కుడి ఎడమయితే పొరపాటోయి - venu gopal maddu

Kudi edamaite porapatoyi

మా నాన్న గారికి వున్న సతకోటి అనూహ్యమయిన చమత్కారాల్లో ఒకటి , అందరికీ పేర్లు పెట్టడం, వున్న పేరుని మార్చి , మారు పేర్లు పెట్టడం. ఆంగ్లం లోదీన్నే 'నిక్ నేం ' అంటాము. ఇందులో తన , పర బేదాలు లేవు మా నాన్న కి. తన పేరు అప్పలకొండ , దాన్ని సరదాగా పక్కలోడొంక అంటారు. ఒక వ్యక్తి ని, తన తలిదంద్రులు పెట్టిన పేరు తో పిలిస్తే మజా ఏముంది, ఆ వ్యక్తి అలవాట్ల బట్టి, వ్యవహారం బట్టి, ఆకారం , ఆహార్యం , శైలి, లేదా అతనిలో వున్న చిన్న లోటుపాట్లు, ఇలా ఎదో ఒకదాన్ని బట్టీ ఈ మారు పేర్లు పెడితే అదొక సరదా. చిన్నప్పుడు ఇవి మనకి విదితమే. ఉదాహరణకి మన క్లాసు రూం లో శ్రీను లు ఇద్దరుండి, వాళ్ళలొ ఒకడు రంగు తక్కువ, ఇంకోడు బక్క చిక్కిన వాడు అయితే, వాళ్ళు నల్ల శ్రీను , బక్క శ్రీను అయిపోవటం పరిపాటి. చిన్నప్పుడు లేదా కాలేజివరకు ఈ అలవాటు చాలామందికి వుంటుంది, కానీ మా నాన్నగారికి గొరోజనం కొంచెం ఎక్కువే. అందుకే ఇలాంటి అలవాటు ని జీవితాంతం తన తోటే అంటిపెట్టుకున్నారు. ఇప్పటికీ ఏ పేరులో అయినా హాస్యం వెతికి, గేలి చేసే విధం గా , వికటకవి లా దాన్ని, తారు మారు చేస్తారు, అసలు పేరు ని మారుస్తారు.


అవి మేము స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో వున్న రోజులు. విశాలమయిన కాళీ రోడ్లు , ఎక్కడ చూసినా చెట్లు, ప్రశాంత జీవితానికి తార్కాణం ఆ క్వార్టర్స్. ఇక మా నాన్న మారు పేర్ల జాబితా విప్పుకుందాం. మా పక్క ఇంటి వాటా ఆయన పేరు ప్రకాష్. చక్కటి ప్రకాశవంతమయిన పేరు. ఒకానొక రోజున ఆయన ఇంటి తలుపు మీద , ఓం ప్రదమం గా పెద్ద " ఓం " అని చెక్కించుకున్నారు. అంతే తళుక్కున మెరిసింది మా నాన్నకి మారు పేరు ' ఓం ప్రకాష్ చవుతాలా ' , అప్పట్లో రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి, హర్యానా ముఖ్య మంత్రి గా కూడ చేసిన ఉత్తర భారత దేశ రాజకీయ వేత్త. అంతే అప్పటినుంచి ఆయన ని అలానే పిలవటం అలవాటయి పోయింది. అసలే మొహమాటం మనిషి, ఎమీ అనలేక నవ్వి ఊరుకునే వారు ప్రకాష్. అసలు వింత ఏంటంటే, పోను పోను అతని పేరు చవుతాలా అంకల్ గా మారి పోయింది. అతని ఇంటి మీద ఓం, ఒంటి మీద ప్రకాషం రెండూ మాయమయిపోయి, ఉత్త చవుతాలా గా మిగిలిపొయారు. "పాపం ప్రకాష్ అంకల్ , ఎందుకలా అతని పేరు మార్చేసారు " అని మా నాన్న ని అడిగితే ' చవుతాలా ' అనేటప్పుడు నోట్లో నాలుక తిరగటం తన కి బలే నచ్చింది అనేవారు. తన తిక్క కి లెక్క కి వుంది అనేవారు.

ఇలా చిట్టా విప్పితే చాలా మంది, ఒకావిడ పేరు ' కళ్ళు టప్ టప్ ' ఎందుకంటే ఆవిడ మాట్లాడే టప్పుడు నిజం గానే కను రెప్పలు ఎక్కువగా ఆడిస్తుంది. ఇంకొక ఆవిడ ' నిర్మ ఆంటీ ' ఎందుకంటే, వాషింగ్ పవుడర్ నిర్మ టి.వి. ఆడ్ లో వచ్చే ఐదుగురు ఆడవాళ్ళలో ఒక ఆమె లా వుంటారు ఆవిడ, పూర్వ జన్మ లో చేసుకున్న నోముల ఫలితం అనుకుంటా , అంచేత ఆవిడ ' నిర్మ ఆంటీ ' అయిపొయ్యారు. ఇంకొకావిడ ' నా మొహం ' ఆంటీ , కారణం ఆవిడ ఊత పదం ' నా మొహం ' . ఇద్దరు రాధ క్రిష్ణలు వుండేవారు, వారు ఖమ్మ రాధ క్రిష్ణ, కాపు రాధ క్రిష్ణ. వెంకట రావు ఇంటి పేరు ఆదిరెడ్డి. అందరూ ఎ.వి. రావు అనేవారు. స్వతహా గా నెమ్మది , కొంచెం మంద బుద్ది. అతనికి చురుకు తనం లేదని నాన్న గారు ఎ.వి రావు ని కాస్తా, ఏవీరావు గా చేసి, ఏవీరావు నీకేమీరావు అని ఎగతాళి చేసేవారు.

ఇంకో ఇద్దరు స్నేహితులు వున్నారు, వారి పేర్లు నక్క బావ, కుక్క బావ. ఎందుకనంటే , నక్క బావ అసలు పేరు నక్కెళ్ళ బాస్కర రావు, ఇంటి పేర్లో ఎక్కడో నక్క దాగుందని ఆయన ని ఆ బిరుదు తో సన్మానించారు. ఈ కుక్క బావ ఏ జన్మ లో ఏ పాపం చేసుకున్నాడొ తెలియదు. అతని పేరు లో గాని , తీరు లో గాని ఎంచడానికి, మెలిక పెట్టడానికి మా నాన్న కి ఎమీ దొరకలేదు, కాని అతను ఈ నక్క బావ కి మంచి దోస్తు. ఎప్పుడూ ఇద్దరూ జంట కవుల్లా తిరుగుతారు. అది చాలు మా నాన్న కి , ఒకడు నక్క కాబట్టి, ఇంకొకడు కుక్క కావలసిందే. 'అయ్యానక్క కి కుక్క కి స్నేహం వుండదు కదా మహా ప్రభో ' అంటే' ప్రాస కుదిరిందోయ్ , ఈ సారికి ఇలా సర్దుకో ' అనే వారు.

ఇలా చెప్పుకుంటూ పోతే , పెద్ద మహా గ్రంధమే అవుతుంది. చివరిగా ఒక్కటి, మా ఇంటికి వచ్చే ఎల్. ఐ. సి ఏజెంట్. నిజంగా చెప్పాలంటె ఆయన అసలు పేరు నాకు ఎప్పుడూ జ్ఞాపకం లేదు. మా నాన్న పెట్టిన పేరు ' అక్కయ్య గారు ' ఎంచేతనంటే , పాపం ఆయన మా అమ్మ గారిని ఆప్యాయం గా అక్కయ్య గారు అని పిలిచే వారు. ' సార్ అక్కయ్య గారి పేరు మీద కూడ ఒక పొలసీ తీసుకోండి ' అనే వారు. అంతే అప్పటి నుంచి ఆయన ' అక్కయ్య గారు ' అయిపొయ్యారు. అసలే బక్క పల్చ మనిషి, రివట లాగ వుండే వారు. ఎల్.ఐ.సి. పోలసీ లన్ని బద్ర పరచుకోటానికి ఒక సూట్ కేస్ పట్టుకొని తిరిగేవారు. నాన్న ఆయనను ' అక్కయా గారూ ' అన్నప్పుడల్లా అతని మొహం అష్టవంకరలు తిరిగేది. ఆ సూట్ కేస్ లో బుర్ర పెట్టి నన్ను మూసేసి లాక్ చేసేయండి రా అన్నట్టు వుండేది ఆ ముఖ కవళిక. ' ఈ పోలసీ పిలక ఆయన చేతిలో వుండబట్టి ఊరుకుంటున్నా, లేకపోతే ఈ కొండ గారి కుండ బద్దలుకొట్టానూ ' అనుకొనేవారేమో మనసులో. మా నాన్న అయ్యన్ను అలా పిలవటం మొదలెట్టాక ఆయన తన స్వంత అక్కని కూడా 'ఆక్కయ్య గారు ' అని పిలవటం మానేసి , ' సిస్టర్ ' అనటం మొదలెట్టారు అని కోలనీ లో బోగట్టా.

చాలా ఇబ్బంది పడేవారు పాపం. అయినా పక్క వాడి ఆందోళన, ఆవేదన పట్టింపు, మా నాన్న గారికి ఎన్నడూ లేవు, అతనిది ఏక మార్గ రహదారి.సాదారణం గా ఇలా మారు పేర్లు చాలా మంది పెట్టుకుంటాం , కాని అవి చాటు గా వాళ్ళు లేనప్పుడు వుపయోగిస్తాం, కానీ మా నాన్న గొప్పతనం ఏంటంటే, వాళ్ళ ముందే ప్రయోగిస్తారు, దాపరికం లేకుండా. ఆ ఎల్. ఐ. సి ఏజెంట్ రాగానే, " ఆ బాలాజి కాఫీ పెట్టు అక్కయ్య గారు వచ్చారు " అంటారు హాల్ లోంచి గట్టి గా, వంట గదిలో వున్న మా అమ్మకి వినపడే లాగా. అలాగే ఆ జంట కవులు వచ్చినప్పుడూ కూడా అంతే ' ఆ బాలాజి, నక్క , కుక్క వచ్చారు, ఎదన్నా బిస్కట్టొ ఓ , టీ ఓ , ఏదోటి చూడు ' అనేవారు. " కుక్క బిస్కట్టులో ఎమిటొ " అన్నట్టు వింత గా మొహ మొహాలు చూసుకునేవారు జంట కవులు. ఇలా వాళ్ళ మొహం ముందే అనటం మా నాన్న ప్రత్యేకత.

*******************

ఆ రోజు వుదయన్నే లేచి స్కూల్ కి తయారవుతున్నాం అన్నయ్యా, నేను.వుదయ్యాన్నే లేచి వ్యాయామం ముగించి , న్యూస్ పేపర్ ముందు వేసుకొని చదుతూ కనపడే వారు నాన్న , ప్రతి రోజూ ఆ సమయానికి. ఆ రోజు ఎదో తేడా గానే వుంది. నాన్న హాల్ లో కనపడలేదు. కంగారు గా తయారవుతూ పుస్తకాలు సర్దుకొని , ఉదయ పలహారం కోసం డైనింగ్ టేబల్ దగ్గర కూచున్నాం. అమ్మ మాకు టిఫిన్ పెడుతూ అంది "ఒరేయ్ నాన్న కి నలత గా వుంది రా, సెలవు చీటీ శ్రీకాంత్ అంకల్ కి ఇచ్చి స్కూల్ కి వెళ్ళండి" ఇద్దరుము బయం గా చూసాము అమ్మ పక్క. "మరేం లేదు రా జలుబు జ్వరమే, పడుకున్నారు గది లో, నేను టాబ్లట్ ఇచ్చాను, తగ్గిపోతుంది లే" మరింత సేమియా ఉప్మా, ఇద్దరికీ వడ్డించి గిన్నె కాళి చేసింది అమ్మ. కొంచెం కుదుట పడి టిఫిన్ పై ద్యాస పెట్టారు పిల్లలు. గిన్నె కాళి అయినందుకు కాదు, అమ్మ చెప్పిన ఊరట మాటలకి.

"సెలవు చీటి మాత్రం మర్చిపోకండి , హాల్ లో టీపాయి మీద వుంది. శ్రీకాంత్ అంకల్ ఇంట్లొ ఇచ్చేయండి" అంటూ వంటింట్లో కి వెళ్ళింది అమ్మ కాళీ అయిన ఉప్మా గిన్నెపట్టుకెళ్తూ.

" అమ్మా శ్రీకాంత్ గారిది ఫ్లాట్ వన్ నాట్ వన్ లో యూనిట్ సి కదా" అన్నాను నేను. అవును అన్నట్టు , నా పక్కన కూచ్చున్న అన్నయ్య తల ఊపటం, వంటింట్లో వున్న అమ్మ " అవును రా" అనటం ఒకేసారి జరిగాయి.

మా ఫ్లాట్ నంబర్ వన్ వన్ వన్, నూట పదకొండు. నాన్న గారి బాష లో చెప్పాలంటే, మూడొకట్లు , మూడు నామాలు, ఒకటి ఒకటి ఒకటి. మా ఇంటి కి పది ఫ్లాట్ ల దూరమే శ్రీకాంత్ అంకల్ వాళ్ళ వన్ నాట్ వన్, నూటొకటి. నాన్న గారు తో ఆ దారి లొ , స్కూటర్ మీద ఎప్పుడు వెళ్ళినా అనేవారు " ఇదే రా శ్రీకాంత్ అంకల్ ఇల్లు, అతనికి నూటొకటి జ్వరం"

*******


అమ్మ సర్దిన లంచ్ బాక్స్ లు మా స్కూల్ సంచి ల్లొ పెట్టుకొని , రెండు సైకిళ్ళ మీద ఇద్దరమూ బయలు దేరాము స్కూల్ కి. నాన్న సెలవు చీటీ అన్నయ్య తీసుకున్నాడు. ఇద్దరిలో పెద్దాడికే జాగ్రత్త ఎక్కువ. మా ఇంటి కి దగ్గరే శ్రీకాంత్ అంకల్ ఇల్లు. ఫ్లాట్ వన్ నాట్ వన్ దగ్గర ఆగాము. వాళ్ళ ఇంటికి మేము మునుపు ఎప్పుడూ వెళ్ళలేదు, కనుక వాళ్ళ ఇంట్లొ వాళ్ళు మమ్మల్ని ఎరుగరు. శ్రీకాంత్ అంకల్ మాత్రం అప్పుడప్పుడు నాన్న దగ్గర కి వచ్చి, ఎవో ఆఫీసు విషయాలు చర్చించి వెళ్ళిపొయ్యేవారు. అక్కడ అన్ని ఇళ్ళూ ఒకే పద్దతి లో వుంటాయి. ఆ విశాలమయిన మెయిన్ రోడ్ కి ఇరు వైపులా వరుసగా ఫ్లాట్ లు. వాటిని ఫ్లాట్లు అనే కన్నా గ్రూప్ హవుసు లు అనటం న్యాయమేమో.

ఒక్కొక్క ఫ్లాట్ లొ నాలుగు యూనిట్లు వుంటాయి. కింద రెండు , పైన మెట్లు ఎక్కగానే రెండు యూనిట్లు. ఆ నాలుగు కూడ ఒకే చదరపు అడుగుల ఇళ్ళు. అన్నీ రెండు బెడ్ రూం మరియు రెండు బాత్ రూం ల ఇళ్ళే.
కాని కింద వుండే యూనిట్ల కి మాత్రం చిన్న తోట లా వుంటుంది, అక్కడ వాళ్ళు, వాళ్ళకి నచ్చిన మొక్కలు వేసుకోవచ్చు. కిందన యూనిట్ ఎ మరియు బి, పైన రెండు సి మరియు డి. అన్నీ చాలా సువ్యస్తము గా వుంటాయి. అదే స్టీల్ ప్లాంట్ క్వార్టర్ ప్రత్యేకత. చిన్న పిల్లలు కూడ కంగారు లేకుండా , బద్రత గా తిరగొచ్చు. మాసైకిళ్ళు కిందనే పెట్టి, చక చకా మెట్లు ఎక్కి, యూనిట్ సి కి వెళ్ళి , కాలింగ్ బెల్ల్ కొట్టాము. ఎవరో ముసలాయన తలుపు తీసారు "ఎవరు కావాలి బాబు" శ్రీకాంత్ అంకల్ తలుపు తీస్తారు సెలవు చీటి ఇచ్చి వెళ్ళి పొవటమే అని ముందే ఊహించుకున్న మేము కొంచెం తడ పడ్డాము. పొనీలే శ్రీకాంత్ గారి నాన్నగారేమో అనిపించింది.


"శ్రీకాంత్ అంకల్ లేరా " అని అదిగాడు అన్నయ్య తేరుకొని."శ్రీకాంత్ .. ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరమ్మా" అన్నారు ఆ ముసలాయన మేము ఆశ్చర్య పొయ్యేలా

"ఇది వన్ నాట్ వన్ ఫ్లాట్ లో యూనిట్ ' సి ' ఏ నా అండి" అన్నాను నేను"అవును బాబు ఇది వన్ నాట్ వన్ ఏ , ఈ మొత్తం ఫ్లాట్ లోనే శ్రీకాంత్ అనే వారు లేరు" అని ఆ ముసలాయన తన వాక్యాన్ని పూరించేంతలొ ఎదురు ఇల్లు అయిన యూనిట్ డి కాలింగ్ బెల్ కొట్టేసా, తొందర ఎక్కువయిన నేను.

"నేను నాల్గింటికి పెర్మిషన్ పెట్టి వస్తా , అప్పుడు వెళ్దాం" అని లోపల వున్న వాళ్ళ ఆవిడ తో అంటూనే తలుపు తీసారు ట్-షర్ట్ లో వున్న అంకల్ లుంగీ సర్దుకుంటూ"శ్రీకాంత్ ...." అన్నా నేనుఇంతలో సి యూనిట్ లో వున్న ముసలాయన

" చెప్పాను కదా బాబు ఇక్కడ శ్రీకాంత్ అని పేరు తో ఎవ్వరూ లెరమ్మా" కొంచెం విసుగు అతని గొంతులో.అన్నా దమ్ములము ఇద్దరము ఆలొచనలో పడ్డాము

"శ్రీకాంత్ ఆ.. శ్రీరాములా " అన్నారు లుంగి అంకల్, తన ట్-షర్ట్ పైనున్న గొంతులోంచిమరీ శ్రీకాంత్ కీ శ్రీరాముల కీ తెడా తెలియని పసి పిల్లాడినా, కొంచెం నాకు కూడ విసుగు వచ్చింది, అయినా అతను ఆపకుండా ఇంకా తన ఆలొచన సాగిస్తున్నారు

" వంద ఫ్లాట్ లో శ్రీరాములు, నూట రెండు లో శ్రీ రాఘవ, తొంబయ్ తొమ్మిది లో శ్రీధర్ , నూట నాలుగు లో శ్రీనివాసు, తొంబయి ఏడు లో శ్రీ విష్ను.." ఇలా శ్రీ సతకం ప్రారంభించి "... శ్రీకాంత్ మాత్రం ఈ వరసలో ఎవరూ లేరమ్మా" అని తేల్చి చెప్పేసారుఎదో తనే జనాభా లెక్కల శాఖ కి అధ్యక్షుడు అయినట్టు.

సెలవు చీటి సంచీ లోంచి బయటకి తీయబోయిన అన్నయ్య, ఇంకెందుకు అన్నట్టు లోపలకే నెట్టేసాడు. ఇద్దరము మొహ మొహాలు చూసుకున్నాం."ఇంతకీ సెక్టర్ మూడే నా మీ సదరు శ్రీకాంత్ అంకల్ ది" అన్నారు యూనిట్ సి లోంచి ముసలాయన సగం తీసిన ద్వారాన్నే పట్టుకు వేళ్ళాడుతూ.

"అవునండి మేము నూట పదకోండు లో వుంటాం" అన్నాను నేను "మా నాన్న గారు అప్పల కొండ గారు, సెలవు చీటి ఇచ్చి స్కూల్ కి వెళ్ళమన్నారు" అన్నయ్య. "కచ్చితం గా ఇదే ఇల్లు" నేను గొణిగాను."సరే థాంక్స్ అంకల్" అని "పదరా ఒక్కసారి చెక్ చేసుకుందాం" అన్నాడు అన్నయ్య.

ఇద్దరం మెట్లు దిగి కింద కి వెళ్ళాము. మా సైకిళ్ళు తీసుకొని బయటకి రోడ్ మీద కి వచ్చాము."అన్నయ్యా పక్కా ఇదే రా ఇల్లు" అన్నాను. ఆ ఫ్లాట్ కింద వుండే గార్డెన్ లో దొంతలు దొంతలు గా రంగు రంగు ల గులాబి మొక్కలు వుంటాయి, కచ్చితంగా అదే ఇల్లు అనిపించింది

"ఎమో రా మనం ఎప్పుడూ రాలేదు గా.. నాన్న ఇదే , అని అలా చూపించే వారు స్కూటర్ మీద వెళ్తుంటే, మరి అటు పక్కదో ఇటు పక్కదో అవ్వొచ్చు గా " అన్నాడు అన్నయ్య "లేదు రా , కచ్చితం గా ఇదే, ఆ రోజా పూలు చూడు" అన్నా నేను నమ్మకం గా "సరే ప్రయత్నిద్దాం, నేను అటు వైపు వెళ్తా , నువ్వు ఇటు వెళ్ళు. ఏది ఏమయినా మళ్ళీ, సరిగ్గా ఇక్కడె కలుద్దాం, సరేనా" అని చెయ్యి చూపిస్తూ అన్నాడు అన్నయ్య. సరే అన్నట్టు తలాడించా నేనుమైన్ రోడ్ మీద నుంచి , రెండు సైకిళ్ళు , చెరో వైపుకి వెళ్ళాయి. అన్నయ్య అటు రెండు ఇళ్ళు, అంటే నూట రెండు , నూట మూడు చూస్తాడు, నేను ఇటు వెళ్ళి, వంద , తొంబయి తొమ్మిది ట్రై చెసాను.నాన్న నోటి కి తొంబయి తొమ్మిది చాలా గమ్మత్తు సంఖ్య. హిందీ లో దాన్ని ' నిన్యాన్నవే ' అంటారు. అది పైత్యం వున్న నాన్న నోటి కి భలే చమత్కారం గా
అనిపిస్తుంది. ఒక్క సారి అని ఊరికోరు, ' నిన్యాన్నవే ' అని నాలుగయిదు మార్లు తిప్పి తిప్పి ఉచ్చరిస్తారు.

ముఖ్యం గా క్రికెట్ ఆట చుసేటప్పుడు ఎవడన్నా ఆటగాడు ఆ స్కోరు మీద వుంటే , ఇక పక్క వాళ్ళు చచ్చినట్టే. ఆ ఆటగాడు , ఆ ఒక్క పరుగు చేసి , వంద కొట్టే వరకూ మా నాన్న నోటి లో ' నిన్యాన్నవే ' నానుతూ నాట్యమాడుతూ వుంటుంది. మాములుగా అయితే ప్రత్యర్ది ఆటగాడు తొంబయి తొమ్మిది మీద వుంటే, అవుట్ అవ్వాలని కోరుకుంటాం , కాని మా నాన్నతో ఆట చూస్తుంటే మాత్రం, వాడు ఆ ఒక్క పరుగు త్వరగా చేసేసి వంద దాటేస్తే బావుణ్ణు అనిపిస్తుంది, ఎందుకంటే మా నాన్న ' నిన్యాన్నవే ' అనటం మానరే. ఖర్మ కాలి వాడు గానీ , తొంబయి తొమ్మిది మీద గానీ , అవుటు గానీ అయ్యాడా చచ్చింది గొర్రె. ఆ రోజంతా ' నిన్యాన్నవే ' మంత్రమే.

అన్నదమ్ములము ఇద్దరమూ అన్ని ప్రయత్నాలు విఫలము అయిపొయ్యాక మళ్ళీ అనుకున్న చోటనే కలుసుకున్నాము. ఇది అంతుచిక్కని రహస్యం లా వుంది."ఒక్క సారి ఇంటికి ఫాస్ట్ గా వెళ్ళి అమ్మ ని కనుక్కొని వస్తా, ఇంటి నంబర్ మనం సరి గా గుర్తు పెట్టుకోలేదేమో" అన్నాడు అన్నయ్య "లేదు అన్నయ్య, టిఫిన్ చెసే టప్పుడు కూడా అమ్మ మళ్ళి చెప్పింది వన్ నాట్ వన్" నేను "కరెక్టే లే, నాన్న అది గుర్తు వుండి పొయ్యెలా, శ్రీకాంత్ ఇంటి నంబర్ వన్ నాట్ వన్ అతని ఫీవర్ నూటొకటి, అనేవారు గా, మర్చిపోలేము అస్సలు" అన్నాడు అన్నయ్య. సరే మరొక్క సారి మళ్ళీ అదే ఫ్లాట్ కి వెళ్ళి యూనిట్ సి లో మరొక్క మారు ప్రయత్నిద్దాం అని తీర్మానించు కొని ఇద్దరము మళ్ళీ మెట్లు ఎక్కాము, ఈ సారీ మునుపటి వేగము లేదు. కాస్త సంకోచం గానే కాలింగ్ బెల్ కొట్టాము. ఇంద్రజాలం ,ఎదో మంత్రం వేసినట్టు ఆ ముసలాయన కాస్తా శ్రీకాంత్ అంకుల్ గా మారిపొయ్యారు. అన్నదమ్ములము ఇద్దరమూ ఆశ్చర్యం తో , కళ్ళు పెద్దవి చేసి, గారడి చూస్తున్నట్టు నోళ్ళు వెళ్ళబెట్టాము.

"ఆ ఎమిట్రా శ్రీకాంత్ కావాలని అడిగారట మీరేనా ఆ బడుద్దాయిలు" అని వెళాకోళం గా నవ్వారు ఆయన. మేము ఆయన్ను ఎరుగుదము, కచ్చితం గా ఇతనే శ్రీకాంత్ అంకల్. హమ్మయ్య అని శాంతించాము ఇద్దరమూ.

"మీరు కొండ గారి అబ్బయిలా" అనారాయనావును అన్నట్టు తలాడించాం ఇద్దరం, ఇంతలో అన్నయ్య సంచీ లోంచీ సెలవు చీటి తీసి ఆయనకి అందించాడు. ఒక పెద్ద ఉపసమనం.

"ఒరేయ్ లిట్టల్ రాస్కల్స్ నా పేరు చారి రా, శ్రీకాంత్ కాదు" మళ్ళీ ఆశ్చర్యం మా వంతు అయింది. "మరి నాన్న గారు..." అని మేము ఎదొ అనబోతుంటే,

"రండి రా కూచోండి అని తలుపు బార గా తెరచారు" మేము లొపలకి రెండు అడుగులు వేసాం , కానీ ఇంకా కూచోలేదు."నాన్నా, ఇందాక వచ్చారన్నావే పిడుగులు, వేళ్ళే నా" అన్నారు శ్రీకాంత్ గారు ఆలెటర్ తెరచి మనసులోనె చదువుకుంటూ. దూరం గా ఒక నులక కుర్చీ మీద కూచొని పేపర్ చదువుతున్న ముసలాయనతో. అతనే మొదట తలుపు తెరిచిన ముసలాయన. అంటే మాయా మర్మం ఎమీ లేదన్న మాట. ఆ ముసలాయన శ్రీకాంత్ వాళ్ళ నాన్నగారు.

"స్కూల్ కి .." అని నేను మొదలెట్టిన వాఖ్యాన్ని "..లేట్ అవుతుంది, వెళ్తాం అండి" అని అన్నయ్య పూరించాడు."ఆ సరే సరే, ఆ లెటర్ ఆఫీస్ లొ ఇస్తా. బాగోలేదట రా మీ నాన్న కి , కుదురుగా ఒక్క చోట వుండడు కదా, బాగా విశ్రాంతి తీసుకోమను. " అంటూ అతను హాల్ లో వున్న ఒక కొర్చీ లొ కూచున్నారు.మేము లోపలకి ఇంకొ అడుగు వేసాము, ఇంకా అలా నించొనే.

"స్కూల్ కి రెండు నిమషాలు లేట్ అయినా సరే, మీరు వినాలి, పిల్లలూ ఇంతకీ విషయం ఎంటంటే, నా పేరు చారి. ఇందాక బాత్రూం లో వుండి మీరు వచ్చిన గోల నాకేం వినపడలేదు. నా పూర్తి పేరు వెంకటా చారి. అందరూ చారి అంటారు... ఇలా ఆ బల్ల మీద కూచోండి రా, అంత పెద్ద కథ కాదులే ఇది " ఇంతలో శ్రీకాంత్ ఆంటీ, అదే వారి శ్రీమతి మాకు మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. మేము శ్రీకాంత్ గారి ఇంటి వేట లో అటు, ఇటు తెగ తిరిగామేమో అలసి పొయ్యాము, చప్పున అందుకున్నాం ఇద్దరం
మంచినీళ్ళు ఆ బల్ల మీద కూచ్చొనే.

"నిదానం గా తాగంది రోయ్ , పొలమారుతుంది. ఆ ఎక్కడున్నాం.. ఆ అదే నన్ను అంతా చారి అనేవారు...అది ఒకప్పుడు.. నేను మీ నాన్న ఆఫీసు లో చేరక ముందు. మీకు క్రికెట్ ఆటగాడు క్రిష్నమాచారి శ్రీకాంత్ తెలుసు కదా.

"ఊ తెలుసు అన్నట్టు తల ఊపుతూ, మంచినీళ్ళు తాగేసి గ్లాసులు కింద పెట్టాము మేము.

"మీ నాన్న కి వున్న నోటి దూల వల్ల, నా నామదేయం చారి ని కాస్తా, క్రిష్నమాచారి శ్రీకాంత్ చేసాడు. కొన్నాళ్ళకి ఆ క్రిష్నుడి నీ, ఆచారి నీ సిక్సర్ కొట్టి , స్టేడియం అవతల పారేసాడు మీ నాన్న, ఇక ఉత్త శ్రీకాంత్ మిగిలింది. ఆఫీసులో ఇప్పుడు అందరికీ నేను శ్రీకాంత్ గానే తెలుసు. మీ నాన్న నోరుపెద్దదాయే. వింత ఎంటంటె, అప్పుడప్పుడూ నేను కూడ, మర్చిపోయి కొత్త వాళ్ళకి శ్రీకాంత్ అనే పరిచయం చేసుకొని నాలుక కరుచుకుంటా, అంతటి ప్రబుద్దుడు మీ నాన్న, పక్క లో డొంక" అని పకా పకా నవ్వారు శ్రీకాంత్, అదే చారి అంకల్. అందరమూ నవ్వు కున్నాం. మా నాన్న నోటి మక తిక విన్యాసాలు వినిమాకు తిక మక పుట్టింది. అక్కడ సెలవు చీటీ ఇచ్చే పని ముగియటం తో. ఇక సెలవు తీసుకొని, ఇద్దరం స్కూల్ కి వెళ్ళిపొయ్యాము.


**************


సాయంత్రానికి నాన్న కొంచెం కోలు కున్నారు , అమ్మ అన్నట్టు అది కేవలముజలుబే. ఉదయం జరిగిన చారి గారి సంగటన అంతా ఇంట్లొ పూస గుచినట్టు చెప్పాము అన్నదమ్ములము. నలుగురూ నవ్వుకున్నాం.

"ఈయన అందరికి పేర్లు పెట్టడం కాదు మనమే పెట్టాలి ఈయనకి " అని "కొకారి" అంది అమ్మ. అంతే అప్పటినుంచి నాన్న ఇలాంటి పనులు చేసినప్పుడు అమ్మ 'కొకారి ' అని వెక్కిరించేది

( మా నాన్న గారి వింత అలవాటు వలన జరిగిన యదార్ధ సంఘటన ఆధారం గా రాసిన కథ)

మరిన్ని కథలు

Telivijana majaka
టెలివిజనా! మజాకా!?
- కందర్ప మూర్తి
Prateekaaram
ప్రతీకారం
- చెన్నూరి సుదర్శన్
Anasteeshiya
అనెస్థీషియా
- వెంకట రమణ శర్మ పోడూరి
Voohinchaledu
ఊహించలేదు...!
- రాము కోలా.దెందుకూరు
APP Street police
ఎ.పి.పి స్ట్రీట్ పోలీసు
- కందర్ప మూర్తి
Maskena covid naasti
మాస్కేన కోవిడ్ నాస్తి
- పి. వి. రామ శర్మ
Pantulamma
పంతులమ్మ
- చెన్నూరి సుదర్శన్