కలెక్షన్ కింగ్ - సుస్మితా రమణమూర్తి

Collection King

కాలింగ్ బెల్ శబ్దం విని శర్మ గారు తలుపు తీసారు. ఎదురుగా నవ్వుతూ ఆఫీసు మిత్రుడు సదానందం కనిపించాడు. “ నమస్కారం సార్! ఈ వారం పత్రికలో మీ కథ చదివాను. చాలా బాగుంది సార్!” “ అలాగా!...నేనింకా చూడలేదు. “ “ నా కథొకటి ఆ పత్రిక నుంచి తిరిగి వచ్చింది. మీరు చదివి లోపాలు చెబితే సరిచేసుకుంటాను.” “ అలాగే చెబుతాను. అటు చూడు. మన అప్పారావు వస్తున్నాడు. “ “ అవసరం ఉంటేనే తప్ప, ఎవరినీ పట్టించుకోని తనకు మీతో ఏ అవసరం పడిందో!?...” “ అప్పారావు నాతో మాట్లాడేటప్పుడు మధ్యలో దూరకు. జాగ్రత్తగా మా మాటలు విను.నీకు కథా వస్తువు దొరకొచ్చు. “ “అలాగే సార్! “ “ నమస్తే శర్మాజీ!... సదానందం సార్! ఇక్కడే ఉన్నారా !? …నమస్తే! “ అప్పారావు నమస్కారంకి ప్రతి నమస్కారం చేస్తూ శర్మ గారు కుర్చీ చూపించారు. “ ఊరక రారు మహానుభావులు! ప్రత్యేకించి ఇంటికే వచ్చారు!?...ఏఁవిటో విశేషం! “ “ ఒకే ఆఫీసు వాళ్ళం. రావడానికి విశేషమే ఉండాలా శర్మాజీ? “ “ అవునవును. మీరన్నది నిజమే! “ “ ఈ ఫోటో చూసారా!?..పదవీ విరమణ శుభాకాంక్షలు!...మన సుబ్బారావు గారి రిటైర్మెంట్ వచ్చే వారమే!. మనం కూడా ఇలా పేపర్లో ప్రకటన ఇస్తే బాగుంటుంది కదా? “ అంటూ తను తెచ్చిన పేపరు చూపించాడు అప్పారావు. శర్మ గారికి అప్పారావు సూచన నచ్చింది. “ సుబ్బారావు గారి ఫోటో తీసుకుని , మీరే మన ఆఫీసు తరపున ప్రకటన ఇవ్వండి. సెక్షన్ ఆఫీసర్ గారికి నేను చెబుతాను. “ “ అలాగే సార్! తప్పకుండా ఫ్రకటన వేయిస్తాను.” సదానందం వారి మాటలు బుద్ధిగా వింటున్నా డు. “ పార్టీకి కలెక్షన్ మీరు చేయండి శర్మాజీ! నాకు తెలిసిన షాపులో మంచి డిస్కౌంట్లో బ్రహ్మాండమైన గిఫ్ట్ కొనే బాధ్యత నాది. “ “ రేపు అర్టంటుగా మా ఊరు వెళ్ళే పనుంది. కలెక్షన్ మీరే చేయండి.” -- అంటూ శర్మ గారు వంద నోటు అప్పారావుకి ఇచ్చారు. ‘ ఎప్పుడూ ఈ సీనియర్ మహాశయుడు తన పథకంకి అడ్డు తగిలేవాడు . ఈసారి మనదే ఇష్టారాజ్యం! కలెక్షన్ మనమే!...గిఫ్ట్ వ్యవహారమూ మనమే! మొన్న గృహ ప్రవేశంకి వచ్చిన బహుమతులు ఇంట్లో చాలా ఉన్నాయి. ఏదో ఒకటి తీసి తోసేస్తే సరి. కలెక్షన్ అంతా మన జేబులోకే! ‘ “ మీరేమీ మాట్లాడటం లేదు!... మీకు ఇబ్బంది అయితే చెప్పండి. సదానందంని కలెక్ట్ చేయమంటాను. “ “ మీలాంటి సీనియర్స్ చేసే పని , నేను చేయబోతున్నందుకు సంతోషమే శర్మాజీ! “ అంటూ వంద నోటు జేబులో పెట్టుకుని అప్పారావు సంతోషంగా వెళ్ళి పోయాడు. శర్మ గారి నిర్ణయంకి సదానందం ఆశ్చర్యపోయాడు. “ కారణం లేనిదే అప్పారావు రాడని తెలుసు కదా?...అందుకే కలెక్షన్ బాధ్యత , పేపర్లో ప్రకటన తనకు అప్పగించాను.” “ మీ ఆంతర్యం అర్థం కాలేదు సార్! “ “ నేను ఆఫీసులో లేనప్పుడు అప్పారావు పెళ్ళిళ్ళకు , ట్రాన్స్ఫర్లకు డబ్బు కలెక్ట్ చేసి, సగం జేబులో వేసుకొని, ఏదో చిన్న బహుమతి కొని ఆడంబరంగా పేక్ చేయించిన విషయాలు నాకు తెలుసు. “ “అన్నీ తెలిసి కూడా కలెక్షన్ బాధ్యత తనకు ఎందుకు అప్పగించారు? “ “ అప్పారావు అయితేనే అందరి దగ్గర కలెక్ట్ చేయగలడు కనుక. “ “ అవునవును. బాగా చేస్తాడు. సగం జేబులో వేసుకోవచ్చు కదా? “ “అప్పారావు కలెక్షన్ చేస్తాడు. గిఫ్ట్ కొనేటప్పుడు నేను కూడా. వెళ్తాను.” “ మీరు ఊరికి!...” “ వెళ్తాను. పార్టీకి రెండు రోజులు ముందే వచ్చేస్తాను. నీవు రాయబోయే కథకు కొసమెరుపుతో కూడిన ముగింపు ఇదే!” “ బాగుంది సార్! అప్పారావు కథ తప్పకుండా రాస్తాను. “ “ కొసమెరుపులో మరో మెరుపు కూడా ఉంటుంది. మన సుబ్బారావు గ గారి పార్టీలో చెబుతాను. అంతవరకు సస్పెన్స్! “ *** “ సుబ్బారావు గారు ఆయురారోగ్యాలతో సంతృప్తిగా విశ్రాంత జీవనం గడపాలని కోరుకుంటున్నాను. ఈ పార్టీ బాగా జరగడానికి కారకులైన అందరికీ అభినందనలు తెలియ జేస్తున్నాను. ఇక మీదట కూడా అప్పారావు గారే అన్ని పార్టీలకు నిర్వాహకులు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అప్పారావు గారు సమర్థులు గనుక , మన ఆఫీసు పార్టీలన్నిటికీ ‘ కలెక్షన్ కింగ్ ‘—మన అప్పారావు గారే ! “ అంటూ శర్మ గారు అప్పారావు వేపు నవ్వుతూ చూసారు. అప్పారావు ముఖం వెయ్యి వాట్ల బల్బులా వెలిగి పోయింది. అంగీకార సూచనగా లేచి చేతులు జోడించాడు—’ ఇక మీదటైనా తన పథకం తప్పక పారుతుంది. ‘ స్వగతంలా అనుకుంటూ. “ ఒక ముఖ్య సూచన. ఇకమీదట పెళ్ళిళ్ళు , బదిలీలు, పదవీ విరమణ సందర్భాలలో బహుమతులు కాకుండా, మనం కలెక్ట్ చేసే డబ్బు కవర్లో పెట్టి ఇవ్వడం మంచిది. ఎవరికి నచ్చిన గిఫ్ట్ వారే కొనుక్కుంటారు. మన సెక్షన్ ఆఫీసర్ గారి అభిప్రాయం కూడా ఇదే!” అందరూ చప్పట్లతో తమ అంగీకారం తెలియజేసారు. సదానందం తన కథకు మెరుపులో మెరుపుకి సంతోషించాడు. కలెక్షన్ కింగ్ ముఖం మాత్రం జీరో వాట్ బల్బ్ అయింది. *

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి