“మన ఇంటి పేరుతో ఒక ఊరు ఉందని నీకు తెలుసా ?” అన్నాడు పొద్దున్నే ఫోన్ చేసి మా కజిన్ రమణ .
“చాలా ఇంటి పేర్లతో ఊళ్లు ఉన్నాయని తెలుసు. లేదా ఊళ్ళ పేరులతో ఇంటిపేర్లు ఉంటాయని కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే నువ్వు ఇప్పుడు చెప్పిన మన ఇంటి పేరుతో ఒక ఊరు ఉండటం వింటూంటే చాలా ఆశ్చర్యంగానూ, థ్రిల్లింగ్గానూ ఉంది. నేను కొద్దిగా అల్పాహారం, కాఫీ సేవించి నీతో ఇంకో అరగంటలో మాట్లాడతాను .ఈలోపు నువ్వు కూడా రెడీగా ఉండు ...” అంటూ రమణకు చెప్పి వాడు తెలియచేయబోయే ఆసక్తికరమైన విషయాలను గురించి వినాలనే ధ్యాసతో గబగబా నా పనులు ముగించుకోవడం మొదలు పెట్టాను.
“ఏమిటీ ఆ హడావిడీ? పొద్దున్నే కొంపములిగినట్టు ఎవరినుండి ఆ ఫోను ? ఇప్పటికిప్పుడు టిఫిన్ చేసేయ్యమంటే ఏం చెయ్యాలో ఆలోచించుకోవద్దా ? ఎక్కడకైనా బయటకు వెళ్ళాలా ? ఇలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే నాకు గుండె దడ పెరిగిపోతుంది ..” అంటూ రామలక్ష్మి నన్ను మరింత కంగారు పెట్టింది.
“ఇదిగో. నువ్వు అలా ఊరికే వణికిపోకు. ఏ బొంబాయి రవ్వ ఉప్మానో చేసి పారెయ్యి. అవతల ఫోన్ వచ్చింది మా రమణ నుండే. వాడేమీ కొంప ములిగి ఫోనేమీ చెయ్యలేదు. వారానికొకసారి మేమిద్దరమూ మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. మేమిద్దరం ఫోనులో పడితే ఇక స్నానాలు ఉండవు. తిళ్ళు ఉండవు అని నువ్వే అంటూ ఉంటావు కదా. అందుకే ఈ హడావిడి ..” అంటూ మా ఆవిడను సమాధానపరిచాను.
మరో అరగంటలో రమణ నుండి ఫోన్ వచ్చింది. ఇంట్లో ఏ బాధ్యతలూ లేవనుకుంటా. ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారా ? ఎవరికీ ఫోన్ చెయ్యాలా అని ఫోన్ ముందేసుకుని కూర్చుని ఉంటాడు.
గబగబా టిఫిన్ తినేసి మూతి తుడుచుకుంటూ “ ఇక చెప్పరా బాబూ . మన ఇంటి పేరుతో ఊరు ఉన్నట్టు మన పెద్ద వాళ్ళు ఎవరూ ఎప్పుడూ చెప్పినట్టు గుర్తు లేదు. నీ దృష్టికి ఎలా వచ్చింది ?” అడిగాను ఉత్సుకతతో.
“నువ్వు కొద్దిసేపు ఆశ్చర్యపోతూ ప్రశ్నలు వెయ్యడం మానెయ్యి. నేను మొత్తం చెప్పేసాక అప్పుడు నీ సందేహాలు చెప్పు ..” అన్నాడు రమణ చనువుగా.
“అవును. నేను చెప్పింది నిజమే. ప్రస్తుతం నేను మన ఇంకో కజిన్ వెంకటరావు ఇంట్లో ఉన్నాను. అతనేదో స్థలం కొనుక్కునే విషయంలో నన్ను సంప్రదించడంతో ఒక వారం రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. వెంకటరావే ఈ ఊరు విషయం చెప్పాడు. దానితో ఆ ఊరు ఒకసారి చూసి రావాలన్న కోరిక నాలో బలీయంగా కలగడం అందుకు వెంకటరావు వెంటనే ఆ వూరు సర్పంచ్ తో మాట్లాడి నా గురించి చెప్పడంతో అక్కడకు వెళ్ళాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది. నేనెలాగూ వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తే నాకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది అని నీకు ఫోన్ చేస్తున్నాను. నీకు కూడా బంధుప్రీతి ఎక్కువ కదా. అది కాకుండా నా కన్నా నువ్వు కొత్త వాళ్ళతో కూడా బాగా అల్లుకుపోతావు. నీకు వేరే ప్రోగ్రామ్స్ లేకపోతే రేపు రాత్రికల్లా ఇక్కడికొచ్చేయ్యి. అన్నట్టు ఆ ఊరి సర్పంచ్ కూడా మన ఇంటిపేరు వాడే. పైగా చుట్టం కూడా అవుతాడు . ఇక్కడ నుండి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఆ ఊరు ఉంటుంది. అదీ విషయం “ అని రమణ నాలో ఆశలు రేకెత్తించడంతో నా ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింది. నేను మా ఆవిడ రామలక్ష్మితో చూచాయిగా నా ప్రోగ్రాం గురించి చెప్పి వెంటనే బయలు దేరాను.
** ** ** **
ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాకముందే పచ్చటి చెట్ల చిగురుల మీద పడి మెరుస్తున్న మంచు తుంపరలు ఆ పల్లెటూరుకు మొదటి పలకరింపునిస్తాయి. గుడిసెల కప్పుల మీద కూర్చుని కాకులు, గోరింకలు ఒకరితో ఒకరు ఉదయ వార్తలు పంచుకుంటూ ఉంటాయి. ఆ ఊళ్ళో రేడియో కన్నా పెద్దలు చెప్పుకునే మాటలే వార్తలు అవుతాయి.మాకు వెంకటరావు తన కారు ఇవ్వడంతో ఉదయం ఐదు గంటలకే బయలుదేరాం. ఆ ఊళ్లోకి ప్రవేశించిన మాకు ఆశ్చర్యంగా పెద్ద అక్షరాలతో రాసి ఉన్న మా ఇంటిపేరుతో ఉన్న ఊరి బోర్డు స్వాగతం పలికి ఒళ్లంతా పులకించి పోయింది. మేము సర్పంచ్ హరి ఇంటికి వెళ్లేసరికి ఆయన ఇంటిముందు ఆరేడు కుర్చీలలో ఎవరో పెద్ద మనుషులు కూర్చుని ఉన్నారు. మేము గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళగానే వాళ్ళందరూ లేచి నిలబడి” మా ఊరుకు స్వాగతం . కాదు కాదు మన ఊరుకు స్వాగతం “ అంటూ హాయిగా నవ్వుతూ మా ముందుకు కుర్చీలు జరిపారు. మేము వాళ్ళందరినీ ఒకరినొకరం పరిచయం చేసుకున్నాం. ఇంతలో ఆ ఊరి సర్పంచ్ హరి, ఆయన భార్య లోపలనుండి బయటకు వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు.
“ మీరు వస్తున్నారని తెలిసి మన ఊళ్ళో మన ఇంటి పేరు ఉన్న ముఖ్యమైన వాళ్ళందరినీ ఇక్కడ సమావేశపరిచాను. వీళ్ళందరూ ఉత్తరోత్తరా ఏదో రకంగా నాకు బంధువులే అవుతారు. ముందు కాఫీలు, టిఫిన్లు ముగించుకుని అందరమూ కలిసి ఒకసారి ఊరంతా తిరిగి వద్దాం. ఈ ఊరు మీకు బాగా నచ్చుతుంది” అనడంతో మేము సంతోషంగా అతనికి ధన్యవాదాలు చెప్పాము .
తెల్లటి లుంగీ పంచె ధరించి ఉన్న హరి ముందుకు నడుస్తూ ఉంటే మేమిద్దరమూ అతన్ని అనుసరించసాగాం. మాతో పాటు అక్కడకొచ్చిన వాళ్ళు కూడా.
” ఇవి మన పొలాలు. ఇక్కడ మాకు వంద ఎకరాలు మాగాణీ ఉంది. ఈ పల్లెటూరు సౌందర్యం అనేది కేవలం కంటికి కనిపించే దృశ్యాలకే పరిమితం కాదు. అది ఒక గొప్ప అనుభూతి. తెల్లవారితే చాలు పల్లె తన అందాన్ని పురివిప్పిన నెమళ్ళులాగా మనల్ని ఆహ్లాదపరుస్తాయి. సూర్యుడి మొదటి కిరణాలు ఎర్రటి మట్టిని తాకగానే ఆ మట్టేలోంచి వెలువడే సువాసనలు ఈ పల్లెకు ప్రాణం పోస్తాయి. ఆ వాసనలలో మనకందరికీ తల్లి ఒడిలో ఉన్నంత భద్రత ఉంటుంది. మన ఊరి పొలాలు మన పల్లెటూరి కళ్ళకు అద్దాలు. వరిచేలు గాలికి ఊగుతున్నప్పుడు అందులోని పచ్చదనం మన కళ్ళను చల్లపరుస్తుంది. మధ్యలో నీలంగా మెరిసే కాలువలు,వాటి ఒడ్డున్న ఉన్న తాటి, కొబ్బరి చెట్లు ఈ పల్లె సహజ సౌందర్యానికి ఆనవాళ్ళు. మేమంతా ఈ ప్రకృతికి బానిసలమైపోయి ఇక్కడి అందాలను, గాలిని అనుభవిస్తూ చక్కటి పంటలు పండించుకుంటూ ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా ఇక మా మనసులో వేరే ప్రాంతాలకు వలస పోవాలనే ఆలోచనలకు దూరంగా ఉంటూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడే స్థిర పడిపోయాం. ఇక్కడే మనసులను ఆధ్యాత్మికత వైపు మళ్ళించడానికి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వాటికి ఈ వూళ్ళో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డొనేషన్ ఇచ్చి తమ దాతృత్వం నిరూపించుకున్నారు. ఇంకా ఈ ఊళ్ళో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. మీరు మా ఆతిధ్యాన్ని స్వీకరించి మరో రోజు ఉండగలిగితే ఇక్కడి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రత్యేక్షంగా వీక్షించి తెలుసుకుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. మా శ్రీమతి మీకు ఇష్టమైన వంటలతో ఈ పాటికి సిద్దంగా ఉంటుంది. ...” అంటూ హరి మా ఇంటిపేరుతో ఉన్న ఊరి అందాలను ఒక్కటొక్కటిగా చెప్పుకు పోతూ ఉంటే మేము ఏదో కొత్త ప్రపంచంలోకి విహరిస్తున్న అనుభూతి కలిగింది. మా మధ్య పాత బంధుత్వాలు కూడా బయట పడ్డాయి. ఇన్నాళ్ళూ ఒకరికొకరం తెలుసుకోకుండా ఉన్నందుకు మాలో మాకే చిన్నతనంగా అనిపించింది.
హరి ఇంటికొచ్చిన మాకు ఆయన భార్య ముందుగానే మేము ఏమి ఇష్టపడతామో తెలుసుకుని అవే పదార్ధాలతో మాకు రుచికరమైన భోజనం ఏర్పాటు చెయ్యడంతో ఎంతో సంతృప్తిగా వాటిని ఆస్వాదిస్తూ, ఆ రాత్రి మేడ మీద మాకు ఏర్పాటు చేసిన పడకల మీద ఎంతో ప్రశాంతంగా హాయిగా నిద్రించాం.
తర్వాత రోజు మిగతా మా అనుభవాలలో మేము గ్రహించింది ఏమిటంటే పల్లెటూరి సౌందర్యం అనేది ఒక కాలానికి చెందినది కాదని అది తరతరాలుగా మనతో పాటు నడిచే జీవన శైలి అని, ఆధునికత ఎంత విస్తరించినా పల్లె మాత్రం తన మూలాలను వదలదు అని.
“మీరు అవకాశం ఉన్నప్పుడల్లా మన ఊరికి రండి. మనమందరమూ ఆత్మబందువులం. ఒకరికి ఒకరు కావలసిన వాళ్ళం. ఇలా కలుసుకున్నప్పుడే బంధుత్వాలు బలపడతాయి . ఈ నాటి అనుభూతులు మేము కూడా మా జీవితాంతం మర్చిపోలేం ..: అంటూ హరి, ఆయన భార్య తేజశ్వని అనురాగ, ఆప్యాయతలతో మాకు వీడ్కోలు పలుకుతూ ఉంటే ఊహించని ఆ కొత్త బంధాల ఉక్కిరిబిక్కిరితో అప్రయత్నంగా మా కళ్ళు సజలనేత్రాలయ్యాయి.
ఎన్నో అనుభవాలతో, అనుభూతులతో తిరిగి మా ఇళ్ళకు చేరుకున్న మేము అక్కడి విషయాలు మా బంధువులతో మనసారా పంచుకోవడంతో “ఇన్నాళ్ళు మాకెవరికీ దక్కని అదృష్టం మీకు కలిగినందుకు మాకెంతో ఆనందంగా ఉంది “ అంటున్న అందరి హర్షధ్వానాల మధ్య పులకించి పోవడం మా వంతయ్యింది. ****
సమాప్తం

