ఆడపిల్ల - VENKATARAMANA SARMA PODURY

Aadapilla
"' మీ రామనాధం బాబయ్య గారు ఫోన్ చేశారు. రేపు ఎదో పనిమీద వస్తున్నారట. ఆదివారమే కదా మిమ్మలిని ఎక్కడికీ వెళ్ళొద్దని అన్నారు" ఆఫీసు నుంచి రాగానే కాఫీ ఇస్తూ చెప్పింది
సుగుణ.
" ఎన్నింటికి వస్తున్నారో ఎమన్నా చెప్పారా ? స్టేషన్ కి రమ్మని చెప్పలేదా ?" అడిగాను
" అదేమీ చెప్పలేదు. ప్రతిమాటు లాగా ఆయన తెచ్చే ఊబలంక కోవా బిళ్ళలు తినేయకండి. కొత్తాగా షుగర్ క్లబ్ లో చెరారు కదా ? " అంది హెచ్చరిస్తూ
రెండు నెలల క్రితం మాస్టర్ చెకప్ లో షుగర్ బయటపడ్డ నుంచీ, రోజుకు ఒక మాటయినా " మీ రామనాధం బాబయ్య గారు తెచ్చే కోవాలు తినేసి షుగర్ వ్యాధి తెచ్చుకున్నారు " అనడం
ఆవిడకి అలవాటయిపోయింది.
స్వీట్లు తినడానికి, షుగర్ వ్యాధి రావడానికి సంబంధం లేదని ఎన్ని మాట్లు చెప్పినా ఆవిడ మనసు లో రిజిస్టర్ అవదు.
వాళ్ళ ఊళ్ళో తయారయ్యే కోవాలు చాలా బాగుంటాయని, బాబయ్య ఎప్పుడు వచ్చినా తీసుకువస్తాడు. కోవా లాగే ఆయనది చాలా తీయని మనస్తత్వం. మా అమ్మకి వరసకి చెల్లెలు
రాజ్యలక్ష్మి పిన్ని భర్త ఆయన. మా నాన్నగారి తరపున కూడా అయన బంధువు కాబట్టి,మా చిన్న తనం నుండి, ఆయన, పిన్ని ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే దిగేవారు.
ఆయన చేసేది వ్యవసాయమయినా, చాలా మందికి కోర్టు కేసులలో సహాయం నిమిత్తం హైదరాబాద్ తరచు వచ్చేవాడు.
వచ్చిన వాళ్ళతో హోటల్ లో ఉన్నా, మా ఇంట్లో ఒకటి రెండు రోజులు గడిపి వేళ్ళ వాడు.
" ఈ మాటయినా మా తమ్ముడికి పపిల్లలు పుడతారా లేదా అడగవచ్చు కదా ?" అంది సుగుణ తాను కూడా కాఫీ తెచ్చుకుని
" ఆయనకి మనసుకి తోచినప్పుడే చెబుతాడు కానీ , అడిగితే ఏమీ చెప్పడు కదా ? చెప్పలేడు కూడాను " అన్నాను గతంలో చెప్పినదే మళ్ళీ గుర్తు చేసి.
******
సాముద్రికం, జ్యోతిష్యం లాంటి వాటికీ సంబంధం లేకుండానే మా రామనాధం బాబాయి లో ఒక ప్రత్యేకమయిన శక్తి ఉంది . ఎవరూ అడగక పోయినా కొన్ని
సందర్భాలలో కొందరిని చూసి అయన కొన్ని విషయాలు జరుగుతాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏ ఆధారం తో అంటే, "నేనేమీ చెప్పలేను ఆ సమయం లో అలా
చెప్పాలని అనిపించి చెబుతాను " అంతే అంటాడు.
. అలా ఆయన చెప్పినవి నిజంగా జరగడంతో అయన మీద బంధు కోటి లో గౌరవం పెరిగింది.
నాకు తెలిసిన మటుకు, అయన చెప్పిన చాల విషయాలు నన్ను ఆశ్చర్యం లో ముంచాయి. ఒక్క విషయం లో మాత్రం అయన చెప్పినట్టు జరగ లేదు.
అయన చెప్పే వాటికి కాల పరిమితి ఏమీ చెప్పేవాడు కాదు కాబట్టి, అయన చెప్పినది మరిచిపోవడం, ఆ తరవాత అది జరిగినప్పుడు, అయన చెప్పినది గుర్తుకు రావడం జరిగేది.
చాలా కాలం తరవాత అయన వస్తున్నారని తెలియగానే అన్ని గుర్తుకు వచ్చాయి.
*******
నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాన్న గారు ఒక చిన్న ఇల్లు తార్నాక లో కట్టారు. దాని గృహ ప్రవేశానికి బాబాయి, పిన్ని కూడా వచ్చారు. ఆవేళ భోజనాలు అయిన తరువాత
అందరం కూర్చుని ఉండగా " అన్నయ్య గారు ఈ ఇంట్లో మీరు ఎక్కువ కాలం ఉండరు. ఇంకో పెద్ద ఇంటికి మారతారు " అన్నాడు బాబాయి.
అప్పుడే అద్దె ఇంట్లోనించి స్వంత ఇంట్లోకి మారిన మాకు అది నమ్మ బుద్ధి కాలేదు. కానీ గృహ ప్రవేశం జరిగిన రెండు సంవత్సరాల లోపు లోనే, నాన్నగారు దుబాయి వెళ్లడం,, అక్కడ
అయిదు సంవత్సరాలు పనిచేసి తిరిగి వచ్చి జుబిలీ హిల్స్ లో పెద్ద ఇల్లుకట్టడం, అందరం అక్కడికి మారడం జరిగింది.
ఆ తరవాత జూబిలీ హిల్స్ ఇంటికి ఆయన వచ్చినప్పుడు అయన చెప్పినది గుర్తు చేసుకున్నాము. అప్పుడే ఆయన ఇంకో విషయం చెప్పాడు. అప్పుడు మా చెల్లెలు కళ్యాణి ఇంటర్
చదువుతోంది. బాబయ్య, నాన్నగారు, నేను కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా కళ్యాణి అందరికి కాఫీలు ఇచ్చి లోపలి కి వెళ్ళింది . కళ్యాణి లోపలి కి వెళ్ళగానే,
"కళ్యాణి పెళ్లి చూపులప్పుడు ముగ్గురు పెద్దవాళ్ళు ఒక చిన్న పిల్ల తో పెళ్లి చూపులకి వచ్చిన సంబంధం జరుగుతుంది" అని అయన నాన్న తో అన్నారు. అది ఇంకా చాలాకాలం
తరవాత మాట కదా అని అప్పుడు అనుకున్నాము. ఆ సంగతి అప్పుడే మరిచి పోయాము.
ఆ తరవాత ఏడు ఎనిమిది సంవత్సరాల తరవాత కల్యాణికి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు.రెండు మూడు సంబంధాలు వాళ్ళు వచ్చి
చూసిన తరవాత, నాన్నగారి స్నేహితుడు ఎవరో చెబితే ఒక సంబంధం వాళ్ళని పిలిచారు. పెళ్ళికొడుకు, తల్లి, తండ్రితో పాటు వాళ్ళ మనవరాలు ఒక చిన్న పిల్ల కూడా వచ్చింది.
బహుశా మూడు సంఖ్యఎందుకని నాలుగు చేయడం కోసం ఆ పిల్లని తీసుకువచ్చారనుకుంటాను.
వాళ్ళు చూసి వెళ్లి ఇంకా ఏ సంగతి చెప్పకుండానే, " ఈ సంబంధం కుదురుతుంది " అంది సుగుణ అందరితోటి.
"ఎలా చెబుతూన్నావు " అని అందరం అడిగితే ఎప్పుడో బాబయ్య చెప్పిన విషయం గుర్తు చేసింది. ఆ సంబంధం కుదిరి వాళ్ళు ఇపుడు హ్యాపీ గా ఉన్నారు.
అయన ఎవరికయినా నెగటివ్ విషయాలు చెప్పేవాడు కాదు. ఒక్క మాటు మాత్రం నా స్నేహితుడు నారాయణ విషయం లో మాత్రం అది జరిగింది. ఇలాగె ఒక మాటు
అయన హైదరాబాద్ వచ్చినప్పుడు, అయన ఉండగా నా ఫ్రెండ్ నారాయణ వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు. అతను వెళ్ళగానే " మీ ఫ్రెండ్ కొద్ధి నెలల లోనే కర్మ చేస్తాడు రా "
అన్నాడు ఆయన
" నేను ఆశ్చర్య పోయాను . నారాయణ తల్లి, తండ్రి అప్పటికి బాగానే ఉన్నారు, నేను అతనికి ఏమీ చెప్పలేదు. బాబాయి చెప్పినట్టు, ఆరు నెలలు గడవకుండానే నారాయణ తల్లి
కాన్సర్ వచ్చి చనిపోవడం, అతను కర్మ చేయడం జరిగి పోయింది.
అయితే మా బాబాయి చెప్పినది ఒక విషయం మాత్రం జరగలేదు. అది మాతమ్ముడు రామం విషయం లో జరిగింది. రామానికి పెళ్లి అయిన తర్వాత ఆరు సంవత్సరాలకి ఒక కొడుకు
పుట్టాడు. కానుపు కష్టయింది మా మరదలు జానకికి. అందుచేత తరవాత కానుపుకు ఎక్కువ వ్యవధి ఉండాలని డాక్టర్లు చెప్పారు. సహజం గానే వాళ్ళకి తరవాత ఐదేళ్లయినా
ఎవరూ పుట్టలేదు. రామం అమెరికా నుంచి ఇండియా వచ్చినప్పుడు, బాబయ్య కూతురు రాధ పెళ్లి అయింది. మన ప్రాంతాలు చూసినట్టు ఉంటుందని రామం, నేను
ఊబలంక పెళ్ళికి వెళ్ళాము.
పెళ్లి అది అయినతరువాత, వచ్చేస్తోంటే, బాబయ్య రామం తో " నీకు మొదట అబ్బాయి కదా . తరవాత ఆడపిల్ల కనపడుతోంది " అన్నాడు తన తరహాలో
రామానికి ఆ మాటలు చాలా;ఆనందం కలిగించాయి. కొడుకు వరుణ్ తరవాత ఒక ఆడపిల్ల ఉంటె బాగుంటుందని అనుకుంటున్నామని వాడు నాతో అన్నట్టు గుర్తు. ఇది జరిగిన
నాలుగేళ్లకు ఒక మాటు ఫోన్లో మాట్లాడుతో ఒక విషయం చెప్పాడు . వాళ్ళ వరుణ్ సడన్ గా ప్రొద్దుటే సోఫాలో కూర్చుని పాలుతాగుతూ వాళ్ళ అమ్మతో " వేర్ ఈస్ మై లిటిల్ సిస్టర్ "
అన్నాడట. రామం, భార్య ఆశ్చర్య పోయారుట . కాస్త ఆలోచిస్తే వాళ్ళకి అర్థం అయింది ఏమిటంటే, వాడు ఈమధ్యన ఎదో చిన్న పిల్లల సిరియల్ చూశాడట. అందులో కథ అంతా ఓ
కుర్రాడు , వాడి చెల్లెలు చుట్టూ తిరిగుతుందట . అది మనసులో ఉండి అడిగాడు అనుకున్నారుట. వాడి స్నేహితులలో కొందరికి చెల్లెళ్లు ఉండడం ఇంకో కారణం కావచ్చు.
వాడి ఒంటరితనాన్ని తగ్గించడానికయినా, దత్తత లాంటిది ఆలోచించారుట. కానీ అమెరికా లో ఉన్న చట్టాలు పరిధిలోను, మిగతా చట్టాల దృష్ట్యా అది సాధ్యం కాదని
.విరమించుకున్నామని చెప్పాడు రామం.
ఇంకో సంతానానికి అవకాశం లేదని వాళ్ళు గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. " మన రామనాధం బాబాయి జోస్యం తప్పు అయినట్లే " అన్నాడు చాలా మాట్లు రామం నాతో.
*******
అవసరం ఉంటె స్టేషన్ కి రమ్మని ఆయనే చెబుతాడు. ఈ మాటు ఆలా సందేశం ఏమీ లేక ఆదివారమయినా నేను స్టషన్ కి వేళ్ళ లేదు.
నేను అనుకున్నట్టు గానే ఎవరో బాబాయిని కారులో దింపి మర్నాడు కోర్టు వేళకి వస్తామని చెప్పి వెళ్లిపోయారు.
బాబాయి స్నానం చేసి రెడీ అయిన తరవాత మాఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టింది సుగుణ . ప్రొద్దుటే నాతొ అంది ఇవాళ బాబయ్యగారికి 'బుట్టల" బ్రేక్ఫాస్ట్ తో సర్ప్రైజ్ చేద్దామంది.
ఆ మధ్యన ఆయన తెచ్చి ఇచ్చిన పనస మొక్క దొడ్లో పాతితే , ఇప్పుడు చాల పెద్దది అయింది. మిగతా ప్రాంతల వాళ్ళకి తెలుసునో లేదో తెలియదు కానీ మా కోనసీమ లో పో లాల
అమావాస్యకి పనస ఆకులతో కుట్టిన బుట్టలో ఇడ్లి పిండి లాంటిది పెట్టి ఆవిరి మీద ఉడికించి పెట్టేది మా అమ్మ. సుగుణ కి ఆవిడే నేర్పింది.
ఇవ్వాళ బాబాయి బ్రేక్ఫాస్ట్ లో వాటిని చూసి చాలా సంతోషించాడు. బ్రేక్ఫాస్ట్ అవగానే రెండో మాటు కాఫీ తెచ్చి ఇచ్చిన సుగుణ తో సడన్ గా " మీ తమ్ముడికి ఇద్దరు పిల్లలు
కనపడుతున్నారు " అన్నాడు ఆయన, సుగుణ ఏమీ అడగక పోయినా . వాళ్ళ తమ్ముడికి పిల్లలు లేరన్న సంగతి ఆ మధ్యన ఎప్పుడో సుగుణ చెప్పింది బాబయ్యతో.
ఇప్పుడు సడన్ గా బాబయ్య ఆ సంగతి ఆయనే ఎత్తి చెప్పడం తో ఆవిడ సంతోషం దాచుకో లేదు. ఇంక దానిమీద ప్రశ్నలు వేయకూడదని ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిషయం విని
ఊరుకుంది.
ఆవిడ సంతోషం ఆవేళ మధ్యాహ్న భోజనం తయారుచేయడం లో ప్రస్ఫుట మయింది. బాబాయికి ఇష్టమయిన, కొబ్బరి కోరు శనగపప్పు కూర, చిలగడ దుంపల పులుసు, ఆవిడ
స్పెషల్ ఐటెం కంద వడలు మొదలయినవి చేయడం వల్ల, బాబాయి ప్రసంశలు ఓపెన్ గానే లభించాయి ఆమెకు.
******
బాబాయి నిద్ర పోయి లేచిన తరవాత మా ఇద్దరికీ టీ ఇచ్చి లోపలి వెళ్ళింది . బాబాయి నేను కబుర్లలో పడ్డాము.బాబాయి ఏ చిన్న విషయాన్నయినా ఒక ప్రత్యేకమయిన స్టైల్ లో
చెబుతాడు. అందు చేత అయన ఏ విషయం మాట్లాడినా వినబుద్ధి వేస్తుంది. ఈ మధ్యన వాళ్ళ ఊళ్ళో జరిగిన సినిమా షూటింగ్ గురించి చెబుతూ ఉండగా సుగుణ
లోపలినుంచి సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని " మీ రామం వాట్సాప్ మెసేజ్ పెట్టాడు చూశారా ? " అంది
ఆ అడిగే పద్దతి లోనే ఎదో పెద్ద విశేషం ఉందని తెలుస్తూనే ఉంది.
ఏమిటది అన్నాను ఆతృతగా ." మీరే చూడండి వాళ్ళ కుటుంబం లోకి వచ్చిన కొత్త మెంబెర్ 'సుబ్బు' తో ఫోటో పెట్టాడు " అంది సెల్ చేతికి ఇస్తూ
ఏమిటి ? కొంపదీసి బాబాయి జోస్యం నిజమైందా ఏమిటి ? అని పైకి అంటూ మెసేజ్ లో ఫోటో చూశాను . అది, రామం, జానకి, కొడుకు వరుణ్, వరుణ్ చేతిలో ఒక కుక్క పిల్ల తో . ఉన్న
ఫోటో అది.
" ఏది చూడనీ అని సెల్ తీసుకున్నాడు బాబాయి. ఫోటో చూసి ఓహో కొత్త మెంబర్ 'సుబ్బు' " ఆంటే కుక్క పిల్ల అన్న మాట " అన్నాడు సాలోచనగా
సెల్ నా చేతికి ఇస్తూ " సుబ్బు" అంటే 'సుబ్బలక్ష్మి నా లేక సుబ్రహ్మణ్యమా ? ఈ బాటికి లేస్తాడా? ఫోన్ చేసి కనుక్కో అన్నాడు
" ఎందుకు లేవడు? ఇప్పుడు అక్కడ టైము ఎనిమిది కదా ? . అని వాట్సాప్ కాల్ చేశాను
" ఎరా కొత్త మెంబర్ సుబ్బలక్ష్మి నా లేక సుబ్రహ్మణ్యమా ? " అన్నాను
వాడు చెప్పినది విని " బాబాయి నీ జోస్యం రామం విషయం లో కూడా నిజం అయింది సుబ్బలక్ష్మి ట "
అన్నాను నవ్వుతూ
సమాప్తం

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల