పట్టాభిషేకానంతరం అయోధ్య నిండా ఆనందోత్సవం, సువాసనలతో నిండిన గాలి....రథాల శబ్దం, పుష్పాల వర్షం…రాజ్యం సర్వత్రా శుభకరంగా వెలిగి కనిపిస్తోంది. ఆ రోజు సాయంత్రం, శ్రీరాముడు తన ముగ్గురు సోదరులతో, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడితో కలిసి, అయోధ్య తోటల్లో నడకకు బయల్దేరాడు. నలుగురు అన్నదమ్ములు ఏళ్ల తరబడి జరిగిన యుద్ధాలు, వలసలు, పరీక్షల తర్వాత ఇప్పుడు శాంతి నిండిన రాజ్యంలో కలిసి అడుగులు వేస్తున్నారు. చెట్ల నీడల్లో నడుస్తూ, పుష్పాల సువాసనను ఆస్వాదిస్తూ, వారు ఒక పాత బావి దగ్గరికి వచ్చారు. భరతుడు బావి లోపల తొంగి చూసి అన్నాడు, “అన్నయ్య, ఈ బావి ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నట్టుంది… ఏదో లోతైన ఉపమానం ఉంటుందనే భావన వస్తోంది.” శ్రీరాముడు చిరునవ్వు చిందించాడు. అతని హృదయంలో ఏదో కథ కదిలింది. “భరతా, నిజమే. ఈ బావి ఒక గొప్ప ఉపమానం. ఇది నాకు ఒక చిన్న జీవి గురించి గుర్తు చేస్తోంది . "ఒక బావిలో నివసించే కప్ప గురించి.” లక్ష్మణుడు, శతృఘ్నుడు ఆసక్తిగా ముందుకు వచ్చారు. “ఎప్పుడో ఒకప్పుడు, ఈ తరహా బావిలో ఒక కప్ప పుట్టి పెరిగింది. ఆ బావి నీరు, గోడలు, పై చిన్న ఆకాశపు వలయం, అవే అతనికి ప్రపంచం. అవే అతని సత్యం.” అతని మాటలు విన్న వెంటనే లక్ష్మణుడు అడిగాడు, “అన్నయ్య, అతనికి బయట ప్రపంచం తెలుసా?” “తెలియదు, లక్ష్మణా. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే, మనిషి కి తెలిసినదే ప్రపంచమని అనుకునే స్వభావం జంతువుల దగ్గర కూడా ఉంటుంది.” కప్ప తన చిన్న లోకాన్నే పెద్దదిగా భావించి గర్వంగా చెప్పుకుంటుండేది: “నా బావిలోనే అన్నీ ఉన్నాయి!” ఒక రోజు బావి అంచునకు సముద్రం నుంచి వచ్చిన పెద్ద తాబేలు, బావి లోని కప్పను చూసి అంది, “ఈ బావి చాలా చిన్నది.బయట చాలా పెద్దదైనా సముద్రం ఉంది.అపార విశాలత విశ్వం ఉంది.” కప్ప నవ్వింది. “అది అసాధ్యం! నా బావికంటే పెద్ద లోకం ఉండదు!” రాముడు మాటల్ని మార్చి అన్నాడు: “భరతా, శత్రుఘ్నా… మనుషులలో కూడా ఇలాంటి అహంకారం ఉంటుంది. తన దృష్టి చిన్నదైతే ప్రపంచం కూడా చిన్నదిగా కనిపిస్తుంది.” తాబేలు మాటలకు, రాత్రి కప్ప ఆలోచించింది... “నిజంగా బయట లోకం ఉంటుందా?” ఆ చిన్న సందేహానికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. రాముడు నడుస్తూ అన్నాడు, “నా తండ్రి దశరథుడు చెప్పేవాడు... ‘సత్యాన్వేషణ ఎప్పుడూ ఒక సందేహంతోనే మొదలవుతుంది’ అని.” కప్ప గోడ ఎక్కడానికి ప్రయత్నించింది. జారిపోయింది. పడిపోయింది. కానీ దైర్యం కోల్పోలేదు. ఒక ఉదయం గొప్ప ప్రతిజ్ఞతో అది బావి గోడ అంచుకు చేరుకుంది మరియు మొదటిసారి, అనంత ఆకాశాన్ని చూసింది. అదృశ్యమైన పెద్ద ప్రపంచాన్ని చూసి అది నిశ్శబ్దంగా, ఆశ్చర్యంగా నిలిచిపోయింది. “నా బావి కాదు చిన్నది… నా దృష్టే చిన్నది.” ఈ మాట చెప్పగానే భరతుడు, లక్ష్మణుడు, శతృఘ్నుడు ముగ్గురి గుండెల్లో కూడా ఏదో మోగింది. అన్నదమ్ములు బావి అంచున నిలబడ్డప్పుడు రాముడు నిశ్శబ్దంగా అన్నాడు, “జీవితం ఒక బావిలా మారిపోవచ్చు. మన నమ్మకాలు, మన భయాలు, మన అహంకారం....ఇవే మనసు చుట్టూ గోడలు కడతాయి.” “బావి నుంచి బయటకు రావడమే జ్ఞానం. బావి లేదని తెలుసుకోవడమే విముక్తి.” శతృఘ్నుడు అభిమానం తో అన్నాడు, “అన్నయ్య, మీరు చెప్పిన ఈ చిన్న కథ మా జీవితానికి దిక్సూచి లాంటిది.” రాముడు చిరునవ్వు నవ్వాడు.

