ఓ అమ్మ కధ - తటవర్తి భద్రిరాజు

o amma katha

మూడు రోజుల నుండి వర్షం పడుతూనే ఉంది. ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియడం లేదు. వర్షానికి గ్రామం లో రోడ్లు అన్నీ బురద బురద గా తయారయ్యాయి.

శెట్టి బలిజ పేట లో ఎవరిదో ఇల్లు వర్షానికి తడిసి కూలిపోయింది. ఆ పక్కనే ఉన్న సుబ్బరాజు గారి పశువుల దొడ్లో నల్ల ఆవు చలికి వణుకుతూ ఉంది.
పాలేరు గోపాలం ఉదయం అవుకు వేసిన గడ్డి వర్షానికి తడిసిపోయింది.

అక్కడే ఒక పెద్ద పెంకుల సావిడి ఉంది. అందులో ఈ మధ్యకాలం లో వాడని చిన్న ఎద్దుల బండి ఒక పక్కగా ఉంచారు .

దానిపక్కనే పశువులకు దాణా కలుపుకునే పెద్ద తొట్టి ఉంది. సావిడి పైన ఉన్న పెంకుల లోంచి అక్కడక్కడ వర్షం నీరు కిందకు పడుతూ ఒక కొత్త రకమైన శబ్దం చేస్తూ ఉంది.

అక్కడే ఉత్తరం వైపు చిన్న సిమెంట్ గట్టు పక్కగా , జుట్టు అంతా చెదిరిపోయి , మొహం నిండా అలంకరించుకున్న దిగులుతో , చిరిగిన చీర తో ఎరుకుల సుబ్బమ్మ కూర్చుని ఎటువైపో చూస్తూ ఉంది.

మధ్య మధ్య లో ' నీకు ఏం కాదు నేను ఉన్నాను' అని గట్టిగా అరుస్తూ ఉంది.. ..వెంటనే సూన్యం లోకి చూసి పెద్దగా నవ్వుతూ ఉంది. చేతిలోకి ఒక చిన్న కర్ర తీసుకుని నేలపై కొడుతూ పైకి వినబడకుండా ఎదో మాట్లాడుతూ ఉంది.
ఆమె అక్కడ ఉంది అని తెలియకుండా సడెన్ గా ఎవరైనా చూస్తే కచ్చితంగా భయపడతారు.

ఊరిలో చాలా మందికి సుబ్బమ్మ గురించి తెలుసు.

సుబ్బమ్మ సోది చెప్పేది. సోది అంటే జరిగేది, జరగబోయేది అన్నీ చెప్పేది. ఎవరి భవిష్యత్ ఏమిటి అనేది కేవలం చేయి పట్టుకుని చెప్పేసేది. చాలా మందికి తమ భవిష్యత్ తమకి తెలుసుకోవాలని ఉంటుంది.
అవి నిజమా కాదా అనేది ఎవరికీ తెలియదు. కానీ అందరూ ఆసక్తి చూపించేవారు.

ఊర్లో ఎంతో మందికి చేయి పట్టుకుని వాళ్ల వాళ్ళ భవిష్యత్ చెప్పింది.

అంతే కాదు. సుబ్బమ్మ పురుడులు పోసేది. గ్రామం లో ఎంతో మంది గర్భిణీలు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా సుబ్బమ్మ చేతే డెలివరీ లు చేయించుకునే వారు.
అలా ఎంతో మంది కి డెలివరీ లు చేసింది.

చాలా మంది సుబ్బమ్మ చేయి మంచిది అని నమ్మేవారు. ఒక చవుకున్న డాక్టర్ కంటే కూడా సులభం గా పురుడులు పోసేది. ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకునేది.

పుట్టిన పిల్లలు కు ఒక నెల వచ్చే వరకు రోజు ఉదయం సాయంత్రం వెళ్లి చూసుకునేది.

తన జీవితం లో గొప్పగా సంపాదించింది ఏమీ లేదు. అందరిదగ్గరా మంచి పేరు తప్ప.

సుబ్బమ్మ భర్త పెళ్లి అయిన కొన్ని రోజులకే ఒక ప్రమాదం లో మరణించాడు. కూతురు పుట్టిన కొన్ని రోజులకే భర్త మరణించడం తో కూతురు ను అల్లారు ముద్దు గా పెంచింది. తనకు వచ్చే కొంచం ఆదాయం తో ఏ లోటు రాకుండా చూసుకుంది.

అందరి భవిష్యత్ చెప్పే సుబ్బమ్మ తన కూతురు భవిష్యత్ తెలుసుకోలేకపోయింది.

ఎప్పుడు ఒకేలా ఉంటే జీవితం ఎందుకు అవుతుంది?!

అందరిలాగే తన కూతురికి మంచి సంభందం చూసి పెళ్లి చేసింది. మంచి సంభందం అని మురిసి పోయింది.

కొన్ని నెలలకే కూతురు గర్భం దాల్చింది. నెలలు నిండాయి.

ఓ అర్ధరాత్రి కూతురి కి నొప్పులు ఎక్కువయ్యాయి. ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుంది. ఊర్లో ఎందరికో పురుడులు పోసిన సుబ్బమ్మ తన కూతురు కు కూడా పురుడు పోయడానికి సిద్ధమైంది.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కో సారి మనం తొక్కే తాడు కూడా పాముగా మారుతుంది.

ఆరాత్రి పురుడు పోయడం లో సుబ్బమ్మ కు ఉన్న అనుభవం కూడా కళ్ళ నీళ్లు పెట్టుకునేలా ....కూతురు కు నొప్పులు ఎక్కువయ్యాయి. బిడ్డ అడ్డం తిరిగింది. ఎంత ప్రయత్నం చేసినా డెలివరీ చేయడం కష్టం ఐయింది. రక్తస్రావం ఎక్కువ ఐయింది.

ఆ అర్ధరాత్రి తాను ఊహించనిది జరిగింది. తల్లి బిడ్డ శాశ్వతం గా సుబ్బమ్మ కు దూరమయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తన చేతులలోనే మరణించడం తో మతిస్థిమితం కోల్పోయింది.

ఇప్పుడు ఎవరైనా పెడితే తింటుంది. తాను ఎక్కడ ఉంటుందో తనకే తెలియదు.

ఊర్లో ఎంతో మందికి భవిష్యత్ చెప్పిన సుబ్బమ్మ ...ఇప్పుడు భవిష్యత్ లేకుండా ఇలా అనదలా... చేరతీసే వాళ్ళు లేక ఇలా ఉండిపోయింది.

సుబ్బమ్మ పరిస్థితి తలుచుకుని ఆకాశం కన్నీళ్లు కారుస్తుందా అన్నట్టు వర్షం మరింత గా పడుతూనే ఉంది.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి