ఆడపిల్ల - కందర్ప మూర్తి

Aaada pilla

ఆర్మీలో హవల్దారుగా దేశ సరిహద్దు జమ్మూకాశ్మీర్లో ఉధ్యోగం చేస్తున్న రాజారామ్ సంవత్సర శలవులో ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం తను విధులు నిర్వహిస్తున్న ప్రదేశం టెర్రరిస్టుల ప్రమాద హెచ్చరికల వల్ల కుటుంబంతో ఉండే అవకాశం లేదు. వీలున్నప్పుడు శలవు తీసుకుని వచ్చి కుటుంబ సబ్యుల్ని కలిసి వెల్తూంటాడు. తండ్రి చనిపోయిన తర్వాత రాజారామ్ కుటుంబంలో పెద్ద కొడుకు కాగా, ఆర్మీలో చేరి ఇద్దరు తమ్ముళ్లను చదివించి ఒకర్ని టీచర్ గా , మరొక తమ్ముడిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా జీవితంలో స్థిర పరిచాడు. వారికి వివాహాలు జరిపించగా కుటుంబాలతో వేరుగా ఉంటున్నారు. అవకాశం ఉన్న చోట ముసలితల్లి, భార్య శారద, ఇద్దరు కూతుళ్లతో కుటుంబంతో ఉంటున్నాడు. కూతుళ్లిద్దరు సెంట్రల్ స్కూల్లో చదువు తున్నందున వారి చదువులకు ఆటంకం అవుతుందని కుటుంబాన్ని ఇంటి వద్దే ఉంచి ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. రాజారామ్ , శలవులో ఉండగా పండగ వచ్చి నందున తమ్ముళ్లను కుటుంబాలతో ఇంటికి పిలిచాడు. అందరూ పిల్లలతో ఆనందంగా పండగ రోజులు గడిపారు. మాటల సందర్భంలో రాజారామ్ పెద్ద కూతురు మానసను ఆర్మీ సర్వీసులో చేరుస్తా ననగానే ఆ మాట విన్న ముసలితల్లి కలగ చేసుకుని "నీకు మతిపోయిందా, ఏమిటి ? నువ్వు మిలిటరీ కెళ్లి ఏం సుఖ పడుతున్నావు ? గత ఇరవై సంవత్సరాలుగా దిన దిన గండంలా ఉధ్యోగం చేస్తున్నావు. ఒకసారి దేశ సరిహద్దుల్లో అయితే ఇంకోసారి ఉత్తరాదిన అంటూ కుటుంబంతో నిలకడ లేకుండా జీవితం గడుపు తున్నావు. తమ్ముళ్లలా ఇక్కడే ఏదైనా ఉధ్యోగం చేసుకుంటే సుఖంగా ఉండేవాడివి. తెగిన గాలిపటంలా ఎప్పుడెక్క డుంటావో తెలియదు. మానసని బాగా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి. నీలా దాన్ని కూడా దేశాలంట తిప్పకు "అని ఉపోద్ఘాతం మొదలెట్టింది. అత్తగారికి తోడుగా శారద కూడా వంత పలికింది. తమ్ముళ్లు కూడా అమ్మకీ , వదిన మాటలను బలపరిచారు. " చూడండి , అందరూ ఎవరి స్వార్థం వారు చూసుకుంటే దేశ రక్షణ దళాలలో చేరే దెవరు? చావు అనేది ఎక్కడైనా రావచ్చు. దాన్ని ఎవరూ తప్పించ లేరు. యూనిఫామ్ సర్వీసుల్లో పరిస్థితుల దృస్ట్యా కొన్ని సుఖాలు త్యాగం చెయ్య వల్సి ఉంటుంది. ఇక ఆడపిల్ల అంటారా , ఇప్పుడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు.క్రీడారంగంలో పురుషులకు ధీటుగా నైపుణ్యం చూపించి పతకాలు తెస్తున్నారు.రోదసిలో కెళ్లి వస్తున్నారు. విమానాలు , భారీ వాహనాలు నడుపుతున్నారు. వైద్య విజ్ఞాన వ్యవసాయ రక్షణ విభాగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. కొన్ని ఉధ్యోగాల్లో మహిళలే పని చేయవల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఆడపిల్లల్ని ప్రోత్సహించాలి. నేను కొన్ని సందర్భాల్లో మిలిటరీ హాస్పిటల్లో ఎడ్మిట్ అయినప్పుడు అక్కడ వార్డుల్లో మా సైనిక సిబ్బందికి, వారి కుటుంబ సబ్యులకు ఎంతో ఓర్పు చిరునవ్వులతో సేవ చేసే యూనిఫామ్ లో నర్సులను చూస్తుంటే నాకు కూడా కొడుకు లేక పోయినా పెద్ద దాన్ని మానసను మిలిటరీ నర్సుగా చూడాలనుకుంటున్నాను "అని తన మనసులోని మాట బయట పెట్టాడు.రాజారామ్ దృఢ ఆశయం విన్న తమ్ముళ్లు , తల్లి , భార్య మరేం మాట్లాడలేకపోయారు. రాజారామ్ కూతురు మానస ఉద్దేశ్యాన్ని కూడా అడిగి తెలుసుకున్నాడు.మానస ఇంతకు ముందు తండ్రితో కుటుంబం తో ఉన్నప్పుడు కొన్ని సార్లు మిలిటరీ హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. అక్కడ వార్డుల్లో మిలిటరీ నర్సింగ్ విధ్యార్ధులు చలాకీగా నవ్వుకుంటు ఆప్యాయంగా పలకరించుకుంటూ కలివిడిగా ఉండటం చూసింది. ఎక్కువగా కేరళా రాస్ట్రానికి చెందిన మలయాళీ అమ్మాయిలే వాళ్ల భాషలో మాట్లాడుకుంటు ఉషారుగా ఉండేవారు.వారి యూనిఫామ్ చూసి ముచ్చట కలిగేది. ఇప్పుడు తండ్రి మిలిటరీ నర్సింగ్ సర్వీసు అంటే తను కూడా నాన్న లాగే దేశసేవకు అంకితమవాలని నిశ్చయించుకుంది. సంవత్సర శలవు రెండు నెలలు కుటుంబం తో గడిపి రాజారామ్ తన ఆర్మీ యూనిట్ జమ్మూకాశ్మీర్ కి వెళిపోయాడు. మానస సెంట్రల్ స్కూల్లో పన్నెండవ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాయగా మెరిట్ తో పాసయింది. ఇంతలో మిలిటరీ నర్సింగ్ సర్వీసులో నర్సుల ట్రైనింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. మానసకు బి.యస్సీ నర్సింగ్ కాలేజ్ , ఆర్ముడు ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(A.F.M.C) పూణేలో సీటు వచ్చింది. రాజారామ్ కి ఎంతో సంతోషమైంది. తను దగ్గరుండి నర్సింగ్ కాలేజ్ లో ఎడ్మిట్ చేసాడు. అక్కడే హాస్టల్ సౌకర్యం ఉండి అన్ని విధాల బాగుంది. కాలేజీ శలవుల్లో ఇంటికి వచ్చి కుటుంబ సబ్యులతో గడిపి వెల్తోంది మానస. బియస్సీ నర్సింగ్ ట్రైనింగ్ నాలుగు సంవత్సరాలు డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఫ్లోరెన్స్ నైటింగేల్ కేండిల్ లైటింగ్ సెర్మనీ తో మిలిటరీ నర్సింగ్ కమీషన్డు ఆఫీసర్స్ గా మిలిటరీ నర్సింగ్ సర్వీసులోకి తీసుకుంటారు. వారు దేశంలోని వివిధ రక్షణ దళ మిలిటరీ హాస్పిటల్స్ లో సర్వీసు చెయ్య వలసి ఉంటుంది. మానస మూడవ సంవత్సరం నర్సింగ్ ట్రైనింగ్ లో ఉండగా అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది. జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ సెక్టార్లో రాజారామ్ విధులు నిర్వర్తిస్తుండగా టెర్రరిస్టుల ఎటాక్ లో కుడి చెయ్యి గాయంతో మిలిటరీ హాస్పిటల్లో ఎడ్మిట్ అవవలసి వచ్చింది. తర్వాత ఆపరేషన్ చేసి మోచేతి వరకు తీసేసారు.వికలాంగుడిగా ఆర్మీ సర్వీసు నుంచి పదవీ విరమణ చెయ్యవల్సి వచ్చింది. ఈ సంఘటన మానసను ఎంతో కుంగతీసింది.పెర్మిషన్ తీసుకుని తండ్రిని ఓదార్చి వచ్చింది. తండ్రి కోరిక ప్రకారం తను నర్సుగా ట్రైనింగ్ పూర్తి చేసి మిలిటరీ హాస్పిటల్సు లో తండ్రిలా దేశసేవలో వికలాంగులకు సర్వీసు చెయ్యాలని నిశ్చయించుకుంది. నర్సింగ్ కాలేజీలో బియస్సీ నాలుగు సంవత్సరాల ట్రైనింగ్ పూర్తి చేసి మెరిట్ విధ్యార్థిగా వచ్చింది. కేండిల్ లైటింగ్ సెర్మనీలో బెస్టు నర్సుగా కమీషన్ తీసుకుని నర్సింగ్ ఆఫీసర్ అయింది. ఆ ఫంక్షన్ కి విశ్రాంత సైనికోధ్యోగిగా మోచేతి వరకు మొండి చెయ్యితో వచ్చిన తండ్రిని చూసి దుఃఖం ఆపుకోలేక పోయింది మానస. కూతురు తన కోరిక ప్రకారం మిలిటరీ హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్గా చూడటం గర్వ కారణమైంది హవల్దార్ రాజారామ్ కి. * * *

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు