అత్తలు...కోడళ్ళు - కాంతి శేఖర్ శలాక

అత్తలు...కోడళ్ళు

"పొద్దున్నే ఏమిటా గోల.... సుప్రభాతాలు...ప్రవచనాలు...నువ్వు సాఫ్ట్వేర్ స్టూడెంట్...బామ్మ గారివి కాదు... " భార్య మీద కేకలేస్తున్నాడు కార్తిక్.
"కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటివి వింటే మంచిది అని అత్తయ్య గారే చెప్పారు..." ముక్తసరిగా చెప్పేసి కాఫీ టిఫిన్ తయారు చేసే పనిలో పడింది దీపిక.
"ఈ టీపాయ్ మీద ఫ్లవర్ వాస్ లో పూలు మార్చలేదు...పేపర్ మడత పెట్టలేదు...ఏమన్నా అంటే నడుము నొప్పి...ఎక్కువ సేపు నిల్చోలేను...ఏమి చేయలేను అంటావు... మా అమ్మ నన్ను ఎత్తుకుని మా చెల్లిని కడుపుతో ఉన్నప్పుడు అన్నీ చేసేది...ఈ పురాణాల మీద శ్రద్ధ మొగుడి మీద పెట్టు... మొగుడే దేవుడు అని పురాణాలు చెబుతాయి గా..." పని హడావుడిలో విసుక్కుంటూ అన్నాడు కార్తిక్.
విసుగు తప్ప ఇతర వ్యసనాలు కార్తిక్ కు లేకపోవటం తో అన్నీ సర్దుకుపోతోంది. తన తల్లి మొన్నటి వరకు ఉండి సాయం చేయటంతో ఈ పనులు పెద్ద భారం అనిపించలేదు కానీ ఇప్పుడు నిండు నెలలు...
నానమ్మ కి బాగాలేదని ఫోన్ రావటంతో త్వరలోనే అన్నీ మాట్లాడి దీపిక ని తీసుకెళ్తా అని తల్లి హామీ ఇచ్చి బయలుదేరటం ఆమెకి కొంత ఊరట.
అత్తగారికి మడి ఆచారం ఎక్కువ అని దీపిక భయం...హాస్టల్ లోనే ఎక్కువ చదువు మరి. అమ్మ వచ్చేదాకా అత్తగారు తన దగ్గర ఉంటానంటే ఆనందం, భయం రెండూ వేశాయి దీపికకు. ఆవిడ ఊరిలో ఇంట్లో బావగారి దగ్గర ఉంటా అని భీష్మించారు మామగారు కాలం చేశాక. తనకు ఆమెతో విభేదాలు లేవు కానీ అత్తగారితో చేయించుకోవాలి అనే బెరుకు మొదలైంది.
**** **** ****
అత్తగారు రావటంతో ఆ ఉదయం హడావుడిగా గడిచిపోయింది దీపికకు. నెమ్మదిగా పొద్దు వాలుతోంది.
"అస్తమానం అలా ఇంట్లో కూర్చొని ఉండకపోతే నాతో గుడికి రావచ్చు కదా దీపు..."అత్తగారు పిలవడంతో కష్టంగానే ఉన్నా అత్తగారికి భయపడి చీర కట్టుకుని బయల్దేరింది. అమ్మలా ఆమె భుజం ఆసరా ఇవ్వటం దీపులో బెరుకు పోగొట్టింది. నెమ్మదిగా నడిచి గుడిలో దర్శనం చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు.
"నువ్వు ఆ గోతం ఏదో వేసుకుంటావుగా వేసుకో... ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు..."నైటీ ని అత్తగారు గోతం అనటం నవ్వు తెప్పించినా అత్తగారు ముందు బాగోదు అని ఆపుకుంది.
"ఇలాంటప్పుడు నవ్వుతూ ఉంటే నీకు కడుపులో బిడ్డకు కూడా మంచిదే అమ్మాయి... నవ్వేయి పర్లేదు...ఏమన్నా చేసుకొస్తా నీకు..."అని ఆ పనిలో పడిపోయింది.
**** **** ****
ఈలోపు కార్తిక్ రావటంతో అతనికి టీ చేయటానికి లోపలికి వెళ్ళిపోయింది దీపిక.
అత్తగారు ఇద్దరికీ బజ్జీలతో ఉన్న ప్లేట్ లు అందించారు. ముగ్గురికి టీ కప్పులతో హాల్ లోకి నడిచింది దీపిక.
"అదేమిటి అమ్మా నువ్వు బజ్జీలు తెచ్చుకో..." తల్లితో అన్నాడు కార్తిక్.
"నాకు పెద్దపేగు ఆపరేషన్ అయిందిరా...ఇవి తినకూడదు..." కొడుకుతో చాలా మామూలుగా అంది ఆవిడ.
కడుపుతో ఉన్నప్పుడు ఉమ్మడి సంసారం, తినీ తినక ఏదో దిగుళ్లతో నెట్టుకొచ్చా...దాని ఫలితం ఇది. అమ్మాయికి ఒంట్లో బాలేదు అని మీ అన్నయ్యతో నీకు చెప్పద్దు అని చెప్పా. మీరు తినండి రా...అనేసి టీ కప్పులు లోపలికి పట్టుకెళ్ళింది.
దీపికా కూడా ఏమి తినకుండా అత్తగారి వెనకే రాత్రి వంట పని ఏర్పాట్లలో పడిపోయింది. "నాకు నూనె కాగిన వాసన పడదు అత్తమ్మా..." అంటూ.
కార్తిక్ మనసుకి కొన్నేళ్ల క్రితం తనకి పెళ్లి కాకముందు ఇంట్లో తన వదిన గర్భవతి ఐతే అమ్మే కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నా...ఆమె ఏదో ఒక వంకలు పెట్టటం జ్ఞప్తికి వచ్చింది. అన్నయ్య క్యాంపులు అని తిరగడంతో ఎవరూ ఏమీ మాట్లాడేవారు కాదు. కార్తిక్ తండ్రి అనేవాడు మొదట్లోనే పెళ్ళాన్ని అదుపులో పెట్టకపోతే ఇలాగే ఉంటాయి రా అని...అవే అతని మనసులో నాటుకున్నాయి బలంగా. తన ముందే పెళ్ళైన తన చెల్లి, బావగారు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటే మురిసిపోయే వాడు. రక్త సంబంధం కదా.
కానీ తన భార్యకు చదువు సంస్కారం రెండూ ఉన్నాయి అని తెలుసుకోవటానికి ఇంత కాలం పట్టింది. ఇన్నాళ్లు ఎంతో ముందు ఉన్నాడు అనుకున్న తను మనసుతో చూడటంలో ఎంత వెనుక పడ్డాడు...రెండు కొప్పులు కలిస్తే కొట్లాట అనుకున్నాడు కానీ మగవాళ్ళ ప్రవర్తనే చాలా గొడవలకి కారణం అని గుర్తించలేక పోయాడు.
అప్పగింతల వేళ దీపుని అప్పగిస్తూ అత్తగారు మామగారు ఇక నుండి నా బిడ్డకు తల్లి, తండ్రి నువ్వే అన్నారు కానీ దీపు తనకు పెళ్ళైన క్షణం నుంచి అన్నీ అమ్మలా అమర్చి పెడుతుంది...అయినా మా అమ్మలా చేయలేదు అని సాధిస్తాడు...దీపుకి రేపు తన అమ్మ లాగే అవుతుందా...తను తట్టుకోలేడు...
"భోజనాలు నేను వడ్డిస్తా అత్తమ్మా...మీరు, తను కూర్చున్నాక నేను జాయిన్ అవుతా..." దీపిక గొంతు వినపడి ఈ లోకంలోకి వచ్చాడు.
"నువ్వు నాకు అన్నీ అందించవోయి...ముగ్గురం కూర్చుందాము..." అన్నాడు సన్నగా నవ్వుతూ...భార్యని ఇంక ప్రేమతో అదుపులో పెట్టాలి...అనుకుంటూ.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి