చెల్లనినోటు - డి.కె.చదువులబాబు

Chellani notu

పిసినారి శ్రీనివాస్ దగ్గరకు ఎలా వచ్చిందో ఓచెల్లని వందరూపాయల నోటు వచ్చింది. ఆ నోటు జేబులో ఉంచుకొని మార్చటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఎక్కడా తీసుకోలేదు.ఎలాగయినా మార్చాలని పట్టువదలని విక్రమార్కుడయ్యాడు. ఉదయమే ప్రయాణమై బస్ ఎక్కి ఏడు కిలోమీటర్ల దూరంలో నున్న పట్నం వెళ్ళడానికి టికెట్టు కోసం చెల్లని నోటిచ్చాడు. కండెక్టర్ గమనించి తీసుకోలేదు.మరో నోటిచ్చి టికెట్ తీసుకున్నాడు.పట్నంలో దిగాడు. దారిలోహోటల్ కనిపించింది. దోశె తెప్పించుకున్నాడు.తింటున్నాడన్న మాటే కానీ మనసంతా చెల్లనినోటు మీదే ఉంది. తినటం పూర్తయ్యాక బిల్లు తీసుకున్నాడు. కాళ్ళూ,చేతులు వణుకుతున్నాయి. కౌంటరుదగ్గరకెళ్ళిఇచ్చాడు.ఆ వ్యక్తి నోటును మడత విప్పి శ్రీనివాస్ వైపు చూసి అదోలా నవ్వాడు. శ్రీనివాస్ కు చెమటలు పట్టాయి. "వేరేనోటివ్వండి" అన్నాడు. "లేదు ఉన్నది ఇదే"అన్నాఢు. ఆ వ్యక్తి చిత్రంగానవ్వి " నీచొక్కా జేబులో నుండి నోట్లు కనిపిస్తున్నాయి" అన్నాఢు. ఉలిక్కిపడి జేబువైపు చూసుకున్నాఢు. పలుచని జేబులో నుండి నోట్లు కనిపిస్తున్నాయి.శ్రీనివాస్ మంచి నోటిచ్చి చిల్లర తీసుకుని బయటకు నడిచాడు. చొక్కాజేబులోనినోట్లు ఫ్యాంట్ జేబులోకి మార్చుకున్నాడు. ఓ అంగడి లోకెళ్ళి ఫౌడరు డబ్బా తీసుకున్నాడు. చెల్లని నోటు కోసం చూస్తే చొక్కా జేబులో లేదు.ఫ్యాంటు జేబులోకి నోట్లు మార్చుకోవడంలో చెల్లని వందనోటు కూడా ఫ్యాంటు జేబులోనికి వెళ్ళిపోయింది. ఫ్యాంటు జేబులో నుండి చెల్లనినోటు తీయబోతే మంచి నోటు బయటకొచ్చింది. శ్రీనివాస్ ముఖం వెలవెలబోయింది. ఆ నోటు ఇవ్వక తప్పలేదు. కాళ్ళీడ్చుకుంటూ సంతకెళ్ళాడు. ఉల్లిగడ్డలషాపు, కోడిగుడ్లషాపు, కళింగరకాయలషాపు వద్ద ప్రయత్నించాడు. నోటు చెల్లకపోగా ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు, కళింగరకాయలు కొనవలసి వచ్చింది. శ్రీనివాస్ కి పిచ్చి పట్టినంత పనయింది. వెర్రి కోతిలా దిక్కులు చూస్తూ అన్నీ భుజానవేసుకుని తిరిగి తిరిగి నోటు మారక బస్సెక్కి కూర్చున్నాడు. బస్సులోనైనా నోటు మారకపోతుందా?అనుకుంటూ గొనుక్కోసాగాడు.చెల్లని నోటు చేతిలో వణుకుతోంది."ఏంట్రా!సంవత్సరం సరుకంతా నీదగ్గరే ఉంది" అన్న మాటలతో వెనుదిరిగి చూశాడు శ్రీనివాస్. స్నేహితులు ఇద్దరు దగ్గరలోనే నిల్చుని ఉన్నారు. శ్రీనివాస్ ఏడ్వలేక నవ్వుతూ "సంసారమన్నాక సరుకులు మోయక తప్పుతుందా?" అన్నాడు. కండక్టరు ముందుగా శ్రీనివాస్ ను టికెట్ అడగడంవల్ల చేతిలో వందనోటు ఉండడం వల్ల మిత్రులకు కూడా టికెట్ తీసుకోవలసి వచ్చింది. "మూడుటికెట్లివ్వండి"అంటూ వణుకుతున్న చేతితో నోటిచ్చాడు. కండక్టర్ చూసుకోకుండా నోటు తీసుకున్నాడు. మూడు టికెట్లు ఇచ్చి చిల్లరిచ్చాడు. ఏమయితేనేం చెల్లని నోటు మారిందని ఆనందపడ్డాడు.సంతోషంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బస్సు దిగగానే చంకలు గుద్దుకుంటూ ఇల్లు చేరాడు.ఆనందం పట్టలేక బొంగరంలా గిర్రుగిర్రున తిరిగాడు. కప్పలా గెంతాడు. విషయం తండ్రికి చెప్పాలని ఎదురుచూస్తూ కూర్చున్నాడు. రెండుగంటల తర్వాత శ్రీనివాస్ నాన్నగారు చెమటలు కక్కుతూ ఇల్లుచేరాడు. నాన్నరాగానే చెల్లనినోటు బస్సులో మార్చిన విషయం ఆనందంగా,ఆయాసపడిపోతూ చెప్పాడు. శ్రీనివాస్ నాన్న బిత్తరచూపులు చూస్తూ, జేబులో నుండి వందనోటు తీసి "పట్నంలో పని ఉండి బస్సెక్కి రెండువందల నోటిచ్చాను.కండక్టర్ చిల్లరలో ఈ వందనోటిచ్చాడు.బస్సు దిగాక చూసుకున్నాను.పట్నమంతా తిరిగినా ఇది మారలేదు"అని నోటు శ్రీనివాస్ కిచ్చాడు. ఆ నోటును చూసిన శ్రీనివాస్ కు స్పృహ తప్పినంత పనైంది. ఆ నోటు తనను మూడురోజులుగా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి అనవసర ఖర్చులు పెట్టించి బస్సులో మారిన చెల్లనినోటు. శ్రీనివాస్ ముఖంలో నెత్తురు చుక్కలేదు.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి