ప్రతి నిమిషం పండగే - నల్లబాటి రాఘవేంద్రరావు

Prathi nimisham pandage

చెన్నై ......మే , 2019. ఆనందరావు చదువు నిమిత్తం తన కొడుకు రవి ని చెన్నై హాస్టల్ లో ఉంచి తాను తిరిగి కాకినాడ వెళ్ళిపోతూ "ఒరేయ్ ..రవీ ..నిన్ను ఈ చెన్నై లో ఉంచటం నాకసలు ఇష్టం లేదురా. ఏదో ..నీ ఫ్రెండ్స్ ఇక్కడే చదువుతున్నా రన్నావని 'సరే'...అన్నాను. నాకసలు ఏమాత్రం ఇష్టంలేని వ్యక్తి ...అదేరా ..మీ బాబాయ్ వెధవ ..ఇక్కడే ఉంటున్న విషయం నీకూ తెలుసుగా...ఇక్కడకు దగ్గరే ...అదే ..అది ...అది.. " చెట్టియార్ స్ట్రీట్ " ఏదో అనుకుంటాను ...అక్కడ ఏడుస్తున్నాడట . వాడు నాకు పరమశత్రువు . ఇరవైఏళ్ల క్రితం మాట.. ..నీకు అప్పుడు ఐదేళ్లు ఉండొచ్చు . విషయాలు నీకు గుర్తుండి వుండవులే . ఆస్తిపంపకాల్లో అప్పట్లో మాకు మాకు చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు వచ్చి విడిపోయాం. ఆ వెధవ పోలీస్ స్టేషన్ కోర్టు ల వరకు నన్ను తిప్పాడు. తిట్టాలని కాదుగాని వాడుదుర్మార్గుడు.. నీచుడు..పాపాత్ముడు. సమయం వచ్చినప్పుడు వాడు.. రాక్షసుడిలా ఎలా ప్రవర్తించాడో నీకు చెప్తాను ..వాడి మీద కసి, పగ ...నేను కాక పోయినా.....నువ్వైనా....తీర్చుకొని.. మగాడినని పించుకోవాలిరా. నీమీద ఆ నమ్మకం నాకుంది .. వాడు ఆ రోజే చచ్చిపోయినట్టురా. వాడు అవసరం మనకు లేదు..రాదు.. ఉండదు. మన అవసరం కూడా వాడికి లేదులే. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఈ రైల్వే ప్లాట్ ఫామ్ మీద నీకెందుకు చెప్తున్నానంటే ఎట్టి పరిస్థితు ల్లోనూ నువ్వు ...ఆ... స్ట్రీట్ ...కు వెళ్ళడానికి వీల్లేదు . వాడికో కొడుకున్నాడు వాడు వీడు లాగే వెధవన్నర వెధవ అయ్యుంటాడు. ఆ వెధవలు ఇద్దరు దృష్టిలోనూ నువ్వు పడటం నాకసలు సుతారాము ఇష్టం లేదు. ఒకవేళ తేడా వచ్చింది అనుకో.... నీ చదువు మానిపించేస్తాను. బాగా అర్థమైందా. అదిగో ట్రైను వస్తున్నట్టుంది నే వెళ్తాను. జాగ్రత్తగా అందరితోపాటు హాస్టల్ లోనే ఉండు" అంటూ కొడుకు రవి కి ఇంకా మిగిలినవిషయాలు కూడా చెప్పి ..వచ్చి ఆగిన ట్రైన్ గబగబా ఎక్కి తన రిజర్వేషన్ లో కూర్చొని కొడుకుని పంపిం చేశాడు ఆనందరావు. 00000 00000 000 రెండు దశాబ్దాల క్రితం.. ... తన తమ్ముడు ...మూర్ఖుడు.. పద్మాకర్ తో గొడవలు.. తగువులు....... కొట్లాటలు.. ....పెద్ద మనుషులు... పోలీసులు... లాయర్లు.... అలా అలా బుర్రలో గిర్రున జోరీగల తిరిగేస్తున్నాయి ...అంతేనా..విజృంభిస్తున్నాయి... ఈ 20 ఏళ్లలో పద్మాకర్ చాలాచోట్ల,..ఫంక్షన్లలో కూడా కనప డ్డాడు ఆనందరావుకు . మాట్లాడ ప్రయత్నించ మనస్కరించలేదు.... ఆనందరావుకి. పద్మాకర్ కాస్త తెగువ చూపించినా... ఆనందరావు చీద రించుకునే వాడు. మరి తన మనసుకు మాన కుండా తగిలిన "గాయం " ......! అలాంటిది..!!! పెద్దమనుషులకు లంచాలు ఎరచూపి ఆస్తిలో ఎక్కువ భాగంవచ్చేలాకూడా సెట్ చేయించుకుని తనను బెదిరించి, భయపెట్టి ఎలాగోలా ఆస్తి పంపకాలు చేయించేశాడు... పద్మాకర్. తమ్ముడికి కొంత భాగం ఆస్తి ఎక్కువైతే తప్పేముందని ఆనందరావు సర్దుబాటు చేసుకున్నాడు.... . అప్పట్లో.. ఆ గొడవలులో ... తనపై పద్మాకర్ గునపంతోహత్యాప్రయత్నంచేయటం...ఇంకా మర్చిపోలేకపోతున్నాడు ఆనందరావు. అదంతా తమ్ముడు దుర్మార్గత్వం, దుష్టత్వం. ..! అందుకని వాడిని ఒక వెధవ గా జమ చేసి తన కుటుంబం లోంచే వెలివేసినట్టు.....నిర్ణయంచేసు కున్నాడు.. అప్పుడే ఆనందరావు! పద్మాకర్ ..అతని ఆస్తి మొత్తం అమ్మేసుకుని ..అప్పుడే ..భార్య బిడ్డలతో చెన్నై పోయి బిజినెస్ లో బాగా సంపాదించినట్లు తన బంధువులు చెప్తుంటే వినేవాడు ఆనంద రావు. నాలుగేళ్ల క్రితం... పద్మాకర్ కొడుకు రాజారామ్ తను బాల్యంలో గడిపిన కాకినాడ వీధులు చూడాలని , అతను పెరిగిన ఆ పాత ఇల్లు చూడాలని పండగ సెల వులకు సరదాగా కాకినాడ వచ్చాడు. ఆనందరావు తన వీధి అరుగుమీద అప్పటికే కూర్చుని ఉన్నాడు. దూరంనుండి ..అతనే తన పెదనాన్న అని ఎవరి ద్వారానో తెలుసుకున్న రాజారాం.. తనను చూసి ప్రేమగా నవ్వడం గమనించాడు. కానీ.. ఆ కుర్రోడు పద్మాకర్ కొడుకని గ్రహించలేకపోయాడు. అదే వీధిలోంచి తనను దాటుకుంటూ వెళ్తున్న తన బంధువు..... " ఆనందరావు..... దూరంగా ఒక కుర్రోడు కనిపిస్తున్నాడు చూడు.. వాడు మీ తమ్ముడు కొడుకట! పండగ సెలవులు కదా.. ఇక్కడ మనందరినీ చూద్దామని వచ్చాడట... నీతో మాట్లాడటానికి భయపడుతున్నాడు పిలువ మంటావా ఏంటి?..."... అని అడిగాడు. ఉలిక్కిపడి పైకి లేచాడు ఆనందరావు " ఇదిగో.. వాడు అడిగితే మా ఇంటికి పంపించకు. వాళ్లంతా ఎప్పుడో చచ్చిపోయారుకదా.. నీకు తెలుసు కదా.. మేమంతా కూడా చచ్చిపోయాము...అని చెప్పు... వచ్చిన దారినే వెళ్ళమని చెప్పు.. మళ్లీ ఎప్పుడైనా కాకినాడ రావద్దని చెప్పు... వచ్చిన.. ఈ రామారావుపేట రావద్దని చెప్పు.." అంటూ ...పెద్ద అడుగులతో ఇంటిలోపలకు వెళ్ళిపోయి చెక్కలు విరిగి పోయేలా తలుపు వేసుకున్నాడు ఆనందరావు.. ట్రైన్ "స్టార్ట్ " అయిన కుదుపుతో పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చిన అనుభూతి పొందాడు ....!! 0000 0000 0000 రవి చదువు చెన్నైలో సంవత్సరం పూర్తయింది రెండో సంవత్సరం.... చెన్నై హాస్టల్, ఏప్రిల్2020. " కోవిడ్" .....విజృంభణ.... విలయతాండవం చేస్తుంది!!! ఇక్కడ కాకినాడ రామారావు పేట నుండి తండ్రి ఆనందరావు ఫోన్ లో..... " ఒరేయ్ రవి...ఫోన్లో సరిగా వినపడు తుందా. పదిహేను రోజుల నుండి నేను రోజూ ఫోన్ చేస్తుంటే చెన్నై హాస్టల్లోనే జాగ్రత్తగా ఉన్నా నని అబద్ధం మాటలు చెప్తున్నావ్ ఏంటి?..".... .కోపంగా అరిచాడు ఆనందరావు. " అంటే... నాన్న..." " నోర్ముయ్.. మీ కొలీగ్ వాళ్లనాన్న మార్కెట్లో ఇప్పుడే కనబడి చెప్పాడు. మీ హాస్టల్ లో ముగ్గురు కుర్రాళ్ళకి "కరోనా పాజిటివ్" వస్తే ..... క్వారంటైన్లో....పెట్టారటగా....భయపడిన మిగిలిన అందరూ తలో చోటికి వెళ్లి పోయా రటగా. హాస్టల్ ని పదిహేను రోజుల క్రితమే లాక్ చేసేసారట కదా?!... నాకెందుకు ఇన్నాళ్లు అబద్దం చెప్పావు. అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు.".. గర్జిస్తూ అడిగాడు కొడుకు రవి ని ఆనందరావు. " నాన్నా.. నిజమే.. పదిహేను రోజుల క్రితం భయంతో.. చెట్టుకొకరు పుట్టకొకరుగా హాస్టల్ నుండి బయటకు వచ్చేసాము. బస్సులు, ట్రైన్ లు లేవు. కొందరు కుర్రాళ్ళు బంధువులు, స్నేహి తుల ఇళ్లకు వెళ్లి పోయారు. నాకేం చెయ్యాలో తోచలేదు.... ఆ రాత్రి నేను... ఓ మూల సందులో అరుగుమీద ఎలాగోలా రాత్రంతా గడపాలని ఎవరికీ కనబడకుండా బిక్కుబిక్కుమంటూ పడుకొని ఉంటే ..ఎవరో ఒకాయన వీధివీధి తిరుగుతూ అన్నంపొట్లాలు పంచుతూ నా దగ్గరకు వచ్చి నాకు ఇచ్చి నేనెవరో చాలా వివరంగా అడిగి తెలుసుకుని వెంటనే తను వచ్చిన ఆటోలోనే తన ఇంటికి తీసుకెళ్ళి పోయాడు ....15 రోజుల క్రితం." " చాలా తతంగం నడిపావు. రోజూ ఫోన్ చేస్తున్నా ఇదంతా నాకెందుకు తెలియనివ్వలేదు. ఏమిట్రా.. నీ డ్రామా. తండ్రంటే అసలు లెక్కలేదా నీకు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనా నీ నాటకాలు. ఇప్పుడే ఇన్ని వేషాలు వేస్తే ఇక ముందు ఎన్ని వేషాలు అయినా వేస్తావు. అసలు ఎవడువాడు ...?.. తీసుకెళ్లి పోయి నిన్ను ఓ గదిలో పెట్టి ఈ పదిహేను రోజులు కుక్క ని చూసినట్టు చూశాడు కదూ....తర్వాత ఏం జరిగిందో త్వరగా చెప్పు" మళ్లీ గర్జించినట్లే అడిగాడు ఆనందరావు. " లేదు నాన్నా నాకు పరీక్ష చేయించి కోవిడ్ పాజిటివ్ లేదని నిర్ధారించుకుని తనింట్లోనే వాళ్ళతో .... సమానంగానే చూశాడు.". " ఇంకేం జరిగింది ..ఇంకా ఏదైనా అడిగాడా?". " నా గురించి తరచూ ఇంకేమీ అడగలేదు. ఎందుకో..... వాళ్ల పేర్లు కూడా నాకు తెలియనివ్వలేదు. నాన్న........ చూడ్డానికి వాళ్లంతా చాలా మంచి మనుషులుగా కనిపించారు. నిజం డాడీ." " నోటితో కాకుండా ముక్కుతో ఏడ్చినట్టు ఉంది నీ వ్యవహారం. అసలు పేర్లు కూడా తెలుసు కోకుండా పదిహేను రోజులు ఒకరి ఇంట్లో ఎలా గడిపావు రా. వాళ్లు తెలుగు వాళ్లేనా??". " ఆ.. ఆయన ..ఇంకా మరో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ కాని కుర్రాళ్ళని తీసుకువచ్చి నాకన్నా ముందే తన ఇంట్లో పెట్టుకున్నాడు. అతని బంధువుల పిల్లలట. మేమంతా కలసి వాళ్ళ అబ్బాయి తో సహా మొత్తం నలుగురం. ప్రపంచ మంతా కోవిడ్ తో భయపడు తున్నా.. మేం మాత్రం భలే హ్యాపీ గా ఎంజాయ్ చేసాం. అందరూ కలసి వాళ్ళ కిచెన్ లో భోజనాలు చేసేవాళ్ళం . దూరం దూరంగా కూర్చొని. .. ఒకే గదిలో..... దూరం దూరంగా.. పడుకునే వాళ్ళం." " ఏడ్చావు.. బోడి హ్యాపీ , బోడి ఎంజాయ్.. వాడు మన శత్రువు ఏమోనని నాకు అనుమా నంగా ఉంది. కాదుగదా.!!!.. అయినా.. గతం అంతా మరచిపోయి వాడు నిన్ను..........ఎందుకు అలా నెత్తి మీద పెట్టుకుంటాడు? వాడు ఏమైనా దేవుడా? మా తమ్ముడువెధవ కి మరీ ఇంత గొప్ప మనసు లేదులే... అవును.. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ల ఆల్బంబుక్స్ ఏమైనాచూసావా? అందులో నీకు తెలిసిన వాళ్ళ బొమ్మలు ఏమైనా కనిపించాయా?". " చూడలేదు నాన్న.. వాళ్లు కూడా చూపించలేదు." " అది సరే.. నిన్ను తీసుకెళ్లినాయన పెళ్ళాం.. నీతో ఏమైనా మాట్లాడుతూ ఉండేదా?". " లేదు నాన్న ..నావైపు చూస్తూ ఆనందంగా నవ్వుతూ ఉండేది... అంతే.. నేను భోజనం చేస్తున్నప్పుడు మాత్రం అమ్మ లాగే కొసరి వడ్డించుతూఉండేది". "ఏరా... వాళ్ళు చాలా బాగా నీకు నచ్చినట్టు ఉన్నారు.గొప్ప ఏం కాదు గాని .. ఎవరైనా అలాగే వడ్డిస్తారు. అవును.. వాళ్లకు ఓ అబ్బాయి ఉన్నాడని అన్నావుగా.. రేయ్.. నిన్నే.. ఫోన్ లో వినపడుతుందా సరిగా. అదే వాళ్ళ అబ్బాయిని ' రాజారాం '.. అంటూ పిలిచేవారా వాళ్లు?". " వినబడుతోంది నాన్న.. వాళ్ళ అబ్బాయిని 'బాబు'.. అనే పిలిచేవారు......! నాన్న.. ఒక విషయం చెప్ప మంటావా ఆయన ఒకసారి..ఫోన్ లో ఎవరితోనూ చాలా బాగా మాట్లాడారు నాన్న . అది..గుర్తుండి పోయింది.. అది.. ఏంటంటే ... ' తప్పులు అందరం చేస్తాం సార్. అయితే ఆ తప్పులు దిద్దుకునే అవకాశం కలిగినప్పుడు... దిద్దు కోవాలి.. అన్న స్పృహ కలిగించు కొని ముందుకు సాగాలి. గతంగతః.... అన్నట్టు అందరూ బ్రతికితే బాగుంటుంది సార్.' ... అన్నారు నాన్న. అదేంటో ఆ డైలాగులు నాకు చాలా బాగా నచ్చాయి. చిత్రంగానూ, చాలా గొప్పగాను కూడా అనిపించాయి." ఫోన్ లో రవి చాలా ఆర్తిగా చెప్పుకు పోతున్నాడు. " సర్లే ఆపు.. ఈ విషయాలన్నీ నాకు ఫోన్ లో చెప్పాలని నీకు ఎప్పుడూ అసలు అనిపించ లేదా?". నిష్టూరంగా అడిగినట్టు అడిగాడు ఆనందరావు. " సారీ నాన్న.. నేను చాలాసార్లు ప్రయత్నించా. కానీ ఆయన ఎవరిని ఫోన్ చెయ్యనివ్వలేదు. 'ఈ విషయం తెలిస్తే దూరంగా ఉన్న మీ వాళ్ళందరూ కంగారు పడతారు. అయినా ఇక్కడకు రాలేరు. పెద్ద వాళ్లను బాధ పెట్టడం వద్దు. ఇది తప్పు కాదు. నా మాట వినండి. ఇక్కడి పరిస్థితులు కొంచెం చక్కబడ్డాక నేనే మిమ్మల్ని హాస్టల్ లో దిగ పెడతాను. ఆ తర్వాత వీలు చూసుకుని నెమ్మదిగా చెప్పండి.'... అంటూ మమ్మల్ని ఆపేవారు. మీ పెద్దలు హడావుడిగా మీ గురించి ఆలోచిస్తూ... ఉన్న ఆరోగ్యంపాడు చేసు కుంటారని కూడా.. చెబుతుండేవారు. అమ్మను దృష్టిలో పెట్టుకొని అమ్మ కంగారు పడి పోతుందని నాక్కూడా అదే మంచిదనిపించింది నాన్నా. సారీ.. తప్పయితే క్షమించు నాన్నా." " అది సరే ...ఇంతకీ ఎవడ్రా అతను....?". " ఎప్పుడన్నా ఎక్కడన్నా కనిపిస్తే "విష్" చేయి చాలు అంటూ ఈ పదిహేను రోజుల తర్వాత నన్ను ఇదిగో .. . ఇప్పుడే ..జాగ్రత్తగా హాస్టల్ లో దిగవిడిచి .. అదిగో వెళ్ళిపోతున్నారు." " ఆయన అసలు ఎలా ఉంటారు.. ఫోటో ఉందా నీదగ్గర?" " లేదు నాన్న , పద్ధతిగా ఉండదని ఫోటోలు తీసుకోలేదు. ఆ... అదేమిటో కానీ నాన్న.. ఆయన కొంచెం అటు ఇటు గా 'నీలాగే'.... ఉంటారు . వాళ్ళ అబ్బాయి కూడా అదేమిటో కొంచెం అటు ఇటు గా 'నాలాగే ' ఉంటాడు నాన్న. నిజం". " ఆ.. చాల్లే. మనిషిని.. పోలిన మనుషులు ఉండరా ఏంటి? నీదో పెద్ద బడాయి. అన్నట్టు ఈ పదిహేను రోజులు ఏ స్ట్రీట్ లో ఉన్నావు ... అదయినా.. తెలిసి ఏడిచిందా.. నీకు" " ఆ.. తెలుసు నాన్న .. ఈ రోజే ఇప్పుడే వస్తూ చూశాను ఆ స్ట్రీట్ .. పేరు.. ఆ ...అది.. అది.. చిట్టి.. కాదు కాదు చెట్టి...... చెట్టి......" " ఏడ్చావు... కొంపతీసి "చెట్టియార్ స్ట్రీటా????" " ఆ... అ.. ఖచ్చితంగా అదే నాన్న." " అంతే.. ఆనందరావు చేతిలో సెల్ కిందపడి ముక్కలు కాలేదు . ఎవరో అతని గుండెల మీద కు పెద్ద కొబ్బరి బొండం విసిరితే "" అది ??!! "" పదహారు ముక్కలుగా పగిలిపోయిన భావన కలిగింది. 00000 00000000 00 0 కాకినాడ.... రామారావు పేట, మే.....( చివరి వారం)..2020. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ పరిస్థితులు కొంచెం చక్కబడి చక్కబడనట్లు ఉన్నాయి. సర్దు కున్నట్టు కనిపించి విజృంభి స్తున్నాయి. అయినా ప్రజాఅవసరం,అభివృద్ధి కుంటుపడకుండా ఉండడం రీత్యా ముఖ్యమైన కొన్నిబస్సులు, ట్రైన్ లు తిరుగు తాయని ... ఆన్ లైన్ బుకింగ్ మళ్లీ మొదలవు తుందని ... టీవీన్యూస్ విన్నాడు ఆనందరావు. కొడుకు నుండి యధార్థ విషయం తెలుసుకొని నెల రోజులు గడిచింది. ఈ నెల రోజులు దీక్షగా, తదేకంగా ఆలోచించిన ఆనందరావు ఒక నిర్ణయానికి వచ్చాడు..అనేకన్నా .."వచ్చేసాడు".అనొచ్చు!!! "" నా దృష్టిలో నా తమ్ముడు "వెధవ".!!..... నా తమ్ముడు దృష్టిలో..నేను.." పెద్దవెధవనేమో"!!!"".. ఏ సమస్యనైనా ఎదుటివారి కోణంనుంచి ఆలోచించాలి అన్నారు పెద్దలు. నిజమే.. ఖచ్చి తంగా నిజం!"" ఇదీ.. ప్రస్తుతం ఆనందరావు.. ఆలోచనా ధోరణి. '"అవును..తప్పులు అందరం చేస్తాం.అయితే ఆ తప్పులుదిద్దుకునే అవకాశం కలిగినప్పుడు... ""దిద్దుకోవాలి"".....అన్న స్పృహ కలిగించు కొని ముందుకుసాగాలి. గతం గతః ... అన్నట్టు అందరూ బ్రతికితే బాగుంటుంది!! రెండు దశాబ్దాలు.. 20 సంవత్సరాలు.. చాలా సుదీర్ఘం! ఇరవై సంక్రాంతులు..ఇరవైఉగాదులు.. ఇరవైదీపావళిలు! ఎలా నిస్సత్తువుగా గడిచిపోయాయి. గభాలున కుర్చీలోంచి లేచి.. 'సిస్టం' దగ్గర కూర్చున్నాడు ఆనందరావు. రెండు టికెట్లు.. తనకు , తనభార్యకు..అన్ లైన్ బుకింగ్ చేసుకున్నాడు... చెన్నై వెళ్లడానికి...! చెన్నైలో తన కొడుకును చూడాలి.. అంతేనా.. అందరూ కలసి సర్ ప్రైజ్ చేసేలా " చెట్టియార్ స్ట్రీట్ " సడన్ గా వెళ్లి వారంరోజులు ఆనందంగా గడపాలి.... ఆ ఇంట్లో.. తమ్ముడు ఇంట్లో!!!!!! తిరుగులేని తన నిర్ణయంతో.. మహమ్మారి కోవిడ్ ఈభూప్రపంచం వదిలి పారిపోయి నంతగా... ఇప్పుడు.. ఆనందరావు....పరమా నందభరితుడైపోతున్నాడు.!!! 000000 00000 000

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ