మానవత -మన మనుగడ - B.Rajyalakshmi

Manavatha mana manugada

చీకటి పడుతున్నది ,దీపాలు వెలుగుతున్నాయి . మారుమూల శిథిలావస్థలో వున్న ఒక యింటి ముందు నిలబడ్డాడు నారయ్య . మాసిపోయిన బట్టలు ,ఒళ్లంతా చెమట ,మురికి కంపు . అట్టలు కట్టిన జుట్టు చూడంగానే అతనెంత దారుణ స్థితిలో వున్నాడో తెలుస్తూనే వుంది . మధ్య మధ్య దగ్గుకూడా వస్తున్నది . ఊరంతా తిరిగీ తిరిగీ చివరకు ఆ యింటిముందుకు వచ్చాడు . సుమారు పది రోజుల క్రిందటి వరకూ నారయ్య ఒక కిరాణా దుకాణం లో పని చేసాడు . అతని అనారోగ్యం వల్ల పని మానేసాడు . మళ్లీ కొన్నాళ్లదాకా పని చేసే శక్తి లేదు . ఇంతవరకూ వున్న డబ్బుతో యెలాగో లాక్కొచ్చాడు . ఇప్పుడు డబ్బులు లేవు . పొద్దుటినించీ తింది లేదు . నీరసం గా వున్నాడు .

నారయ్య ఆ యింటి ముందున్న చెట్టుక్రింద నిలబడ్డాడు . ఆ యింటి తలుపు తెరచి ఒక బామ్మ గారు బయటకు వచ్చి అటూ యిటూ చూస్తున్నారు . చెట్టు క్రింద వున్న నారయ్య కనపడ్డాడు .
" యిలా రావయ్యా " అంటూ చెయ్యి వూపుతూ రమ్మని పిలిచారు .నారయ్య వచ్చాడు . బామ్మ వాడి బట్టల కంపు కి కొంగు అడ్డం పెట్టుకుంటూ ఏం యెందుకు నిలబడ్డావు ?"అని ప్రశ్నించారు .
"అమ్మగారూ , కొద్దిగా అన్నం పెడతారా ? ఆకలేస్తున్నది " అడిగాడు నారయ్య దినంగా .
" సరే అన్నం పెడతాను ,డబ్బులూ యిస్తాను కానీ ఒక పని చేసిపెట్టాలి " అన్నారు బామ్మ . తలూపాడు నారయ్య . ఆవిడ వాడిని లోపల వంటింట్లోకి తీసికెళ్లారు . అక్కడ భరించరాని కంపు వాసన వస్తున్నది .
" "పైన అటక మీద పిల్లి చచ్చిపోయింది ,యెప్పుడు చచ్చిందో తెలియదు . పొద్దుటినించీ వాసన మొదలయ్యింది . దాన్ని తీసి చెత్తకుండీలో వేస్తె నీకు అన్నం పెట్టి డబ్బులు యిస్తాను ,సరేనా ?" బామ్మ నారయ్యకు అటక చూపిస్తూ అడిగారు . నారయ్యకు ఆ వాసనకు కడుపులో తిప్పినట్టయ్యి వికారం అయ్యింది .
" ఎట్టా చచ్చిందమ్మగారూ ?" ప్రశ్నించాడు .
" ఏముంది ? నాలాగే యీ యిల్లు కూడా శిథిలావస్థలో లో వుంది . కొన్నిచోట్ల కరెంటు తీగలు అవీ పాడయ్యాయి . ఎలుక కోసం పరుగెత్తుతూ అటక యెక్కేటప్పుడు కరెంట్ తీగ ముట్టుకుందో యేమో లేదా అటకమీద యేదైనా బరువు తల మీద పడిందో ? తెలియదు . మొన్న మద్యాహ్నం అటకెక్కడం చూసాను . మళ్ళి దిగడం చూడడం లేదు . నీకు పుణ్యం వుంటుంది ,నాయనా ,దాన్ని అవతల పారెయ్యి " అన్నారు బామ్మ
.
ఒప్పుకున్నాడు నారయ్య . బామ్మ పెద్ద బల్ల తెచ్చి వేసింది . ఒక గోనెసంచీ , పరచిరి యిచ్చింది . నారయ్య అటకెక్కి ముక్కుమూసుకుంటూ చచ్చిన పిల్లిని చీరెలో మూట కట్టి గోనెసంచిలో వేసుకుని క్రిందికి దిగాడు .
"త్వరగా వచ్చెయ్యి ,యింతలోపల వంటిల్లు శుభ్రం గా కడుగుతాను . నా కూతురు వచ్చేవేళయ్యింది " అన్నారు బామ్మ .
నారయ్య గోనెసంచి యీడ్చుకుంటూ వీధిలో నడుస్తున్నాడు . చచ్చిన కుళ్లిన పిల్లి శవం వాసనకు అందరూ నారయ్యకు దూరంగా జరుగుతున్నారు . చెత్తకుండీలోకి విసరబోయాడు . అంతే అక్కడ జనాలు పెద్దగా అరిచారు . " ఒరేయి మేం వుండాలా ,వద్దా ? యిక్కడ పడెయ్యడానికి వీల్లేదు " నారయ్యను అడ్డగించారు . నారయ్యకు ప్రతిచోటా యిదే చేదు అనుభవం యెదురయ్యింది . ఒకప్రక్క ఆకలి ,యింకోప్రక్క చీకటి బాగా పడింది . చివరికి తిరిగీ తిరిగీ వూరి అవతల పారేసి వచ్చాడు . అప్పటికే కాళ్లు వణుకుతున్నాయి . దాహం వేస్తున్నది . మొత్తానికి ఓపిక తెచ్చుకుని బామ్మ యింటిముందున్న చెట్టుక్రింద చతికిల పడ్డాడు . తలుపు కొట్టే ఓపిక కూడా లేదు
' బ్రతుకంతా తపనా ,తాపత్రయం యీ పొట్టలోని ఆకలి కోసమేగా ,,' అనుకున్నాడు నారయ్య .
నెమ్మదిగా లేచి తలుపు కొట్టాడు . " ఎవరూ "అంటూ ఆడగొంతు వినిపించింది . కానీ నారయ్యకు బామ్మా గొంతు లా అనిపించలేదు .
"నేనమ్మా "నీరసంగా ,సన్నగా గొణిగాడు నారయ్య .
"నేనమ్మా అంటే " విసుక్కుంటున్న ఆడగొంతు .
"నేనమ్మా సాయంకాలం బామ్మ గారు చచ్చిన పిల్లిని పడేస్తే అన్నం పెడతానన్నారు . ఆ మనిషినమ్మా , అన్నం పెట్టండమ్మా " నారయ్యకు నీరసం తో మాట రావడం లేదు .
"వేళాపాళా లేదా ! పొద్దున్నే కనపడు "అంటూ కసురుకుంటున్న ఆడగొంతు .
"అమ్మా అమ్మా అమ్మా "ఆక్రోశం తో ఓపిక తెచ్చుకుని అరిచాడు .
సమాధానం లేదు .
"అమ్మా అమ్మా " ఆయాసం వస్తున్నది నారయ్యకు . నిశ్శబ్దం సమాధానం అయ్యింది .
నీరసం గా చెట్టుక్రింద కనీసం తాగేనీళ్లు కూడా దొరకలేదు అనుకుంటూ చతికిల పడ్డాడు . చల్లగాలి తగులుతుంటే ఆకలి అతన్ని అనేక అనేక విధాలుగా ఆలోచింప చేసింది .
'వీళ్లకు ఆకలి బాధ తెలియదా ? తనేం ముష్టి అడగలేదే ?చెప్పిన పని చేస్తే అమ్మగారు అన్నం పెడతానన్నారు ,తను వాళ్లు చెప్పిన పని కాళ్ళరిగేలాగా తిరిగి మరీ చేసాడు . మరి అన్నమాట ప్రకారం అన్నం పెట్టాలిగా ! వాళ్లు అన్నం తిని సుఖం గా నిద్రపోతున్న్నారు . ఎదుటివాడి ఆకలంటే చులకన !తను పిల్లిని పడెయ్యకపోతే వీళ్లు యింత హాయిగా నిద్రపోగలరా ? కొంచెం కూడా జాలి లేదు తననెంత మోసం చేసారు ' అనుకుంటూ వాలిపోయాడు నారయ్య . చల్లగాలిలో ప్రాణవాయువు కలిసిపోయింది . కంపులూ ,కుళ్లు లేని విధులలో పయనం సాగిపోయింది .
.తెల్లవారింది . ఆ యింటి తలుపులు తెరుచుకున్నాయి . బామ్మగారి కూతురు వాకిలి చిమ్మడానికి బయటకు వచ్చింది . చెట్టు దగ్గర కుక్కలు తిరుగుతున్నాయి . ఆ చెట్టు వాళ్ల ఆవరణలోనే వుంది . .
"అమ్మా అమ్మా "అంటూ బామ్మగారిని పిలిచింది . బామ్మగారు గుర్తుపట్టారు నారయ్య శవాన్ని .
" వీడే నిన్న అటకమీది చచ్చినపిల్లిని పారేసింది . రాత్రివచ్చినట్టున్నాడు . పాపం ఆకలికి తట్టుకోలేక ప్రాణం పోయినట్టుంది . " బామ్మగారు బాధపడ్డారు . కూతురు తప్పుచేసినదానిలాగా బాధ పడింది . రాత్రి సంగతి బామ్మకు చెప్పలేదు .
ఇప్పుడు బామ్మ నారయ్యను యెవరు తీస్తారా అని యెదురుచూస్తున్నది . గుప్పెడన్నం పెట్టలేని బామ్మగారు యిప్పుడు నారయ్య శవాన్ని యెవరైనా తీసేదాకా యింట్లో వంట చెయ్యలేని పరిస్థితి !మనం చేసే ప్రతి పనీ పరమాత్మ గమనిస్తూనే వుంటాడు !1
.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి