శృతి తప్పిన పలకరింపు ..!! - బి.రామకృష్ణా రెడ్డి

శృతి తప్పిన పలకరింపు ..!! శృతి తప్పిన పలకరింపు ..!! ------------------------------------బి.రామకృష్ణా రెడ్డి సఫిల్ గూడ. కాలానుగుణంగా ప్రభుత్వాలు కల్పిస్తున్న సరళీయకృత విధివిధానాలు ,ఆధునికీకరణ ప్రభావంతో నేటి యువత ఎంతో అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ఒకప్పటి మారుమూల గ్రామాలు నేడు పట్టణాలుగా ,పట్టణాలు నగరాలుగా, నగరాలు మహా నగరాలుగా అభివృద్ధి చెందుతున్నాయి . నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్షతో ఉన్నత చదువులు చదువుకున్న యువత కూడా సుదూర ప్రాంతాలలోని విదేశాలకు వెళ్లి ,తాము కోరుకున్న ప్రత్యేక సాంకేతిక విద్యను అభ్యసించడంతోపాటు అక్కడే స్థిరపడిపోయి ఎన్నో రంగాలలో విజయ పధాన పయనిస్తున్నారు .అంతవరకు ఈ మార్పు శుభ పరిణామమే. కానీ ఇక్కడే సమస్య అంతా ....నవ నాగరికత పేరుతో మన భారతీయసంప్రదాయాలను , కుటుంబ వ్యవస్థను ,గౌరవ మర్యాదల విషయంలో మొక్కుబడిగా వ్యవహరించటం, చివరకు ఆత్మీయ పలకరింపులు కూడా బలహీనపడటం బాధాకరం. ఇప్పుడు పలకరింపు ఎలా రూపాంతరం చెందిందో అనే విషయానికి వస్తే..... మన చిన్నతనంలో ముఖ్యంగా పల్లెటూర్లలో మరియు ఉమ్మడి కుటుంబాలలో పలకరింపు విధానాలు చాలా ఆత్మీయంగా ఉండేవి .తమ రక్తసంబంధీకులు, బంధు వర్గము బంధుత్వపరంగా తమకు ఏ వరుస అవుతారో తెలుసుకొని పెదనాన్న /పెద్దమ్మ , చిన్నాన్న/చిన్నమ్మ ,అత్త /మామ,.... ఇలా సంభోదించేవారు . ఈ పలకరింపులో మరో ప్రత్యేకత ....అది కేవలం తమ రక్తసంబంధీకులు మరియు బంధు వర్గానికే పరిమితం కాకుండా ,తమ ఊరిలోని ప్రతి వ్యక్తిని కులమతాలకు ,ఆర్థిక స్థితిగతులకు , సామాజిక హోదాకు అతీతంగా ఏదో ఒక బంధువు హోదాతో అత్త/మామ ,అక్క /అన్న ఇలా పలకరించుకునేవారు. అలా పలకరించుకోవడంలో మరో భావాత్మక విశేష గుణాన్ని పాటించేవారు .ఉదాహరణకి ఒక కులస్తులు ,వారి కులస్తులను వివాహ బంధాలతో ఏర్పడిన బంధుత్వ పరంగా అన్నదమ్ముల వరసనో లేదా బావ బావమరిది వరుసతో సంబోధించే క్రమంలో, ఇతర కులస్తుల వారు కూడా వీరిని అనుసరిస్తూ ,అదే బంధుత్వ సంబోధనతో కూడిన పలకరింపును కొనసాగిస్తారు . ఏదో సందర్భంలో సొంత ఊరికి వెళ్ళినప్పుడు ఆనాటి వ్యక్తులు మనల్ని ఇప్పటికినీ అదేవిధంగా పలకరించటంతో ఏదో తెలియని అనుభూతికి లోనౌతాము. ఇక పలకరింపు /సంభోదన పరిణామ క్రమాన్ని గమనిస్తే.... తల్లిదండ్రులను ఆత్మీయంగా అమ్మ/ నాన్న అనే పిలిచే వారం .అది క్రమంగా మమ్మీ/ డాడీ , మామ్ /డాడ్ ... ఇక భార్యాభర్తలు ...మరి పాత రోజులలో పల్లెటూర్లలో భర్త ,భార్యని ఏయ్ /ఏమేయ్/ ఏమోయ్... నాగరికత వృద్ధి చెందిన తర్వాత కొంత మార్పు జరిగి భార్యాభర్తలు ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోవటం లేదా భార్య భర్తని ఏమండీ!.. అని సంబోధించడం ఆరోగ్యకరమైన పరిణామమే. అది క్రమంగా బుజ్జి /బంగారం ..పండు /పప్పు అని ముద్దుముద్దుగా పిలుచుకోవడం.. క్రమంగా అది ఒరేయ్ /రారా/ పోరా ..అనే పరిస్థితి అక్కడక్కడ దాపరించడం దిగజారుడు తనమే. ఇక అన్నదమ్ములు ,అక్కా చెల్లెళ్లు, బావ బావ మరిది, వదిన మరదల మధ్య కూడా పలకరింపులు పెద్ద చిన్న అనే భేదం లేకుండా పేర్లతో పిలుచుకోవడం,అరేయ్/ఒశేయ్ అనే విధంగా వెళుతున్నాయి. ఇక ...పెదనాన్న /చిన్నాన్నలు అంకుల్ గాను, పెద్దమ్మ /చిన్నమ్మలు ఆంటీలు గాను ,అవ్వ తాతలు పెద్ద అంకుల్ ,పెద్ద /ఆంటీలగా పరిణామం చెందాయి. ఇక వియ్యంకుల మధ్య ఉండే బావ/అక్క అనే ఆత్మీయ సంబోధనలు కనుమరుగై పేరుతోనో లేదా ఏమండీ !అనే పరిస్థితికి వచ్చాయి. ఇక ఇంటి కోడండ్లు కూడా తన భర్త తల్లిదండ్రులను మామ /అత్త అనే సంబోధన మరచి ఆంటీ /అంకుల్ అనే విధంగా పరిణామం చెందటం శోచనీయము. నాకు వ్యక్తిగతంగా స్నేహితులకన్నా బంధు వర్గమే అధికంగా ఉంది. దానికి కారణం ...మా అన్నదమ్ముల తరం వరకు అధిక సంతానముతో ఉన్న కుటుంబ వ్యవస్థలు ,మరియు వివాహబంధంతో ఏర్పడే బందు వర్గం తెలిసిన వారో ,లేేదా తమకి దగ్గర ఊరివారితోనో సంభవించడం జరిగేది. ఏవైనా శుభకార్యాలకు సొంత ఊరికి కానీ, బంధువుల ఊర్లకు గాని వెళ్ళినప్పుడు మిగిలిన బంధువులందరూ కలవటం ,వారితో ఆత్మీయంగా మెలగడం నాకు ఎంతో తృప్తినిస్తుంది. ముఖ్యంగా ఆ సందర్భాలలో మనకు దూరపు బంధువుల ద్వారా ఏర్పడే కొత్త సంబంధాలు ,కొత్తగా వచ్చిన కోడల్లు_ అల్లుళ్ళు ,మన గురించి మనం వారికి ఎలా బంధువులంమవుతామో తెలుసుకొని, పెదనాన్న _బాబాయ్ ,పెద్దమ్మ _చిన్నమ్మ , మామయ్య _అత్తమ్మ , అక్క _బావ,...అంటూ ఇలా బంధు వర్గపు వరుసలు కలుపుకొని ఆత్మీయంగా పలకరించటం ....ఆ సందర్భమే మహదానందంగా ఉంటుంది. ఆ ఆత్మీయ పిలుపులోనున్న తీపిదనం వినేవారి కన్నా అనుభవించిన వారికే తెలుస్తుంది. ఈ సత్ సంప్రదాయాన్ని వ్యక్తిగతంగా నేను సమర్థిస్తూ, నా వరకు నేను అమలు పరుస్తూ ,పిల్లలను కూడా ప్రోత్సహిస్తున్నాను .ఆ ప్రయత్నంలో మా అమ్మాయి ,అల్లుడు వరకు సఫలీకృతుడయ్యాను .అబ్బాయి ,కోడలు విషయంలో విఫలమైనందుకు చింతిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మా బంధు వర్గంలోని చాలా కుటుంబాలు బందువర్గ కలయిక కేవలం శుభకార్యాలకే పరిమితం చేయకుండా, కులదైవపూజ ,ఇంటి దైవపూజ అనే సంప్రదాయాలను సృష్టించుకుని, దగ్గరి బంధువులందరినీ పిలుచుకొని ,శనివారాలు శాఖాహార భోజనాలు ,ఆదివారాలు నిండైన మాంసాహార భోజనాలు ,అన్ని హంగామాలతో ఏర్పాటు చేస్తూ, ఆ ఆత్మీయ అనుబంధాన్ని ద్విగునీకృతం చేయడం మరో విశేషం . ఒక సినీగేయ రచయిత చెప్పినట్లు ,అమ్మ/ నాన్న అనే పలకరింపులో ఉండే మాధుర్యం మమ్మీ /డాడీ అనే పదములో ఎక్కడ కనిపిస్తుంది. అలాగే అత్త /మామ అనే పలకరింపులో ఉండే ఆత్మీయత ,అంకుల్/ ఆంటీ లో వెతికినా కనపడవు కదా! ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి ఒక అంతం ఉండదు ఎక్కడో ఒకచోట దీనికి ఒక అడ్డు కట్టబడి ,తిరిగి పాత రోజుల్లోకి వెళితే ఎంత హాయిగా ఉంటుందో కదా! వేచి చూద్దాం. ***