భయ' సన్యాసం. - గొర్తి.వాణిశ్రీనివాస్

Bhaya sanyasam

"ఏవోయ్ కనకం! ఇందాక నువ్విచ్చిన కాఫీ చప్పగా చల్లారిపోయిందోయ్!." అన్నాడు సన్యాసిరావు. " 'ఒక కప్పు కాఫీ తీసుకొస్తావా! 'అని అడగొచ్చుగా. భూతకాలాన్ని వర్తమానానికి ముడిపెట్టి భవిష్యత్తులో ఏం సాధిద్దామనీ. మీవన్నీ లాయర్ బుద్ధులే" అంది గడుసుగా. కప్పు కాఫీ కూడా వైనంగా అడగాలా అని తలగోక్కున్నాడు . కనకం ఎడం చేతి నాలుగు వేళ్ళకీ గోరింటాకుతో టోపీలు పెట్టుకుంది . గోరింటాకు పెట్టకుండా వదిలేసిన చూపుడు వేలితో ఫోన్ లో వాట్సాప్ సందేశాలు టిక్కు టిక్కుమంటూ టైప్ చేసే పని ఆపి , కుడి చేత్తో పిసుకుతున్న గోరింటాకు ముద్దని గిన్నెలో పడేసి చెయ్యి కడుక్కునేoదుకు వంటింట్లోకి వెళ్ళింది భార్యవంక భూతాన్ని చూసినట్టు చూస్తూ చెవిలో పెట్టుకున్న పెన్ను తీసి ఏవో పాయింట్స్ నోట్ చేసుకున్నాడు. సన్యాసిరావు చిన్నప్పటినుంచీ భయస్తుడు. అందరూ 'పిరికి సన్యాసి' అని కూడా పిలుస్తుండేవాళ్ళు. ఎవరితోనూ చిన్న వాగ్వివాదానికి దిగకుండా భయపడుతూ తలుపువెనక నక్కేవాడు. అలాంటి సన్యాసిరావు పెద్దయ్యాక విధివశాత్తూ క్రిమినల్ లాయర్ పట్టా పుచ్చుకున్నాడు. పుస్తకాల పురుగులా లైబ్రరీలో తెచ్చుకున్న పుస్తకాల్లోంచి ఎత్తిరాసుకుంటూ బల్లపై బల్లపరుపుగా వాలి బల్లిలా కరుచుకుపోయాడు. సన్యాసిరావు పట్టా పుచ్చుకోగానే పట్టపగ్గాల్లేని ఆనందంలో తేలిపోయాడు. 'సన్యాసిరావు బి.ఏ, ఎల్ ఎల్ బీ' అని నేమ్ ప్లేట్ రాయించి బయట గుమ్మానికి తగిలించి విజయగర్వంతో పొంగిపోయాడు. చుట్టుప్రక్కల వాళ్ళు బోర్డుని చూస్తూ హమ్మ పోన్లే మన వీధిలో ఒక లాయర్ ఉన్నాడు . ఎందుకోందుకు పనికొస్తాడు అనుకునేవాళ్లే కొత్తగా ప్రాక్టీస్ పెట్టి దోమల్నితోలుకునే ఆర్. ఎం. పీ దగ్గరకి ఉచిత వైద్య సలహాకోసం వచ్చినట్టు , ఊసుపోని తగాదాల్తో ఉత్తుత్తి సలహాలకోసం వచ్చేవాళ్లే ఎక్కువయ్యారు. బార్ కౌన్సిల్ లో తనపేరు రిజిస్టర్ చేసుకున్నప్పటినుంచీ క్లైoట్స్ ఎప్పుడొస్తారా అని తలుపులు బార్లా తెరుచుకుని ఎదురు చూస్తూ ఈగల్ని తోలుకుంటున్నాడు. "ఏవోయ్ సన్యాసి! ఏం చేస్తున్నావ్?" అంటూ సన్నగా గడకర్రలా వుండే పక్కింటి లాయర్ సహదేవుడు మునివేళ్ళమీద నడుస్తూ వచ్చాడు. అతను చాలాకాలం క్రితమే రిటైరైన చెట్టుకింద ప్లీడరు . చెట్టుమీద పిట్ట రెట్టలు లెక్కపెట్టటం తప్ప, ఒక్క కేసు కూడా డీల్ చేయలేదు. "కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు, పొద్దస్తమానం పుస్తకాలు ముందేసుకుని ఏదో చూస్తూ ఉంటావు. ముళ్ళ మీద కూర్చున్నట్టు ఆ మొహం ఏవిటీ?! ముళ్ళకంపలాంటి కేసేదన్నా తగిలిందా? " అన్నాడు సహదేవుడు . "ముళ్ళకంపా లేదు, కలగోలుగంపా లేదు. మా సీనియర్ క్రిమినల్లాయరుకి కొరుకుడు పడని కేసొకటి వచ్చిందట రక్తం ఓడ్చి కేసు వాదిస్తానని పంతంపట్టి రక్తపిశాచిలా నా ప్రాణం తీస్తుంటే, భయపడి నేను కోర్టు ఛాయలక్కూడా పోవట్లేదు ." అన్నాడు పుస్తకంలోకి తలదూరుస్తూ.. "మరి నన్నయ్యకు అన్నయ్యల్లే ఇన్ని పేజీలు రాసేస్తున్నావ్ దేనికి?" అన్నాడు. "ఎన్ని పుస్తకాల్లో వెతికినా నాకు కావాల్సిన సరైన సమాచారం మాత్రం దొరకట్లేదు" అంటూ నాలిక చప్పరించాడు. " గ్రంథాల్లో దొరకని అంత ఘాటు విషయం ఏవిటబ్బా? గూగుల్ తల్లిని ఆడక్కపోయావా?" అంటూ సలహా ఇచ్చాడు. "అదీ అయ్యింది. గూగుల్ 'ఈ ప్రశ్నకూ నాకూ ఎలాంటి సంబంధం లేదు. దీనికి జవాబు ఈ భూమండలంలో దొరకదు. వీలైతే ఇంకెప్పుడూ ఇలాంటి చచ్చుప్రశ్నలు అడక్కు' అని సమాధానమిచ్చింది" నిట్టూర్చి చెప్పాడు. " నాడీమండలాన్నే కాకుండా, క్లౌడ్ మండలాన్ని కూడా వేడెక్కించే అంత గొప్ప ప్రశ్న ఏమై వుంటుందబ్బా?అదేంటో నాకు చెప్పు .నేనేమన్నా చెప్పగలనేమో చూస్తా" అన్నాడు సహదేవుడు కుతూహలంగా. "ఏం లేదు.నేను లాయర్ గా కోర్టులో కేసు వాదించేటపుడు కాళ్ళు గజగజా వణికిపోకుండా వాదించటం ఎలా? అని వెతుకుంటున్నాను." అన్నాడు సీరియస్ గా మొహం పెట్టి. పగలబడి నవ్వాడు సహదేవుడు. "ఈ ప్రశ్నకు సమాధానం గూగుల్ తల్లిదగ్గరో, లైబ్రరీ పుస్తకాల్లోనో దొరకదు. నీ ఇంట్లోనే ఉంది." అన్నాడు నవ్వాపుకుంటూ. "నాయింట్లోనా? ఏదీ మా తాత పెట్టెలో దాచిన ఆ పురాతన తాళపత్ర గ్రంధాల్లో దొరుకుతుందా? " అన్నాడు రహస్యాన్ని చేధించిన డిటెక్టివ్ లా మొహం చాటంత చేసుకుని. "తాళపత్రాల్లోనో, చెట్టు తొర్రలోనో లేదు! నువ్వు తాళి కట్టిన భార్య చేతుల్లోనే ఉంది " అన్నాడు . అఖండ మండలంలోని అసలు రహస్యాన్ని విప్పిచెప్తున్నట్టు. "అవునా? మా ఆవిడ ఏమన్నా నేను 'సరే యువరానర్' అనడం తప్ప ఆవిడ చేతుల్లో ఏముందో నేనెప్పుడూ చూడలేదే?" అన్నాడు బిక్కమొహం వేసి. "ఆ అక్కడే ఉంది కిటుకు. ఇకనుంచి ఆవిడ మాటలకు సరే అని ఊ కొట్టకుండా ఎడ్డెం అంటే తెడ్డెం అని రెచ్చగొట్టుచాలు. ఆవిడ లాగే లా పాయింట్లకి ఎంతటివాడి జాయింట్లయినా కదిలిపోవాల్సిందే. వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకో. కోర్టులో అనర్గళంగా వాదించై. సింపుల్. " అంటూ సలహా ఇచ్చాడు సహదేవుడు . రెండు కాఫీ కప్పులు పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది కనకం. "కాఫీ తెమ్మని చెప్పి ఎంతసేపయ్యింది? ఇంతసేపు చేసావే?" అన్నాడు సన్యాసిరావు. "ఇన్స్టెంట్ కాఫీ మీరు తాగరు కదా అని, ఫిల్టర్ కాపీ ఇద్దాం కదా అని చూస్తే డికాక్షన్ లేదు. సరే కొత్త డికాక్షన్ వేద్దామని చూద్దునుకదా కాఫీ పొడి కాస్తే ఉంది. మొన్న మీ అమ్మగారు వచ్చినపుడు రోజుకు నాలుగైదుసార్లు కాఫీ కలిపానేమో అయిపోయిందని చూసుకోలేదు. పక్కింటి పిన్నిగారిదగ్గరకెళితే నన్నుఆపేసి ఏవో కబుర్లు చెప్పి చాలా సేపటికి పొడి ఇచ్చింది. అది డికాక్షన్ వేసి పాలుపోసేసరికి......" "నేను కాఫీ అడిగితే కాసీమజిలీ కధలు చెబుతావే?" అన్నాడు సన్యాసిరావు కాస్త గొంతుపెంచి. "ఆపండి! ఆనాడు మీ నాన్నగారు మన పెళ్లిలో ఇలాగే వంకరగా మాట్లాడేసరికి ,మా బాబాయికి మండి, గంగాళంనిండా కాఫీ పోసి లోటాతో తాగమన్నాడు. ఆడపెళ్ళివారుకదా అని ఆడుకుందామనుకున్నారేమో, అదేం కుదరదని మా చిన మావయ్య కలగజేసుకుంటే, మీ పెత్తల్లి కొడుకు సర్దిచెప్పాడు. మిమ్మల్ని అలకపాన్పు ఎక్కించిన మీ పెద్దమ్మతో 'అలా చేయకూడదు , ఇది తప్పు' అని అనకపోగా మంచం మీద మఠం వేసుకుని కూర్చుని.. ..."అంటూ ఎప్పటివో పాత సంగతులు గుర్తు తెచ్చుకుని పుట్టు పూర్వోత్తరాలనాటి విషయాలు తోడి అసందర్భంగా వాదిస్తూ దుమ్ము దులిపేసింది కనకం. గూగుల్ కూడా గుటకలు మింగే పాయింట్లను కనకం అలవోకగా చెప్పేస్తుంటే ఆదరాబాదరాగా రాసేసుకున్నాడు సన్యాసిరావు. "హుర్రే! నాకు వాదించటం వచ్చేసిందోచ్. జోరీగలా అక్కడక్కడే తిరక్కుండా, కందిరీగలా ఎక్కడెక్కడికో వెళ్లి తిరిగి తిరిగి పాయింట్ కి రావాలి. ఈలోగా అవతలివాడు అసలు విషయం మర్చిపోయి డిఫెన్స్ లో పడిపోతాడు.అప్పుడు కేసు మనమే గెలుస్తాం " అంటూ సంబరంగా గంతులేశాడు సన్యాసిరావు. 'నాకింతటి తెలివైన భార్య దొరకుంటే కేసుల్ని విష్ణుచక్రంలా ఒంటి వేలుతో తిప్పేసేవాడిని. హు ! దేనికైనా అదృష్టం ఉండాలి.' అనుకుంటూ లోలోపలే కుళ్ళుకుని వెళ్ళిపోయాడు సహదేవుడు. అప్పటినుంచి సన్యాసిరావు తనమీద తనకు నమ్మకం సడలుతున్నప్పుడల్లా భార్యతో వాగ్వివాదానికి దిగి విజయవంతంగా డిపాజిట్లు కోల్పోయేవాడు ఓటమి తాలూకు సారాంశాన్ని నోట్ చేసుకుని కోర్టులో జడ్జి ముందు జడవకుండా నిలబడి ' యువరానర్' అంటూ ధైర్యంగా వాదించేసేవాడు.

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం