జాతర - పరిమళ కళ్యాణ్

Jaatara

"అరే బిడ్డా, బాగున్నవ్లే, రా అల్లుడు లోపటకి రాండ్రి" అంటూ పండుగకి వచ్చిన కూతుర్ని అల్లుడిని లోపల కూర్చోబెట్టి మర్యాదలు చేసింది మైసమ్మ. "అమ్మా, నే మంచిగున్న, నువ్వెట్లా ఉన్నవ్? అయ్యకి ఏమైనాది? " అంటూ మంచం మీద ఉన్న తండ్రి మల్లన్న నీ చూసి అడిగింది మైసమ్మ కూతురు లచ్చిమి. "ఏం చెప్పాలే, బిడ్డా, నాల్గు దినాల సంది మీ అయ్య లేవనే లేదు ఎటైనాదో ఏమో? మా సంగతికేం గాని మీరందరూ ఎట్లున్నరు? నీ కొడుకు మంచిగా సదువుతుండా? నీ కొడుకుని స్కూల్లో ఏసిర్ర? సరి గాని ఇస్కూలు బళ్ళు తెరవలేదు కదా, మరేట్ల సదుకుంటుండు?" అని క్షేమ సమాచారాలు అడిగింది. "అమ్మా, ఇప్పుడు ఇస్కూల్ బళ్ళు లేవూ, గవి గూడ ఫోన్లో సెప్తుర్రు. పొద్దస్తమాను గా ఫోన్ పట్టుకుని కూసుంటుండు గీ పోరడు. గేమైనా అంటే సదూతున్ననే నీకేం తెల్సు అంటుండు. మా సెడ్డ సిరాకు అయిపోనాదే అమ్మా" అంటూ తన గోడు వెళ్లపోసింది లచ్చిమి. "అవునే గదేదో ఆన్లైన్ కలాసులంటే, ఫొన్ కొనియ్యమని గొడవ సెత్తుండు నీ తమ్ముడు గూడా, సూద్దాం లే అయ్యా అని సెప్పినా. కాదే అమ్మ పోను లేకుంటే ఎట్టా సదివేది. గిప్పుడాన్ని ఫోనులోనే గందా అని తినేసిటోడు. మన దగ్గర అంత డబ్బు ఏడ్నుంచి రావాల్న అంటి. ఓరోజు సూర్రావు మేస్టారు కొనిచ్చాడంటూ ఫొను తెచ్చిండు. అప్పటిసంది పోనులోనే సదువుతుండు. ఆ మేష్టారు పున్నెమా అని ఈడి సదువుకి ఏ లోటూ లేకుండా పోతాంది. ఆ మేష్టారు సల్లగుండాల!" అంది మైసమ్మ. "మంచి గయ్యింది లే అమ్మి. గా మేష్టారు సెప్పినట్టు మంచిగ సదుకోమను గాన్ని, చెట్లంటా పుట్లంటా తిరక్కుండా. అయినా ఈ మాయదారి రోగమేదో అచ్చింది, బళ్ళు, దుకాణాలు అన్నీ మూసేసిర్రు. పనులు గూడ లెవ్. కస్టమైతాందే అమ్మా. మీరు జాగత్తగా ఉండుండ్రి.. "గట్టనా. ఈడ గూడ పనులేం లేవని మీ అయ్య సేపుతాండూ. అమ్మోరి జాతర్లో దుకాణం పెట్టేటోడు మీ అయ్య, ఈ సరికి బాగులేదని రమేశు కి అప్పజెప్పినం. గాడేంత డబ్బిస్తే అంతే" అంది. "సరే అమ్మా, సందేల జాతర కాడికి పోదామే. మస్తు గుంటది. గాజులు ఎయించుకోవాల" అంది లచ్చిమి. "గట్లనే, చిన్నూ గాడ్ని తీస్కపొండ్రి..." అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది మైసమ్మ. "ఓ అత్తా, మీ కబుర్లు అయినాయ? కూసింత మమ్మల్ని కూడా సూసేటిది ఏదైనా ఉందా?" అన్నాడు అల్లుడు ప్రసాదు. "అయ్యో మాటల్లో పడి యాద్ మర్సిన, సరి మీరు కూసోన్ద్రి బువ్వ అడ్డిస్తా" అంది మైసమ్మ. కంచంలో అన్నం, పప్పూ, ఆవకాయ వేసింది. అది చూసి ప్రసాదు, "పండగ పూట కూడా గిదే పప్పూ, పచ్చడీ న? ఓ పరమాన్నం లేదు, చికెను లేదు." అన్నాడు విసుగ్గా. "చూస్తున్నావ్ గా అల్లుడు, మీ మామ నాల్గు దినాల సంది లేయలే, పనికి పోతేనే కదా మా కాడ పైసలుందేటిది! ఇక చికెన్ ఏడ దొరికేది? లేకుంటే జాతర్లో దుకానం ఎట్టెటోడు గదేటి మీ మావ! ఈ పాలి దీంతో సరిపెట్టుకో బాబూ" అంటూ బతిమాలింది. "ఎందుకో జాతర్కి రాండ్రీ అంటా పిలుస్తరు, తీరా వచ్చినంక పచ్చడి మెతుకులు. దీనికోసమే నా రెండు దినాల సందీ అమ్మ కాడికి పోదాం, అమ్మ కాడికి పోదాం అంట నా పానం తీస్తివి? ఛల్ కానీ తీయ్" అన్నాడు కోపంగా. "కోపం కాకు బిడ్డా, గిప్పుడే తెప్పిస్త ఆగు ఆ చికెన్ ఏదో" అంటూ.. "చిన్నూ బేటా, జల్ది మస్తాన్ అన్న మటన్ కొట్టుకు పోయి చికెన్ తీస్కరా బేటా" అని కొడుకు చిన్నూ నీ పంపింది మైసమ్మ. చిన్నూ కొట్టు నుంచి ఇంటికి కాళీ చేతుల్తో తిరిగి వస్తూ, "మస్తాన్ అన్న అప్పు ఇవ్వనన్నడు, ఉన్న అప్పు తీర్సినంక గప్పుడు వచ్చి సికెన్ పట్కవొమ్మండు" అన్నాడు. "అయ్యో ఎట్టా మరి? ఆ అరెయ్, నువ్వీడే ఉండి, అక్క నీ, బావని సూస్కో, నే పోయి సికెన్ అట్టుకొస్త" అని పోయింది మైసమ్మ. కొట్టుకి పోయి "మస్తాన్ బాబు, ఈ దినాం జాతర ఉంది అని కూతుర్ని, అల్లుని పిల్సినా, బోజనాల కాడ సికెన్ ముక్క కూడా లేందే ఎట్టా? అని అల్లుడు అలిగి కూసున్నడు. కూసింత నువ్వే ఎలాగోలా ఈ పూటకి సికెన్ ఇచ్చెయ్ బాబు! రేపడి సంది అప్పు మల్లడగ.. సిన్నోడివైపోతివి నీ కాల్లు మొక్కితా ఇయ్యయ్యా" అని బతిమాలుకుంది మైసమ్మ. చాలాసేపటికి మస్తాన్ గుండె కరిగి చికెన్ ఇచ్చాడు మైసమ్మకి. మైసమ్మ ఆనందంగా ఇంటికి పోతా ఉంది. దారిలో ఓ కుక్క మైసమ్మ వెంటబడి, తన మీదకి ఉరికి, తన చేతిలో ఉన్న చికెన్ కవర్ లాక్కుని పారిపోయింది. "అయ్యో కట్టపడి సంపాదించింది కాత్త ఈ కుక్క ముం... ఎత్తుకుపోయిందీ, గిప్పుడు అల్లుడి నెలా సందాయించేటిది? దేవుడా!" అని అక్కడే కూలబడి పోయింది మైసమ్మ. "అమ్మ వత్తాది, సికేన్ అట్టుకొత్తది, బావ తిన్నంక కూసింత మిగిల్తే నాకే ఎత్తాది" అనుకుంటా గుమ్మంలో ఎదురుచూస్తా ఉండిపోయాడు చిన్నూ... *****

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు