తప్పు చేస్తే.. - రంగనాధ్ సుదర్శనం

if done mistake...

స్నానం చేస్తూ నా ఒంటిని చూసుకున్నాను, నల్లగా కమిలిన వాతలు, నా తెల్లని శరీరంపై స్పష్టఒగా కనిపిస్తున్నాయి. పాత వాతలు కాస్త మాసినట్లు కనిపించినా..కొత్తవి సలుపుతూ ఎర్రగా కనిపించాయి.
ఒంటి మీద వేడి నీళ్లు పడగానే దెబ్బలకు కారం పూసినట్లు  భగ్గుమన్నాయి...నొప్పికి అప్రయత్నంగా కళ్ళుల్లో నీళ్లు చిప్పిల్లాయి.
ఎందుకు బ్రతుకుతున్నానో తెలియని నాకు, భగవంతుడు నన్ను ఇన్ని బాధలు భరించడానికే పుట్టించాడేమో అనిపిఒచింది.....
కానీ నా స్వయంకృతాపరాధానికి భగవంతుణ్ణి నిందించడం ఎందుకు... 
నా జీవితంలో నేనే నిప్పులు పోసుకున్నాను, నాకీ శిక్ష సరైనదే అనిపించింది.
కానీ..నాకిక  ఈ బాధలు భరించే ఓపిక లేదు,
ఇలా బ్రతకడం కన్నా చావడమే మేలనిపించింది.
అందుకే ఇక చావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.
కానీ చావడానికి కూడా ధైర్యం చాలడం లేదు....
అందుకే ఎన్నోసార్లు చావాలనుకున్నా..చావలేక బ్రతికి చస్తున్నాను...
కానీ ఈ రోజు అన్నిరోజుల్లా కాదు, ఎలాగైనా ఖచ్చితంగా చావాల్సిందే, ఇక ఆగటం ఆలోచించడం అనవసరం అనిపించింది.
స్నానం చేసి ఇంట్లొకొచ్చి మురికి పట్టిన గుడ్డి అద్ధం ముందు నిలబడి నన్ను నేను పరిశీలనగా చూసుకున్నాను.
పసిమి ఛాయ లాంటి నా శరీరం... మునుపటి రంగు వెలిసి...నిర్జీవంగా కనిపిస్తుంది.
వంటి నిండా..బొంతకు వేసిన అతుకుల్లా గాయాల మరకలు విస్తరించి నా శరీరం నాకే కొత్తగా కనిపిస్తుంది.
మునుపటి మెరుపు స్థానంలో...శరీరం వార్ధాక్యపు ఛాయాలతో... నీరసంగా..నిర్జీవంగా కనిపిస్తుంది.
అందం శరీరానికి సంబంధిఒచిందే అయినా మానసిక పరిస్థితి దాన్ని ప్రభావితం చేస్తుంది...మనో వేదన వలన  కళ్ళకింద వచ్చిన నల్లని వలయాలు...ముఖాన్నీ కప్పివేసాయి..
అలసటతో... ఆలోచనలతో..ముడతలతో... బుగ్గలు లోనికి వెళ్లి...ముఖంలో ప్రేతకళ తాండవిస్తుంది.
మెడ పక్కనవున్న మాసిన గాయం నన్ను వెక్కిరించింది. 
నుదుటిపై తగిలిన గాయం తాలూకా మరక నా వైపు అసహ్యంగా  చూసింది.
అవును బంగారం లాంటి జీవితం
నా అందాన్ని చూసి కాణి కట్నం ఆశించకుండా పెళ్లి చేసుకొని కంటి పాపలా చూసుకుంటున్న భర్త..
బంగారం లాంటి బిడ్డలు.
ఒంటి నిండా  నగలు, బీరువాల నిండా చీరలు..
నా అదృష్టాన్ని చూసి అందరూ ఈర్ష్య పడేవారు... దానికి తోడు..ఇద్దరు పిల్లలు కలిగినా చెక్కు చెదరని నా అందం, అంగ సౌష్టవం చూసి  అంతా....
సంతూర్ సుందరీ  అనేవాళ్ళు...
అదే నా గర్వానికి.. నా పతనానికి కారణం అయ్యింది.
ఏం మత్తు ఆవరించిందో..ఏ పోయే కాలం దాపురించిందో  కానీ...ఈ మొదనష్టపోని మీద మనసు పారేసుకున్నాను.
పారేసుకున్న మనసు...ముళ్ళ చెట్టుపై అరేసిన గుడ్డలాంటిది...వేసినంత తేలిక కాదు వెలికి తీయటం.
వాడికి కూడా నాలాగే పెళ్లయిందని పిల్లలున్నారని తెలుసు...చిన్న వాచ్ రిపేరింగ్ షాప్...రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం వాడిదని తెలుసు....
కానీ ఏ బలహీన క్షణమో.. శారీరక అవసరమనే బలుపో.. కానీ నా కొంప ముంచాయి.
అసలు తప్పంతా నాదే... వాడికి నాతో మాట్లాడే అవకాశం ఇచ్చిన చనువు వల్ల వాడు ప్రయోగించిన మాటల మంత్రాలు... నన్ను వాడి మత్తులో ముంచేసాయి.
వాడు తెలివైన మాటల మంత్రాలతో.. నన్ను నిలువునా ముంచాడు..అందులో నా తప్పు లేకపోలేదు నేను మునిగితేనేగా.. వాడు ముంచింది. వాణ్ణని ఏం లాభం..నన్ను నేను పాత చెప్పుతో కొట్టుకోవాలి.
అబ్బా ఎన్నిమాటలు చెప్పేవాడు..
ఎలా బురిడీ కొట్టించేవాడు......
స్వర్గం అంటే ఈ జన్మే నని..
మరో జన్మ ఉందో లేదో తెలియదని..
కోరికలు తీర్చుకుంటే తప్పులేదని...
అసలు మనిషిగా పుట్టిందే కోరికలు తీర్చు కోవడానికని..
ఫారిన్ లో నచ్చినంత కాలం నచ్చిన వారితోనే  కలిసి వుంటారని..నచ్చని మరుక్షణం ఎవరి దారి వారు చూసుకుంటారని..
అన్ని చంపుకొని వందేళ్లు బ్రతకడం కన్నా అన్ని అనుభవించి త్వరగా చస్తే  నష్టం ఏమిటని...
ఆకలి, నిద్ర , మైదునం.. ఇవన్నీ బయలాజికల్ నీడ్స్ అని...
జంతువులు కూడా వీటిని ఆపుకోలేవని...
కానీ అన్ని తెలిసిన  మనిషి ఎందుకు తన కోరికలను  చంపుకుంటున్నాడో అర్ధం కావట్లేదని......
దేవుళ్లు  చేస్తే అంటని పాపం  మనను అంటుతుందా...అని..మాటలతో మెస్మ రైజ్ చేసేవాడు.

అసలు పాపం ఏంటంటే ... కోరికలు తీర్చకోకుండా వాటిని చఒపుకోవడమేనని.... 
ఇలా....
వాడు  మెట్ట వేదాంతం చెప్పి,...లాజిక్కులు మాట్లాడి ...తెలివిగా నన్ను లొంగదీసుకున్నాడు.
కానీ వాడిది ప్రేమ కాదని...డబ్బుల ఆశేనని,..నా డబ్బు బంగారం కరుగుతున్నకొద్ది ..నా పై పడే దెబ్బలు నాకు అర్ధం అయ్యేలా చేశాయి. 
సుఖాలు సంతోషాలు మాత్రమే ఉన్న ఇంట్లో..ఆనందాలు..ఆప్యాయతలు విరబూసే లోగిలిలో...నా భర్త మహారాజు కాకున్నా..నన్ను మహారాణి ని చేసి 
కాలు కఒదకుండా ...చూసుకునేవాడు..
మా షాప్ కు ఎదురుగా రఘు వాచ్ రేపేరింగ్ షాప్ ఉండేది...
నేను అప్పుడప్పుడు క్యాష్ కౌంటర్ లో కూర్చునే దానిని....
రఘు ఎదో వొంకతో షాపకు వచ్చి మాటలు కలిపేవాడు..అలా మొదలైన పరిచయం..మెల్లగా ఫోన్లు..మెసేజ్ లు...వాట్సాప్ చాటింగులు,..ఊపిరాడకుండా చేసే వాడి పొగడ్తలకు ...మెల్లగా ఎట్రాక్ట్ అయి ఎడిక్ట్ అయ్యాను.
తప్పొప్పులు...జీవిత సత్యాలు వాడి ఆకర్షణ  ముందు వెల వెల బోయాయి.
అసలు నీలాంటి..అందగత్తె ఈ భూమి మీద పుట్టడం ఈ నేల చేసుకున్న అదృష్టం...
అసలు ముందే నిన్ను చూసివుంటే...నా ప్రాణాలిచ్చయినా సరే..నిన్ను పెళ్లి చేసుకునేవాడిని...ఇలాంటి మాటలు...నన్ను గాలిలో.. తేలేలా... చేసేవి.
అలా వాడి మత్తులో పడి చేయకూడని తప్పు చేశాను...అంతటితో ఆగకుండా...అన్నీ మరచి వాడి మోసాన్ని గుర్తించలేక వాడికోసం గడప దాటాను.
కొన్ని రోజులు బాగానే ఉన్నా...నా దగ్గరున్న డబ్బు, నగలు  వాడి వ్యసనాలకు హారతి కర్పూరంలా కరిగి పోయాయి..
దానితో నాపై  మోజు తీరి,.. అసహ్యం పెరిగింది,..
తిట్లు..దెబ్బలుగా మారాయి..
నేను భారమయ్యాను...
మహారాణిలా బ్రతికిన నేను పనిమనిషినయ్యాను..
నాలుగిండ్లలో పాచి పని చేసే పరిస్థితికి దిగ జారాను.
దానికి తోడు...వాడికి వ్యసనాల కారణంగా..ఆరోగ్యం దెబ్బతింది...
నా మీద అనుమానం పెరిగింది..
చీటికీ మాటికి అనుమానించడం..
ఆ వంకతో ఇష్టం  వచ్చినట్లు కొట్టడం..చేసేవాడు.
నేను అలాంటి దానిని కానని అన్నప్పుడు..అంత  ప్రతివతవైతే... మొదటి మొగుడిని వదిలేదానివా..నీ సంగతి నాకు తెలియదా అని మళ్ళీ..మళ్ళీ..
కాళ్లు.. చేతులు..దొరికిన కర్ర.. రాయి అన్నింటినీ ఆయుధాలుగా చేసి విచక్షణా రహితంగా కొట్టేవాడు..
నేను కాదని అన్నప్పుడల్లా..నా తప్పు నన్ను నిలువునా దహించి వేసేది. నా అంతరాత్మ నన్ను...వేలెత్తి చూపేది.
అప్పుడు..బీరువాల నిండా ఉన్న చీరలతో ఏది కట్టుకోవాలో.. తోచేది కాడు..
కానీ ఇప్పుడు....
వొంటి మీద బట్ట..ఉతకడానికో..బట్ట..మెడలో నల్లగా జిడ్డు పట్టిన ఉరి తాడుకు మల్లే  వేలాడే  పసుపుతాడు...దానికి వేలాడే రోల్డ్ గోల్డ్.. సూత్రాలు...చెవులకు దిద్దిలకు బదులు దర్శనమిచ్చే.. వేప పుల్లలు.
ఛీ.. ఛీ.. నా బ్రతుకు నాకే రోతగా అనిపించింది.
అందుకే...ఏ అందాన్ని చూసి గర్వపడ్డానో...
ఏ అందం..నాచే  తప్పు చేయించడానికి కారణం అయ్యిందో...
అదంటే నాకు అసహ్యం అనిపించింది..
నేను చేసిన పని నాకే జగుప్సాకరంగా.. అనిపించింది..పశ్చ త్తాపం నన్ను నిలువునా దహించి వేస్తుంది.
అందుకే....నాకు నేనే శిక్ష  వేసుకోవాలనుకున్నాను....
అది..నా పొగరును అందాన్నీ...దహించి వేసేలా ఉండాలని...
డబ్బాలో ఉన్న కిరోసిన్..పూర్తిగా..తలపై నుండి ధారగా పోసుకున్నాను.
చాలా తృప్తిగా..సంతోషంగా అనిపించింది
మరికొద్ది సేపట్లో...నా శరీరం పూర్తిగా కాలిపోతుంది..అందరూ నన్ను అసహ్యించుకుంటారు...నాకు కావాల్సింది కూడా అదే...
ఆ బాధలోను నాకు చాలా సంతోషం అనిపించింది.
అగ్గిపుల్ల...వెలిగించాను..
భగ్గున అంటుకుంది..
కెవ్వుమని కేక వేసి మేలుకున్నాను..
నా  పక్కనే పడుకొని ఉన్న..నా భర్త..పిల్లలు ఉలిక్కిపడి దిగ్గున మేల్కొన్నారు.
నా ఒళ్లంతా చమటలతో.. తడిసిపోయింది.
నా భర్త.. పిల్లలు నన్ను అల్లుక పోయి పట్టుకొని..ఏంటి..ఏంటి అని అడుగుతున్నారు.
పీడకల అని చెప్పి..లేచి వెళ్లి మంచినీళ్లు తాగి..ఎదురుగా కనపడే అమ్మవారి పఠం వైపు చూసి... భక్తితో నమస్కరించుకున్నాను.
రఘు గురించి మెల్లగా..నాలో మొదలైన  సంఘర్షణ..చెడు భావనల తలంపులు... 
ఒక వైపైతే....
మరోవైపు..
మా అమ్మ నాన్న  నేర్పిన సంస్కారం ....నా విచక్షణ జ్ఞానం..నా మానసిక ధృఢత్వం...నన్ను హెచ్చరిస్తూ... నన్ను చెడు వైపు జారకుండా రక్షించాయి.
ఈ రెండు సంఘర్షణల... అంతర్మధనమే నాకు వచ్చిన కల అనుకున్నాను...కానీ అసలు ఆ కల ను ఊహించుకుఒటేనే....నాకు విపరీతమైన  భయం వేస్తోంది..మోసపోతే ఎవరి జీవితమైనా  అంతే కదా అనిపించింది.
తెల్లవారగానే.....తలస్నానం చేసి..అమ్మవారికి దీపం వెలిగించి..కలలో నా  భవిష్యత్ చిత్రాన్ని చూపించి నా కళ్ళు తెరిపించిన  తల్లికి..భక్తితో నమస్కరించాను..
ఇక జీవితంలో..ఏ మగాడితో నైనా.. అవసరం ఉనా లేకున్నా చనువుగా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దనుకున్నాను.
ఎదురుగా నిలబడిన నా భర్త పాదాలకు నమస్కరించి..నా మాంగళ సూత్రాలను కళ్ళకు అద్దుకున్నాను...నా భర్త నా కంటికి మునుపటికన్నా  ఎక్కువ అందంగా కనిపించాడు..బహుశా ఆయన వ్యక్తిత్వపు సౌందర్యాన్ని నేను మరింతగా తెలుసుకోవటమే... దానికి కారణం అయ్యుంటుంది అనిపించింది.
మనసు చాలా ప్రశాంతంగా... అనిపించింది.
ఏ స్త్రీ కైనా....ఆకర్షణలన్నీ.. తాత్కాలికమే, దిగితే కాని లోతు తెలియదన్నట్లు..పడక ముందే..పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. ఏ బంధమైనా తాత్కాలికమే ఒక్క వివాహ బంధం తప్ప.
మనిషిని చెడు ఎప్పుడూ తన వైపు లాగుతూనే ఉంటుంది.
కానీ మనిషి యొక్క  బుద్ధి వికాసం..ఇక్కడే తెలుస్తుంది..తెలివి తక్కువ వాళ్ళు...ఈ పద్మవ్యూహంలో చిక్కి శలబం లా మాడిపోతారు.
వివేకవంతులు... ఇలాంటి ఎన్ని పరీక్షలైనా..తట్టుకొని నిలబడతారు..

మరిన్ని కథలు

asirayya
అసిరయ్య
- భవ్య
robbery
దోపిడి
- పద్మావతి దివాకర్ల
lesson by champions
గుణపాఠం నేర్పిన ఛాంపియన్లు
- సరికొండ శ్రీనివాసరాజు
cow kid
లేగ దూడ
- వినయ్ కుమార్ కొట్టే
valentines day story
ప్రేమికుల రోజు
- కాంతి శేఖర్. శలాక
she like pearl social story
కడిగిన ముత్యం
- లత పాలగుమ్మి
the solution
పరిష్కారమార్గం
- కందర్ప మూర్తి