మరణ శయ్య - కందర్ప మూర్తి

Marana sayya

సాయంకాలమైంది. అగ్రహారంలో డాక్టర్ సాగర్ క్లినిక్ పేషంట్లతో సందడిగా ఉంది. ఆయన హస్తవాసి మంచిదని , ఓపిగ్గా పేషెంట్ల బాధలు వింటారనీ ప్రజల నమ్మకం. ఊరి పురోహితులు విశ్వనాథ శాస్త్రి గార్కి ఛాతీలో మంట , రాత్రి నిద్రలో గురక ఎక్కువ పెడు తున్నారనీ వారి అబ్బాయి మాధవ్ బలవంతాన డాక్టర్ సాగర్ గారి హాస్పిటల్ కి తీసుకు వచ్చాడు. శాస్త్రి గారు సనాతన వ్యవహార శైలి మడీ ఆచారం పాటించే వ్యక్తి. పరమ ఛాందస్తుడు. కోపమెక్కువ. ఊబ కాయంతో ఎంత శరీర రుగ్మత కలిగినా ఊరి ఆచారి గారి ఆయుర్వేద వైద్యమే కావాలంటారు. కొడుకు పోరు పడలేక ఆలోపతి వైధ్యుడి దగ్గర కొచ్చారు. విశ్వనాథ శాస్త్రి గార్ని ఎగ్జామిన్ చేసిన డాక్టర్ సాగర్ " శాస్త్రి గారూ, మీ వయస్సు అరవై సంవత్సరాలు దాటిందంటున్నారు. మీ వయస్సును మించిన బరువున్నారు.ఆరోగ్య విషయంలో అశ్రద్ద కారణంగా మీకు హై బ్లడ్ ప్రెషర్ , హై షుగర్ లెవెల్సు , కడుపులో అల్సర్ ఉన్నట్టుగానూ, హార్ట్ సమస్య కూడా ఉన్నట్టు లేబ్ రిపోర్టులు , ఎండోస్కీపీ ఇ.సి.జీ. రిపోర్టుల వల్ల తెలుస్తోంది. ఇకనుంచి మీరు కొవ్వు పదార్దాలు ముద్దపప్పు నెయ్యి, తీపి , ఉప్పు, వేపుడు పదార్దాలు వదిలెయ్యాలి. మీ బొజ్జ తగ్గాలంటే రోజూ ఉదయం సాయంకాలం వాకింగు చేస్తూ నేను ప్రిస్క్రిప్సన్లో రాసిన మందులు రెగ్యులర్ గా వాడాలి" డాక్టర్ గారు చెప్పుకు పోతున్నారు. " ఆగండి, డాక్టర్ ! అందరి కళ్లూ నా బొజ్జ మీదే ఉంటాయి. నా వృత్తిలో మీరు నిషేదించిన భోజన పదార్దాలు తినకపోతే తద్ధినాల ఫలితమే ఉండదు. పితృదేవతలు తృప్తి పడాలంటే మస్తుగా పురిషిళ్లతో నెయ్యి పప్పు పరమాన్నం గారెలు పచ్చళ్లతో తినక తప్పదు. అలా సుష్టుగా తిన్నప్పుడే నాతోపాటు తద్ధినం పెట్టిన వారికీ మనసు శాంతిస్తుంది. కాశీ వెళ్లినప్పుడు అరటిపండు వదిలేసినట్టు నా బ్రాహ్మణ వృత్తిలో ముఖ్యమైన భోజన పదార్దాల్ని నిషేదించడం భావ్యం కాదు. షడ్రుచు లతో భోజనం చేసే నన్ను మీరిచ్చే ట్యబ్లెట్లు క్యాప్సుల్సు మింగి కడుపు కట్టుకోవాలంటే ఎలా చెప్పండి. ఏదైనా మరో మార్గం చూడండి ‌" డాక్టరు గార్ని ప్రాధేయ పడుతున్నారు పురోహితులు విశ్వనాథ శాస్త్రి. " శాస్త్రి గారూ, మీ ఇష్టం! ప్రస్తుత మీ శరీర ఆరోగ్య పరిస్థిని బట్టి మాకొచ్చిన పరీక్ష రిపోర్టులను చూసి మీకు సూచిస్తున్నాను " అన్నారు డాక్టర్ సాగర్. వెంట వచ్చిన విశ్వనాథం గారి అబ్బాయి మాధవ్ కి తండ్రి ఆరోగ్య విషయం వివరంగా నచ్చ చెప్పారు డాక్టరు. " నా ప్రాణం పోయినా పరవాలేదు. తద్ధిన భోజనం వదిలి ఆ గొట్టం మందులు మింగలేనురా మాధవా ! " ఖరాకండిగా చెప్పారు పంతులు గారు. " మీ ఆరోగ్యం నయం కావాలంటే డాక్టరు గారు చెప్పినట్టు మీరు తద్ధినాలు వదలక తప్పదు." కొడుకు నచ్చచెబుతున్నాడు. కొద్ది సేపటి తర్వాత ‌" అవునూ , నాకు తెలియక అడుగుతున్నాను. ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ ఐతే నేను ఇంటి దగ్గర పడుకునే పట్టెడ మంచం వెంట తీసుకెళ్ల వచ్చా ? " అమాయకంగా అడిగారు శాస్త్రి గారు. " అలా కుదరదు. హాస్పిటల్ మంచం మీదే పడుకోవాలి." చెప్పాడు మాధవ్. " హాస్పిటల్ మంచాల మీద ఎంత మందో చచ్చి శవాలుగా వెళ్లి ఉంటారు. అదీగాక ఏ జాతి ఏ మతం వాళ్లు పడుకుని ఉంటారో అటువంటి చోట నాలాంటి గాయత్రి చదివే నిస్టాతురుడు ఎలా పడుకోవాలి చెప్పు" తన అశక్తతని తెలియ చెప్పారు పంతులు గారు. హాస్పిటల్ నుంచి కొడుకు వెంట ఇంటి కొచ్చారు విశ్వనాథం గారు. " చూసావురా, ఈ పందిరి మంచాన్ని. తరతరాల్నుంచి వస్తోంది.మా తాతల నుంచి నాకూ, నా తదనంతరం నీకూ చెందుతుంది. మీ అమ్మ గతించి నప్పటి నుంచి దీని మీద పడుకోవాలంటే మనస్కరిండం లేదు. ఎందుకో ఇవాళ దీని మీద పడుకోవాలనుంది." అన్నారు. రాత్రి భోజనాలైనాక ఎవరి గదుల్లో వారు నిద్రకు ఉపక్రమించారు. తెల్లారి ఉదయం నాలుగు గంటలైంది. మామూలుగా ఐతే ఆ సమయానికి శాస్త్రి గారు కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి మడిగా గాయత్రి చేసి పూజా కార్యక్రమాల్లో ఉండేవారు. కోడలు కాత్యాయని మామ గారు నిద్ర లేవకపోవడంతో గదిలో కొచ్చి వరస పెట్టి పిల్చింది. జవాబు లేదు. గాబరాగా పూజా మందిరంలో ఉన్న మాధవ్ ని పిల్చుకొచ్చింది. ఆందోళనగా తండ్రి గదిలో కొచ్చి పందిరి మంచం మీద అచేతనంగా పడిఉన్న తండ్రిని తట్టి లేపాడు. కదలిక లేదు. గాబరాగా పక్కింట్లో ఉన్న మేనమామని పిలిచి చూపించాడు. అప్పటికే తెల్లారింది. వెలుగు వచ్చింది. ఈ వార్త బ్రాహ్మణ వీధిలో గుప్పుమంది. ఒక్కొక్కరు వచ్చి శాస్త్రి గార్ని చూసి వెల్తున్నారు. భారీ ఊబకాయంతో పందిరి మంచం మీద చలనం లేక విగతజీవిగా ఉన్న శాస్త్రి గార్ని పరీక్షించిన డాక్టర్ సాగర్ "కార్డియాక్ ఫెయిల్యూరై నో మోర్ " అని డిక్లేర్ చేసారు. మొత్తం మీద శాస్త్రి గారు తను కోరుకున్న పందిరి మంచం మీద ప్రాణాలు వదిలి తన మనోవాంఛ.తీర్చుకున్నారు. * * *

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి