" భూత్ బంగ్లా" - Dr.Vivekanand Rayapeddi

Bhoot Bangla

హారర్ సినిమా చూసి వస్తున్నాం నేను మా శ్రీమతి.
కార్ వైపర్స్ నిరంతరాయంగా పని చేస్తున్నా రోడ్డు స్పష్టంగా కనిపించటం లేదు. వర్షం కారణంగా నెమ్మదిగానే నడుపుతున్నాను. ఏసీ ఆన్ చేయకున్నా వాతావరణం చాలా చల్లగా వుంది.
మా ఇల్లు నగరానికి కాస్తా విసిరేసినట్టుండే కాలనీలో వుంటుంది. ఎంతలేదన్నా ఇంకో గంట ప్రయాణం వుంది.
"సినిమా ఏం బాగాలేదు" పెదవి విరుస్తూ అంది నా శ్రీమతి, "మీకోకటి తెలుసా, మా చిన్నప్పుడు మేము ఓ అద్దె ఇంట్లో ఉండేవారం, ఆ ఇంట్లో దెయ్యాలుండేవని చెపుతుండే వారు మా స్నేహితురాళ్ళు. మేము నాలుగేళ్ళున్నా మాకొక్క దెయ్యం కూడా కనిపించలేదు ఆ ఇంట్లో"
" అవునా, నా చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పనా? ఖచ్చితంగా ఈ హారర్ సినిమాకంటే థ్రిల్లింగా వుంటాయి" అన్నాను నేను.
"సరే చెప్పండి, ఇల్లు చేరే వరకు కాలక్షేపంగా బాగా వుంటుంది" ప్రోత్సహించింది శ్రీమతి.
సరే మీరు కూడా వినండి
*****
జమ్మలమడుగు అంటే ఫాక్షన్ సినిమాలు చూసే వారెవరయినా భయపడటం సహజం. అలాంటి జమ్మలమడుగులో నా బాల్యం ఒక సంవత్సరం గడిచింది. ఆ ఒక్క సంవత్సరంలో ఎదురైన అనుభవాలు జీవిత పర్యంతం మరచి పోగలనా? ఆ అనుభూతులు ఇప్పుడే జరిగినంత తాజాగా నామనోఫలకంపై ముద్రించుకునిపోయాయి.
కాకపోతే మేము రాయలసీమ తాలూకు ఫాక్షనిజం వల్ల కష్టాలు ఏమీ ఎదుర్కోలేదు కాని, ఇంకో రకంగా భయంకర అనుభూతుల్ని పొందటం జరిగింది.
దాన్ని దెయ్యం అనాలా లేక ఏదైనా మానవాతీత శక్తా అన్నది మాకు ఎన్నటికీ అర్థం కాని ఒక ఆశ్చర్యం. కానీ కథాసౌలభ్యం కోసరం దాన్ని దెయ్యం అని అనుకుందాం. కథంతా విన్నాక అది ఏమిటి అన్న విషయం మీరుకూడా ఆలోచించి నాతో చెబుదురు గాని.
దెయ్యంతో మా కుటుంబం ఎదుర్కొన్న కొన్ని చిత్రమైన అనుభవాల్ని చెప్తాను వినండి.
ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు. నేనో ప్రొఫెసర్‍గా పని చేస్తున్నాను. సమాజంలో ఇప్పుడు నేనున్న స్థాయిలో ఇలాంటి విషయాలు ఎవరికయినా చెప్పినా, ఏమయ్యా చదువుకున్నవాడివి, నలుగురికి శాస్త్రీయమైన అంశాలు చెప్పే వాడివి, నీవే ఇలా మూఢనమ్మకాల్ని ప్రోత్సహించవచ్చా అని నాకే క్లాసు పీకుతారేమోనన్న జంకు వల్ల ఈ విషయాలు ఎవరికి చెప్పుకోలేదు, చివరికి కట్టుకున్న పెళ్ళానికి కూడా చెప్పలేదంటే మీరే అర్థం చేసుకోండి.
దాన్ని ప్రత్యక్షంగా చూసిన మా అప్ప. ఆ అనుభవాన్ని ఆయన అందరికీ చెపుతున్నప్పుడు విన్న ఆ అనుభూతి ఇంకా నాకు గుర్తుంది. అప్పటికి నాకూ మహా అంటే పన్నెండేళ్ళు వుంటాయి. ఇది జరిగి దాదాపు ముఫై ఎనిమిది సంవత్సరాలు అయినా అది నిన్నో, మెన్నో జరిగినట్టుగా తాజాగా వుంది నా స్మృతిలో. అక్కడి విషయాలన్నీఇప్పటికీ నాకు పూస గుచ్చినట్టు గుర్తున్నాయి. ఆ అనుభవాలు చిత్రంగా వుంటాయి. నాస్తికులు నమ్మకుంటే నేనేమీ చేయలేను.
మా అప్పకి ( నాన్న గారికి) ఒక భయానకమైన అనుభూతిని కలిగించేలా దెయ్యం కనిపించింది ఆ ఇంట్లో.
ఆ ఇంట్లో మా చుట్టాలామెకి కనిపించింది దెయ్యం ఒక సారి కాదు, అనేక మార్లు.
నాకూ ఓ చిన్న సైజు అనుభూతి కలిగింది. అన్నీ వివరంగా చెపుతాను ఈ ఎపిసోడ్‍లోనే.
మా అప్పకు డిప్యూటి కలెక్టర్‍గా పోష్టింగ్ రావటంతో మా కుటుంబం జమ్మలమడుగు రావటం జరిగింది. సినిమాలలో చూపించే విధంగా ఏమి వుండదు అక్కడి పరిస్థితి. మనుషులంతా చాలా స్నేహశీలురు, కష్ట జీవులు. అక్కడి ప్రజలు చాలా అమాయకులు, నమ్మితే ప్రాణం ఇస్తారు.
మాకు దొరికిన ఇల్లు చాలా పెద్దది. అదేం ఊరికి దూరంగా కూడా ఏమి ఉండదు. మామూలుగా అన్ని ఇళ్ళ మధ్యనే ఉండేది. మా ఇంటి ఓనర్స్ కూడా మా ప్రక్కింట్లోనే ఉండేవారు. అప్పట్లో ఏవిధమైన ఆధునికమైన సౌకర్యాలు ఉండేవి కాదు ఆ ఇంట్లో. ఒక పెద్ద ఇల్లు అంతే.
ఇప్పట్లో కనీస సౌకర్యాలైనట్టి ఓవర్ హెడ్ టాంకు, బాత్రూముల్లో కొళాయిలు కూడా వుండేవి కావు. మా ఇంటెదురుగా రోడ్డుకటువైపు వున్న ఓ పెద్ద ఓపెన్ ప్లాటులో ఓ బావుండేది. మా నౌకర్లు ప్రొద్దునా, సాయంత్రం నీరు చేది బాత్రూంలో తొట్లలో నీరునింపే వారు. . నౌకర్లు పగలు మాత్రం పని చేసి వెళ్ళిపోయే వారు. రాత్రి కేవలం మా కుటుంబ సభ్యులం మాత్రమే వుండేవారం.
ఇంకో విషయం చెప్పాలి. అప్పుడు మేము గమనించలేదు గాని, ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే జ్ఞాపకం వస్తోంది. ఆ వీధిలోని వారు అనేక మంది వచ్చి అదే బావిలో నీరు చేదుకునివెళ్ళే వారు. వారంతా ఒక విధమైన ఆసక్తితో మాఇంటి వంక చూసే వారు. ’అరె! ఇందులో బాడుగకు (అద్దెకు) మనుష్యులు దిగారే’ అన్న ఆశ్చర్యం వారి కళ్ళలో కనిపించేది. కొందరు మాకు ఏదో చెప్పబోయి, తిరిగి మనకెందుకులే తంటా అన్నట్టువెళ్ళిపోయేవారు. మా ఇంటి ఒనర్లు కాస్తా బలమైన మనుషులు అన్నివిధాలా. అందువల్లనుకుంటాను జనం వెనుకంజ వేసేవారు.
ఆ ఇంట్లో ఓ రెండు గదులు తాళాలు వేయబడి, మా అధీనంలో లేకుండా , ఓనర్ల అధీనంలో వున్నాయి. ఆ రెండు గదులనుంచీ చిన్న చిన్న చప్పుళ్ళు వినిపించేవి అప్పుడప్పుడూ, ఎలకల వల్లనుకుంటాను .
మేడపైన ఓ పెద్ద గది, దానికి అటు, ఇటూ పేద్ద వరండాలు వుండేవి. ముందు వేపు వరండా మెయిన్ రోడ్ వైపుంటుంది. వెనుకువైపు వరండా దాటంగానే పెద్ద ఆరు బయలు. ఆ ఆరుబయలును కప్పేస్తూ ఇందాక చెప్పిన వేప చెట్టు కొమ్మలు విస్తారంగా ఆక్రమించి నీడను ఇస్తూ వుండేవి.
ఇంకా ఓపెన్ స్పేస్ కావాలంటే గది పైకి చేరుకుంటే బోలెడు ఓపెన్ స్పేస్.
ఇంటి వెనుక కాస్త దగ్గరగానే పెన్నా నది కనిపించేది. ప్రకృతి ప్రేమికులకు ఇదో బోనస్. కాకపోతే పెన్నానదిలొ అరుదుగా నీళ్ళు ప్రవహించేవి. ఎప్పుడన్నా బాగా వర్షాలు వచ్చి, మైలవరం (కడప జిల్లా) డ్యాం గేట్లు తీస్తే అందులో నీళ్ళు ప్రవహిస్తాయి, లేదంటే నిరంతరం ఇసుక మేటలు కనిపిస్తూ వుంటాయి.
వేపచెట్టు కొమ్మలు అడ్డుగా వుండటం వల్ల మొదటి అంతస్థునుంచి చూచాయగాను, పై అంతస్థునుంచి బాగా స్పష్టంగాను కనిపించేది పెన్నానది. మా ఇంటి వెనుక ఇంకేమీ ఇండ్లువుండేవి కావు, మా ఓనర్ల తాలూకు చేనేత మగ్గాలు, పశువల శాలలు కనిపిస్తుంటాయి, వాటి కాంపౌండ్ వాల్ అయినపిమ్మట, బీడుపడిన పొలాలు, వాటి తర్వాత నది. ఈ బీడు భూములలోనే పెద్ద వృక్షం ఒకటి వుండేది. అది ఏ చెట్టో నాకు సరిగ్గా గురుతు లేదు. పిల్లతనం ఉత్సాహంలో తెలిసేది కాదు గాని, అదేమి పెద్ద సేఫ్ ఎన్విరాన్‍మెంట్ కాదని ఇప్పుడనిపిస్తోంది.
పూర్తిగా రాంగోపాల్ వర్మ హారర్ సినిమాలకు సరిపోయే నేపధ్యం.
ఇక అసలు కథలోకి వద్దాం.
ఆ వృక్షం ఏదయితే వుందో దానిపై బోలెడు పక్షులు, కోతులు వుండేవి. కోతులు పగలంతా నిరంతరం పోట్లాడుకోవటం, పరిగెత్తి గెంతులెయ్యటం, గట్టి గట్టిగా అరచుకోవటం, దెబ్బలాడుకోవడం చేస్తువుండేవి .
ఇక పక్షుల విషయానికి వస్తే అవి తెల్లవారు ఝామున, సాయంసమయాన కిలకిలారావాలతో తెగ చిరాకు పెట్టేవి. అయితే రాత్రయ్యేటప్పటికి అవన్నీ నిశ్శబ్దంగా అయిపోయేవి. చిత్రమైన విషయం ఏమిటంటే, రాత్రుళ్ళు నిశ్శబ్దంగా వుండే ఈ జీవులన్నీఒక్కోసారి అరుదుగా, రాత్రిపూట కూడా వున్నట్టుండి తీవ్ర సంచలనం చేసేవి. చాలాసేపటి తర్వాత అన్నీ సద్దుమణిగేవి. అదెందుకో మాకర్థం అయ్యేది కాదు అప్పట్లో (అఫ్‍కోర్స్ ఇప్పటికీ అనుకోండి).
కడపజిల్లాలో ఎండాకాలం చాలా భయంకరంగా వుంటుంది. పగలంతా చండప్రచండంగా మార్తాండుడు తన ప్రతాపం చూపిస్తాడు, ఇక రాత్రంతా ఉక్కపోత. ఈ కారణం వల్ల రాయలసీమలో ప్రజలు రాత్రిళ్ళు ఇంటిముందర ఆరుబయల్లో పడుకుని నిద్రపోయేవారు. మేడలున్న వారు మేడలపై పడుకొనే వారు. ఇది చాలా సహజమైన విషయం అక్కడి ప్రాంతాలలో. చిత్రంగా మా వీధీలో ఎవ్వరూ కూడా ఇలా ఓపెన్ ఎయిర్‍లో పడుకొనేవారు కాదు. ఇప్పుడు గుర్తొస్తొంది ఆ సంగతి కూడా.
మా కుటుంబం మాత్రం మేడపై ఓపెన్ ఎయిర్లో పడుకొనే వారం నిశ్చింతగా. రాత్రి ఎనిమిది, ఎనిమిదిన్నరకల్లా పడుకోనేవారం ఆ రోజుల్లో. నౌకర్లు మంచాలు, దోమతెరలు ఏర్పాటు చేసి వెళ్ళే వారు. కబుర్లు చెప్ప్కున్నంతసేపు చెప్పుకుని క్రమంగా హాయిగా నిద్రలోకి జారుకునే వారం.
మా అప్ప మాత్రం మా గోలకి దూరంగా, పైమిద్దె పైకి వెళ్ళి పడుకొనే వారు. మేం పిల్లలం వెళ్ళి త్రాగే నీళ్ళ చెంబు, గ్లాసు పెట్టి వచ్చే వారం. మా అప్ప ట్రాన్సిస్టర్ తీసుకుని పైకి వెళ్ళి ఆకాశవాణిలో ఇంగ్లీష్ వార్తలు విని, ఏవయినా కర్ణాటక సంగీతాన్నో, ఏదయినా చర్చావేదికో వింటూ నిద్రలోకి జారుకొనేవారు. ఆ రోజుల్లో ఇంటిపెద్దలందరి పద్దతి ఇలాగె వుండేది.
ఇక నాకు ఒళ్ళు గగుర్పొడిచిన ఒక చిన్న అనుభూతిని మీకు చెప్తాను.
ఒక మధ్య రాత్రి పక్షులు, కోతులు గోలగోలగా అరుస్తుంటే నాకు మెలకువ వచ్చింది. బాగా అలసిపొయినట్టున్నారు ఇంకెవ్వరికి మెలకువ రాలేదు. యధాలాపంగా ఆ పెద్ద వృక్షాన్ని చూసి కాస్తా అదిరిపడ్డాను. పైనున్న చెట్టుకొమ్మకు ఎవరో మనిషి ఉరివేసుకుని వేలాడుతున్నట్టు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే తలనుండి కాళ్ళదాకా తెల్లటి నీడలాగా, మనిషి ఆకారంలో కత్తిరించిన ఒక తెల్లటి కటౌట్ లాగా వుంది తప్పనిచ్చి స్పష్టంగా జుత్తు, కాళ్ళు, చేతులు కనిపించలేదు. ఏదో భ్రమలెమ్మనుకుని నిద్రలోకి జారిపొయాను. క్రమంగా కోతులు, పక్షుల చప్పుళ్ళూ మందగించాయి.
తెల్లవారి మామూలుగానే మెలకువ వచ్చింది.భయపడాలి అని కూడా తెలిసే వయసు కాదది. అందరూ కాఫీలు త్రాగుతూవుండగా వెళ్ళి ఈ అనుభవాన్ని చెప్పాను, కాకపోతే ఉరివేసుకున్నట్టు కనపడింది అన్నది మినహాయించి చెట్టుపై ఏదో తెల్లటి ఆకారం కనపడింది అనె చెప్పాను. ఉరి గిరి అంటే వయసుకు మించి మాట్లాడుతున్నానని కేకలేస్తారేమోనని కాస్తా భయపడ్డాను.
నేనూహించినట్టే అంతా తేలిగ్గా కొట్టేశారు, ఉత్తి భ్రమ అయివుంటుందని, నిద్రలో కలవచ్చివుంటుందని తీర్మానం చేసేసి ఆ విషయం అంతటితో ముగించారు.
ఇది జరిగిన కొన్ని రోజులకి ఇంకో చిత్రం జరిగింది.
మా పెద్దక్కయ్య అప్పుడు నిండు గర్భిణి. మా అక్కయ్య ఆరుబయట పడుకోకుండా మేడపైనే వున్న పెద్ద గదిలో పడుకొంది. ఆమెకు తోడుగా మా చుట్టాలావిడ ఒకరు పడుకొనే వారు. మేమంతా మేడమీదే, ఆగది బయట ఆరుబయల్లో పడుకోని ఉన్నాం. మా నాన్నగారు పై అంతస్థులో ఆరుబయల్లో పడుకుని వున్నారు.
ఒక సారి మధ్య రాత్రప్పుడు మా చుట్టాలావిడకి మెలకువ వచ్చి చూస్తే ప్రక్కనే మంచి వర్చస్సుతో కూడిన ఒక పెద్ద ముత్తైదువ కూర్చుని చిరునవ్వుతో పలకరించిందట. ఆమెవరో తెలియకున్నా మా చుట్టాలావిడ మొహమాటానికి చిరునవ్వు నవ్విందట. ఆ తర్వాత ఆమె చాలా చక్కగా కబుర్లు చెప్పి వెళ్ళిపోయేదట.
ఇలా కొన్ని రోజులు జరిగిందట. ఆ వచ్చినావిడ ఒకోసారి చాలా ఉత్సాహంగా కబుర్లు చెప్పేదట, ఒక్కోసారి దిగులుగా వుండేదట. ఒక్కోసారి అకారణంగా కోపం తెచ్చేసుకుని కర్ర తీసుకుని ఎడాపెడా మా చుట్టాలావిడని కొట్టేసేదట.
ఇంకా చిత్రమైన విషయమేటిటంటే ఆ వచ్చే ఆవిడ (దెయ్యం?) ఒక్కోరోజు ఒక్కో వ్యక్తి రూపంలో కనపడేదట. అదీ బ్రతికున్నవారి రూపాలలోనే. సాక్షాత్తు అప్పటికి బ్రతికే వున్న మా దగ్గర బంధువుల రూపాలలోనే వేర్వేరు రూపాలతో వచ్చేదట.
ఇవేవీ ఆమె మాకు చెప్పేది కూడా కాదు. ఒక సంఘటన జరిగే దాకా. ఆ సంఘటన ఏంటో చెపుతాను వినండి.
ఇదే అన్నిటికన్నా తీవ్రమయిన సంఘటన. అయితే ఒకటి మాత్రం నిజం. ఏ సంఘటనలోనూ ఎవ్వరికీ అపకారం గాని, గాయాలు గానీ కలుగలేదు.
అది మంచి పున్నమి రాత్రి. అంతా పడుకొని వున్నాం. నేను, మా ఇద్దరక్కయ్యలు, మా అమ్మగారు, మా పెద్దన్నయ్య మొదటి అంతస్థు ఆరుబయల్లోనూ, మా పెద్దక్కయ్య, చుట్టాలావిడ గదిలోనూ, మా నాన్నగారు పై అంతస్థు ఆరుబయల్లోనూ ఇలా ఎవరి స్థానాలలో వాళ్ళు పడుకుని ప్రశాంతంగా పడుకుని వున్నాం.
సాధారణంగా మా నాన్నగారు దేనికీ పెద్దగా ఉద్వేగానికి గురవ్వరు. ఆయనకి మూఢనమ్మకాలు కూడా ఏమీ లేవు. పిచ్చి పిచ్చి నమ్మకాలు, తాయెత్తులు గట్రా సెంటిమెంట్లు కూడా ఏమీలేవు. అలాంటి కథలు ఎవరయినా చెపితే కూడా నవ్వి వదిలేస్తారు.
కాస్తా సందడిగా అనిపించి, సడెన్‍గా మెలకువ వచ్చి లేచి కూర్చున్నాను ఒక రాత్రి. నాన్న గారు మాట్లాడుతున్నట్లు, ఏదో విషయమై చాలా ఉద్వేగంగా చెపుతున్నట్టు, అనిపించి కళ్ళు తెరచి చూశాను.
నిజంగానే మా నాన్నగారు మేడపైనుంచి దిగి వచ్చారు. ఆయన బనీన్ అంతా చెమటతో తడిసి పోయుంది. బాగా ఆయాస పడిపోతున్నారు. ఏదో విషయమై తీవ్రంగా ఉద్వేగపడి వివరిస్తున్నారు మా అమ్మగారికి.
అప్పటికే అందరూ లేచి ఆయన చుట్టు కూర్చుని ఆయనని నెమ్మదింపజేస్తున్నారు.
నేను వెళ్ళి మాఅమ్మగారిప్రక్కనే కూర్చున్నాను. నాకర్థమయినదాన్ని బట్టి ఆయన అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటనని చూశారు. నమ్మశక్యం గాని ఆ విషయమేటంటె, .............

*****
ఎప్పట్లాగే ఆకాశవాణిలో ఇంగ్లీష్ వార్తలు విని, కాసేపు సంగీతమేదో విని ట్రాన్సిస్టర్ రేడియోని ఆపేసి నిద్రకుపక్రమించారట మా నాన్నగారు ఆరాత్రి కూడా.

ఒక రాత్రప్పుడు ఎవరో తట్టిలేపుతున్నట్టనిపిస్తే మెలకువ వచ్చిందట. మెలకువ వచ్చి కళ్ళు కూడా తెరవకముందే ఆయనకి పక్షుల గోల, కోతుల అలజడి వినిపించిందట. ఏంట్రా తెల్లవారిందా అని అనుకుని కళ్ళు తెరిచి చూస్తే ఇంకా చీకటి వీడలేదు.
అప్పుడు వినిపించిందట ఆయనకి "ఒరే హనుమంతుడూ (మా అప్ప పేరు హనుమంతరావు గారు) బావున్నావా?" అన్నపిలుపు ఆప్యాయంగా.
అప్పుడు చూశాడట మానాన్నగారు రమణమ్మని.
ఆవిడ మాకు దూరపు బంధువు. కాని వారి కుటుంబంతొ మాకు బాగా సాన్నిహిత్యం వుంది . మా నాన్న గారికంటే బాగా పెద్దావిడ ఆమె. అందుకే ఆయనని ’ఒరె, నీవు అని ఏకవచనంతో సంబోధించే చనువు వుంది ఆవిడకి. రమణమ్మగారు పెద్దముత్తైదువ. అప్పటికే అరవైపైన వుంటాయి ఆవిడకి. పెద్ద కుంకుమ బొట్టు, సోడాబుడ్డి లాంటి కళ్ళజోడు, చింపిరి జుత్తు, మడతలు పడి నలిగిపోయిన కాటన్ చీర, ఆవిడ అప్పుడే ప్రయాణం చేసొచ్చినట్టుంది.
చాలాసేపు అప్యాయంగా మాట్లాడిందిట, అందరి గురించి పేరు పేరునా క్షేమసమాచారాలు అడిగి కనుక్కుందిట. వాళ్ళ ఊరి విశేషాలు, క్షేమ సమాచారాలు తెలియజెప్పిందిట. ఆవిడ నిజంగానే మా రమణమ్మ అత్త అనే అనుకున్నాడట మా నాన్న.
ఆవిడ ప్రవర్తన తేడాగా ఏమీ అనిపించలేదు. అప్పుడే ప్రయాణం చేసొచ్చి అలసటగా వున్నాసరే పలకరించాలని పైకి వచ్చి మాట్లాడిస్తోంది అనే అనుకున్నారట.
కాసేపయ్యాక ’పదరా క్రిందకెళదాం అందరం కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చని’ చెప్పి నడవటం మొదలెట్టింది రమణమ్మ.
ఆవిడ వెనుకే మానాన్నగారు కూడా నడవటం మొదలెట్టారు. మేడపైన సగం దాకా వచ్చాక , మెట్లున్నవైపుకి ఎడంవేపుకి తిరగాలి. కాని ఆవిడ మెట్లున్న వైపునకు కాకుండా తిన్నగా ముందుకే వెళుతోందట. అలాగే ముందుకు వెడితే పారపెట్ వాల్ కూడా లేని ఆ మూడంతస్తుల మేడపై నుంచి కింద పడటం ఖాయం. క్రింద మా ఓనర్ల తాలుకు పశువుల శాల, మగ్గాలు వున్నాయి.
’రమణమ్మా అలా కాదు, ఇటు వేపు’ అని మా నాన్న హెచ్చరిస్తూనే వున్నా కూడా ఆవిడ ఇక ఏమీ పలక్కుండా అలాగే ముందుకే వెళ్ళి వెళ్ళి అలాగే నడచుకుంటు, కాళ్ళక్రింద ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత కూడా కాసేపు గాల్లోనే నడిచి ఆపై అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయి చూస్తూ వుండగానే గాల్లో కలిసిపోయిందట. మధ్యలో ఒకట్రెండు సార్లు తన వెనుకే రమ్మని మా నాన్నగారిని ప్రోత్సహించిందట కూడ.
మొదటి సారి అప్పుడు కలిగింది భయం మా నాన్నగారికి.
పెద్దగా కేకలు పెట్టుకుంటు పరిగేట్టుకుంటు క్రిందికి వచ్చేశారు.
అదీ జరిగింది.
ఇది ఏదో సినిమాలో అయితే చూడటానికి బాగుంటుంది కాని ఒక సామాన్యమయిన మనిషికి అస్సలు ఎన్నడూ ఊహకుకూడా రాని విధంగా ఇలా జరిగితే ఎలా ఉంటుందో వివరించటానికి మాటలు చాలవు. ఆ రాత్రి ఎవ్వరికి నిద్ర లేదు. అలాగే చర్చించుకుంటూ వుండిపోయారు పెద్ద వాళ్ళందరు.
ఇది భ్రమనా నిజమా అని చాలా సేపు విచికిత్సకి గురయ్యారు. ఏదయినా పీడకల వచ్చిందేమోనని కూడా అనుకున్నారు. ఘంటాపదంగా మా నాన్నగారు అది నిజంగా జరిగిందేనని నొక్కివక్కాణించారు.
ఈ హడావుడికి గదిలో పడుకున్న మా చుట్టాలావిడ కూడా బయటకు వచ్చి జరిగిందంతా విని, అప్పుడు ఏకరువు పెట్టింది తన అనుభవాల్ని.
అందరికీ మిడిగుడ్లు పడ్డాయి.
తరువాత ఉదయాన్నే రమణమ్మ వాళ్ళ ఊరికి ఎస్.టీ.డీ కాల్ బుక్ చేసి మాట్లాడితే ఆవిడ నిక్షేపంగా వున్నారని తెలిసింది.
ఇలా లాజిక్‍కి అందని సంఘటనలు జరిగాయి ఆ ఇంట్లో. అయినా మా వాళ్ళు ఇల్లు మార్చాలని ఏమీ అనుకోలేదు.
మరో ఆరునెలలకు మా నాన్నగారికి నూజివీడు ట్రాన్స్ఫర్ అయ్యింది.
అంతే ఇంతకు మించి ఏమి జరగకున్నా, మాటల్లో వ్యక్త పరచలేని ఒక విధమైన్ ఉద్విగ్నతకి గురవుతాము మా ఇంట్లో అందరమూ ఈ సంఘటనల్ని తలుచుకున్నప్పుడల్లా.

****
"ఓ! మై గాడ్ ఇదంతా నిజమా!" గుడ్లు తేలేసింది నా శ్రీమతి.

ప్రియమైన పాఠకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది.
మేమా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన అయిదారు సంవత్సరాల తర్వాత అదే ఇంట్లో అద్దెకి దిగారట మా శ్రీమతి వాళ్ళు, తన చిన్నతనంలో. చిత్రంగా వారికి ఎటువంటి అనుభవాలు ఎదురు కాలేదట. మా శ్రీమతి వాళ్ళ స్నేహితురాళ్ళు చాలానే చెప్పారట ఆ ఇంటి గురించి స్కూలుకు వెళ్ళినప్పుడు.
మాకెవ్వరూ చూచాయగా కూడా చెప్పలేదు, కానీ మాకేమో చిత్రాతిచిత్రమైన అనుభవాలు.
ఏంటొ అంతా విచిత్రం.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ