నేనూ, నా మనసు - మద్దూరి నరసింహమూర్తి

Nenoo naa manasu

‘మనసు తిట్టినట్టు ఎవరూ తిట్టరు’ అన్నది జగమెరిగిన సత్యం.

కానీ, నా 65 ఏళ్ల జీవితంలో ఎన్నడూ నాకా అనుభవం అవలేదు.

అంతగా మిత్రుడులా వ్యవహరించిన నా మనసు ఈరోజు ఎందుకో అదే పనిగా నన్ను తిట్టిపోస్తూంది.

ఉదయమే పక్కమీంచి లేచి నిలబడబోతూంటే, శరీరం తూలినట్లై క్రింద పడబోయి తమాయించుకున్నాను. లేకపోతే, నా శరీరంలో ఎక్కడో పెద్ద దెబ్బ తగిలి ఉండేది.

వెంటనే, ఎవరో గట్టిగా తిడుతున్నట్టు నాలో నాకే వినిపించసాగింది.

అదేమిటి, పైకి ఎవరూ కనిపించక నాలోపల నాకే వినిపించేటట్టు ఎవరు మాట్లాడేది, అని నన్ను నేను ప్రశ్నించుకున్నానో లేదో –

“నీ మనసుని నేను. నీతో మాటలాడుతూంటే ఎవరూ అని దిక్కులు చూస్తావేమిటిరా వెర్రి వెధవా?” అని వినిపించింది.

“నువ్వు నా మనసు అయితే మాత్రం, మంచీ మర్యాద లేదా. 65 ఏళ్ల జ్ఞానవృద్ధుడిని అనుభవజ్ఞుడిని అయిన నన్ను పట్టుకొని ఉదయానే ‘వెర్రి వెధవా’ అని సంభోదించడం ఏమైనా సబబుగా ఉందా”

“ముడ్డి కిందకు 65 ఏళ్ళు వచ్చినా, ఉదయం తెలివి వచ్చిన తరువాత వెంటనే లేవకుండా ఒక నిమిషమైనా అలా పడుకొని ఉండాలని, తరువాత పక్క మీదనే ఒక నిమిషం కూర్చొని ఉండాలని కూడా తెలియని నువ్వు జ్ఞానవృద్ధిడివా అనుభవజ్ఞుడివా”

“ఏదో తొందరలో లేస్తే, అలా తిడతావేమిటి”

“పని పాటు లేని వెదవవి నీకు తొందరేమిటి”

“లఘుశంకకు కూడా పొరపాటున లేవకూడదంటావా ఏమిటి”

“ఇప్పుడు లేచేవు చూడు, అలా లేస్తే పడిపోయే అవకాశం ఉందని తెలుసా లేదా”

“తెలుసనుకో”

“తెలిసి చేస్తే దానిని పొరపాటు అనరు, వెధవపని అంటారు”

“ఉదయానే అంత పెద్ద మాటాలెందుకులే”

“లేవకూడని రీతిలో లేచి క్రింద పడితే శరీరానికి ఎక్కడైనా దెబ్బ తగిలి అక్కడున్న ఎముక విరుగుతుందని, సాధారణంగా ఈ వయసులో విరిగిన ఎముక అతుక్కోదని తెలుసా లేదా”

“ఈరోజుల్లో వైద్యవిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని నీకు తెలిసినట్టు లేదు”

“నాకు తెలియక కాదురా బుద్ధి హీనుడా, కీడెంచి మేలెంచమన్నారు”

“నువ్వు నాతో మాటలాడే విధానం చూస్తూంటే, నీకు మేలెంచడం కూడా తెలుసా అని నా అనుమానం”

-2-

“ఏ దెబ్బ అయినా తగిలి అక్కడున్న ఎముక విరిగితే, నీ అజాగ్రత్త వలన జరిగినదానికి నువ్వు ఆ కష్టాన్ని అనుభవించడంలో న్యాయం ఉంది. కానీ, నీ వాళ్ళు అప్పుడు పడే కష్టాలు పెట్టే అనవసర ఖర్చులతో వారికి నీవు అన్యాయమే చేసినట్లే కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు”

“తప్పైపోయింది, మరెప్పుడూ అలా తొందరపడి లేవను, నీ తిట్లు ఆపు”

“పక్క మీదనుంచి లేవగానే స్థితి కారకుడైన శ్రీమహావిష్ణువును తలచుకొని నమస్కారం చేసి లేవాలని తెలుసా లేదా”

“చెప్పేను కదా, ఏదో తొందరలో లేచేను అని”

“తెల్లవారి పక్కమీంచి లేచేటప్పుడు ఏమి చేయాలో తెలుసా”

“జాగ్రత్తగా లేవాలి అంతే”

“భూదేవతను తలుస్తూ నమస్కారం చేయాలని కూడా తెలియని నీవు జ్ఞానవృద్ధుడివా”

“తెలుసు, కానీ లఘుశంకకు లేచే తొందరలో జ్ఞాపకం రాలేదంతే”

“తెలుసు’ అని బుకాయింపు ఒకటి. తెలిస్తే, భూదేవతను ఏమని తలచుకోవాలో చెప్పు చూద్దాం”

“భూమాతా నీకో నమస్కారం అని తలుస్తాం, ఆ మాత్రం తెలియదా ఏమిటి”

“అలా బుకాయించడానికి సిగ్గు వేయడంలేదూ”

“బుకాయించడమేమిటి”

సముద్రవసనే దేవీ, పర్వతస్థన మండలే

విష్ణుపత్నీ నమస్తుభ్యం,పాదస్పర్శం క్షమస్తుమే

– అని భూమాతను తలచుకుంటూ నమస్కారం చేస్తూ, పక్కమీదనుంచి తీసిన కాలు భూమి మీద పెట్టాలని తెలియదు కదూ నీకు”

“నిజమే నాకు తెలియదు, ఇక మీదట గుర్తుంచుకుంటానులే”

“ఔన్రా అబద్ధాలకోరూ, నిన్న రాత్రి పడుకొనే ముందర ఏమి చేసి చచ్చావు”

“చేసేదేముంది, నిద్ర వచ్చింది పడుకున్నాను”

“అసలు పడుకొనే ముందర ఏం చేయాలో తెలుసా లేదా”

“నిద్ర కోసం ప్రయత్నించాలి. కానీ, నాకా బెంగలేదు. ఇప్పటికీ పక్క చూస్తే చాలు, కళ్ళు మూతలు

పడుతూ నిద్ర ముంచుకొని వస్తుంది”

-3-

“అఘోరించావులే. చెప్పింది జాగ్రత్తగా విని ఏడు. నిద్రపోయే ముందర స్వల్పకాల లయకారకుడైన పరమేశ్వరుడిని తలచుకొని నమస్కారం చేసిన తరువాత నిద్రకు ఉపక్రమించాలి. ఆ మాత్రం కూడా తెలియని నీవు జ్ఞానవృద్ధుడిని అని చెప్పుకుందికి బుద్ధి లేకపోతే సరి”

“65 ఏళ్ళు నిండిన నన్ను పట్టుకొని అదేపనిగా తిట్టడం ఏమైనా బాగుందా”

“గుర్రానికి గాడిదకు కూడా వస్తుంది వయసు”

“గుర్రమైనా గాడిదైనా 65 ఏళ్ళు బతకదు అని తెలియని నీవు నాకు బుద్ధులు చెప్పడమేమిటి”

“ఈ వెధవ తెలివితేటలకు కొదవ లేదు నీ దగ్గర”

“నీ తిట్లు వింటూ కూర్చుంటే ఈరోజంతా ఇలాగే గడిపోయేలాగుంది, నేను స్నానం చేస్తాను బాబూ”

“ఆ స్నానమైన శుభ్రంగా చేసి శుచిగా బయటకు రా”

ఇదే అదననుకొని నేను స్నానాలగదిలోకి పరిగెత్తేను.

సుమారు అరగంట తరువాత వచ్చి, ఈరోజు నన్ను నేను ఆపాదమస్తకం తనివి తీరా పరీక్షించి చూసుకోవాలన్న కోరికతో అద్దం ఎదుట నిలబడి చూసుకుందునూ –

అందమైన నొక్కుల జుత్తుతో, ఎగు భుజాలతో, విశాల వక్షస్థలంతో, ఉందో లేదో అనిపించే నడుముతో -- యువతుల కలల రాకుమారుడిలా ఉండే నా ప్రతిబింబమేనా ఇప్పుడు అద్దంలో నాకు కనిపించేది అని విచారం అలుముకున్న నాతో,

నా మనసు – “ఎందుకలా విచారంగా ఉన్నావు” అని అడగ్గానే –

“ఏమని చెప్పను నీకు” –

అని మొదలిడి నాలోని అనాకారి విశేషాలను ఒక్కొక్కటీ వర్ణించసాగేను.

“నా జుత్తు పలచబడి, ఉన్న నాలుగు వెంట్రుకలు కూడా తెల్లగా మెరుస్తున్నాయి. నల్లగా ఒత్తుగా అందంగా ఉండే నా జుత్తు ఇలా మారిపోయిందేమిటో”

“ఈ వయసుకి నీ జుత్తు అలా మారడంలో విచిత్రమేముంది” అని నా మనసు నన్ను ప్రశ్నించింది.

“మగాడి అందం సగం జుత్తులోనే ఉంటుందని నీకేం తెలుసు”

“అంటే, ఇప్పుడు వెధవది ఏ విగ్గో తగిలించుకుంటావా ఏమిటి”

“నన్ను ఉదయంనుంచీ తిడితే తిట్టేవు కానీ, మంచి సలహా ఇచ్చి నా విచారాన్ని పోగెట్టేవు”

“ఏం ఏడుస్తావో ఏడు”

-4-

“అయ్యో, నా కనుబొమ్మల దగ్గర వెంట్రుకలు కూడా ఎలా తెల్లబడిపోయాయో” అన్న నా ఆందోళనకు ---

“అక్కడ ఏ విగ్గూ తగిలించుకోలేవు తెలుసా” అని నవ్వసాగింది నా మనసు.

“జాగ్రత్తగా అక్కడ నల్లరంగు పట్టిస్తాను”

“పొరపాటైతే కళ్ళు పాడైపోతాయి వెధవా, అలాటి తెలివిమాలిన పనుల జోలికి వెళ్లకు”

“నాకు తెలుసు, నువ్వు ఏమీ సలహాలు ఇవ్వక్కరలేదు”

“ఏమేడుస్తావో ఏడు, ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అని ఉత్తినే అన్నారా”

“అయ్యో, నా బుగ్గలు” అంటూ ఏడవసాగిన నాతో –

“ఏమిటైంది నీ బుగ్గలకు అలా ఏడుస్తున్నావు, ఉన్నాయి కదా రెండు బుగ్గలూనూ”

“మా అత్తగారి బంధువులు ఆమెతో –

‘మీ అల్లుడికి ఉన్న బూరెల్లంటి బుగ్గలకే మీరిచ్చిన కట్నం డబ్బులు’ --

అనేవారంట. అలా పొగడబడిన నా బుగ్గలు ఎలా లోపలికి పోయాయో”

“రెండు బుగ్గలలో ఇటొకటి అటొకటి పూర్ణం బూరె లేదా కిల్లీ కూరుకొని తృప్తిపడు” అని పెద్దగా నవ్వుతున్న నా మనసు మాటలకు నాకు కోపం వచ్చింది.

“అయ్యో, సన్నగా అందంగా కనబడే నా నడుమేమిటి ఇలా వలయాకారంగా తయారయింది. ఉందో లేదో అనిపించే నా పొట్ట ఇదేమిటి బానలా తయారైంది. కొన్నాళ్లుగా నా పాంట్లు బిగుతుగా అయిపోయి సరిగ్గా పట్టడం లేదేమిటా అనుకున్నాను, ఇందుకన్న మాట” అని నేను కుమిలిపోతూంటే ---

“నువ్వు వ్యాయామం చేసి ఎన్నాళ్ళైందిరా బడుద్ధాయి” అని అవకాశం దొరికిందే చాలన్న సంతోషంతో ప్రశ్నించింది నా మనసు.

“ఏమో గుర్తు లేదు”

“నాకు గుర్తు ఉంది”

“ఏమిటి నీకు గుర్తుంది”

“నువ్వు వ్యాయామం మానేసి ఐదేళ్ళైంది. పదవీ విరమణ పొందిన తరువాత, వాలు కుర్చీలో టి‌వి ముందు కూర్చోవడం, పగలు కూడా మస్తుగా నిద్రపోవడం తప్ప నువ్వు చేసిన వ్యాయామం ఏముంది”

“పని చేసినన్నాళ్లు పగటి నిద్రకు మొహం వాచిపోయిన నేను, పదవీ విరమణ తరువాత కూడా పగలు పడుకొని సుఖపడకపోతే ఎందుకీ బ్రతుకు”

-5-

“నడుము కొలత పెరిగిపోయి, బానెడు పొట్ట ముందుకు చొచ్చుకు వచ్చి, వేసుకున్న ప్రతీ పాంటూ నడుం దగ్గర బిగుతుగా అయిపోయిన నీకు సుఖమే సుఖం కదూ” అని నవ్వసాగింది మనసు.

“సందు దొరికితే చాలు, తిట్టడం లేదా వెకిలిగా నవ్వడం తప్ప నీకు ఇంకేమీ తెలియదు ఫో” అని నా మనసును కసిగా కసిరేను.

అద్దం ముందు నిలబడి నన్ను నేను నిగ్రహించుకోలేను అని భావించినవాడినై, అద్దం దగ్గరనుంచి లేచి ---

తొందరగా ఇటు తిరిగేనో లేదో ముణుకులు రెండూ కలుక్కుమన్నాయి.

డేక్కుంటూ మెల్లిగా వచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాను.

“చదువుకొనే రోజుల్లో జరిగే వార్షిక పరుగు పందేలలో పసిడి పతకం చేజిక్కుంచుకొని గర్వంగా తల ఎగరేసుకొని తిరిగే నాకు ఇప్పుడు రెండు ముణుకులూ ఇలా చచ్చుపడిపోయాయి ఏమిటి” అని తల వంచుకొని విచారిస్తూంటే –

“ప్రతీ రోజూ కనీసం అరగంటైనా క్రమం తప్పకుండా నడుస్తూ ఉండు అని నీకు ఎన్నిసార్లు చెప్పేనో గుర్తు చేసుకోరా బడుద్ధాయ్”

“ఉద్యోగంలో ఉన్నప్పుడు అందంగా ఆకర్షణీయంగా ఉండాలి అన్న కోరికతో ప్రతీరోజూ నడక మరియు వ్యాయామం చేసేవాడిని. కానీ పదవీ విరమణ తరువాత వాటికి సెలవిచ్చేయాలనుకున్నాను”

“ఆ అలసత్వానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు చూసేవా”

“నిజమే”

“అయినా, నా మాట వినకపోతే పోయే, మహాతల్లి నీ ఇల్లాలు బ్రతికున్నాన్నాళ్లు నీ మంచి కోరి నీ చెవిలో ఇల్లు కట్టినట్టు పోరుతూండేది. ఆమె తృప్తి కోసమైనా ఆమె మాట విని ఉంటే, ఈరోజు ఈ పరిస్తితి వచ్చి ఉండేది కాదు కదా”

“చాల్లే, నన్ను అదేపనిగా దెప్పి పొడవకు” అని నా మనసును కసిరేను.

టిఫిన్ తిని, ఈరోజు నుంచీ అపార్ట్మెంట్ లోనే కొంతసేపు ఎండలో నడిచి కాళ్ళకు మళ్ళా నడక అలవాటు చేస్తూ, విటమిన్ ‘డి’ లోపం కూడా తగ్గించుకొనే ప్రయత్నం చేద్దామని తలచి –

ఉన్న నాలుగు వెంట్రుకలు అద్దంలో చూసుకుంటూ దువ్వుకుంటూ, మొహానికి పౌడర్ పట్టిస్తూంటే –

ఆ పక్కనుంచి వెళ్త్తూ నన్ను చూసిన పదహారేళ్ళ మనవడు గట్టిగా నవ్వుతూ –

“ఏం తాతా, ఈరోజు బాగా ముస్తాబు అవుతున్నావు. బామ్మ ఖాళీ చేసిన జాగాని భర్తీ చేయడానికి ఎవరినైనా చూడడానికి వెళ్తున్నావా ఏమిటి” అని ఆటపట్టించసాగేడు.

-6-

“నాకిప్పుడు ఎవరు పిల్లనిస్తారు మనవడా” అనగానే –

“ఇస్తే చేసేసుకుంటావన్నమాట” అంటూ గట్టిగా నవ్వుతూ బయటకు వెళ్లిపోయేడు.

“మనవడేదో హాస్యమాడితే – ‘నాకు మళ్ళా పెళ్ళేమిట్రా భడవా’ అని వాడిని కసరుకోక -- ‘నాకిప్పుడు ఎవరు పిల్లనిస్తారు’ అనడానికి సిగ్గు లజ్జ ఏమీ లేవా నీకు” అంటూ నా మనసు మళ్ళా తిట్టడం ఆరంబించింది.

“ఏదో సరదాకి అలా అన్నాను కానీ నేనేమైనా కన్యాశుల్కం నాటకంలోని అగ్నిహోత్రావధానులనా ఏమిటి నిజంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడడానికి”

“సిగ్గు లజ్జ లేని మాటలు మళ్ళా మాటలాడేవంటే నలుగురిలో నీ పరువు తీసేటట్టు వ్యవహరించవలసి వస్తుంది, జాగ్రత్త”

“ఇప్పటికేదో నా పరువు నువ్వు నిలబెడుతున్నట్టు” అని వెళ్లబోతూంటే –

“కింద చూసుకుంటూ జాగ్రత్తగా ఆ నడకేదో పూర్తి చేసి వచ్చి -- టి‌వి ఎదురుగుండా చతికిలబడక – భగవద్గీతో, భాగవతమో, రామాయణమో చదువుకో. ఏం బ్రాహ్మణ పుట్టుక పుట్టేవో కానీ, ఇన్నేళ్లు వచ్చినా, ఒక్క రోజు కూడా దేముడి దగ్గర దీపం వెలిగించి నాలుగు మంత్రాలు వల్లించింది లేదు. యజ్ఞోపవీతం ఉన్నా గాయత్రి మంత్రం కూడా పుస్తకం చూడకుండా వల్లించలేవు, విష్ణు సహస్రనామాలు మంత్రపుష్పం పుస్తకం చూసి కూడా తప్పులు లేకుండా చదవడం రాదు. నీ ఇల్లాలు నీ బాగు కోరి చేసిన వ్రతాలు నోములు పూజలతో, ఇంతకాలం నీకు హాయిగా గడిచిపోయింది అని గ్రహించి, ఇక మీదట రోజూ దేముని దగ్గర దీపం వెలిగించి పుస్తకం చూసైనా భగవత్ స్తోత్రాలు చదువుకో. నా ఖర్మ కాకపోతే, నేను ఏం పాపం చేసేనో నీ పనికిమాలిన వెధవ శరీరంలో చిక్కుకుపోయేను”

--అని నా మనసు తిట్లతో సలహాలతో నన్ను మరొకసారి కడిగేసింది.

**శ్రీరామ**

మరిన్ని కథలు

Vaarasudu
వారసుడు
- యమ్.శ్రీనివాసరావు
Devude kaapaadaadu
దేవుడే కాపాడాడు
- మోహనకృష్ణ
Lokam teeru
లోకం తీరు..!
- యు.విజయశేఖర రెడ్డి
Bhale baamma
భలే బామ్మ
- కొడవంటి ఉషా కుమారి
Manchi salahaa
మంచి సలహ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nijayitee viluva
నిజాయితీ విలువ
- సి.హెచ్.ప్రతాప్
O anubhavam
ఓ అనుభవం!!
- జి.ఆర్.భాస్కర బాబు
Veedani anubandham
వీడని అనుబంధం
- కందర్ప మూర్తి