ఇత్తడి మనసులు - Srinivas Kasturi

Ittadi manasulu

కెనడా - టొరంటో మహానగరంలో....ఒక ఇంట్లో

"వాళ్ళు బయల్దేరారట..."అంది స్వర్ణ.

అద్దం ముందు కూర్చున్న స్వర్ణ తన మేడలో డైమండ్ నెక్లెస్ ని సర్దుకుంటూ.

"ఆ సర్దుకోవడం ఆపి డైనింగ్ టేబుల్ దగ్గర ఏర్పాట్లు చూడు" అన్నాడు చక్రి తాను చేస్తున్న పనిని ఏకాగ్రతతో చేస్తూ

"ఆ ఖరీదయిన ఖాళీ విస్కీ బాటిల్ లో చవక విస్కీ నింపడం పూర్తి చేసి నాకు సాయం చెయ్యి" అంది స్వర్ణ వెటకారంగా

"అబ్బా!!! మరి ఫ్రెండ్ దగ్గర అరువుకి తెచ్చుకుని పెట్టుకున్న డైమండ్ నెక్లెస్ ని సర్దుకోవడం ఆపితే, నేను సాయం చెయ్యడానికి రెడీ" వెటకారం ఘాటుని పెంచాడు చక్రి

"ఈ ఒక్క రోజుకి మనం కొంచం ఘనంగా కనిపించాలనుకున్నాం కదా. అసలే ఆ మానస-అరుణ్ లు ఇక్కడికి వచ్చాక బాగా సంపాదించారు కదా? హైదరాబాద్ లో మన పక్కింట్లో ఉన్నప్పుడు లాగా కాదు" అంటూ లేచింది

దానికి చక్రి, "అవునులే, షాపింగ్ మాల్లో సెల్ ఫోన్ accessories అమ్ముకునే నేను, ఎదురుగా జ్యువెలరీ షాప్ లో పని చేసే నువ్వు ....వాళ్ళ స్టేటస్ కు సరిపోతామా?

చక్రి గరాటుని పక్కకి గిరాటేసి…..నింపిన ఖరీదయిన బాటిల్ ని పట్టుకుని లేస్తూ అన్నాడు,"అందుకేగా ఈ తిప్పలు....పదా".

***

ఒక మెర్సీడిస్ బెంజ్ కార్ వారి ఇంటి ముందు డ్రైవేవేలో మంచు మీద మెత్తగా ఆగింది. అరుణ్, మానసలు దిగారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న స్వర్ణ చక్రిలు సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు.

లోపాలకి వస్తూ స్వర్ణ అడిగింది, "పట్టు చీరలు రెపరెపలాడిద్దామన్నావు? ఇలా ఘాఘ్రా లో దిగావేంటి?" అంది. "సారీ స్వర్ణ, పొద్దున్న మన ఇండియన్ కాన్సలేట్ జనరల్ తో బ్రేక్ఫాస్ట్ మీట్ కి వెళ్ళవలసొచ్చింది. వాళ్ళు నార్త్ ఇండియన్స్. అందుకే ఇలా వేసుకోవాల్సొచ్చింది. కానీ, మన ప్లాన్ మర్చిపోలేదులే. ఇదిగో పచ్చని పట్టుచీర తెచ్చాను. ఇప్పుడే మార్చుకుని వస్తా, మీ గెస్ట్ రూమ్ ఎక్కడ?" అడిగింది. తీసుకు వెళ్ళింది స్వర్ణ.

ఇంతలో చక్రి అరుణ్ లివింగ్ రూమ్ లో కూర్చున్నారు."ఎలా ఉన్నారు అరుణ్? చాలా రోజులయ్యింది" అన్నాడు చక్రి

"బాగానే ఉన్నాము చక్రి. ఈ మధ్య బిజినెస్ పనుల మీద యూరప్ బాగా ప్రయాణం చెయ్యవలసి వస్తోంది. ఇలా స్నేహితులతో గడపడానికి టైం దొరకడమే కష్టం గా ఉంది" చెప్పాడు అరుణ్.

ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుండగా రెప రెప లాడుతూ రెండు పట్టు చీరలు కిందకి దిగాయి. ఆ ఇద్దరిలో మానస పట్టుచీర మెరిసిపోతోంది.

చక్రి, స్వర్ణ కళ్ళతో సంభాషించుకున్నారు.

"చీర ఎంతుంటుంది?" చక్రి

"50 వేలేమో" స్వర్ణ

"ఇల్లు బాగుంది. ఎప్పుడు తీసుకున్నారు?" అడిగింది మానస.

“ఒక సంవత్సరం అయ్యింది. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న ఏరియా కదా అని కాస్త ఎక్కువ పడినా, ఇక్కడే తీసుకున్నాం".

"ఇల్లు చూపించు" అన్నాడు చక్రి స్వర్ణతో

అరుణ్ మానసలకు ఇల్లు చూపించిన తరవాత, అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటుండగా, చక్రి అరుణ్ ని అడిగాడు,"కాస్త గొంతు తడుపుకుందామా?" అని.

"ఏముంది?" అడిగాడు

"జానీ వాకర్....బ్లూ లేబిల్" అన్నాడు చక్రి

"అద్భుతం, నా టేస్ట్ నీకు బాగా తెలుసు" నవ్వాడు అరుణ్

ఇద్దరూ మద్యపానం మొదలుపెట్టారు. మగవాళ్ళు అస్సలు మొహమాట పడకుండా చేసే పని ఇదే.

కాసేపటికి భోజనాలు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక, అరుణ్ తాను వేసుకున్న షేర్వాణీ చేతులు మడత పెట్టి, చేతికి ఉన్న రోలెక్స్ వాచ్ తీసి పక్కన పెట్టాడు. భోజనం చెయ్యడానికి సౌకర్యంగా ఉంటుందని.

చక్రి, స్వర్ణ కళ్ళతో మళ్ళీ సంభాషించుకున్నారు.

"ఎంతుంటుంది?" స్వర్ణ.

"అధమం 5 లక్షలు" చక్రి

భోజనంలో కబుర్లు నంచుకుని తిన్నారు.

పాన్ వేసుకుని కులాసాగా కూర్చుని టీవీ చూస్తుండగా, ఎవరో పిలిచినట్టు అయితే చక్రి లేచాడు. వచ్చింది తమబేస్మెంట్లో అద్దెకు ఉంటున్న కుర్రాడు.

"ఏంటి?" అన్నాడు చక్రి.

"రెంట్ అండీ" అంటూ డబ్బుని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు.

“సరే” అని తీసుకుని వచ్చి కూర్చున్నాడు చక్రి.

వీళ్ళ సంభాషణల మధ్యలో అరుణ్ సెల్ ఫోన్ కు కాల్స్ వస్తూనే ఉన్నాయి.

"మీరు బిజీ అనుకుంటా. నా ఆఫీస్ రూంలో నుండి కాల్స్ తీసుకోండి" అన్నాడు చక్రి

"పర్వాలేదు. వీకెండ్స్ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. తరవాత చేస్తా" అన్నాడు అరుణ్

సాయంత్రం అవుతుండగా, మానస అంది"మేము బయలుదేరాలి. ఎప్పుడన్నా వీలు చూసుకుని మా ఇంటికి రండి" అని. అరుణ్ కూడా,"ఇక్కడ కూడా మళ్ళీ కలుసుకోవడం చాల సంతోషంగా ఉంది. మా ఇంటికి తప్పక రావాలి" అన్నాడు.

తప్పకుండ వస్తామని హామీ ఇచ్చారు స్వర్ణ చక్రిలు. వెళ్లే ముందు మానస అడిగింది," నేను ఇక్కడినుండి తిన్నగా BollyX డాన్స్ క్లాస్ కి వెళుతున్నాను. డ్రెస్ మార్చుకోవాలి... " అంటుండగా..."గెస్ట్ రూమ్ నీకు తెలుసుగా..."నవ్వుతు అంది స్వర్ణ.

కాసేపటికి బట్టలు మార్చుకుని వచ్చింది మానస. సెలవు తీసుకుని బయటపడ్డారు అరుణ్ మానసలు.

***

వాళ్ళు ఆలా వెళ్ళాక….., స్వర్ణ,"మనం వాళ్ళ స్థాయికి తగ్గట్టుగానే మేనేజ్ చేశాములే...నువ్వేమో ఆ విస్కీ.....ఈ ఇల్లు మనదే అని చెప్పడం...మన అదృష్టం బాగుండి ఓనర్ ఈ నెల మననే బేస్ మెంట్ వాళ్ళ రెంట్ కూడా తీసుకుని ఇవ్వమని చెప్పడం....ఆ బేస్ మెంట్ కుర్రాడు సరయిన టైం కి వచ్చి రెంట్ ఇవ్వడం.... అన్నీ కలిసొచ్చాయి".

చక్రి,"నిన్ననే ఇస్తానన్నాడు. నేనే రేపు మధ్యాన్నం ఇవ్వమని చెప్పను. ఇలా వాళ్ళకి తెలిసేలా చెయ్యాలని" నవ్వుతు అన్నాడు.

"ఆహ! ఎంత ఎదిగిపోయారు?'.....అంటూ మొటికలు విరిచింది.

***

కారులో కూర్చున్నాక అడిగింది మానస,"ఆ రోహిత్ కదా మీకు ఫోన్ చేస్తున్నాడు?"

"అవును, మూడు గంటలకల్లా కార్ తెచ్చి ఇస్తానన్నాను. లేట్ అయిందిగా, అందుకే తెగ ఫోన్ చేస్తున్నాడు" అంటూ అరుణ్ కార్ ని రివర్స్ చేసాడు.

మూతి మూడు వంకలు తిప్పింది మానస.

"చీర దగ్గర బాగానే మేనేజ్ చేసావే" అన్నాడు అరుణ్.

"మరి? నా క్లోజ్ ఫ్రెండ్ కీర్తిని బ్రతిమాలి తెచ్చుకున్నాను. మళ్ళీ ఎక్కడ నలిగిపోతుందో అని డాన్స్ క్లాస్ అని చెప్పి చీరను జాగ్రత్తగా మడత పెట్టి తీసుకొచ్చాను. స్వర్ణ చీర చూసావుగా. అయినా, నువ్వు మాత్రం...ఆ నకిలీ రోలెక్స్ వాచ్ ని మరీ అంతలా చూపించాలా? ? పైగా Europe అంట ….పక్కనే ఉన్న నయాగరా కి వెళ్ళడానికే దిక్కు లేదు" అంది మానస అతని వైపు చూస్తూ

"లేకపోతే, నేను చేసేది బోడి ఫ్యాక్టరీ ఉద్యోగం, నువ్వు చేసే కాల్ సెంటర్ జాబ్, అద్దె కొంప. వాళ్ళది సొంత ఇల్లు, అసలు ఆ ఖరీదయిన విస్కీ చూసావుగా?....అందుకే....ఈ రోలెక్స్.....బెంజ్ కార్...ఈ హడావిడి" అన్నాడు అరుణ్

"సరే, ఇంటికి రమ్మన్నారు....వాళ్ళు వస్తామంటే? మనం ఉండేది అద్దె కొంపలో..."బాధగా అంది మానస.

"అప్పుడు వేరే కథ ఎదో ఒకటి ఆలోచిస్తానులే....ప్రస్తుతానికి గండం గడిచింది కదా?" అంటూ కార్ వేగం పెంచాడు అరుణ్.

వీళ్ళ జీతాల లాగానే.....మనసులూ చిన్నవే.

పుత్తడి కోసం ప్రాకులాడే ఈ మనుషుల ఇత్తడి మనసులు మారవేమో?

సమాప్తం

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల