తల్లి... గోదావరి...! - పి.కె. జయలక్ష్మి

thalli godavari

"ఉప్పొంగి పోయె గోదావరి.........."

ఎక్కడ్నించో అలలు అలలుగా తేలి వస్తున్న ఆ పాట నా మనసులో సన్నని ప్రకంపనలు రేపింది. ఎన్నాళ్ళ కల ఈ నాటికి తీరబోతోంది? మొదటి నుంచి శ్రీరాముడన్నా, గోదావరి అన్నా నాకెందుకో విపరీతమైన ఇష్టం. చిన్నప్పుడు భద్రాచలం అమ్మమ్మ, తాతయ్యలతో బస్సులో వెళ్ళడం, గోదావరిలో స్నానం చేసి భద్రగిరి వాసుణ్ణి దర్శించుకోవడం, రాత్రికి రాత్రి రాజమండ్రి బయలుదేరి వచ్చేయడం లీలామాత్రంగా జ్ఞాపకం. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. నా మనసులో లాంచీలో గోదావరి ప్రయాణం చేసి శ్రీరాముణ్ణి దర్శించాలన్న కోరిక రానురాను పెరుగుతూ వచ్చిందే కాని ఈషణ్మాత్రం కూడా తగ్గలేదంటే నమ్మండి. ఈ మధ్య గోదావరి సినిమా చూశాక ఆ కోరిక ఊడలు వేసుకుని మరీ పాతుకుపోయింది. అంతరాంతరాల్లో! పాపికొండల నడుమ వయ్యారి గోదావరి అందాలు చూడ్డం ఎలాగబ్బా అని అనుకుంటున్న తరుణంలో "యూత్ హాస్టల్ వాళ్ళ భద్రాచలం యాత్ర, లాంచీలోనే సుమా" అంటూ మా శ్రీవారు నన్ను ఊరించడం మొదలుపెట్టేసరికి పరమానంద భరితనయ్యాను. పిల్లలు "మాకు పరీక్షలు మమ్మీ, ఇంకోసారి వెళ్దాం" అన్నా సరే, పుత్రప్రేమ కంటే గోదావరి ప్రేమే మిక్కుటమై వాళ్ళని వాళ్ళమానాన వదిలేసి (రెండు రోజులే లెండి) మావారు నేను టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకున్నాం. ఇంక ఆ పదిరోజులు ఎలా గడుస్తాయా అని అసహనంగా ఎదురుచూడ్డం మొదలుపెట్టాను. ఆ రోజు రానే వచ్చింది. రాత్రి పది గంటలకి వైజాగ్ నుంచి బస్సులో బయలుదేరి మర్నాడు తెల్లవారు ఝాము మూడు గంటలకి రాజమండ్రి లాంచీలో రేవు చేరాం. వెన్నెల్లో గోదావరి అబ్బ ఎంత అందంగా, రమ్యంగా మెరిసిపోతోందో? మమ్మల్నందరిని ఆప్యాయంగా స్వాగతిస్తున్న గోదావరిలో, అమ్మరూపం అస్పష్టంగా కనిపించింది. ఎన్నోరోజుల తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ అలాగే గుమ్మం దగ్గర ఎదురుచూపులు చూస్తూ మేము రాగానే ప్రేమగా దగ్గరికి తీసుకొనేది.

చలికాలం మొదలవుతోంది అప్పుడే, అందరం శాలువాలు, మఫ్లర్స్ తో సన్నద్ధమయ్యాము. మేం మొత్తం వందమందిమి రెండు లాంచీల్లో హాయిగా బైఠాయించాము. అందరూ కొత్తవాళ్ళే! తెలిసిన ముఖాలేవీ కనపడలేదు. సర్లే కాసేపటికి వాళ్లే పరిచయమవుతారు అనుకుని తీరిగ్గా చుట్టూ పరిశీలించడం మొదలుపెట్టాను. లాంచీలో చెక్క బల్లలు నాలుగువైపులా, క్రిందన 6,7 పరుపులు పరిచివున్నాయి. లాంచీ మొత్తం మూడు కాబిన్స్ గా విభజించబడి వుంది. చివరన వంటగది, ఆ ప్రక్కన టాయ్ లెట్స్. చిన్న ఇల్లుగా ఉంది. లాంచీ పై పోర్షన్ అంతా ఓపెన్ గా ఉంది. లాంచీ పైన ఎండపడకుండా అనుకుంటా షామియానా వేసారు. సామాన్లవీ సర్దుకుని కొందరు పడకలు పరిచేసుకుని కునుకులు మొదలు పెట్టారు. కొందరు ముఖాలు కడుక్కుంటున్నారు. హడావిడి పడిపోతూ మరి కొంతమంది పైకి ఎక్కేసి చలిలో గోదావరిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది వీళ్ళందరిని గమనిస్తూ, కొందరు ఎవరితోనూ నిమిత్తం లేకుండా శూన్యంలోకి చూస్తూ రకరకాల భంగిమల్లో దర్శనమిస్తున్నారు...!

నేనూ సామాన్లు సర్దేసి, నిచ్చెన సాయంతో లాంచీ పైకి ఎక్కి కెమెరాకి పని కల్పించాను. పున్నమి చంద్రుడు జున్ను ముక్కలా మెరిసిపోతూ, మిడిసి పడుతున్న గోదావరిలో అందంగా ప్రతిఫలిస్తున్నాడు. గోదావరి చల్లగా అచ్చం అమ్మ నవ్వులా, ముగ్ధమనోహరంగా, చంద్రునితో పాటు మాకు స్వాగతిస్తోంది. శీతాకాలపు ఆ కార్తీక సుప్రభాతం చాలా మనోజ్ఞంగా అనిపించింది. దూరంగా పట్టిసీమ కనువిందు చేస్తోంది. పట్టిసీమ ప్రకృతి కళ్ళకే కాదు, మనసుకీ ఆహ్లాదంగా, హరిత మనోహరంగా ఉంది. సన్నగా వణికిస్తున్న చలి చెవులకి, మాడుకి ఇబ్బంది పెట్టకుండా స్కార్ఫ్ కట్టుకున్నాను. లాంచీలో భద్రాచలం వైపు ప్రయాణిస్తోంటే నా ఆలోచనలు గోదావరిలో మునకలు వేస్తున్నాయి. ఎన్నాల్టి కల ఈ రోజుకి సాకారమైంది? చుట్టూ గోదావరే! అనంత జలరాశి, పరమ పావని గోదావరి మాత, దక్షిణ గంగ బిరుదాంకితురాలు, విశ్వనాథ వంటి కవి సామ్రాట్టుల మానస పుత్రిక ఈ జీవనది! ఎన్ని కథలు, ఎన్నెన్ని గీతాలు, మరెన్ని ఊసులు ఈ తల్లిమీద! ఎక్కడో మహారాష్ట్రలో నాసిక్ దగ్గర పుట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మన రాష్ట్రంలో ప్రవేశించి అందరిని అన్నపూర్ణలా ఆదరిస్తూ, అన్నదాతల జీవగర్రగా మారి మన తరతరాల సంస్కృతీ సంప్రదాయాలకి జీవరస వాహిని ఈ గోదావరి! గోదావరి తల్లి ఒడ్డున ఎన్ని స్మృతులో! ఆటలాడే ప్రాయంలో పిల్లలకి గోదావరి ఒడ్డే అమ్మ ఒడి. యౌవనవంతులు ఎందరు ఈ నది ఒడ్డున తమ మధురానుభూతుల్ని కలబోసుకున్నారో? జీవిత మలి సంధ్యలో ఎందరు వృద్ధులు ఇక్కడ తమ కష్టసుఖాల్ని, అనుభవం నేర్పిన పాఠాల్ని నెమరువేసుకున్నారో? ఎంతమంది అభాగ్యులు జీవన క్రీడలో ఓడిపోయి ఈ అమ్మ కడుపులోకి చేరిపోయారో? అయినా గోదావరి తల్లి ఏమి తెలియనట్లు సుఖదుఃఖాలకి అతీతంగా స్థిత ప్రజ్ఞాలా నిండుగా కదిలిపొతూనే ఉంది కాలంలా! అవును ఎవరూ ఎవరికోసం ఆగరు! ఈ గంభీర గౌతమి నిజంగా ఎంత లోతైనది? అనుకోకుండా ఉండలేకపోయాను. నా ఆలోచనల్లో నేనుండగానే బాల సూర్యుడు అరుణవర్ణంలో కాంతిపుంజాలు వెదజల్లుతూ గోదావరి గర్భంలోంచి నెమ్మదిగా పైకి వస్తూ కన్పించాడు. ఒక పక్క అదృశ్యమవుతున్న అస్పష్ట చంద్రబింబం, మరోప్రక్క ఆకాశాన్ని హస్తగతం చేసుకోవడానికి సమాయత్తమవుతున్న భానుబింబం. సుఖదుఃఖాల మేలుకలయికలా అన్పించింది ఈ దృశ్యం! ఆ రెంటితో బంధుత్వం కలుపుకుంటున్న గలగల గోదావరి! పట్టిసీమ దగ్గర లాంచీకి లంగరు వేసారు. అందరు కార్తీకస్నానాలు కానిచ్చాం. ఒక ప్రక్క సన్నగా వణికించే చలి, మరోప్రక్క నులివెచ్చని సూర్యరశ్మి, వీటి మేళవింపుతో గోదావరి గోరువెచ్చగా అన్పించింది అచ్చం అమ్మ స్పర్శలా! ఒడ్డు దగ్గర చాలా బురదగా ఉంది. చెత్త, చెదారం పోగుచేసి గోదావరిలో పడేస్తున్నారు. ఎక్కడికక్కడ స్నానాలు చేసేవాళ్ళు, తిన్న తర్వాత ఎంగిళ్ళు పడేసేవాళ్ళు, చేతులు, కాళ్ళు కడుక్కునే వాళ్లు. వీటితో గోదావరి కలుషితమైపోతున్నా పరమ పావనికి ఆ పంకిలం అంటదు కదా! అమ్మతో ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకొనే వారు కొందరయితే, తమ కోపతాపాలు ప్రదర్శించేవారు మరికొందరు ఇలా అమ్మ బుర్రని మనసుని కలుషితం చేసినా, సహనంగా వర్తిస్తూ వాళ్ల తప్పుల్ని క్షమిస్తూ, తన కడుపులో దాచుకునే తల్లిగా గోదావరి కూడా తనని నానారకాలుగా కలుషితం చేస్తున్నా ఎవ్వరికీ ఏ హానీ కల్గించకుండా శుభ్రమైన జలధారల్ని మనకి సతతం అందించడానికి సిద్ధంగా ఉంటుంది.

దూరంగా పట్టిసీమలో వెలసిన భావనారాయణ స్వామి క్షేత్రం. లాంచీలో నుండి చూస్తే చాలా దగ్గరగా ఉన్నట్టు కన్పించినా నడుస్తూ ఉంటే ఎంతకీ తరగని దూరం. దాదాపు ఒకటిన్నర కిలోమీటరు ఇసుక తిన్నెల్లోంచి నడిస్తే కాని గుడికి చేరలేకపోయాము. క్షేత్రపాలకుడు విష్ణుమూర్తిని, శంకరుణ్ణి దర్శించుకొని తిరిగి లాంచీ ప్రయాణం సాగించాము. టిఫిన్ల కార్యక్రమం అనంతరం చిన్నాపెద్దా అందరు కల్సి ఏవేవో సరదా సరదా ఆటలతో, అంతాక్షరీలతో కాలక్షేపం చేసాము మధ్యాహ్నం భోజనాలు దాకా! లాంచీపైన బఫ్ఫే విందు షామియానా క్రింద. అందరం ప్లేట్స్ లో కావాల్సినవి వడ్డించుకుని గోదావరిని కళ్ళారా వీక్షిస్తూ తృప్తిగా ఆరగించాము. గోదావరి మమ్మల్ని చూసి సంతృప్తిగా నవ్విన ఫీలింగ్, అమ్మకూడా అంతే! కొసరి కొసరి తినిపిస్తూ, మేం తింటుంటే తానే తిన్నంత సంతోషంగా నవ్వేది. అలా నీటి మధ్యలో పూల బంతిలా తేలియాడుతున్న లాంచీలో భోజనాలు చేయడం గమ్మత్తయిన అనుభవం. కాసేపు కునుకు తీసాము. గోదావరి మధ్యలో అలలపై తేలుతున్న పడవలో, కునుకు తీస్తుంటే పసితనంలో అమ్మ ఉయ్యాలఊపిన రోజులు తిరిగి స్ఫురణకి వచ్చాయి. పాపికొండల నడుమ నుండి లాంచీ వెళ్తుంటే ఒక పెద్దాయన చెప్పసాగారు. "ఇక్కడ గోదావరి 60 అడుగుల లోతు ఉంటుంది. ప్రవాహవేగం చాలా ఎక్కువ" అని! పాపికొండలు గోదావరికి రక్షణగా రెండు వైపులా అంత ఎత్తున ఆకాశానికి అంటుతున్నట్లు వ్యాపించి పచ్చని చెట్లతో శోభాయమానంగా ఉన్నాయి. ఎవరబ్బా అంత ఓపిగ్గా వాటి మీద అంతటి హరిత వనాల్ని పెంచింది అనుకోకుండా ఉండలేకపోయాను. పాపికొండల సాక్షిగా ఉరకల పరుగుల గోదావరి నాకేంటి భయం అంటూ ధీమాగా ఒకింత గర్వంగా వయ్యారాలు పోతూ, నన్నెవరు పట్టుకోలేరు అన్నట్లు త్వరితంగా మెలికలు తిరుగుతూ హుషారుగా పరుగులు తీస్తోంది. తనని చూడ్డానికి మేమంతా వచ్చామన్న గర్వమో ఏమో మరి? అమ్మ కూడా అంతే! పండగలకి, పబ్బాలకి పిల్లలంతా వాళ్ళ కుటుంబాలతో వస్తే ఎంత పొంగిపోయేదో? అన్నిటా తానే, అంతా తానే అన్నట్లు కళకళలాడుతూ తిరిగేది. "పోలవరం ప్రాజెక్టు వస్తే ఇంక లాంచీలో గోదావరి ప్రయాణం నీటి మూటే" అని గొణుక్కుంటోంది ఒక పెద్ద ముత్తైదువు ఎవరో! పాపికొండలు, గోదావరి అపురూపమైన ఆ జోడీ ఎంత చూసినా తనివి తీరదు.

సాయంత్రం 6 గంటలకి కూనవరం రేవు చేరాం. వేడి వేడి టీ, బజ్జీలు ఆరగించి బస్సులో భద్రాచలం బయలుదేరాం. గంటన్నరలో భద్రాచలం చేరుకున్నాం. లాంచీలో భద్రాచలం వరకు అంటే మరో 6 గంటలు పడుతుందట. సుడిగుండాలు ఎక్కువగా ఉండటమే దానికి కారణం అని తెలిసింది. భద్రాచల శ్రీరామ చరణ సన్నిధిలో గోదావరి పులకించి పోతూ ప్రవహిస్తోంది. మరొకసారి ఆ పవిత్ర జలధారలలో స్నానించి రామదర్శనం కానిచ్చి, రామదాసు, తానీషా తయారుచేయించిన ఆభరణాల ప్రదర్శన తిలకించి మాకు కేటాయించిన రూమ్ కి చేరుకున్నాం. మర్నాడు ఉదయం మళ్ళీ రామదర్శనం చేసుకుని, ప్రసాదాలు అవీ కొనుక్కుని జైరామ్ అనుకుంటూ కూనవరం వరకు బస్సులో వెళ్లి తర్వాత లాంచీలో రాజమండ్రి బయలుదేరాం. దార్లో పేరంటాలపల్లి దగ్గర ఆగి ఆశ్రమ దర్శనం చేసుకున్నాం. కొండమీద కట్టిన ఆ ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడి గిరిజనులు శివాలయాన్ని నిర్మించి పూజలు, పునస్కారాలు, ధ్యానాలతో ఆ వాతావరణాన్ని చాలా శుభ్రంగా, పవిత్రంగా మలిచారు. తిరుగు ప్రయాణంలో నాకెవరితో మాట్లాడాలని కాని, ముందురోజులా కేరింతల, తుళ్ళింతలతో హడావిడి చేయాలని గాని అన్పించలేదు. మరికొన్ని గంటల్లో గోదావరి సాహచర్యాన్ని కోల్పోతాననే బాధ అంతరాంతరాల్లో వేధించడం మొదలుపెట్టింది. సెలవుల్లో హాస్టల్ నుంచి అమ్మ దగ్గరికి వెళ్లి, హాయిగా గడిపేసి తిరిగి వచ్చేటప్పుడు పడిన యాతన, వేదన ఇప్పుడు మళ్ళీ అనుభవంలోకి రాసాగాయి. ప్రవాహం దిశలా లాంచీ ప్రయాణం చేయడం వల్లేమో అనుకున్న సమయం కంటే ముందే రాజమండ్రి చేరిపోయాం. దూరంగా లైట్ల వెలుతురులో రాజమండ్రి నగరం తళుక్కుమంటోంది. సంధ్య చీకట్లు ముసురు కుంటున్న తరుణంలో గోదావరి మౌన సుహాసినిలా మాకు వీడ్కోలు చెప్పడానికి సంసిద్ధంగా ఉంది.

అమ్మకూడా అంతే! సెలవులయ్యాక మేం వెళ్ళే టైం దగ్గర పడుతుంటే లోలోపల దిగులు పడుతూ, పైకి గంభీరంగా(?) తిరుగుతూ ఉండేది. తను బాధపడుతుందని తెలిస్తే మేమెక్కడ బెంగ పడతామో అని ఆవిడ ఆలోచన కాబోలు అంతసేపు ఉరుకులు, పరుగులతో హడావిడిగా సందడి చేసిన గోదావరి ఒక్కసారిగా స్థబ్ధుగా, నిశ్చిలంగా మారిపోయింది. మళ్ళా ఎప్పుడమ్మా నిన్ను చూస్తాను? మనసులోంచి దుఃఖం వరద గోదావరిలా పొంగుకొచ్చింది ఒక్కసారిగా గతం గుర్తుకొచ్చేసరికి.

కొన్నేళ్ల క్రితం నా పుట్టిన ఊరు రాజమండ్రిలో అనారోగ్యంగా ఉన్న అమ్మని చూసి వెళ్ళిన కొన్ని రోజులకే తెలిసింది అమ్మ లేదన్న చేదు నిజం! సహజంగానే సాహిత్యాభిమానియైన అమ్మ గోదావరిని ఎంతో ప్రేమించేది. వెన్నెల్లో గోదావరి అందాలను ఆస్వాదించడమంటే తనకి చాలా ఇష్టం. ఆఖరిసారి గోదావరి తీరంలోనే పంచభూతాల్లో ఐక్యమై ఆ నదీమతల్లి లోనే చితాభస్మరూపంలో మమేకమైన అమ్మ దివ్యమంగళ రూపం గోదావరి సాక్షిగా నా హృదయంలో సుస్థిరంగా నిలిచే ఉంది. అందుకే నాకు గోదావరి అంటే చెప్పలేనంత ఇష్టం... అమ్మ అంత ఇష్టం.

గత స్మృతుల్ని నెమరువేసుకుంటూ ఎంతో ప్రియమైన తల్లి గోదావరిలో కొన్ని గంటలపాటు లాంచీలో ఈ భద్రాచల యాత్ర మా అమ్మ జ్ఞాపకాల్ని పునశ్చరణ చేసుకోవడానికి ఎంతగానో దోహదపడింది. నిజం చెప్పొద్దూ మా అమ్మతో మళ్ళీ ఆ అమూల్య క్షణాలు తిరిగి గడిపిన ఫీలింగ్. ఆ తేలియాడుతున్న గోదావరి అలలలో అస్పష్టంగా కన్పిస్తున్న మా అమ్మ రూపానికి ప్రణమిల్లుతూ భారమైన మనసుతో విశాఖపట్నం బస్సువైపు నడిచాను.


***

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao