశంలో పలు ప్రాంతాలనుంచి అక్కడికి వలస వెళ్ళిన వాళ్ళతో ఇంకా ఇంకా విస్తరిస్తోంది. అందులో మేమూ ఉన్నాము. మా అమ్మాయి హిమన ఉద్యోగరీత్యా ఆ నగరంలో మకాము పెట్టి సుమారు ఎనిమిది నెలలు కావొస్తోంది.

ఇంతలో అకస్మాత్తుగా ప్రపంచాన్ని కమ్మేసిందీ కొరోనా మహమ్మారి. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న కొరోనా వ్యాప్తిని నిరోధించడం కోసం మార్చి నెలలో లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. సరిగ్గా దానికి రెండ్రోజుల ముందు అత్యవసర పనిమీద సొంతూరు విజయనగరం వచ్చి ఇక్కడే చిక్కుకుపోయాను.

అక్కడ హిమన కూడా, అత్యవసరమైతే తప్ప ఆఫీసుకి రానక్కరలేదని సూచనలు ఇవ్వబడటంతో, ఇంట్లోనే ఉండి పనిచేస్తోంది. తనిక్కడికి రాలేదు నేనక్కడికి వెళ్ళలేను. ఆఫీసు పనుల మీద వెళ్ళిన అబ్బాయీ శ్రీవారూ కూడా అక్కడే చిక్కడిపోయారు. అందరం తలో చోటా ‘ఎక్కడి వాళ్ళక్కడే గప్ చుప్’ లా తయారైంది మా పరిస్థితి!

రోజూ ఫోన్ చేసి మాట్లాడుతున్నాను హిమనతో. తనని తాను సంభాళించుకోగలిగే వయసే అయినా ఈ కొరోనా పరిస్థితులలో ఒక్కర్తే ఉన్నదని బెంగ, తల్లి మనసు కదా పీకుతుంటుంది అదంతే!

ఉదయం లేచి ఫలహారం కానిచ్చి యథాప్రకారం హిమన ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాను. రోజూ తను ఫోన్ చేసే సమయం దాటినా ఎంతకీ ఫోన్ రాలేదు. ఇక ఉండబట్టలేక నేనే చేసాను అయినా అటునుంచి జవాబు లేదు.

‘ఎందుకు చేయలేదో? రాత్రంతా పని చేసి ఆలస్యంగా పడుకుందేమో అందుచేత ఇంకా నిద్ర లేవలేదేమో? ఆఫీసు పని ఎక్కువగా ఉందేమో?’ అనుకుంటూ అన్యమనస్కంగా గడిపాను.

మధ్యహ్నం భోజనం చేసాక చిన్న కునుకు తీయటం అలవాటు. అందుకు విరుద్ధంగా ఈరోజు కంటిమీదకి కునుకేరాలేదు చిత్రంగా! సాయంత్రం టీ త్రాగుతుండగా ఫోన్ మ్రోగింది....అమ్మాయే!

గభాలున ఎత్తి “ప్రొద్దున్నుంచీ ఎదురుచూస్తున్నాను నీ ఫోన్ కోసం. ఏమ్మా ఇప్పటిదాకా చేయలేదు?” గొంతులో ఆదుర్దా అణచిపెట్టడానికి విశ్వప్రయత్నం చేసాను!

“అయ్యో సారీ అమ్మా! ఫోన్ చేద్దామని అనుకుంటూనే ఉన్నాను ఇంతలో ఏమైందో తెలుసా”

“ఏమైందమ్మా?”

“మన వీధిలో, నువ్వు మాట్లాడతుంటావే, ఆ ఇంటి బామ్మగారు చనిపోయారమ్మా!”

“అయ్యో...అలాగా?”

అక్కడ, ఆ నగరంలో, మేముండే వీధిలో హిందూ ముస్లిం కుటుంబాలు దాదాపు సరి సమానంగా కాపురాలుంటున్నాయి. ఎవరిగొడవలో వారుంటారు. ఒకరి విషయాలలో మరొకరు కలగజేసుకున్నట్లు నేవెళ్ళాక చూడలేదు. సాయంత్రమయ్యేటప్పటికి ఇరు మతాల పిల్లలంతా వీధిలోచేరి ఆటలు, నవ్వులూ..చాలా సందడిగా ఉంటుంది. హిందూ ముస్లిం కుటుంబాల ఆడంగులు కూడా గుమ్మాలలో చేరి కబుర్లాడుకోవటం చూస్తే సంతోషం కలిగేది. మా ఎదురింటికి రెండిళ్ళ అవతల ఇంట్లోకి, ఆ మధ్య, నేనిక్కడికి వచ్చేముందే, ఒక హిందూ కుటుంబం క్రొత్తగా అద్దెకి వచ్చారు. నాకు వాళ్ళతో కొంచం పరిచయం ఏర్పడింది. మాలాగా మధ్య తరగతి వాళ్ళే. ఆ కుటుంబంలో భార్యా భర్తా, వృద్ధురాలైన అతని తల్లీ ఉంటారు. మాటల్లో తెలిసింది వాళ్ళకి తెలుగు తప్ప ఏ భాషా రాదని.

“అమ్మా..అమ్మా” హిమన పిలుపుకి ఆలోచనలలోంచి బయటపడి “ఆ... చెప్పమ్మా” అన్నాను.

“ఇవాళ పనుందని ప్రొద్దున్నే లేచాను. బాల్కనీలో నిలబడి టీ త్రాగుతున్నాను. క్రొత్తగా అద్దెకి వచ్చిన ఆంటీ బయట నిలబడి మాటిమాటికీ కళ్ళు తుడుచుకుంటున్నారు. లాక్ డౌన్ కదా బయట ఎవ్వరూలేరు. ఏం జరిగిందో కనుక్కుందామని నేను వెళదామనుకుంటూండగానే ప్రక్కనున్న ఇంట్లోంచి ఒక అబ్బాయి బయటకి వచ్చాడు.

“ఫాతిమా ఆంటీ వాళ్ళింట్లోంచా?”

“అవును. కానీ అతనెవరో నాకు తెలియదు. ఆంటీని చూసి ఏమైందని అడిగినట్లున్నాడు. ఆంటీ తమ ఇంట్లోకి చూపిస్తూ ఏం చెప్పారో తెలియదు కానీ అతనికి అర్థంకాలేదనుకుంటాను బుర్ర గోక్కుంటూ అటూ ఇటూ చూడడం మొదలెట్టాడు. నువ్వు చెప్పావు కదా ఆంటీ వాళ్ళకి అస్సలు హిందీ రాదని. అది గుర్తొచ్చి నేను గబగబా అక్కడికి వెళ్ళి ఆంటీని విషయమేమిటని అడిగాను.

బామ్మగారికి ఉన్నట్లుండి ఆరోగ్యం బాగా క్షీణించిందనీ, సమయానికి అంకుల్ కూడా ఊళ్ళో లేరనీ, ఆంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే నెట్వర్క్ లేక జవాబు రాలేదనీ ఏం చేయాలో తెలియట్లేదనీ అన్నారు. అదే విషయం అతనికి హిందీలో చెప్పాను. ఆంటీని కంగారుపడొద్దని చెప్పి ఆ యువకుడు వెంటనే తన బైక్ పై వెళ్ళి ఒక డాక్టర్ గారిని తీసుకొచ్చాడు. ఆయన బామ్మగారిని పరీక్ష చేసి పరిస్థితి విషమంగా ఉందనీ వెంటనే ఆస్పత్రికి తీసికెళ్ళాలని చెప్పారు”

“నిజంగా ఆ అబ్బాయి ఎవరో కానీ మంచివాడులా ఉన్నాడే”

“అవునమ్మా నిజంగా నాకూ అదే అనిపించింది”

“ఊ...మరి ఆస్పత్రికెళ్ళారా?”

“లేదమ్మా. పాపం బామ్మగారు ఆ లోగానే చనిపోయారు!”

“అయ్యో! అదేమిటే?”

“అవునమ్మా. నాకు చాలా బాధనిపించింది. అంకుల్ వేరే ఊరు వెళ్ళారుట ఆఫీసు పనిమీద. ఈ విషయం తెలియగానే పాపం ఒకటే ఏడుపుట. అయితే లాక్ డౌన్ నిబంధనల వలన తాను వచ్చే పరిస్థితి లేదనీ తదుపరి కార్యక్రమాలన్నీ జరిపించేయమనీ చెప్పారుట”

‘అయ్యో దేవుడా! ఎంత బాధాకరం కన్నతల్లి చనిపోతే కూడా రాలేని దయనీయ స్థితి. పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు’ నిట్టూర్చాను.

“కానీ బామ్మగారిని క్రిమేషన్ కి తీసుకెళ్ళాలంటే ఎవ్వరూ లేరు. ఆంటీకి ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే మళ్ళీ ఇందాకటి అబ్బాయే ధైర్యం చెప్పి తన స్నేహితులని మరో నలుగురిని తీసుకొచ్చాడు”

“ఓ!” నమ్మలేకపోయాను.

ఒక వైపు అవకాశం దొరికితే చాలు మత కలహాలు రెచ్చగొట్టడానికి కొన్ని అసాంఘిక శక్తులు శాయశక్తులా ప్రయత్నిస్తుంటే ఇంకోవైపు మతాలకతీతంగా జరిగే ఇలాంటి సంఘటనలు మానవత్వం ఏమూలో ఇంకా బ్రతికే ఉన్నదనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి అనిపించింది.

“అవునమ్మా అందరూ కలిసి బామ్మగారి శవాన్ని గ్రేవ్ యార్డ్ కి తీసుకెళ్ళారు క్రిమేట్ చేయడానికి. ఆంటీకి తోడుగా నేనక్కడే ఉండిపోయాను. అందుకే ఫోన్ చేయలేకపోయాను. సారీ అమ్మా! పాపం కంగారుపడ్డావా?” అంది క్షమాపణగా.

“అదే ఎందుకు చేయలేదా అనుకుంటున్నాను. ఇప్పుడు కారణం తెలిసిందిగా. ఫరవాలేదులే. నీ చేతనైనంత సహాయం చేసి ఆపదలో ఆదుకున్నవాళ్ళే నిజమైన స్నేహితులని నిరూపించావు”

“థ్యాంక్స్ అమ్మ. ఇక ఉంటానూ. చాలా ఆఫీస్ పనుంది”

“సరే. జాగ్రత్తగా ఉండూ. బయటకి వెళ్ళాల్సి వస్తే మత్రం తప్పనిసరిగా మాస్క్ పెట్టుకో. బయటనుంచి రాగానే సబ్బుతో చేతులు కడుక్కో. జాగ్రత్తలన్నీ పాటించు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో”

“అలాగేనమ్మా. జాగ్రత్తగానే ఉంటాను. నువ్వు కంగారుపడకు. బై”

ఆ రోజంతా హిమన చెప్పిన సంఘటనే మనసులో మెదిలింది. ఇలాంటి, లాక్ డౌన్, క్లిష్ట పరిస్థితులలో కూడా, మతాలకతీతంగా ముందుకొచ్చి, ఎంతో ఉదారతనీ, స్నేహశీలతనీ, మానవత్వాన్నీ చూపించి, ఆపన్నహస్తాలందించిన ఆ యువతని ఎంత ప్రస్తుతించినా తక్కువే. అటువంటి యువతవల్లనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి