ప్రేమికుల రోజు - కాంతి శేఖర్. శలాక

valentines day story

"ఏరా...ఇంకా స్కూల్ కి రెడీ అవ్వలేదు..." పిల్లల్ని కసురుతోంది మంజుల.
"నిన్న మా స్కూల్ లో వాలెంటైన్ డే అని టీచర్స్ కి ఫ్లవర్స్ ఇప్పించారు అమ్మా... అదేమన్నా పండుగా..." ఏడేళ్ల కూతురి ప్రశ్నకి ఏమి చెప్పాలో అర్థం కాలేదు మంజులకి.
"చీ...అది పెడ్డాల్ల ది..." ముద్దుగా చెప్తున్న అయిదేళ్ల కొడుకుని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఆమె కి.
"నువ్వు పెద్దాడివి ఐపోయావురోయ్..." అంటూ వాడికి చిన్నగా మొట్టి కాయ వేశాడు...భార్య టిఫిన్ బాక్స్ లు సర్దుతుంటే...తను పిల్లలకి డ్రెస్ లు వేస్తున్న మంజుల భర్త మధు.

"అదేం పనికి మాలిన స్కూల్ రా...వాలెంటైన్ డే.. ఏమిటి...వాడి దినం..." మంచం మీద నుండి కేకలేసారు నడుం కింద భాగం నుండి పని చేయని మధు తాత.
"ఏదో అనాథ ఆశ్రమ విరాళం కోసం అంట తాతగారు...నాకు మెసేజ్ వచ్చింది...ఆ పిల్లలు చేసిన బొకే లు ఇప్పించారట..." ఫోన్ చూస్తూ అంది మంజుల.
**** **** ****

"ఏమిటో కలికాలం...రామాయణం భారతం పాత చింతకాయ పచ్చడి అంటూ పిల్లలకి ఇవి...టీవీలు సినిమాలు అనుకుంటే స్కూల్స్ కూడా..." మధు భుజం ఆసరాగా లేచి తన పనులు చేసుకుంటూ అన్నారు తాతగారు.

"మీ బామ్మ మీ నాన్న పుట్టగానే పోతే అన్నీ అయి వాడిని పెంచాను...మీ అమ్మా నాన్న ఏక్సిడెంట్ లో వెళ్లిపోతే నీ కోసమే బతికాను...ఇవన్నీ ఒక రోజులో జరిగేవా...ఈ రోజు ఒకటి గుర్తు ఉంటేనే ప్రేమా..." ఆయన కళ్ళల్లో చెమ్మ.

"క్రితం ఏడాది ఉగ్రవాద దాడుల నుంచి దేశ రక్షణ కోసం ఎందరో జవాన్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు...వాళ్ళ కుటుంబాలని వదిలేసి మన కోసం...వాళ్ళది ప్రేమ కాదా...ప్రేమ పేరు తో తాగటం తిరగటం...ఖర్మ..." మంజుల సాయంతో అల్పాహారం చేసి పత్రిక చదువుతూ అన్నారు ఆయన.

"తాతయ్య...కాలం బట్టి మనము మారాలి...చూసి చూడనట్టు వదిలేయటం అంతే..." ఆఫీస్ కి తయారు అవుతూ అన్నాడు మధు.

"ఇది వరకు చిన్నప్పుడు పెళ్లిళ్లు... మీ బామ్మ కాపురానికి వచ్చిన ఏడాదికి మీ నాన్న పుట్టాడు...బామ్మ వెళ్లిపోయింది...మీ తాతమ్మ సాయంతో వాడిని చూసుకున్నా...తర్వాత మీ అమ్మా...నాన్న...
అప్పుడు ఈ దినాలు తద్దినాలు లేవుగా... మారాలి...నిజమే...పెళ్ళయాక మీ బామ్మని ఏమే ఒసేయ్ అనే వాడిని...నువ్వు మంజులని బుజ్జి...బంగారం అంటే ముచ్చట అనిపిస్తుంది...
నేను మంచి నీళ్ళు కూడా ముంచుకునే వాడిని కాదు...నువ్వు తనకి అన్నిటిలో సాయం చేస్తున్నావు...ఇవి ఈతరంలో మంచి మార్పులు. పాతవి అన్నీ మంచివి కాదు...కొత్తవి అన్నీ చెడ్డవి కావు...కానీ పిల్లల్లో ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన కలిగించాలనే బాధ్యత మనదే..."
తాత గారి మాటలు మధు ని ఆలోచనలో పడేశాయి.

స్మార్ట్ ఫోన్ సాయంతో చాగంటి గారి ప్రవచనాలు వినటంలో లీనం అయిపోయారు తాతగారు.
**** ***** ****

"సాయంత్రం తొందరగా రెడీ అవ్వు..పిల్లల్ని తాతయ్యని కూడా రెడీ అవ్వమని చెప్పు..శిల్పారామం వెళదాం..." బయటకి బయల్దేరుతూ మంజులతో అన్నాడు మధు...

"ప్రేమికుల రోజు చేసుకుందాము..." అతని మాటలకి సన్నగా నవ్వింది మంజుల.
"ఇలాంటి కుటుంబం ఉంటే ప్రతి రోజు ప్రేమికుల రోజే..." తృప్తిగా నవ్వుకుంది.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి