మరణానంతరం ..దుఃఖం - చెన్నూరి సుదర్శన్

Marananantaram duhkham

అలా అడగడం.. అనితకు కొత్త గాదు.

చావు దృశ్యం కనబడితే చాలు.. అక్కడ ఏడ్చే వారిని కన్నార్పకుండా చూస్తూ.. తనూ కన్నీరు పెడుతుంది.

“సరితా.. నేను చనిపోతే ఇలాగే ఏడుస్తావా..” అంటూ అడుగుతుంది.

“నీకేమైనా పిచ్చా..! చనిపోవడమనే మాట ఎందుకు? అయినా చచ్చాక ఎవరెలా ఏడుస్తున్నారో! అని చూడొస్తామా?’ అంటూ గూబ గుయ్యిమనేలా జవాబివ్వడం సరితకు అలవాటు.

అనిత స్కూల్ ఫైనల్ పరీక్షలు కాగానే.. వేసవి సెలవుల్లో తల్లి దండ్రులతో కలిసి తన అన్నయ్య ఆనంద్ ఇంటికని బయలుదేరారు. బస్సు ప్రమాదానికి గురయ్యింది. తల్లిదండ్రులు కాలం చేశారు. అప్పుడు మొదటిసారిగా అనిత మరణానంతరం దుఃఖం అంటే ఏమిటో అనుభవించింది. అలాగే తాను చనిపోయినా.. తన స్నేహితులూ ఇలాగే ఏడుస్తారా? అనే ప్రశ్న ఆమె మనసులో నాటుకుంది.

ఆనంద్ మెడికల్ రిప్రజెంటేటివ్.. అనిత పై చదువుల కోసం వరంగల్ లో మకాం పెట్టాల్సి రావడం.. సరిత ఇంటి ప్రక్కనే ఇల్లు అద్దెకు దిగడం.. వారి స్నేహానికి నాంది పలికింది. అలా ఇంటర్ మీడియట్ నుండి డిగ్రీ ఫైనలియర్ వచ్చే సరికి వారి స్నేహబంధం మరింత బలపడింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా.. ఒకరి ప్రాణంలో మరొకరి ప్రాణం ఇమిడి పోయింది.

అనితకు ఇంట్లో కాలు నిలిచేది కాదు. దానికి కారణం.. ఆమె వదినమ్మ వనజ. ఆమెకు అనిత అంటే గిట్టేది కాదు పైగా సరితతో స్నేహం నచ్చేదీ కాదు. వారి ఇంటి విషయాలన్నీ చేరవేస్తుందనే అనుమానం ఆమె మనసును మరింతగా పీక్కు తినేది. కాని అనిత ఆలోచన ధోరణి వేరు. కలివిడిగా ఉండే అన్నయ్య, వదినమ్మల మధ్య తాను పానకంలో పుడకలా ఎందుకని? అనుకుంటుంది. తన వల్ల వారి కాపురంలో కలతలు రాగూడదని ఎక్కువ సమయం సరిత ఇంట్లోనే గడుపుతుంది. రాత్రుల్లు సైతం కంబైండ్ స్టడీ నెపంతో.. సరిత ఇంటికి వెళ్లి తన అనుమానాలను నివృతి చేసుకుంటూ.. చదువుకుని అక్కడే పడుకుంటుంది.

సరిత చదువులో అనిత కంటే కాస్త ముందుంటే.. అనిత ఆటపాటల్లో సరితను వెనుకంజ వేయించేది. అనిత హృదయం వెన్న.. అన్ని గుణాలూ మిన్న, అయినా.. ఆమెలో అదొక్కటే ప్రమాదకరమైన ఆలోచన.. తన మరణానంతరం స్నేహితుల దుఃఖం తెలుసు కోవాలనే కోరిక. నాటి మొలక నేడు మహావృక్షమయ్యింది. అలాంటి పిచ్చి కోరిక మనసులో పెట్టుకోవద్దని సరిత తరచూ కోపగించుకుంటుంది.

ఆ రోజు ఇద్దరూ కాలేజీ నుండి ఇంటికి తిరిగి వస్తుంటే.. వారి వీధిలోని ఒక ఇంటి ముందు షామియానా, పిడుకలతో రాజుకున్న పొగరావడం.. అనితలో అత్యంత ఉత్సాహం పెల్లుబుకింది. ఎవరో చనిపోయారు. వారి ఏడుపు విందామని అడుగుల వేగం పెంచింది. దీనికి ఈ పిచ్చి ఎప్పుడు వదులుతుందో అని విసుక్కుంటూ.. అనితను అనుసరించింది సరిత. అక్కడి హృదయ విదారక దృశ్యం చూసి.. ఏ బంధమూ లేక పోయినా.. అలవాటు ప్రకారం తనూ కంట నీరు పెట్టింది. తిరిగి వస్తూ.. మళ్ళీ అదే ప్రశ్న..

“అది కాదే సరితా.. నాకెందుకో శవం దగ్గర కూర్చోని ఏడ్చే వారిని చూస్తుంటే.. తెగ ముచ్చటేస్తుంది. చనిపోయిన వారికోసం కావాల్సిన వారు, బంధువులు ఏడుస్తున్నారు కదా..! నాకు నువ్వు తప్ప కావాల్సిన వారు ఇంకెవరున్నారు చెప్పు. ఏడుస్తావు కదూ..!” అడిగింది అనిత అమాయకంగా.

“ఇదుగో ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకో సారి ఇలా అడిగావంటే.. నీతో మాట్లాను. నేరుగా సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకు వెళ్తాను” అంటూ బెదిరించింది సరిత.

ఇది మామోలే.. అన్నట్టుగా చిన్న చిరునవ్వుతో సరితను ప్రసన్నం చేసుకుంది. అనిత మనసు చాలా సున్నితమని తెలిసి.. సరిత గూడా అంతగా బెట్టు చేయదు.

“అన్నట్టూ.. చెప్పడం మరిచాను సరితా. మా అన్నయ్య మెడికల్ ఏజెన్సీ కాన్ఫరెన్స్ హాజరవడానికి హైద్రాబాదు వెళ్ళాడు. ఈ రోజ రాత్రికి మీ ఇంటికి రావడం కుదరదు” అంది ముఖంలో కొంచెం బాధను వ్యక్తపరుస్తూ..

“సరేలే.. రేపు మన పెళ్ళిళ్ళు అయితే ఎలాగూ కుదురదుగా.. అదేదో ఈ రోజు నుండే అలవర్చుకుందాం..” నవ్వుతూ అంది సరిత. భళ్ళున నవ్వింది అనిత.. నిండు కుండ కిందపడి బద్దలైనట్టు.

***

“సరితా..! సరితా..!” అంటూ గావు కేకలు విన వచ్చే సరికి దిగ్గున లేచి కూర్చుంది సరిత. అది వనజ గొంతు. సరిత హాల్లోకి వచ్చేసరికే ఆమె తల్లిదండ్రులు తలుపు తీశారు.

వనజ నిలువెల్లా వణకి పోతూ ఏడుస్తోంది..

“ఏమయ్యిందమ్మా..” అంటూ అడిగాడు సరిత నాన్న నారాయణ. సరిత తల్లి సావిత్రమ్మ వనజను భయపడకు అన్నట్టు దగ్గరికి తీసుకుంది.

“అనిత ఎంత పిలిచినా లేవడం లేదు అంకుల్.. నాకెందుకో భయంగా ఉంది” అంటూ దుఃఖాన్ని ఆపుకోలేక పోతోంది.

సరిత వెంటనే వనజ ఇంటికి పరుగు అందుకుంది. ఆమె వెనుకాలే అంతా వడి, వడిగా వెళ్ళారు.

“అనితా.. అనితా..” అంటూ గట్టిగా పిలుస్తూ.. ఏడువసాగింది సరిత. ఆమెలో చలనం లేదు. సావిత్రమ్మ అనిత ఒళ్ళు తడుముతూ పరీక్షించి.. గాఢ నిద్రలో ఉన్నట్టు తన అనుమానం వ్యక్త పర్చింది. ఏదో గుర్తుకు వచ్చిన దానిలా.. వనజ చటుక్కున వంగి అనిత మంచం కిందకు చూసింది. స్లీపింగ్ పిల్స్ బాటిల్ కనబడింది.

“ఆంటీ.. అనిత నిద్రమాత్రలు మింగిన్నట్టుంది” అంటూ ఖాళీ బాటిల్ తీసి చూపించింది. “ఇందులో దాదాపు పది టాబ్లెట్స్ ఉండాలి. రాత్రి తనకు మీ ఇంట్లో నిద్ర పోవడం అలవాటై ఇక్కడ నిద్ర రావడం లేదంటే.. ఒక టాబ్లెట్ వేసుకోమన్నాను. మొత్తం వేసుకున్నట్టుంది” అంటూ ఘొల్లుమంది.

సరిత వీధి లోకి పరుగెత్తి ఆటో కోసం కేక వేసింది. ఇంతలో నారాయణ రడీయై వచ్చాడు. ఆటో డ్రైవర్ సాయంతో అనితను ఆటోలో తీసుకుని.. నారాయణ, సరిత యం.జి.ఎం. హాస్పిటల్ కు ఆఘమేఘాలమీద బయలుదేరారు. దారిలో సరిత క్లాస్ మేట్ అన్నయ్య అశోక్ జూనియర్ డాక్టర్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. అశోక్ నుండి సానుకూల సమాధానం రాగనే.. మనసులో దేవునికి నమస్కరించుకుంది.

హాస్పిటల్ కు వెళ్ళే సరికి అశోక్ తన సహాయ సిబ్బందితో రడీగా ఉన్నాడు. అనితను స్ట్రెచర్ పై పడుకోబెట్టి ఐ.సి.యు. కు తీసుకు వెళ్ళాడు.

రిసిప్షనిస్ట్ కు ఎదురుగా వెయిటింగ్ హాల్లో సరిత, నారాయణలు బిక్కు, బిక్కు మంటూ.. కూర్చున్నారు. సరిత కళ్ళు జలపాతాలయ్యాయి. నారాయణ తన దుఃఖాన్ని దిగమింగు కుంటున్నాడు. సరితను సముదాయించిన కొద్దీ.. ఆమె కన్నీళ్లు ఉబికి, ఉబికి దుముక సాగాయి. అనితను, సరితను తానెప్పుడూ వేరు, వేరుగా చూడ లేదు. పండుగలకు, పబ్బాలకు ఇద్దరికీ బట్టలు కొనుక్కొమ్మని డబ్బులిచ్చే వాడు. అనిత ఎంతగా వారించినా.. మీ నాన్న గారు ఇస్తే కాదంటావా అనితా..! అని సున్నితంగా ఒప్పించే వాడు.

అనితకు ఏమైనా అయితే సరిత ఏమవుతుందో! అనే ఆవేదన అతని మనసును అతలాకుతలం చేస్తోంది.

ఇంతలో ఒక నర్స్ వేగంగా వచ్చి.. “అనిత కొద్దిగా వాంతి చేసుకుంది. ఏమీ అధైర్య పడకండని డాక్టర్ చెప్పమన్నాడు” అని మళ్ళీ అంతే వేగంగా వెళ్లి పోయింది.

“సరితా.. ఏడువకమ్మా.. వాంతి అయ్యిందంటే కోలుకున్నట్టే..” అని ధైర్యం చెప్పసాగాడు నారాయణ. ఇంతలో వనజ, సావిత్రమ్మలు రావడం.. వారికీ అదే మాట చెప్పాడు. కాస్త మనసు నెమ్మది చేసుకుని సరిత ప్రక్కనే కూర్చున్నారిద్దరూ.

వనజను చూడగానే సరితలో రక, రకాల అనుమానాలు పొడచూపాయి. అనిత తరుచూ చెబుతూండేది. మా అన్నయ్య అంత విశాల హృదయం కాదు మా వదినమ్మదని. ఏదో ఒక వంకతో తన మీద చాడీలు చెబుతుందని వాపోయేది. విషయం ఆరా తీయాలి అన్నట్టుగా కాస్త ధైర్యం తెచ్చుకుని..

“వదినమ్మా.. రాత్రి అనిత మీతో ఏమైనా ఘర్షణ పడిందా?” అంటూ డగ్గుత్తికతో అడిగింది.

“లేదమ్మా.. ఇద్దరం కలిసే భోజనం చేశాం. కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. పెందలాడే పడుకుంది. తనికిష్టమైన ఇడ్లీ ఈ రోజు ఉదయానికి టిఫిన్ కోసం చేద్దామని ఆపనిలో ఉన్నాను. వదినమ్మా..! నాకు కొత్త ప్లేస్ కదా.. నిద్దుర రావడం లేదు. అన్నయ్య వాడే నిద్దుర మాత్తర్లు ఉంటే ఒకటివ్వుమని బతిమాలింది. ఒక్కటే కదా.. ప్రమాదమేమీ ఉండదని ఒక మాత్ర ఇచ్చి మర్చిపోయి ఆ బాటిల్ అనిత పడుకున్న మంచం పక్కకే ఉన్న కప్ బోర్డులో పెట్టాను. ఒక మాత్రతో నిద్దుర రాకుంటే.. అన్నీ వేసుకున్నట్టుంది. పొరబాటయ్యింది. పిచ్చి పని చేశాను. కనబడకుండా దాచిపెట్టాల్సింది” అంటూ నుదురు సుతారముగా కొట్టుకో సాగింది. సరిత నమ్మశక్యం గానట్టు తన తల్లి వంక చూసింది. సావిత్రమ్మ పెదవి విరిచి.. నారాయణ దిక్కు తిరిగింది.

ఇంతలో డాక్టర్ అశోక్ రావడం చూసి అంతా లేచి నిలబడ్డారు.

“సరితా.. నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. కంగారేమీ లేదు. అనిత స్టమక్ వాష్ చేశాం. ప్రస్తుతం కోమాలో ఉంది. గ్లూకోజ్ ఎక్కిస్తున్నాము. ఆక్సీజన్ గూడా పెట్టాము. పూర్తిగా నాపర్యవేక్షణలోనే ఉంటుంది. రేపు ఉదయానికి మెళకువ రావచ్చు.. మీరూ రేపు రండి” అంటూ వెళ్లి పోయాడు అశోక్.

అంతా హతాశులయ్యారు. నెమ్మదిగా వెళ్లి కిటికీ గుండా అనితను చూశారు. జీవచ్ఛవములా కనబడింది. ఆదృశ్యం చూసే సరికి సరిత కళ్ళు తేలేసి సావిత్రమ్మ భుజం మ్మీద వాలి పోయింది. సావిత్రమ్మ చటుక్కున తన గుండెలకు హత్తుకుని సరిత వీపు నిముర సాగింది. వనజ స్థాణువై పోయింది. . నారాయణ కళ్ళు చెమ్మగిల్లాయి.. తన వద్ద ఉన్న బాటిల్ లోని కొన్ని నీళ్ళు సరిత మోముపై చిలకరించాడు. సరిత తెప్పరిల్లి బిత్తిరి చూపులు చూడసాగింది. సావిత్రమ్మ గుండె చెరువయ్యింది. అనిత త్వరగా కోలుకోవాలని మనసులో వేయి వేల్పులకు మొక్కుకుంది. గుండె దిటవు చేసుకోవాలని సరితకు ధైర్యం చెబుతూ.. అంతా కలిసి ఆటోలో ఇంటికి బయలుదేరారు.

ఆ రోజంతా సరిత ఎంగిలి పడలేదు. రాత్రంతా కలవరింతలు.. కలవరింతలు. సావిత్రమ్మ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కు, బిక్కుమంటూ.. ఎప్పుడు తెల్లవారుతుందా.. అని ఎదురి చూస్తూ మంచంలో ఓమూలకు కూర్చుంది.

కాలింగ్ బెల్ మ్రోగేసరికి ఉలిక్కి పడిలేచి కూర్చుంది సరిత. నారాయణ తలుపు తీసినట్టు చప్పుడయ్యింది. సరిత దిగ్గున లేచి పరుగెత్తింది. సావిత్రమ్మ ఊహించింది నిజమే.. అతను ఆనంద్.

“సరితా.. నేను పోలీసు కేసు గాకుండా మేనేజ్ చేశాను. నువ్వు త్వరగా రడీగా. హాస్పిటల్ కు మనల్ని ముందు వెళ్ళమంది వనజ. తరువాత తను అమ్మా, నాన్నలను తీసుకుని వస్తానంది” అంటూంటే సావిత్రమ్మ అడ్డు చెప్పింది.

“లేదు ఆనంద్.. అంతా కలిసే వెళ్దాం.. అనితను చూడంది మాకు మనఃశ్శాంతి ఉండదు.. ఎంత సేపు ఐదు నిముషాల్లో మేమూ రడీ అవుతాం. అంతగా అయితే వనజను తీసుకుని ముందు మీరు బండి మీద వెళ్ళండి” అంది సావిత్రమ్మ.

“అయితే అందరం కలిసి ఆటోలోనే వెళ్దాం.. రడీ కండి” అంటూ వెళ్లి పోయాడు ఆనంద్.

అంతా కలిసి సెవెన్ సీటర్ ఆటోలో ఎంజిఎం వెళ్లేసరికి పూర్తిగా తెల్లవారింది. అందరిని రిసిప్షన్ కౌంటర్ హాల్లో కూర్చోమని.. సరిత, ఆనంద్ రిసిప్షనిస్ట్ వద్దకు వెళ్ళి అనిత ఆరోగ్యం విషయం ఆరా తీశారు.

“డాక్టర్ అశోక్ రాత్రంతా మెళకువతోనే అనిత దగ్గరే ఉన్నాడు.. పాపం ఆయనను చూస్తుంటే పిటీ అనిపిస్తోంది. స్వంత అన్నయ్యలా మనసులో బాధపడ్తున్నాడు. అలా కూర్చోండి.. డాక్టర్ గారికి ఇన్ ఫాం చేస్తాను” అంటూ ఎదో ఫోన్ కాల్ వస్తే అటెండ్ అవుతోంది. ఆమె ఫోన్ మాట్లాడ్డం పూర్తికాగానే..

“ప్లీజ్,, సిస్టర్.. నేను ఒక్కర్తెనే వెళ్లి కిటికీ గుండా చూస్తాను” అంటూ వేడుకుంది సరిత, సిస్టర్ మౌనం.. అంగీకారంగా తలచి సరిత కిటికీ వైపు కదిలింది. ఆనంద్ దీర్ఘ నిట్టూర్పు విడుస్తూ.. వనజ వద్దకు వెళ్ళాడు. అదే విషయం చెబుదామని.

సరిత అడుగులు ఐ.సి.యు. కిటికీని సమీపిస్తున్న కొద్దీ గుండె వేగం పెరుగసాగింది. నెమ్మదిగా కిటికీ వద్దకు చేరి తొంగి చూసింది. భాస్కర్ మోములో బాధ ప్రస్ఫుటమవుతోంది. సరిత గుండె మీద అరచేయి వేసి వేగంగా అదుముతూ.. పల్స్ మీటర్ వైపు పదే, పదే చూస్తున్నాడు. దాదాపు ఐదు నిముషాలు గడిచింది. లాభం లేదనుకున్నాడేమో..! స్టెతస్కోప్ తీసి నేలకు బలగా కొట్టి కర్చీఫ్ తో కన్నీళ్లు ఒత్తుకుంటూ బయటకు రాసాగాడు. సరిత ఆందోళనగా ఎదురు వెళ్ళింది.

“సారీ సరితా.. అనిత ఈజ్ నో మోర్..” అంటూ ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు.

“అనితా..!” అంటూ దిక్కులు అదిరేలా గావు కేక పెట్టింది సరిత. నేల మీద వాలి పోయే సరితను పడకుండా పట్టుకున్నాడు భాస్కర్.

రిసిప్షన్ లో కూర్చున్న వాళ్ళంతా పరుగెత్తుకుంటూ వచ్చారు.

“అనితా.. నేను ఏడుస్తున్నానురా.. రారా.. వచ్చి చూడురా..” అంటూ అందరి గుండెలు వడి పెట్టి పిండేలా ఏడువసాగింది సరిత.

ఆ పెడబొబ్బలకు హాస్పిటల్ సిబ్బంది అంతా పరుగెత్తుకుంటూ వచ్చారు.

***

అనిత లోకం విడిచి వెళ్ళిన నెల రోజులు గూడా కాలేదు. ఆనంద్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియదు. అత్యంత రహస్యంగా అర్థ రాత్రి చెప్పకుండా వెళ్లి పోతూండడం.. సరితకు అనుమానమేసింది. పదే, పదే ఆమె మనసులో అనిత ఎందుకలా చేసిందో! అని మనసు, మనసులో లేక.. మామూలు మనషి కాలేక పోతోంది. అలాగే ఆలోచిస్తూ కూర్చుంది.

తెల్లవారుతూనే.. వారు వెళ్తూ ఇచ్చారని.. సావిత్రమ్మ ఒక నోట్ బుక్ సరితకిచ్చింది.

“అనిత చాలా తప్పు పని చెసిందమ్మా.. ఎవరైనా.. ఏమైనా ఆమెను అంటే.. నీలాంటి స్నేహితులకు చెప్పి, సలహా తీసుకోవాల్సింది. నిలబడి ఎదురించాలి గాని చచ్చి సాధించేదేముంది చెప్పు. పిచ్చి పిల్ల. అనవసరంగా ప్రాణాలు తీసుకుంది” చెమ్మగిల్లిన ఆమె కళ్ళను కడ కొంగుతో ఒత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది.

అది తనదే.. ఆ రాత్రి చదువుకుంటానని అనిత తీసుకు వెళ్ళింది. దాన్ని చూడగానే సరితకు దు:ఖం పొంగుకు వచ్చింది. అనిత చివరి సారిగా వాడుకున్న తన నోట్స్ అని.. కళ్ళకు అద్దుకుంటూ.. తెరిచింది. ఒక్కొక్క పేజీ తిరుగ వేస్తుంటే.. ఒక్కొక్క కన్నీటి బొట్టు ముత్యపు బిందువులా ముద్దు పెట్టుకోసాగాయి. ఒక పేజీ వద్ద సడన్ గా ఆగిపోయింది సరిత. అది అనితకు తనకు మాత్రమే తెలిసిన కోడ్ భాషలో రాసి ఉంది. కళ్ళు గబుక్కున తుడ్చుకుని.. డీ కోడ్ చేసుకుంటూ.. చదువసాగింది.

సరితా..!.. నేను ఎవరికీ భారం కాదల్చుకో లేదు. నా తల్లి దండ్రులతో బాటు నేను గూడా పోతే పీడ విరగడయ్యేదని వదినమ్మ అంది. బై.. నా మరణానంతరం నీ దుఃఖం నేనూహించుకో గలను. బై.. బై బై. నీ.. అనిత. *

మరిన్ని కథలు

Telivijana majaka
టెలివిజనా! మజాకా!?
- కందర్ప మూర్తి
Prateekaaram
ప్రతీకారం
- చెన్నూరి సుదర్శన్
Anasteeshiya
అనెస్థీషియా
- వెంకట రమణ శర్మ పోడూరి
Voohinchaledu
ఊహించలేదు...!
- రాము కోలా.దెందుకూరు
APP Street police
ఎ.పి.పి స్ట్రీట్ పోలీసు
- కందర్ప మూర్తి
Maskena covid naasti
మాస్కేన కోవిడ్ నాస్తి
- పి. వి. రామ శర్మ
Pantulamma
పంతులమ్మ
- చెన్నూరి సుదర్శన్