"మంత్రి పదవి ఎన్నిక" - యు.విజయశేఖర రెడ్డి

Mantri padhavi ennika

కాశీ రాజ్యాన్ని జయవర్దనుడు పరిపాలించేవాడు. అతని కుమారుడు మహేంద్రుడు గురుకులంలో శిక్షణను పొందుతున్నాడు. అక్కడ కేశవుడు అనే విద్యార్థి అందరిలోకీ ఎంతో చురుకుగా అన్నీ విద్యాలలో ముందుడే వాడు.మహేంద్రుడు,కేశవుడు మంచి స్నేహితులయ్యారు.

ఒక సారి మహేంద్రుడు,కేశవుడు గురుకులం కోసం కావలసిన వస్తువులను సంతలో కొని వస్తూ ప్రయాణ బడలికను తీర్చుకోవడానికి ఒక చెట్టు కింద కాసేపు విశ్రమించారు. అదే సమయంలో ఒక పాము మహేంద్రుడి చేతిని కాటు వేసింది.అది చూసిన కేశవుడు తన నోటితో పాము కాటు వేసిన చోటును కొరికి విషాన్ని లాగివేసి మహేంద్రుడి ప్రాణాలు కాపాడాడు.కానీ మంహేంద్రుడు మూర్చిల్లాడు. గురువు,విష్ణుచిత్తుడు చికిత్స చేశాక మహేంద్రుడు పూర్తిగా కోలుకున్నాడు.

“నా ప్రాణాలు కాపాడావు మిత్రమా!” అని మహేంద్రుడు,కేశవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

గురుకులంలో శిక్షణ పూర్తి అయ్యాక కేశవున్ని కూడా కోటకు తీసుకు వచ్చాడు మహేంద్రుడు.తండ్రికి కేశవుణ్ణి పరిచయం చేసి జరిగిన విషయం చెప్పాడు.

“యువరాజును పాము కాటు నుండి కాపాడవు...నీకు ఏమి కావాలో కోరుకో?” అన్నాడు జయవర్దనుడు.

“మనిషిగా నా ధర్మాన్ని నిర్వర్తించాను మహారాజా!” అన్నాడు కేశవుడు.

ఒక మాసం తరువాత యువరాజు పట్టాభిషేకం ఉంటుదని ముహూర్తం నిర్ణయించారు ఆస్థాన పండితులు. “నాన్నగారు నాకు పట్టాభిషేకం అంటున్నారు.. మంత్రిగా కేశవుడికి అవకాశం ఇద్దాము” అన్నాడు మహేంద్రుడు.

“గురుకులంలో విద్యను పూర్తి చేయడం వేరు రాజ్యాంగంలో మంత్రి పదవిలో కొనసాగడం వేరు..అయిన నీవు కోరుతున్నావు కాబట్టి అతనికి తెలియకుండా కొన్ని పరీక్షలు పెడతాను అందుకు నీ సహకారం కావాలి” అన్నాడు రాజు. “అలాగే నాన్న గారు” అన్నాడు మహేంద్రుడు.

ఒక రోజు మహేంద్రుడు,కేశవుడు అడవిలోకి వేటకు వెళ్లారు దారిలో ఉన్నట్లుండి మహేంద్రుడు గుర్రం మీద నుండి కిందకు పడిపోయాడు.

“కేశవా! నా కళ్ళకు అంతా మసకమసకగా కనబడుతోంది” అన్నాడు మహేంద్రుడు.

“అయ్యో... యువరాజా! అని లేపి తన గుర్రం మీద ముందు కొర్చో బెట్టి తాను వెనుక కూర్చుని కోటకు బయలుదేరాడు,యువరాజు గుర్రం వీరిని అనుసరించింది.

కోటకు చేరుకుని జరిగింది చెప్పాడు.రాజు,వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయమన్నాడు.చికిత్స మొదలై రెండు రోజులయ్యింది.మూడవ రోజు నాకు ఒక్క కన్ను మాత్రమే కనబడుతోంది అని యువరాజు బాధ పడసాగాడు.

“ఎమ్మయ్యింది వైద్యులవారు?” అని మంత్రి అడిగాడు.”యువరాజు కింద పడడంతో తల లోపల నరాలు చిట్లడం వల్ల ఒక కన్ను పోయింది” అన్నాడు వైద్యుడు.

“యువరాజు పట్టాభిషేకం దగ్గర పడింది ఇప్పుడెలా?” అన్నాడు రాజు.

“నాన్నగారు గుడ్డి రాజు ఎలా పాలన చేస్తాడని నలుగురూ నాలుగు మాటలంటారు నాకు పట్టాభిషేకం వద్దు” అన్నాడు మహేంద్రుడు.

ప్రక్కనున్న కేశవుడు ఈ విషయాలన్నీ విన్నాడు.వైదుడితో “మరి కన్ను కనబడాలంటే వేరే మార్గం లేదా?” అన్నాడు కేశవుడు.

“ఎందుకు లేదు, ఎవరైనా ఒక కన్నును దానం చేయడానికి ముందుకు వస్తే... వారికి మత్తు పానీయాన్ని ఇచ్చి వారి కన్నును శాస్త్ర చికిత్స ద్వారా తొలగించి యువరాజుకు అమర్చ వచ్చు” అని జవాబిచ్చాడు వైద్యుడు.

“నా కన్నును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు” కేశవుడు.

“నీది ఇంకా చిన్న వయసు నీవు కంటిని ఇస్తానంటే ఒప్పుకొను” అన్నాడు రాజు.

“లేదు మహారాజా! ఈ లోకంలో గుడ్డి వాళ్లు చాలమందే వున్నారు...అయిన ఒక కన్నుతో లోకాన్ని చూడవచ్చు” అని రాజును ఒప్పించాడు. తను కన్ను ఇస్తున్నట్లు యువరాజుకు తెలియకుండా జాగ్రత పడమన్నాడు.

మూడు రోజుల తరువాత రెండు వేరువేరు మందిరాలలో నుండి మహేంద్రుణ్ణి,కేశవుణ్ణి తీసుకు వచ్చి రెండు ప్రత్యేక ఆసనాలలో కూర్చోబెట్టి ఇరువురి కళ్ళకు కట్టిన కట్లను విప్పాడు వైద్యుడు.

“పోయిన నా కన్నుతో ఇప్పుడు బాగా చూడగలుగు తున్నాను” అని పక్కనున్న ఆసనం మీద కంటికి కట్టు కట్టుకుని కూర్చున్న కేశవుణ్ణి చూసి నాకు కన్ను ఇచ్చిన దాత నా మిత్రుడా అని బాధ పడ్డాడు యువరాజు.

“యువరాజా! ఈ సమయంలో మీరు బాధ పడకూడదు” అని కేశవుడికి రెండు కళ్ళకు ఉన్న కట్లలో ఒక కన్నుకు సంబంధించిన కట్టు విప్పి “ఈ కంటితోనే నీవు చూడగలవు మరో కన్నుకున్న కట్టును వారం రోజుల తరువాత విప్పుతాను...ఎందుకంటే ఆ కన్ను తొలగించబడింది కనుక” అన్నాడు వైద్యుడు.

యువరాజుకు పట్టాభిషేకం చేసే రోజు రానే వచ్చింది. “నాన్న గారు నాకు కంటి దానం చేసిన నా మిత్రుడికి నేను ఋణ పడి ఉన్నాను... అందువల్ల మంత్రి పదవిని కేశవుడికి ఇవ్వడమే ఉత్తమం” అన్నాడు రాజుతో, మహేంద్రుడు.

“లేదు యువరాజా! మీరు కాబోయే మహారాజు...మీకు మంత్రిగా నేను పనికి రాను రెండు కళ్ళతో చూసే వారికే మంత్రి పదవి ఇవ్వండి... నేను మా గ్రామం వెళ్ళి మా తండ్రిగారికి వ్యవసాయంలో తోడ్పడతాను” అన్నాడు కేశవుడు.

మంత్రి సైగతో వైద్యుడు వచ్చి కేశవుడి కంటికున్న కట్టు విప్పిచూడమన్నాడు. “నాకు ఈ కన్ను కూడా బాగా కనబడుతోంది...అంటే నా కన్నును తొలగించ లేదా?” అన్నాడు కేశవుడు.

“లేదు కేశవా! మంత్రి పదవి కోసం నేను నీకు పెట్టిన పరీక్షలలో నీవే గెలిచావు... యువరాజు ఒక కంటి చూపు పోవడం అన్నది అంతా నాటకం.అని మెచ్చుకుని శుభ గడియలలో యువరాజుకు పట్టాభిషేకం జరపడంతో పాటు కేశవుడికి కొత్త మంత్రి పదవిని ఇచ్చాడు మహారాజు.

****

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి