లోపం..ఎవ్వరిది....? - రాము కోలా దెందుకూరు.

Lopam evvaridi

కొన్ని సంఘటనలను చూస్తుంటే కంట నీరు చేరడం సహజం. అలాగే కొన్ని అక్షరాల్లో దాగిన భావం ఎదను తాకగానే,కన్నులు చెమర్చడం సహజమే అనేది వాస్తవం అని తెలియజేసే సంఘటనలో "సువిధ" సాక్షిగా నిలిచింది . కంటితో చూసింది వాస్తవం కాకపోవచ్చు,అనేది తెలిసిన క్షణం. "సువిధ "చేతిలోని లెటర్ కన్నీటితో తడిచి పోతుంటే కన్నులు పైవిట చెంగుతో అద్దుకుంటున్న సంఘటనకు పది నిముషాల ముందు... ఇలా జరిగింది ***** ఉదయం నుండి ఆఫీసులో పని వత్తిడితో మానసికంగా ఇబ్బందిని ఎదుర్కొని,పని ముగించుకుని ఇంటికి చేరాలనే ఆలోచనలో తానుండగానే ఉదయం తాను సిటీ బస్ ఎక్కుతున్నప్పుడు తన వైపు అదోలా చూసిన చూపులను తాను మరువకముందే.. అలా చూసిన యువకుడు చేతిలో ఏదో లెటర్ తో దగ్గరగా ప్రత్యక్షం అవ్వడంతో "సువిధ"కు కోపం కట్టలు తెంచుకుంది.. ఓరి దరిద్రుడా ! లవ్ లెటర్ ఇవ్వడానికే ఇక్కడ ఉన్నావా అనుకుంటూ .. తనకు లెటర్ అందిస్తున్న యువకుడి చెంప పగలకొట్టేసింది "సువిధ." రెండుచేతులు ఎత్తి నమస్కరించి మౌనంగా నిల్చున్న యువకుడి మనోభావం ఎంటో తెలుసుకోవాలని లెటర్ చదవడం ప్రారంభించింది "అమ్మకు వందనం . నేను రెండు రోజులు క్రితమే మిమ్ముల్ని చూసాను. మీరు అచ్చు మా అమ్మలా ఉన్నారు ... అందుకే రేపు నా పుట్టిన రోజు మీ దీవెనలు తీసుకోవాలి అనిపించింది. అది అడగాలనే బస్ స్టాఫ్ దగ్గరే ఆగాను. చిన్నతనం లోనే అమ్మానాన్నా యాక్సిడెంట్ లో చనిపోవడంతో. నా అనే వారు లేక పోవడం. దానికి తోడుగా పుట్టుకతోనే మాటరాని వాడిగా పుట్టడంతో ఎవ్వరూ చేరదీయలేదు. నా బాల్యం అంతా అనాధగానే సాగుతుందనుకున్న సమయంలోనే ఎవ్వరో ఒక మహానుభావుడు హాస్టల్లో చేర్పించాడు. ఉపాధ్యాయులు శ్రద్ధ చూపడంతో గురుకుల పాఠశాల ప్రవేశ పరిక్ష వ్రాసిన నేను ఇంటర్ వరకు గురుకుల కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసాను. ఇక్కడ డిగ్రీలో చేరాలని వచ్చాను. బస్ దిగుతూనే మిమ్మల్ని చూసాను. అమ్మా అని పిలవాలనే మనసు తపన నోటితో తెలపలేను.మాట రాదు కనుక. అందుకే ఇలా లెటర్ రాసాను. అమ్మ దూరమైన తరువాత అమ్మ రూపం మీలో కనిపించింది. చెప్పలేని మాటలను ఇలా రాసాను. మీకు నమ్మకం కలిగితే అమ్మలా నన్ను దీవించండి." చదవడం ముగియగానే "సువిధ" లో మాతృత్వం వెల్లువలా పొంగి కన్నీటి వరదలా మారింది. కన్నీటితో నిండిన కన్నులకు అక్షరాల స్థానంలో ఆ యువకుడు హస్తాలు జోడించి వేడుకుంటున్నట్లుగా కనిపిస్తుంటే.. తాను తల వంచుకుంది. ఎదుటివారిని చూసే విధానంలో మనలో ఎటువంటి కల్మషం లేకుండా ఉండాలి అనిపించింది. "సువిధ " అతన్ని దగ్గరకు రమ్మంటూ సైగ చేసింది. అతని కన్నుల్లో చెప్పలేని ఆనందపు వెలుగు. బిడియంగా నే దగ్గరగు వచ్చిన యువకుని తలనిమురుతూ సున్నితంగా నుదుటిపై ముద్దు పెట్టి దీవించింది.. దీర్ఘాయుష్షు మాన్ భవః..అంటూ.... తనలోని మాతృత్వంతో మనసారా... అమ్మలందరికి వందనంతో .. అమ్మా అని పిలిచే వారిని మనసారా దీవించండి.

మరిన్ని కథలు

The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ