బామ్మ బంగారం (కామెడీ కథ) - సరికొండ శ్రీనివాసరాజు‌

Baamma bangaram

"మాటిమాటికీ ఆ బ్యాగ్ విప్పి చూస్తున్నావేమిటే బామ్మ! అలా చూస్తుంటే చూసేవాళ్ళకు అనుమానం రాదా? బ్యాగులో విలువైనవి ఉన్నాయని. నీ బ్యాగు ఎవరో ఎత్తుకుపోవడం ఖాయం." అన్నది లావణ్య. "ఏమిటే ఆ పాడు మాటలు? నీ నోటికి మంచి మాటలు రావా? పైగా తథాస్తు దేవతలు ఉంటారు పైన. ఈ బ్యాగులో దాదాపు మూడు కిలోల బంగారం ఉంది. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి?" అన్నది నాయనమ్మ. "నువ్వు అలా మాటిమాటికీ చూస్తుంటేనే ఎవరికైనా అనుమానం వస్తుంది. దాన్ని పట్టించుకోకుండా నువ్వు పడుకుంటే ఎవరికీ అనుమానం రాదు." అన్నాడు రాకేశ్ తల పట్టుకుంటూ. "మీ మాటలు వింటే నా బంగారాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీరు నోరు మూసుకొని పడుకోండి." అన్నది నాయనమ్మ. "నీ బంగారాన్ని జాగ్రత్తగా చూసుకో. అస్సలు నిద్రపోకు. ఎవరికైనా దొరికితే వాళ్ళ జీవితం బాగు పడినట్లే. పెద్ద పెద్ద మేడలు కట్టుకోవచ్చు." అన్నది లావణ్య. బామ్మ కారాలు మిరియాలు నూరింది.

ఈ కుటుంబం అంతా రైలులో హైదరాబాద్ నుంచి సుదూర ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. వీళ్ళ మాటలు ఆ రైలులోనే ప్రయాణం చేస్తున్న రాంబాబు, సోంబాబు చెవిన పడ్డాయి. సోంబాబు మెల్లిగా "ఒరేయ్ రాంబాబు! మనం మెలకువతోనే ఉండాలి. ఒకరికి నిద్ర వచ్చినా మరొకరు నిద్ర పోకుండా జాగ్రత్తగా చూడాలి. ఆ ముసలావిడ నిద్రలోకి జారుకున్న తక్షణం మనం ఆ బ్యాగు తీసుకుని రైలు దిగి పారిపోవాలి." అన్నాడు. "ఒరేయ్! ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత మనకు గొప్ప ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. మనకు ఉద్యోగం గ్యారంటీ కూడా అయింది. పాపం! పరుల సొమ్ము కోసం ఆశపడితే పాపం తగులుతుంది. పైగా ఉద్యోగం కూడా మిస్ అవుతుంది." అన్నాడు రాంబాబు. "నువ్వు నోరు మూయరా తింగర వెధవా? అదృష్టం వెతుక్కుంటూ వస్తుంటే అడ్డుపుల్ల వేస్తావు. నువ్వు జన్మలో బాగుపడవు. ఇంకొకరిని బాగుపడనీవు." అన్నాడు సోంబాబు. "నీ ఖర్మరా బాబు! ఏమైనా తేడా వస్తే పీక పిసికి చంపేస్తా! ఏ.టి.ఎం. డస్ట్ బిన్లలో పారేసిన స్లిప్పులను ఏరుకొని కిలోల లెక్కన షాపుల్లో అమ్ముకునే వాడి ముఖం నువ్వూను." అన్నాడు రాంబాబు.

ఒక రాత్రివేళ బామ్మ నిద్రపోయింది. రాంబాబు, సోంబాబు బామ్మ తలాపున ఉన్న బ్యాగును అతి జాగ్రత్తగా తీసుకుని వేరే కంపార్ట్ మెంట్ కు మారి తదుపరి స్టేషన్లో దిగి పారిపోయారు. తమ లగేజీని రైల్లోనే విడిచి పెట్టారు అపూర్వ మిత్రులు ఇద్దరూ. కొంత సమయానికి నిద్ర లేచిన బామ్మ తన బ్యాగు కనిపించక పోవడంతో పిడుగులు పడ్డట్లు పెద్ద పెద్ద శబ్దాలతో ఏడుపు లంకించుకుంది. ఉలిక్కిపడి లేచారు అందరూ. జరిగింది తెలుసుకున్నారు. "నాయనమ్మా! ఏం కొంపలు మునిగిపోయినాయని భూకంపం వచ్చేట్లు ఏడుస్తున్నావు? రైలు పట్టాలు తప్పిందంటే ఏమవుతుంది? వేలాది మంది ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. ఊరుకో!" అని గద్దించాడు రాకేశ్. "అయ్యో! ఎంతో టైం వేస్ట్ చేసుకొని ఎన్నో మామిడికాయలతో చేసిన మూడు కిలోల బంగారం లాంటి రుచికరమైన పచ్చడి. ఎక్కడ రైలు కుదుపులకు ఒలికిపోతుందో అని జాగ్రత్తగా కాపాడుకున్నాను. అయ్యో! ఇప్పుడు ఆ బంగారం లాంటి పచ్చడి పోయింది. ఎవడు తీశాడో! వాడి చేతులు పడిపోనూ! వాడికంట్లో పచ్చడి అంతా పెట్టా!" అంటూ మళ్ళీ ఏడుపు అందుకుంది బామ్మ. ఆ పిడుగుపాటు శబ్దానికి చైన్ లాగి రైలు దిగి పారిపోయారు చాలామంది.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి