కాకి మెతుకులు - గొర్తి.వాణిశ్రీనివాస్

Kaaki metukulu

" గోహోవిందేతి సదాఫ్ స్నాహ్నం, గోవిందేతి సదాఫ్ జపం గోవిందేతి సదాహ్ ధ్యానం.. సదాఫ్ గోహోవింద కిహీర్తనం" వణుకుతున్న గొంతుతో రహస్య సమావేశాలు జరుపుతున్నట్టు ఏవో మంత్రాలు వినబడుతుంటే చటుక్కున లేచింది రచన. సమయం చూస్తే తెల్లవారు జాము మూడూ ముప్పావు. బాత్ రూమ్ లో షవర్ ఆనైన నీళ్ల చప్పుడు వినబడుతోంది. ఈ సమయంలో స్నానం చేసేదెవరబ్బా? రమ్యగానీ స్నానం చేస్తోందా అని లేచి లైట్ వేసింది. పదహారేళ్ళ కూతురు రమ్య గాఢనిద్రలో ఉంది. ఎవరా అని బాత్ రూమ్ తలుపుకి చెవి ఆనించిoది. సందేహంలేదు ఇది అత్తగారు హనుమాయమ్మ గొంతే. ఈ వేళప్పుడు శీతాకాలం చలిలో అదీ గీజర్ లేని బాత్ రూములో స్నానం చేయటమంటే సాహసమనే చెప్పాలి. "అత్తయ్యా! ఏం చేస్తున్నారు మీరు? అంది " కార్తీక సోమవారం కదటే..తలారా స్నానం చేస్తున్నాను." అంది. "తలారా చేస్తున్నారా? వేన్నీళ్ళు పెట్టివ్వనా?" అంది. "హవ్వ..వేన్నీళ్ళు పోసుకుంటే పుట్టగతులుంటాయా! శంకరుడు శపించగలడు." అంటూ తడిబట్ట కట్టుకుని బయటకొచ్చిన అత్తగార్ని చూసి హడలిపోయింది రచన. కింద దవడ గడగడ ఒణుకుతూ కటకటా కొట్టుకుంటున్నా, మాట్లాడ్డం మానలేదు హనుమాయమ్మ. "ఏం అపార్ట్మెంట్లో ఏవిటో! వీలూ చాలూ ఉండవు. చక్కగా బావిలోనో ,పంపులోనో నీళ్లు కొట్టుకుని పోసుకోవటానికి వీలులేదయ్యే. పంపులు ముట్టుకోకుండా ఉండాలని షవర్ కి కింద చేస్తున్నాను. పారే జలానికి దోషం లేదు. వసతి లేనిచోట సర్దుకోవటమే ." మంత్రాల మధ్యలో మాటల్ని కూడా ఒణికించేసింది హనుమాయమ్మ. "కార్తీకం అనీ, అది అయ్యాక మార్గశిరం , తర్వాత ధనుర్మాసం, మళ్లీ సంక్రాంతి , వెంటనే మాఘమాసం అనుకుంటూ ఇలా స్నానాలు చేస్తుంటే జలుబు చేసి జ్వరంగానీ వచ్చిందంటే అది ఏ జలుబో ఏ బాపతు దగ్గో కూడా తెలియదు. ఎందుకు రిస్కు! కాస్త జాగ్రత్తగా వుండొచ్చుకదమ్మా!" అన్నాడు రామం ఆవులిస్తూ. "కరోనా ఎన్ని రూపాలు మార్చుకుని వచ్చినాగానీ నన్నేం చేయలేదు. నేను ఉక్కుపిండాన్ని." అంది తలకి తుండు పిడప పెట్టుకుంటూ. "వ్యాధి పులిలాంటిదత్తయ్యా! మనకి కనపడకుండా కాచుకుని ఉంటుంది. ఆదమరచి ఉన్నామా! అంతే, అమాంతం మీదపడి మనపై స్వారీ చేస్తుంది. మెలాయించుకుని లేచే సమయం ఇవ్వదు తెలుసా". రచన మంచం మధ్యలో కూర్చుని దుప్పటి ముసుగు కప్పుకుని అంది వేదాంతిలా. "అది పులి అయితే, నేను బెబ్బులిని. నాదగ్గర దాని ఆటలు సాగవు." అంది హనుమాయమ్మ కాన్ఫిడెంట్ గా. "సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ మానండి. ఆ తడి బట్ట విప్పి పొడిబట్ట కట్టుకోమ్మా!" అన్నాడు రామం నిద్ర మొహంతో. "అప్పుడేనా! తులసి కోట దగ్గర దీపం పెట్టాక అప్పుడు మార్చుకుంటూను." అని బాల్కనీలోకి వెళ్ళింది. నిట్టూరుస్తూ దుప్పటి ముసుకేసుకుని మళ్లీ పడుకున్నాడు రామం. అమ్మను ఒక్కదాన్నీ పల్లెటూరులో ఉంచటం ఇష్టం లేక పట్టుబట్టి హైదరాబాద్ తీసుకొచ్చాడు రామం. నాకు ఇక్కడేబాగుందంటూ రానని మంకుపట్టు పట్టింది హనుమాయమ్మ. కానీ తొలివిడత లాక్డౌన్ ప్రకటిoచటానికి ముందే వెళ్లి తల్లిని తీసుకొచ్చేసాడు రామం. తన మడి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదనే కండిషన్ మీద కొడుకు వెంట వచ్చింది. అప్పటి నుంచీ ఆమె మడి బట్టలకీ, మంత్రోచ్చారణలకీ ఎవరూ అడ్డు చెప్పలేదు. "కానీ ,కార్తీక మాసం ,మంచు చలి ఎక్కువగా వుంది. అసలే కరోనా రోజులు. డాక్టర్లు సైతం భయపడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరం చన్నీళ్ల స్నానాలూ,ఉపవాసాలూ పక్కన పెట్టమ్మా" అని కొడుకూ కోడలూ ఎంత చెప్పినా వినలేదు హనుమాయమ్మ. " కార్తీక మాసంలో కాకి కూడా స్నానం చేసి ఉపవాసం ఉంటుంది.తెలుసా?" అంది. "కాకి కూడా ఉపవాసం ఉంటుందని నీకెలా తెలుసు బామ్మా?" అని రెట్టిoచింది రమ్య. "మా పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని గుడ్లు మూసుకుని విని ఆచరించాం. ఇలా వితండవాదం చేయాలని మాకు తెలీలేదే తల్లీ" అంటూ పంచి పటాకా పేల్చి అందరి నోళ్ళూ మూయించేసింది హనుమాయమ్మ. ఆ మధ్యాహ్నానికల్లా ఒంట్లోంచి చలి పుట్టుకొచ్చి ఒణుకుతూ కూర్చుంది హనుమాయమ్మ. " అత్తయ్యా! ఈ జ్వరం మాత్ర వేసుకోండి. పెరిగితే తట్టుకోలేరు!" అని మాత్ర తెచ్చి ఇచ్చింది రచన . " ఇంగ్లీష్ మాత్రలు నాకొద్దు. సీతాంశురసం కుప్పె అరగదీసుకుని తేనెలో రంగరించి నాకితే జ్వరం, జలుబూ తగ్గి పోతాయి. కుప్పె నా జపమాల బాక్సులో వేశాను. ఎటుపోయిందో కనబడ్డంలేదు." అంటూ చేతిసంచీలో బట్టలు తీసి దులిపింది. ఆ దుమ్ముకి తుమ్ములు మొదలయ్యాయి. "కుప్పెలూ, గంటలూ అరగదీస్తే జ్వరం తగ్గదమ్మా! కాస్త అన్నం తిని మందులు వేసుకోమ్మా!" అన్నాడు రామం. "టా ట్! కార్తీక మాసంలో నక్తాలు వుంటూ అన్నం తింటానా? అపచారం" ససేమిరా అని భీష్మించుకు కూర్చుంది. భార్యవంక నిస్సహాయంగా చూశాడు రామం. "అన్నాన్ని భిన్నం చేసి తినొచ్చు అత్తయ్యా.. బియ్యపు జావ తాగండి" అని బియ్యాన్ని మిక్సీలో పట్టి, జావచేసి ఇచ్చింది రచన. రామం, రచనా బతిమలాడగా మందు బిళ్ళ మింగి పడుకుంది. రాత్రికి జ్వరం కాస్త నెమ్మళించింది. " నాన్నా! ఇందాక నేనొస్తుంటే వాచ్ మెన్ చెప్పాడు. ఓవర్ హెడ్ ట్యాంక్ లో కాకి అన్నం ముద్ద తెచ్చి పడేసిందిట. పంపుల్లోంచి అన్నం మెతుకులు వస్తాయేమో కంగారు పడొద్దని చెప్పాడు. రేపో ఎల్లుండో మనిషిని పిలిపించి శుభ్రం చేయిస్తారుట" అంది రమ్య తండ్రితో. "ఆసినీ కాకి నోరుపడా! అన్నం తెచ్చి పడేస్తే, ఆ అంట నీళ్లతో రేపు పొద్దున్నే నేను స్నానం ఎట్లా చేస్తానురా!? పది మందితో పని. ఎప్పుడు శుభ్రం చేస్తాడో ఏవో! అందుకే అన్నారు. గజం స్థలంలోనైన సొంత పాక వున్నా మేలని. ఒక పని చెయ్యండి. నీళ్లను స్టవ్ మీద పెట్టి వేడి చేసి పోసుకుంటే దోషం ఉండదు. మీరు కూడా అలాగే పోసుకోండి.అంటు అయిన నీళ్ళని మాత్రం పోసుకోకండి ఏం చేస్తాం! కార్తీక పౌర్ణమి రోజున వేడి నీళ్లు పోసుకుంటున్నాను స్వామీ! క్షమించు" అంటూ దణ్ణాలు పెట్టుకుంది హనుమాయమ్మ. "మన వాటర్ ట్యాంక్ కి మూత ఉందిగా. అన్నం మెతుకులు ఎలా పడ్డాయి? వాచ్ మెన్ ని ఇటు పిలు అడుగుతాను" అన్నాడు రామం. "ఉష్! ఊరుకోండి నాన్నా! అదేం లేదు. మామ్మా చేత చన్నీళ్ల స్నానాలు మాన్పించాలని అలా చెప్పాను." అంది రమ్య ముసిముసిగా నవ్వుతూ. కూతురి తెలివికి మురిసిపోయాడు రామం. వద్దంటే వాదించి సాధించే అమ్మ అమాయకత్వానికి మందు తెలిసిపోయింది రామానికి.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి