వంశీకి నచ్చిన కథ - డాక్టర్ సుబ్రమణ్యం దవాఖానా - రాజేందర్ (జింబో)

Dr.subramanyam davakhaanaa telugu story

మావూరి ముందు కుక్కపిల్లలా వాగుంటుంది. అది దాటగానే వూరొస్తుంది. కాస్త ముందుకు వెళ్తే ఎడమవైపు వేణుగోపాలస్వామి గుడివస్తుంది. దాని ప్రక్కనే బొడ్ల గుట్టయ్య బంగారు దుకాణం, దాన్ని ఆనుకొని ఓ చిన్న సందు. సందులోకి కాస్త దూరం వెళ్లగానే ఎడమవైపు ఆంజనేయస్వామి గుడి, ఇంకా కాస్త ముందుకు వెళ్తే సుబ్రమణ్యం దవాఖానా కన్పించేది. ఆ దవాఖానా చిరునామా తెలియని వ్యక్తులు, సుబ్రమణ్యం వైద్యం గురించి తెలియని వ్యక్తులు మా వూర్లోనే కాదు, ఆ చుట్టుప్రక్కల వూర్లల్లో కూడా ఎవరూ లేరు.

నా చిన్నప్పుడు మావూర్లో వున్నది ఒకే ఒక్క దవాఖానా. మా వూర్లోనే కాదు, మావూరి చుట్టుప్రక్కల వున్న రెండువందల గ్రామాలకి అదే దవాఖానా డాక్టర్ పేరు సుబ్రమణ్యం. అరవై సంవత్సరాల చరిత్ర వున్న దవాఖానా అది. పేరుకి శ్రీ రాజేశ్వర దవాఖానా. కాని సుబ్రమణ్యం దవాఖానా గానే ప్రసిద్ధి.

ఆ దవాఖానా మొదట అక్కడలేదు. మా రాజేశ్వరుని గుడిని ఆనుకుని వుండేది. అంతకు ముందు గుడి ముందు వుండేది. ఇదంతా ఎనభై సంవత్సరాల క్రిందిమాట. సుబ్రమణ్యం వైద్యం ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు. అతను పుట్టింది వేములవాడలో కాదు, మహబూబ్ నగర్ జిల్లాలో. కానీ అతని పూర్వీకులు వేములవాడ వాళ్ళే. అందుకే వాళ్ళ ఇంటిపేరులో వేములవాడ కూడా వుంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని రాజుల ముందు తలపాగా వేసి నడపడం ఇష్టం లేక ధిక్కార స్వరంతో వేములవాడకి వచ్చాడు. వేములవాడ ప్రక్కన వున్న సిరిసిల్లలో వాళ్ళ పెదనాయన కొడుకు రామచంద్రం. ఆ కాలంలో అతనొక ప్రసిద్ధి చెందిన న్యాయవాది. ఒంటరిగా వచ్చిన సుబ్రమణ్యం గుడిముందు దవాఖానా పెట్టి వైద్యం ప్రారంభించాడు. చెట్లు, మూలికలతో అతను చేసే కషాయం చాలా రోగాలకి పనిచేసేది. రోగ నిరోధక శక్తి నిచ్చేది.

ఇంట్లో వాళ్ళని ఎదిరించి వచ్చాడని రామచంద్రం అతనికి ఎలాంటి సహాయాన్ని మొదట అందించలేదు. అన్న నుంచి ఎలాంటి సహాయం అందలేదని సుబ్రమణ్యం నిరాశ చెందలేదు. తన వైద్యాన్ని కొనసాగించాడు. ఒకసారి వేములవాడ జాగిర్దారు రాజేశ్వరుని దర్శనానికి వేములవాడకి వచ్చాడు. అతను తీవ్ర అస్వస్థతకి లోనైనాడు. సుబ్రమణ్యం హస్తవాసి తెలిసిన మా వేములవాడ బ్రాహ్మలు జాగిర్దార్ కి సుబ్రమణ్యం గురించి చెప్పారు. అతన్ని పిలిపించమని జాగిర్దార్ చెప్పాడు. సుబ్రమణ్యం అతనికి వైద్యం చేశాడు. రెండు మందు పొట్లాలు ఇచ్చాడు. జాగిర్దార్ అస్వస్థత మాయమైపోయింది. అతని జ్వరం ఎగిరిపోయింది. అంతే? సుబ్రమణ్యాన్ని వేములవాడ దేవస్థానానికి వైద్యునిగా నియమిస్తూ ఫర్మానా జారీ చేశాడు. అట్ల సుబ్రమణ్యం దేవస్థానం తొలివైద్యునిగా చేరినాడు. అతని దవాఖానా గుడి ఆనుకుని వున్న మహిషాసుర మర్దని ఆలయం ప్రక్కకి మారిపోయింది.

సుబ్రమణ్యం కాషాయం ప్రభావమో, గోళీల ప్రభావమో, అతని చేతి గుణమో తెలియదు కానీ ఎంత పెద్ద రోగాలైనా తగ్గిపోయేవి. పేరుకి దేవస్థానం డాక్టర్ గానీ, చుట్టుప్రక్కల ఎవరికీ వైద్య సహాయం అవసరం ఏర్పడినా కచ్చురం తయారయ్యేది. ఆ కచ్చురంలో సుబ్రమణ్యం బయల్దేరేవాడు. వేములవాడలో ఏ ఇంట్లో ఎవరికి జ్వరం వచ్చినా సుబ్రమణ్యం కషాయం, గోలీ తీసుకోవాల్సిందే. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా డాక్టరు గారింటికి ఆ భోజనం రావాల్సిందే.

సుబ్రమణ్యం పేరు ప్రఖ్యాతులు గమనించిన వాళ్ళ అన్న న్యాయవాది రామచంద్ర, సుబ్రమణ్యాన్నిసిరిసిల్లకి పిలిచాడు. కొంతకాలానికి సత్తెమ్మ అనే అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు. ఎవరికి ఏ వైద్యం చేసినా వాళ్ళు ఏమి ఇచ్చారన్నది ఎప్పుడూ సుబ్రమణ్యం పట్టించుకోలేదు. వాళ్ళకు తోచినవి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కొంతమంది బియ్యం పంపించేవాళ్ళు. కొంతమంది తేనెని ఇచ్చేవాళ్ళు రాజాగౌడ్ లాంటివాళ్ళు మంజలని పంపించేవాళ్ళు. అతను ఎన్నడూ ఎవరినీ ఏమీ అడగలేదు. ఆయన ఇంట్లో వివాహం వుందంటే అన్ని సమకూరేవి. ఎవరికీ ఏమి చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి తోచిన పని వాళ్లు చేసేవాళ్ళు. ఎవరి దగ్గర వున్నవి వాళ్ళు తెచ్చి ఇచ్చే వాళ్ళు. ప్లేగు వ్యాధి మా వేములవాడలో ప్రబలినప్పుడు ధైర్యంగా సుబ్రమణ్యం వైద్యం చేశాడు.

కషాయం బట్టీలు రోజూ మరిగేవి. ఇంట్లో పెద్దవాళ్ళందరూ గోలీలు చేసేవాళ్ళు. ఇంటి వెనక ఏవో చెట్లని, మొక్కలని పెంచేవాడు. ఆయుర్వేదంతో పాటు, అల్లోపతిని కూడా అతను ఉపయోగించేవాడు. మొట్టమొదటి సారిగా మా వూర్లో సూది మందును ఇచ్చిన డాక్టర్ సుబ్రమణ్యమే. దేవస్థానం పదవీ విరమణ చేసిన తరువాత గుడి దగ్గర్లోనే శ్రీ రాజేశ్వర దవాఖానాను పెట్టాడు. ఒక చేతిలో మందుల సంచి మరో చేతిలో అసరాకి కట్టె, ఖద్దరు బట్టలు, అరవై దాటిన తరువాత కూడా ఎంతో ఉత్సాహంగా వుండేవాడు. ఊరు బయట అతని ఇల్లు అక్కడి నుంచి దవాఖానాకి వచ్చే దారిలో ఎందరి ఇండ్లల్లోనో వైద్యం చేసేవాడు. దార్లో మామా అని పలకరించే వాళ్ళు కొందరు తాతా అని పలకరించేవాళ్ళు మరికొందరు.

రోగులతోనే కాలం గడిచేది. సాయంత్రం కాస్త సమయం చిక్కితే ఆయన దవాఖానా ముందు చాలా మంది పెద్దవాళ్ళు గుమికూడేవాళ్ళు. అక్కడ నేలమీద రెండు చాపలు వేసేవాళ్ళు. ఊరిలోని పెద్దవాళ్ళు సాయంత్రం అక్కడ కలిసి కూర్చుండి మాట్లాడుకునేవాళ్ళు. జగన్ మోహన్ సింగ్, ముకుంద నర్సయ్య, గౌర్నేని గోపాలరావు, శీనయ్యపంతులు, శేఖేదార నరహరి, నూగూరి సాంబయ్య లాంటి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చునేవాళ్ళు. వివాదాలని పరిష్కరించేవాళ్ళు.

ఆకాలంలో మా వూరికి వస్తున్న ఒకే ఒక పత్రిక గోరాశాస్త్రి సంపాదకత్వంలో వస్తున్న ఆంధ్రభూమి. పదకొండు ప్రాంతంలో ఆ పత్రిక వచ్చేది. సుబ్రమణ్యం దవాఖానా రీడింగ్ రూమ్ లాగా ఉపయోగపడేది. రాత్రిపూట వయోజనుల కోసం ఓ బడి నడిచేది. శ్రీహరి సార్ ఆ బడి నడిపేవాడు. చదువురాని పెద్దవాళ్లకోసం ఆ బడి నడిచేది. ఆ బడి నడపడానికి కారణం సుబ్రమణ్యం. దవాఖానాలో వున్న రోగులు కూడా అక్షరాలు దిద్దుకునేవాళ్లు. మా వూర్లో రావడానికి దాని నిర్మాణానికి కారణం సుబ్రమణ్యమే.

ఆ దవాఖానలో దగ్గు తగ్గడానికి తియ్యని మందుపొట్లాలు వుండేవి. ఆ మందు పొట్లాలకోసం, ఆయన తియ్యటి మాటల కోసం స్కూళ్ళకి వెళ్తున్న పిల్లలు చాలామంది అక్కడికి వచ్చేవాళ్లు. ఆయనతో మాట్లాడి తాతా అని వెంటపడి దగ్గులేకున్నా ఆ పొట్లాలు తీసుకునేవాళ్ళు. కషాయం పోస్తానని ఆయన అనగానే వాళ్ళు అక్కడినుంచి పారిపొయ్యేవాళ్ళు. అప్పుడు నావయసులో వున్న పిల్లలందరూ ఆయన్ని తాతా అని అనేవాళ్ళు. అలాంటి అవకాశం లేని వ్యక్తిని నేనొక్కడినే. ఎందుకంటే నేను ఆయన తొమ్మిదవ సంతానాన్ని. ఆయన మా బాపు. తాత వయస్సులో ఉన్నప్పటికీ మా బాపుతో నాకు అంత సన్నిహితం వుండేది కాదు. దూరం వుండేది.

మా రాజేశ్వరుని సేవ గుడి ముందు నుంచి ప్రారంభమై నాలుగు ప్రధాన స్థలాల్లో ఆగేది. అందులోని ఓ స్థలం మా బాపు దవాఖానా. అక్కడ సేవ ఓ ఐదు నిముషాలు ఆగేది. దవాఖానా ముందు కూర్చున్న పెద్దవాళ్ళందరూ దేవుణ్ణి దర్శించుకునేవాళ్లు. దవాఖానాలో వున్నరోగులు ఆ దేవుణ్ణి దర్శించుకునే వాళ్ళు. మా బాపు రెండు చేతులెత్తి దండం పెట్టేవాడు. మా ఇంట్లో అందరూ మా రాజేశ్వరుని గుడికి వెళ్ళడం కన్పించేది. కానీ మా బాపు గుడికి వెళ్ళిన సందర్భం నేను చూడలేదు. ఆయనకు అంత సమయం చిక్కేదికాదు. చిక్కిన దాన్ని మా వూరి ప్రజల కోసం రోగుల కోసమే వెచ్చించేవాడు. ఒక్క సేవ వచ్చినప్పుడు తప్ప ఆయన దేవుని కోసం తాపత్రయ పడ్డ సందర్భం నాకు కన్పించలేదు.

రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసిన తరువాత కూడా పేషెంట్లు వచ్చేవాళ్ళు. చందమామ కథలు కూడా అతన్ని చదువుకొనిచ్చేవాళ్లు కాదు. డబ్బులు అడగడు అన్నందుకు కాదు, అతను మందిస్తే రోగం తగ్గుతుందన్న నమ్మకంతో వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. మేం భోజనం చేస్తున్నప్పుడు బాపు వస్తున్నాడంటే మా అందరికీ భయంగా వుండేది. కంచం దగ్గర క్రింద ఒక్క మెతుకు కన్పించినా ఆయన వూరుకునేవాడు కాదు. ఒక్క మెతుకు కూడా వృధాగా పోవద్దు అనేవాడు.

ఉదయం స్నానం చేసి రెండు బిస్కట్లు తిని టీ తాగి దవాఖానకి బయల్దేరేవాడు. దేవునికి దండం పెట్టకుండానే బయల్దేరేవాడు. ఈ విషయం మా అమ్మ ప్రస్తావించిన సందర్భాలు వున్నాయి. నేను చేస్తున్న పనులు దేవుడికి ఇష్టమైన పనులు. రోగులకి వైద్యం చేయడం దేవున్ని మొక్కడంతో సమానం. బడి కట్టించడం చదువురాని పెద్దవాళ్ళకి చదువు చెప్పించడం దేవుడు ఇష్టపడే పనులు అనేవాడు. ఈ మాటలు మా అమ్మకి అర్ధం కాకపోయేవి ఎందుకంటే ఆమె చదువుకోలేదు. అందుకని మా బాపు మాటల్లోని అంతరార్ధం తెలియకపోయేది.

మా బాపుకి ఎనభై ఆరేళ్ళ వయసులో గొంతునొప్పి వచ్చింది. ఏదైనా తింటే అది లోపలికి పొయ్యేది కాదు. మా రఘుపతన్న దేవస్థానంలో డిప్యూటేషన్ పై డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అతను అల్లోపతి డాక్టర్. మా బాపుని హైదరాబాద్ తీసుకుని వెళ్ళాడు. కాన్సర్ లక్షణాలు వున్నాయని తేలింది. రెండు నెలల పాటు హైదరాబాద్ లో వైద్యం చేయించాడు. ఆ రెండు నెలలు మా బాపు దవాఖానా మూతపడింది. వేములవాడకి వచ్చిన నెల తరువాత మా మల్లయ్యతో దవాఖానాని శుభ్రం చేయించాడు. కషాయం బట్టీ పెట్టించాడు. మళ్లీ దవాఖానాకి వెళ్ళడానికి మా అమ్మ వ్యతిరేకించింది. దవాఖానాకి వెళ్ళాల్సిన అవసరం లేదని మా రఘుపతన్న అన్నాడు. అయినా మా బాపు వినలేదు. గుడికి వెళ్ళిన తరువాత దవాఖానాకి వెళ్లమని కోరింది.

"గుడికి నువ్వు పోతావు గదనే. అది చాలు దవాఖానాకి వెళ్తాను" అన్నాడు మా బాపు.

నేనప్పుడు ఉస్మానియాలో చదువుతున్నాను. మూడు నెలలు మూతబడిన దవాఖానాకి ఎవరొస్తారని నేననుకున్నా. నా అంచనాలన్నీ తారుమారైనాయి. ఎప్పటిలాగా దవాఖానాకి రోగులు వచ్చారు. అదే వైద్యం నమ్మకం, అదే సేవ.

మూడు సంవత్సరాలు గడిచాయి. నా పెళ్లైంది. నా పెళ్ళప్పుడు కూడా దవాఖానానే ఆయన సర్వస్వం. నా పెళ్ళైన రెండో రోజు గుడికి వెళ్ళడానికి నేనూ మా ఆవిడా సిద్ధమవుతున్నాం. అప్పుడు మా బాపు ఇంట్లోనే వున్నాడు. మా ఆవిడని పిలిచాడు. ఆమె దోసిట్లో రూపాయి బిళ్ళలు పోశాడు.

"శైలజా! గుడిముందు చాలామంది బిచ్చగాళ్ళు ఉంటారు. వాళ్లకి ఈ డబ్బులు పంచు" అన్నాడు.

నేనూ మా ఆవిడా ఆశ్చర్యపోయాం. దేవునికి ఈ పూజ చేయించు. ఆ పూజ చేయించు, ఆ సేవ చేయండి, అని చెబుతున్నాడనుకున్నాం. అతనేమీ చెప్పలేదు. మా ఆవిడ దోసిట నిండా నాణేలు. ఆయన కోరిక, దేవున్ని దర్శించి ఆయన చెప్పినట్టే చేశాం.

ఆరు నెలలు గడిచాయి. మళ్లీ మా బాపు ఆరోగ్యం క్షీణించింది హైదరాబాద్ తీసుకెళ్ళాడు మా రఘుపతన్న. ఓ వారం రోజుల తరువాత గుండెనొప్పితో మా బాపు చనిపోయాడు. ఉదయాన్నే మా వేములవాడకి ఆయన్ని తీసుకొచ్చారు. ఆ సమాచారం ఊరు ఊరంతా క్షణంలో తెలిసిపోయింది. అర్ధరాత్రి అనకుండా అపరాత్రి అనకుండా ఎప్పుడూ తెరిచి వుండే మా ఇంటి ద్వారాలు ఇక తెరుచుకునే అవకాశం లేదు. ఏరాత్రి ఎవరు తలుపు తట్టినా మందుల పెట్టెని తీసుకుని కచేరీలోకి వచ్చే మా బాపు ఇకలేడు. ప్లేగువ్యాధి ప్రబలినా, కలరా వూరు ఊరంతా వ్యాపించినా ధైర్యంతో వైద్యం చేసిన మా బాపు లేడు. ఓ శోకమయ వాతావరణంలో మేమున్నాం.

ఊరు వూరంతా వచ్చి మా ఇంటి ముందుంది. అప్పుడు మా అన్నయ్య కొడుకు నా దగ్గరకు వచ్చి "బాబాయ్! తాతయ్య చనిపోలేదు" అన్నాడు వాళ్ళందరికీ చూపిస్తూ.

అంత శోకంలో వాడిని గుండెకు హత్తుకున్నాను. చివరిసారి చూడటానికి మా గుడిలోని పూజారులంతా వచ్చారు. గ్రహణం వచ్చిన రోజు తప్ప మూసుకోని మా రాజేశ్వరుని గుడి తలుపులు ఆ రోజు మూసుకున్నాయి. గుడికి తరచుగా వెళ్ళని మా బాపు కోసం రాజేశ్వరుడు గుడి తలుపులు మూసి, పూజారుల రూపంలో మా బాపు పార్థీవ శరీరం ముందుకొచ్చారు. ఆ విషయం తెలిసిన మా కన్నుల్లో ఆనందబాష్పాలు శోకంలో కూడా ఆనందం.

అందుకే నా ప్రయత్నమంతా ఒక్కటే. ఆయనలా నేను పరివర్తనం చెందాలని, ఫలప్రదమైన జీవితం గడపాలని, ఎప్పటికీ ఆయన కేరాఫ్ లో వుండాలని.

అలాంటి సుబ్రమణ్యం దవాఖానా మళ్లీ మా వేములవాడలో రావాలని నా ఆశ.

***

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao