మధుర జ్ఞాపకం - సుస్మితా రమణమూర్తి

Madhura gnapakam

స్టేషన్ లేనిచోట ఆగిపోయింది రైలు. పంకాలు తిరగడం లేదు . గాలి లేక ప్రయాణీకులు పేపర్లతో, పుస్తకాలతో విసురు కుంటున్నారు. “ ఏఁవండోయ్ అప్పారావు గారూ!... మీది వైజాగేనా?...” కాలక్షేపం కోసం సుందర్రావు గాలిలోకి వదిలిన బాణం ఒకరిని తాకింది. “ నన్నేనా మాస్టారూ!?...నా పేరు మీకెలా తెలుసు!?...” ఒకతను తనవేపు చూస్తూ ఆశ్చర్య పోతుంటే సుందర్రావు ముసిముసిగా లోలోపల నవ్వుకోసాగేడు. ఆ అప్పారావులో ఆత్రం పెరిగింది. “ వైజాగ్లో మీరుండేది?….” “ డాబా తోటలోనండి. “ “ అనుకున్నాను.బాగా చూసిన ముఖం కదా?...అందుకే గుర్తున్నారు. “ “అలాగా!?...మీది కూడా డాబా తోటేనా !?...” “ అవునండీ! “ “బండి ఎందుకు ఆగిందో ?” “ సవాలక్ష కారణాలు ఉండొచ్చు. మనకు ఎందుకండీ?...” ఓ ప్రయాణీకుడి విసుగు. “ స్టేషన్ సిగ్నల్ లేక ఔటర్లో ఆగిందేమో?... బండి బయల్దేరితే గంటన్నరలో వైజాగ్లో దిగిపోతాం.” అరగంట అయినా బండిలో కదలిక లేదు. ప్రయాణీకుల్లో కొందరు క్రిందకు దిగి ఇటూ అటూ చూస్తున్నారు.” “ అదుగో అక్కడ రైల్వే వారు రిపేర్ చేస్తున్నారు. “ అందరి దృష్టి ఆవేపు పోయింది. ‘ టెక్నికల్ ఇబ్బందిలా ఉంది. ఇంకెంత సమయం పడుతుందో?’ స్వగతంలా అనుకున్నాడు సుందర్రావు. “ ఇంత గందరగోళంలో కూడా మేడమ్ గారు సెల్ ఫోన్లో సీరియస్గా టైపింగ్ చేసుకుంటున్నారే!?...” అంటూ ఎదురుగా కూర్చున్న అందమైన యువతిపై నవ్వుల బాణం వదిలాడు సుందర్రావు. ఆమె మౌనమే తనకు సమాధానం కావడంతో సుందర్రావు మరో ప్రయత్నంగా “ మీరు కాలేజీ స్టూడెంటా ? “ అడిగాడు. ఆమె నోరు విప్పలేదు. సుందర్రావులో పంతం పెరిగింది ఎలాగైనా మాటల్లో పెట్టి, తనను ఆకర్షించాలనుకున్నాడు. “ మీరు చెప్పక పోయినా మీరు డిగ్రీ స్టూడెంటని నాకు తెలుసు. “ అప్పటికీ ఆమె తలెత్తి చూడలేదు. “ మనం తోటి ప్రయాణీకులం.ఆ మాత్రం మాట్లాడుకోవడంలో తప్పేముంది? పలుకే బంగారమా?” నవ్వుతూ అన్నాడు సుందర్రావు. తన ప్రయత్నం ఫలించలేదు. “ ఇక్కడ మీలాంటి వారెందరో ఉన్నారు. అయినా కేవలం మీతోనే నాకు మాట్లాడాలనిపిస్తోందంటే కారణం-మీరు ఆకర్షణీయంగా ఉన్నారు. మీరు నాతో మాట్లాడకున్నా , నేనెవరో మీకు చెప్పాలనిపిస్తోంది. నేనొక పోలీస్ ఆఫీసర్ని!” ఓసారి సుందర్రావుని తేరిపార చూసి తల దించుకుందామె. ఆమె తననలా చూసినందుకు ఆనందంతో మెలికలు తిరిగాడు సుందర్రావు. మరిన్ని కోతలు కోసి ఆమె మెప్పు పొందాలని అనుకున్నాడు. “ ఓసారి మాట్లాడితే వరహాలేమీ రాలిపోవు.మాట్లాడండి.” ఈసారి ఆమె నోరు విప్పింది. “ మీకు కబుర్ల కాలక్షేపం. నాకేమో ఈ చరవాణితో స్నేహం. “ బాణం తనకే గుచ్చుకోవడంతో సుందర్రావు నోటికి మూత పడింది. కొన్ని నిముషాల తరువాత నోటికి మూత తీసేసాడు సుందర్రావు . “ మేడమ్!...మీది కూడా వైజాగేనా?” “ కాదండి. “ “ మరెక్కడికో?” ఆమె విననట్టు ఊరుకుంది.సుందర్రావు నిరాశ పడలేదు. భోగీలో జనం కాలక్షేపం బఠాణీలు తింటున్నారు. “ కరోనా మమహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ, తప్పనిసరైన పరిస్థితులలో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పటికీ మహమ్మారి సమస్య పోలేదు కదండీ? “ “ ఆఫ్కోర్స్!...బాధ పడుతున్న మాట వాస్తవమే! మహమ్మారి వల్ల అందరికీ ఆరోగ్య సూత్రాలు విధిగా పాటించడం అలవాటైంది కదా?...ఒక విధంగా కాస్త మేలు కూడా జరిగింది. కాదంటారా చెప్పండి!“ వారి మాటలకు చిన్నగా నవ్వుకుంది ఆమె. “ శంకర్రావు గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. “ “ మీరెవరో నాకు తెలీదే!?...నా పేరు మీకెలా తెలుసు!!...” ఆ ఆసామీ ఆశ్చర్యంతో మెలికలు తిరిగి పోతుంటే సుందర్రావు మరోసారి మురిసి పోయాడు. వీరి వ్యవహారం గమనిస్తూనే ఆ యువతి చరవాణిలో టైపింగ్ చేసుకో సాగింది. ఇందాకటి అప్పారావు, ఇప్పటి శంకర్రావు ఇంకా, సుందర్రావు వేపు ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు. సుందర్రావు ఆమెను తినేసేలా దొంగ చూపులు చూస్తున్నాడు. ఆమె తన వెకిలి చేష్టలు క్రీగంట గమనిస్తూ , ముభావంగా ఉంది. మాటల్లో దింపి ,ఆమెను ఆకర్షించడానికి తెగ తాపత్రయ పడుతున్నాడు సుందర్రావు. “ మనం ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం. అన్నీ గుర్తుండవు. కొన్ని మాత్రమే గుర్తుంటాయి. ఈ ప్రయాణం నాకు మాత్రం ఓ మధుర జ్ఞాపకమే సుమండీ!” పమిట కొంగు నిండుగా కప్పుకుని తలెత్తి చూసింది ఆమె. చూపులో చూపు కలిపి చిన్నగా నవ్వాడు తను. ఆ యువతి చరవాణి మోగింది. “ మేడమ్! మీ ఫోనే! చూడండి..చూడండి! “ సుందర్రావు వేపు ఆమె చూడనే లేదు “ ఆఁ…ఆఁ…నేనే మాట్లాడుతున్నాను. బండి ఆగిపోయి అరగంట అయింది. రైల్వే వారు చాలా సేపటి నుంచి రిపేర్ చేస్తున్నారట.ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు. సి కోచ్ లోనే ఉన్నాను. మీరు వచ్చేలోగా నేను దిగిపోతాను. “ అంటూ సూట్ కేసు తీసుకుని నిల్చుంది ఆమె. “ నేను తీసుకుని వస్తాను పదండి “ అంటూ సుందర్రావు సాయం చేసాడు. ఆమె దిగి పోయింది. “ నా మెసేజ్ చూసి , అదుగో మావారు వచ్చేసారు. “ సుందర్రావు ఆమె మాటలు వినిపించుకోలేదు. “ మేడమ్! మనం ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే నా మొబైల్ నెంబరు ….” “ అవసరం లేదు సుందర్రావు గారూ! మీ సూట్ కేసుకి ఉన్న అడ్రస్ టేగ్ నా మొబైల్లో భద్రంగా ఉంది. “ ఆమె మాటలకు సుందర్రావు ఆశ్చర్య పోయాడు. “ మీది వైజాగ్ కాదని, విజయనగరమనీ మీ సూట్ కేస్ టేగ్ చూసి గ్రహించాను.మీ వెకిలి నవ్వులు, చేష్టలు నన్ను దాటి పోలేదు. మీరు గాలిలోకి వేసిన బాణం, అప్పారావుకి అనుకోకుండా తగిలిందనీ, లగేజీ టేగ్ మీద పేరు చూసి, శంకర్రావుతో మీ కబుర్ల వ్యవహారమూ నాకు తెలుసు….” ఆమె అలా చెబుతుంటే,సుందర్రావు తెరచిన నోరు మూయడం మరచి పోయాడు. “ నేనెవరో తెలుసు కోవాలని , పరిచయం చేసుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నారు కదా?... నా గురించి తెలుసుకోవాలంటే వెంటనే మీరు పుస్తకాల షాపుకి వెళ్ళి, నూట పదహార్లు మినీ కథల సంకలనం కొనండి. ఆ కథల పుస్తకంలో రెండు వందల ఇరవై నాలుగో పేజీలో నా ఫోటోతో బాటు అడ్రస్సు , మొబైల్ నెంబరు ఉంటాయి. నాతో మాట్లాడాలనిపిస్తే రాత్రి ఎనిమిది తర్వాత ఫోన్ చేయండి. మన పరిచయం మీకు తప్పక ఓ మధుర జ్ఞాపకం అయేలా చేస్తాను.“ అంటూ ఆమె వెళ్ళి పోయింది. ఆ మర్నాడు ఆత్రంగా షాపుకి వెళ్ళి ఆ పుస్తకం కొన్న సుందర్రావు జుత్తు పీక్కున్నాడు. ఆ పుస్తకంలో కేవలం నూట అరవై పేజీలు మాత్రమే ఉన్నాయి. పుస్తకంలో పేజీలు అన్నీ తీవ్రంగా తన ఎక్సరే కళ్ళతో గాలించాడు. ఓ పేజీలో ఆమె ఫోటోతో బాటు ,అడ్రస్, వివరాలు చూసిన సుందర్రావు నేలకు పాతిన రాటలా బిగుసుకు పోయాడు. ఆమె ప్రముఖ రచయిత్రి! ఓ పెద్ద పోలీసు ఆఫిసర్ గారి శ్రీమతి!! **********

మరిన్ని కథలు

Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.
Bandham
బంధం
- B.Rajyalakshmi
Desam kosam
దేశం కోసం
- కందర్ప మూర్తి
Sutakapu manishi
సూతకపు మనిషి
- రాము కోలా.దెందుకూరు
Guru dakshina
గురుదక్షిణ
- పిళ్లా కుమారస్వామి
Telivi okkate chaladu
తెలివి ఒక్కటే చాలదు
- శింగరాజు శ్రీనివాసరావు
Angla nadaka pingla nadaka
అంగ్ల నడక-పింగ్లనడక.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.