
పెరట్లో నుండి తాతయ్య పిలుపుతో ఇంటి వెనుకాలకు పరుగెత్తాడు రవి. ధోవతి పైకి దోపుకొని, చేతిలో చిన్న గునపంతో నిలబడ్డ తాతయ్యను ఎగాదిగా చూస్తూ.. “ఏంటి తాతయ్యా! పిలిచావు?” అంటూ అడిగాడు.
“మృగశిర కార్తె వస్తోంది. కొన్ని మొక్కలు నాటుదాం” అంటూ నర్సరీ నుండి తెచ్చిన మొక్కలను చూపించాడు.
“మృగశిర కార్తె అంటే ఏంటి తాతయ్యా.. మొక్కలు ఇప్పుడే నాటాలా? ఎందుకు?” అంటూ అడిగాడు రవి.
“అవును రవీ.. మృగశిర కార్తె వస్తోందంటే వానాకాలం ఆరంభమైనట్టు. ఇది ఆంగ్ల మాసం జూన్ మొదటి వారంలో వస్తుంది. రైతులు వ్యవసాయం పనులు ఆరంభిస్తారు. మనం కూడా ఇప్పుడు మొక్కలు నాటితే నీళ్ళు పోయాల్సిన అవసరం రాదు. మొక్కలు పెరిగి పెద్దవైతే వృక్షాలంటాం. ఇంటి చుట్టూ వృక్షాలుంటే ఇల్లంతా చల్లగా హాయిగా ఉంటుంది.ఏ.సీ. లు వాడే అవసరం ఉండదు.” అంటూ వివరిస్తూ.. “ఇంట్లో మూలకున్న పెద్ద గునపం తీసుకరా రవీ.. ఇక్కడ నేల కాస్త గట్టిగా ఉంది. ఈ చిన్న గునపంతో గుంత తీయడం కష్టమవుతోంది” అడిగాడు తాతయ్య
ఇంట్లోకి పరుగు తీసాడు రవి. “జాగ్రత్త రవీ.. బరువుంటుంది. కాలు మీద వేసుకునేవు” అంటూ జాగ్రత్తలు చెబుతున్న తాతయ్య వంక చూసాడు.. ఆలాగే అన్నట్టు తలూపుతూ.
కాస్త కష్టమైనా జాగ్రత్తగా గునపం తెచ్చి తాతయ్యకిచ్చి చేతులు చూసుకున్నాడు. అరచేతులు చిలుముతో ఎర్రపడి పోయాయి. “ఛీ.. ఛీ.. తాతయ్యా.. చిలుము చూడు” అంటూ నోరంతా అసహ్యంగా పెట్టి పక్కనే ఉన్న బకెట్లోని నీళ్ళతో కడుక్కుంటూ.. “చిన్న గునపానికి చిలుము లేదు కదా తాతయ్యా.. పెద్ద గునపానికి ఎందుకుంది” అంటూ అమాయకంగా అడిగాడు రవి.
తాతయ్య నవ్వుతూ.. “మనం చిన్న గునపాన్ని రోజూ వాడుతున్నాం. అందుకే తుప్పు పట్టదు. అదే పెద్ద గునపాన్ని ఎప్పుడో ఒక సారి వాడుతాం. అలా వాడక మూలకు పడి ఉన్న గునపానికి తుప్పు పట్టక తప్పదు. కొన్నాళ్ళకు నిరుపయోగమవుతుంది” రవి శ్రద్ధగా వింటూ ఉండడం గమనించిన తాతయ్య మళ్ళీ చెప్పసాగాడు.
“మనం ఉన్నత చదువులు చదువుకుంటూ.. విద్యనార్జించడం మంచిదే. కాని ఆ విద్యను నలుగురికి పంచుతూ సదుపయోగం చేయాలి. మనం బోధిస్తుంటే అనుమానాలు వస్తుంటాయి. నివృతి కోసం మళ్ళీ మనం పుస్తకాలు తిరగేస్తుంటాం. దాంతో విజ్ఞానం మరింత పెరుగడానికి అవకాశం ఉంది. అలా గాక మన చదువును నిరుపయోగం చేస్తే ఇలాగే పెద్ద గునపం లాగా మన మెదడు తుప్పు పడుతుంది. అంటే.. మొద్దుబారి పోతుంది. సంఘంలో మనల్ని ఎవరూ గుర్తించరు.. విలువ కోల్పోతాం. గంధం చెక్క చూడు.. తాను అరిగి పోతూ మనకు సువాసనలు వెదజల్లుతుంది. కొవ్వొత్తి చూడు.. తాను కరిగిపోతూ వెలుగునిస్తుంది. ఏ వస్తువైనా అలా ఉండాలి కాని తుప్పు పట్టి శిథిలమై పోకూడదు.”
“అర్థమయ్యింది తాతయ్యా.. నేను బాగా చదువుకొని మీ మాదిరిగా ఉపాధ్యాయుడినవుతా” అంటున్న రవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని తల నిమురుతూ.. ఆశీర్వదించాడు తాతయ్య.
ఇరువురు కలిసి మొక్కలు నాటే పనిలో నిమగ్నమయ్యారు.*