కాముడు - యు.విజయశేఖర రెడ్డి

Kaamudu

నేను,రాజు,కాముడు చిన్ననాటి స్నేహితులం.పాఠశాలలో చదువుకునే రోజుల్లో బల్ల స్నేహితులం.కొందరికి
ఊత పదం జబ్బు ఉన్నట్టు మా కాముడికి కూడా ఒక పదం అబ్బింది.. మాటి మాటికీ ‘వన్ సెకెండ్’ అంటాడు. మేము
ఎంత మాన్పించాలన్నా అది కుదరలేదు. సరేలే దాని వల్ల నష్టం లేదని వదిలేశాము.

మా ముగ్గురులో కాముడు తప్ప నేను, రాజుఒక ఏడాది పదవ తరగతి తప్పాము. కాముడు మరో మూడు
సంవత్సరాలకు గాని విజేత కాలేక పోయాడు. ఎలాగోలా కాముడు తప్ప నేను,రాజు డిగ్రీ పూర్తి చేశాము. కాముడు
ఇంటర్ తప్పి ఇక దండయాత్ర చేయలేనని అస్త్రసన్యాసం చేశాడు.

నేను,రాజు ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించాము. మాకు రెండు,మూడు నెలల తేడాతో పెళ్లిళ్లు
జరిగాయి.చెప్పాలంటే కాముడికి పది ఎకరాల మాగాణి ఉంది.వాడు మాకంటే ముందు పెళ్లి చేసుకోవచ్చు కానీ
‘ఉద్యోగం పురుష లక్షణం’ లేక పోతే పలువురూ పరుషంగా మాట్లాడతారు అని భీష్మించుకు కూర్చుని, ఎట్టకేలకు చిన్న ఉద్యోగం సంపాదించాడు.దానితో వాడికి పెళ్లి కుదిరింది.అమ్మాయి పేరు కామాక్షి.

పెళ్లి రోజు రానే వచ్చింది మాకు పెళ్లి కూతురు వాళ్ళు విడిది ఏర్పాటు చేశారు. మాకు భోజనాల సమయంలో
వడ్డించేవాళ్లు ఒక్కొక్క ఐటమ్ వడ్డిస్తునప్పుడల్లా మావాడు “వన్ సెకండ్” అన సాగాడు. ఇది కాస్తా విన్న ఒక అమ్మాయి
పెళ్లి కూతురు చెవిన పడేసింది.

పెళ్లి మొదలయ్యింది... తాళి కట్టే సమయం వచ్చింది. పంతులు గారు “నాయనా తాళి తీసుకుని అమ్మాయి
మెడలో మూడు ముళ్లు వెయ్యి” అన్నాడు. మావాడు తాళి అందుకోబోతూ “వన్ సెకండ్” అన్నాడు. దానికి కొందరు
నవ్వులను గలగల మనిపించారు. మావాడు కాస్త బిడియ పడ్డాడు. నేను భుజం తట్టగానే అమ్మాయి మెడలో తాళి
కట్టాడు. పెళ్లి తతంగం ముగిసింది. వస్తామని నేను,రాజు బయలుదేరాము.

మొదటి రాత్రికి,అమ్మలక్కలు కాముడు గదిలోకి వెళ్ళాక, కామాక్షిని గదిలోకి తోసేశారట.అమ్మాయి మావాడికి
పాల గ్లాసు అందించిందట మా వాడు అందుకుని వన్ సెకండ్ అన్నాడట దానికి అమ్మాయి ముసిముసి నవ్వులు
నవ్విందట. దానితో మా వాడు పాల గ్లాసు పక్కన పెట్టి అలిగి బుంగ మూతి పెట్టి చాలా సేపు అలాగే మంచం మీద
పడుకున్నాడట..కామాక్షి మా వాణ్ణి బుజ్జగించి ఇంకెప్పుడూ నవ్వను అన్నాక గాని మావాడు పాలు తాగలేదట.ఈ
విషయాలన్నీ మాకు ఫోన్ చేసి చెబుతుంటే నేను, రాజు తెగ నవ్వుకున్నాము.

ఏడాది గడిచింది,కాముడికి కొడుకు పుట్టాడు.కాల చక్రం గిర్రున తిరిగింది. కాముడి కొడుకుకు మూడు
సంవత్సరాలు వచ్చాయి నేను,రాజు మా కుటుంబాలతో వాడి ఇంటికి వెళ్లాము.. కాముడు సాదరంగా ఆహ్వానించాడు.
వెనకాలే కామాక్షి వచ్చి “బాగున్నారా..అన్నలూ..వదినమ్మలూ!” అని పలుకరించింది, వారి వెనకాలే వారి పిల్లాడు
వచ్చాడు, పిల్లాడికి “బబ్లూ” అని పేరు పెట్టుకున్నారు. స్వీట్స్ తీసుకున్నాక నేను “బబ్లూ... మంచి నీళ్ళు తెసుకురావా”
అన్నాను “వన్ మినిట్” అంకుల్ అన్నాడు వాడు. వెనకాలే వచ్చిన కాముడు నేను “వన్ సెకండ్.. అనేది మానేశానురా..

వీడికి ఎలా అబ్బిందో... ఏమిటో ప్రతి దానికీ ‘వన్ మినిట్’ అని అంటున్నాడు” అన్నాడు. “అవునురా... సెకండ్
తరువాత వచ్చేది మినిటే కదా” అన్నాను నేను.” అవును అన్నగారూ... జీన్స్ ఎక్కడికి పోతాయి” అంది
కామాక్షి...అందరం హాయిగా నవుకున్నాము.
***

మరిన్ని కథలు

Telivijana majaka
టెలివిజనా! మజాకా!?
- కందర్ప మూర్తి
Prateekaaram
ప్రతీకారం
- చెన్నూరి సుదర్శన్
Anasteeshiya
అనెస్థీషియా
- వెంకట రమణ శర్మ పోడూరి
Voohinchaledu
ఊహించలేదు...!
- రాము కోలా.దెందుకూరు
APP Street police
ఎ.పి.పి స్ట్రీట్ పోలీసు
- కందర్ప మూర్తి
Maskena covid naasti
మాస్కేన కోవిడ్ నాస్తి
- పి. వి. రామ శర్మ
Pantulamma
పంతులమ్మ
- చెన్నూరి సుదర్శన్