ఎవరు? - దినవహి సత్యవతి

Evaru

నిద్రపట్టక మంచంపై దొర్లీ దొర్లీ విసుగొచ్చి టైం చూసాను. పన్నెండు కావొస్తోంది. దోమలు కుట్టి చంపేస్తుంటే లేచి దోమతెర కట్టి మంచినీళ్ళు త్రాగొచ్చి మళ్ళీ పడుకున్నాను.

ఎంతసేపయిందో తెలియదు ఏవో రెండు కబంధ హస్తాలు నా మెడ చుట్టూ బిగిసి గట్టిగా నొక్కుతున్నట్లై ఊపిరాడక ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అతికష్టం మీద కళ్ళు పైకెత్తి చూసాను.... మసక వెలుతురులో తల దగ్గర ఎవరిదో ఒక పెద్ద ఆకారం అస్పష్టంగా కనిపించింది!

భయంతో నాలుక పిడచ కట్టింది. చేతులు వెనక్కి జాపి మృత్యు హస్తాలనుంచి నన్ను నేను కాపాడుకుందామంటే వెధవ దోమతెర అడ్డొచ్చింది....కట్టకుండా ఉన్నా బాగుండేది!

“ఎవరూ ఎవరదీ” అరుస్తున్నాను కానీ మాట పెగిలితే కదా......గొంతు మీద పట్టు బిగిస్తూ “నన్నే జైలుకి పంపుతావూ! చూడు నిన్నేం చేస్తానో! నాతోనే పెట్టుకుంటావా? నీ పని సరి ఇవాల్టితో..హ..హ..హా..” కసితో కూడిన బెదిరింపులూ వెన్నంటి వికృతమైన నవ్వూ....ఆ ఆకారం ఎవరో తెలియదు..అసలు అక్కడ ఎవరన్నా ఉన్నారో లేదో తెలియదు...ఎవరూ ఇంట్లోకి వచ్చే అవకాశమే లేదు....మరిది ఎవరు?

‘అబ్బా......మెడ నొప్పి’ ..అతికష్టం మీద మళ్ళీ కళ్ళు పైకెత్తి నా తలదగ్గర నిలబడిన ఆకారాన్ని, మసక వెలుతురులో పరీక్షగా చూసాను...ఎర్ర జుట్టూ...తెల్ల లాల్చీ...మిడిగుడ్లూ....బండ గొంతూ వాడి జుగుప్సాకారానికి తోడు ఎత్తు పళ్ళూ భయంకరమైన నవ్వూ...అమ్మోయ్!

‘అబ్బా....వదులూ వదులూ....’ అరిచాననుకున్నాను కానీ గొంతులోంచి కీచుమన్న శబ్దం మాత్రమే వచ్చింది! మెడ నెమ్మది నెమ్మదిగా ఆకారం చేతిలోకి వెళ్ళిపోతోంది...నా బాధ చూసి ఆకారం పైశాచికత్వం మితిమీరుతోంది...’ఇవాల్టితో నీ పని ఠా! హ్హ..హ్హ..అహ్హహ్హ’ ఇక్కడ ప్రాణాలు కడగడుతుంటే ఆ బొంగురు గొంతుకు తోడు వెధవ నవ్వొకటి..

‘దేవుడా కాపాడు’ అనుకున్నానో లేదో....హఠాత్తుగా మెడపైన పట్టు వదిలింది...గబుక్కున మంచంపై బోర్ల తిరిగి కళ్ళు చిట్లించి చూద్దును కదా....ఆ ఆకారం నడుచుకుంటూ పోతున్నదల్లా అధాటుగ వెనక్కితిరిగి చూపుడు వేలుతో బెదిరించి చటుక్కున మాయమైంది.......గుండె ఠారుమంది. అటే గుడ్లప్పగించి చూస్తుండిపోయాను.......మరి కంటి మీదకి కునుకొస్తే ఒట్టు!

!+!+!+!

మర్నాడంతా రాత్రి సంఘటనే బుర్రలో మెదిలి కలవరపెట్టింది.....ఇంట్లో ఒక్కర్తినే ఉన్నాను. తనకి దూరపు బంధువు వరుసకి అన్నయ్య ఒకాయన ధర్మోదకాలని వెళ్ళిన అమ్మ కొరోనా కారణంగా అక్కడే చిక్కడి పోయింది.

రాత్రి సంఘటన కలా నిజమా తెలియటంలేదు....అయితే ఒక్కటి మాత్రం మనసుని తొలుస్తోంది...ఆ ఆకారాన్ని ఎక్కడో చూసాను...ఎవరూ ఎక్కడన్నది ఎంత బుర్ర పగులగొట్టుకున్నా జ్ఞాపకం రావటంలేదు ..

నిజమనుకోవటానికి లేదు ఎందుకంటే సుమారు 250 ఫ్లాట్స్ ఉన్న మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోకి వాచ్మెన్ అనుమతి లేకుండా చీమ దూరే అవకశమైనా లేదు. అంత పటిష్ఠమైన సురక్ష. అక్కడికీ సెక్యూరిటీని అడిగాను నాకోసం ఎవరైనా వచ్చారా రాత్రి అని.......లేదని సమాధానం వచ్చింది......

కల అనుకుందామంటే నా మెడ మీద ఒరిసిపోయినట్లయింది....అసలింతకీ ఆ ఆకారం ఎవరు? నేనెరుగుదునా? ఏం జరుగుతోంది? ఒకవేళ భయంతో నేనే నిద్రలో మెడ బరికేసుకుంటున్నానా?....

ఇలా సమాధానంలేని ప్రశ్నలెన్నో మెదడుని తొలుస్తున్నాయి.....అమ్మకి చెప్దామనుకుని కూడ అనవసరంగా ఆందోళన చెందుతుందని మానుకున్నాను.......

రాత్రవుతోందంటే భయమేస్తోంది...... భోజనానంతరం చిక్కటి టీ త్రాగాను ఇవాళ ఎలాగైనా మెలకువగా ఉండి ఆకారాం సంగతి తేలుద్దామని.....కానీ అదేమిటో చిత్రంగా సరిగ్గా అర్థరాత్రయ్యేటప్పటికి కళ్ళు నిద్రతో బరువెక్కి మూసుకుపోయాయి.....గాఢ నిద్రలో ఉండగా....రెండు చేతులు మెడ నొక్కుతున్నట్లు......వెనువెంటనే వికటాట్టహాసం.... విడిపించుకుందామని పెనుగులాడుతూనే చేతులు జాపి ఆకారాన్ని పట్టుకుందామని విశ్వప్రయత్నం చేసాను..... చిత్రంగా ఉన్నట్లుండి మెడ వదిలి తర్జనితో నన్ను బెదిరిస్తూ చూస్తుండగానే ఆ ఆకారం గాలిలోకి లేచి మాయమైంది......భయంతో ముచ్చెమటలు పట్టాయి ధభాలున లేచి కూర్చున్నాను.......

!+!+!

మర్నాడు ఉదయం పది గంటలకి అమ్మ ఫోను. కుశల ప్రశ్నలయ్యాక “అన్నట్లు మంగళా నీకు గుర్తుందా..గతంలో ఒక కేసులో నువ్వు సాక్ష్యం చెప్పగా ఉరిశిక్ష పడింది ఒక రౌడీవెధవకి .జైలుకెళుతూ నిన్ను బెదిరించాడూ....వాడిని ఇవాళ ఉరి తీసారు. టి.వి.లో చూపిస్తున్నారు చూడు” అంది.

టి.వి. ఆన్ చేసి వార్తలు పెట్టాను .....దస్తగిరికి ఉరి.....మూడు సంవత్సరాల క్రితం వరుస హత్యల కేసులో ఉరిశిక్ష పడిన దస్తగిరిని ఇవాళ ఉదయం ఆరు గంటలకు ఉరి తీసారు......

అప్పుడు గుర్తొచ్చింది... పత్రికా విలేకరినైన నేను ఒకసారి ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఒక సమాచారం కోసం అటవీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ దస్తగిరి అకృత్యాన్ని కళ్ళారా చూడటం ఫొటో తీయటం ఆ ఆధారంగా వాణ్ణి పోలీసులు అరెస్టు చేయటం కోర్టులో కేసూ....దానికి నేనే ప్రత్యక్ష సాక్షిగా వాజ్ఞ్మూలం ఇవ్వటం....వగైరా..వగైరా....దస్తగిరికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది..ఆనాడు అరెస్టై వెళుతూ ’నీ అంతు చూస్తాను’ అని క్రూరంగా నవ్వాడు......

ఆలోచనలలో ఉన్న నేను...టి.వి. తెర మీద దస్తగిరి ఫొటో చూసి ఉలిక్కిపడ్డాను......ఒక్కసారి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి....ఊపిరి ఆగినట్లనిపించింది.....అప్రయత్నంగా చేతులు మెడ తడిమాయి....వాడు.....ఆ రౌడీ......రాత్రి.....అదే ఆకారం......!!!

నాకు భ్రమ కలిగిందనుకుందామంటే మెడ నొప్పిగా ఉంది మెడపైన నొక్కినట్లు చారలున్నాయి. ఇప్పుడు వాడి ఫొటో చూస్తుంటే అనుమానమే లేదు... రూఢీ అయింది.. ఆకారం కూడా వాడిదే ఖచ్ఛితంగా! అందుకే ఆకారాన్ని ఎక్కడో చూసినట్లుంది..చూసినట్లుందీ అనిపిస్తోంది నిన్నటినుంచీ.....వీడన్న మాట!

అంటే అదంతా నిజమా? ఎక్కడో జైల్లో ఉన్నవాడు ఇక్కడికెలా రాగలడు..అదీ మరో నాలుగు గంటల్లో ఉరికాబోయే వాడు? అసంభవం.....ఇటువంటి భావనని మ్యాజిక్ సర్రియలిజం అంటారని ఎక్కడో చదివాను!

కాకపోతే మరి ఆ వచ్చింది ‘ఎవరు?’

!+!+!

మరిన్ని కథలు

Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.
Bandham
బంధం
- B.Rajyalakshmi
Desam kosam
దేశం కోసం
- కందర్ప మూర్తి
Sutakapu manishi
సూతకపు మనిషి
- రాము కోలా.దెందుకూరు
Guru dakshina
గురుదక్షిణ
- పిళ్లా కుమారస్వామి
Telivi okkate chaladu
తెలివి ఒక్కటే చాలదు
- శింగరాజు శ్రీనివాసరావు
Angla nadaka pingla nadaka
అంగ్ల నడక-పింగ్లనడక.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.