అమ్మ దీవెనలు - B.Rajyalakshmi

Amma deevenalu

అమ్మ ఫోటో చూస్తుంటే దుర్గకు యెన్నో యెన్నో మరపురాని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి . మనసు బాల్యంలోకి పరుగెత్తుతున్నది , వర్తమానం లోకి వస్తున్నది . ప్రతిరోజూ ఒక కృతి అమ్మ ఫోటో ముందు కూర్చుని పాడటం దుర్గ కు అలవాటు ఈ రోజెందుకో దుర్గకు బాల్యం గుర్తుకొస్తుంది . ఇప్పుడు తన వయస్సు యిరవైదు సంవత్సరాలు . సంగీత కళాశాలలో అధ్యాపకురాలు . పేరు ,ఖ్యాతి పొందింది . గుర్తింపు పొందింది . ప్రోత్సాహమిచ్చిన అమ్మ తన అభివృద్ధిని చూడకుండానే వెళ్లిపోయింది . అక్కయ్యా ,అన్నయ్యా అప్పుడప్పుడూ హేళన చేస్తుంటే అమ్మ వాళ్లను కసిరేది . నాన్నగారు గంభీరం గా వుండేవారు. . ఆయన దగ్గర భయం తప్ప చనువు లేదు .
బళ్లో కూడా అందరూ చులకనగా చూసి నవ్వేవాళ్లు . ఇప్పటికి గుర్తుంది ,ఒకరోజు తను యేడుస్తూ యింటికి వచ్చింది .
" దుర్గ తల్లీ ,యేమైందమ్మా " అమ్మ తన తల నిమురుతూ ,కళ్లు తుడుస్తూ అడిగింది .
"అమ్మా అందరూ పొట్టిపిల్లా పొట్టిపిల్లా అంటూ చిన్న బొమ్మ గౌను నా బెంచీ మీద పెట్టి చప్పట్లు కొట్టారమ్మా ," పెద్దగా యేడ్చేసింది . "నువ్వు బంగారు తల్లివి ! రేపు నేను వచ్చి మీ టీచరుగారితో మాట్లాడుతాను నువ్వు పొట్టి కాదమ్మా ,దేవుడు నీకు మంచి తియ్యని గొంతు యిచ్చాడు ,వాళ్లకు యివ్వలేదమ్మా అందుకే ఆలా అంటారు . " అంటూ అమ్మ సున్నితంగా తనల్ని ఓదార్చింది అంతేకాదు మర్నాడు బడికి వచ్చి టీచర్లతో మాట్లాడి మళ్లీ యెవ్వరూ వెక్కిరించకుండా కట్టుదిట్టం చేసింది . అప్పుడు తనకు పదేళ్లు .
దేవుడు యెందుకు పొట్టిదానిగా పుట్టించాడు !అక్కయ్యా మంచి పొడుగూ ,అన్నయ్యా మంచి పొడుగూ దుర్గ మూడున్నర అడుగులు పొడుగు . మొదట్లో అంత అనిపించేది కాదు . ఒకసారి నాన్నగారు షెల్ఫ్ పై వరుసలో వున్న పుస్తకం తెమ్మన్నారు . తను తెద్దామని పరుగెత్తితే అక్కయ్య నవ్వింది ,అన్నయ్య నవ్వాడు .
"దుర్గా నీకు అందదు ,నువ్వు యెత్తు తక్కువ " అన్నారు నాన్న . ఆలా రెండు మూడు అనుభవాల తర్వాత దుర్గకు తను మరుగుజ్జు అని అర్ధం అయ్యింది .
ఒకసారి భోజనాల సమయం లో నాన్నగారు " లీలా యేమిటి విశేషం ? పులిహోర చేసావు !"నవ్వుతూ అడిగారు . అమ్మ జవాబు చెప్పకుండా నవ్వింది . అక్కయ్యా ,అన్నయ్యా ,దుర్గా ఆలోచిస్తున్నారు .
నాన్నగారు నవ్వుతూ "పుట్టినరోజు కదూ ,పిల్లలూ సాయంకాలం అమ్మకు సరదాగా జరుపుదాం .సరేనా "అన్నారు . దుర్గ తలూపింది . "నాన్నా మల్లెపూలు కోసి అమ్మకు పెద్దపూలదండ యిస్తాను "అన్నది .

నాన్న నవ్వి "నీకు అందదు ,అక్కయ్య పొడుగు కదా ! నువ్వు యెత్తు లేవమ్మా "అన్నారు . దుర్గ గదిలోకి వెళ్లి యేడుస్తూ పడుకుంది ..సాయంకాలం దుర్గ నిద్ర లేచి వచ్చేసరికి హాలంతా సందడి సందడిగా వుంది అమ్మ దుర్గను దగ్గరగా పిలిచి తల నిమిరింది .
" దుర్గా మొహం కడుక్కుని మంచంమీద కొత్త గౌను వుంది ,వేసుకుని రా ,తలదువ్వి జడలేస్తాను "అన్నది అమ్మ . దుర్గ తయారయ్యింది . అన్నయ్య అమ్మకు మిఠాయి డబ్బా తెచ్చాడు . అక్కయ్య యింట్లోని మల్లెమొగ్గలతో అమ్మకోసం పెద్ద మల్లెపూల అల్లింది . నాన్న అమ్మకు చీరె ,జాకెట్ తెచ్చారు . అందరూ యేదో ఒక బహుమానం యిచ్చారు . తనే ఏదీ ఇవ్వలేదని దుర్గకు బాధేసింది . సరదాగా హాయిగా జరిగిపోయింది .
. .
దుర్గ గదిలోకి వెళ్లిపోయింది . అమ్మ గ్రహించింది . వెంటనే అమ్మ దుర్గను వొళ్లోకి తీసుకుని తల నిమిరింది . అంతే దుర్గ అమ్మ వొళ్ళో తల దాచుకుని వెక్కివెక్కి యేడ్చింది .
"ఎందుకు తల్లీ " అమ్మ పిలుపుకు దుర్గ కరిగింది .
"అమ్మా నీకోసం యేదైనా చెయ్యాలనుకుంటాను ,కానీ అన్నయ్యా ,అక్కయ్యా యిచ్చేస్తారమ్మా పైగా నన్ను పోట్టి పొట్టీ అంటూ నేనేం చెయ్యలేనంటూ వెక్కిరిస్తూ నవ్వుతారమ్మా "యేడుస్తూనే చెప్పింది దుర్గ .
"బంగారు తల్లీ నువ్వు మన యింటి వెలుగు . చక్కగా చదువుకుని పేరు తెచ్చుకో ! నీ గొంతు బాగుంటుంది . సంగీతం నేర్పిస్తాము . పోట్టి ,పొడుగూ ముఖ్యం కాదు . నువ్వు సంగీతం లో పేరు తెచ్చుకుంటే నిన్ను హేళన చేసినవాళ్లే నిన్ను చూసి సిగ్గు పడతారు ఎవరి వెక్కిరింపులూ పట్టించుకోకు " అమ్మ ధైర్యం చెప్పింది .
.దుర్గ నెమ్మదిగా విమర్శలను పట్టించుకోవడం మానేసింది . చదువులో గుర్తింపు తెచ్చుకుంది . వయసు పెరుగుతున్నకొద్దీ సంగీతం లో కృతులు ,కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం పొందింది . దేవీ నవరాత్రులలో ,గణపతి నవరాత్రులలో గుళ్లల్లో కచేరీలు చేసేది .క్రమంగా కాలేజీ చదువుకొచ్చింది . మూడున్నర అడుగుల దుర్గ అందరూ నవ్వుతారని కాలేజీలో చేరనంది . కానీ మళ్లీ వెన్నుతట్టి ధైర్యం చెప్పి కాలేజీలో చేర్పించింది . సంగీతం లో సర్టిఫికేటు వచ్చింది .
-- --------------------------------------------------------------------------------------------------------------------------- అన్నయ్య ,అక్కయ్యలు పెళ్లయిపోయింది . అన్నయ్యకు వుద్యోగం ఢిల్లీ లో వచ్చింది . ఇంకా చేరలేదు . దుర్గ సంగీతకళాశాలకు అప్లై చేసింది .
ఆ రోజు దుర్గకు చేదు రోజు . అమ్మపుట్టినరోజు . కాలేజీనించి వస్తూ వస్తూ అమ్మకు చీరె తెచ్చి అందరినీ ఆశ్చర్యం పరచాలనుకుని దుర్గ ముందుగా యెవ్వరికీ చెప్పలేదు . సాయంత్రం చీరె కవరుతో సంతోషంగా యింటికొచ్చింది . ఇంటి నిండా జనం ! దుర్గకు ఒక్కక్షణం ఝల్లుమంది . అందరినీ తోసుకుంటూ గబగబా లోపలికి వెళ్లింది .
చాపమీద అమ్మ నిశ్చలంగా పడుకుంది . తలదగ్గర దీపం వేలుతుర్లో అమ్మ మెరుస్తున్నది . దుర్గకు నమ్మకం కలగటం లేదు . అంతా కలగా వుంది . అమ్మ పక్కన నాన్నా ,అన్నయ్యా కూర్చున్నారు . అందరి కళ్లల్లో నీళ్లు

దుర్గ అమ్మ దగ్గరకు వచ్చి కొత్తచీరె వెక్కివెక్కి యేడ్చేసింది . చిన్నప్పటినించీ అమ్మకు పుట్టినరోజున కొనివ్వాలన్న తన కోరిక యిలా జరగడం జీర్ణించుకోలేకపోయింది .
-----------------------------------------------------------------------------------------------------------------------------గతమంతా గుర్తుకొచ్చింది యీరోజు . మొదటి జీతం అమ్మ ఫోటో ముందు పెట్టి కన్నీళ్లతో చేతులు జోడించింది .

అమ్మ నవ్వుతూ 'బంగారు తల్లీ ' అంటూ పలకరించినట్టుగా అనిపించింది దుర్గకు .

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల