పిచ్చి సుబ్బడు - తటవర్తి భద్రిరాజు

Pichchi subbadu

ఊరి మధ్యలో ఉండే రావి చెట్టు కింద చిన్న తాటి ఆకుల పాక లో బాషా సైకిల్ షాప్ ఉండేది. ఉదయాన్నే సైకిల్ షాప్ తెరిచే బాషా రాత్రి వరకు ఆ షాప్ లో ఉంటూ సైకిల్స్ రిపేర్ చేసే వాడు. సైకిల్ రిపేర్ చేయించుకువడానికి వచ్చే వాళ్ళ తో మాట్లాడుతూ ఊర్లో విషయాలు అన్నీ తెలుసుకునే వాడు. కాకినాడ దగ్గర ఉన్న ఉండూరు లో కొంత కాలం సైకిల్ షాప్ పెట్టుకుని అక్కడ డబ్బులు సరిగా రావడం లేదు అని ఈ ఊరు వచ్చి ఇక్కడ సైకిల్ షాప్ పెట్టుకున్నాడు బాషా. రేషన్ షాప్ పక్కనే ఉండే సందులో కందుల రాంబాబు అని ఒక కమీషన్ ఏజెంట్ ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళు , చుట్టు పక్కల గ్రామాల వాళ్ళు పశువులు ను గాని , పంటలను గాని ఏదైనా అమ్మాలి అంటే రాంబాబు ను పిలిచే వారు. రాంబాబు వచ్చి ఆ పండిన పంటలను కానీ , పశువులను కానీ అమ్మడానికి కొనుగోలుదారులను తీసుకు వచ్చేవాడు. అలా అమ్మి పెట్టినందుకు అమ్మిన వాళ్ళ దగ్గర , కొన్న వాళ్ల దగ్గర కొంత మొత్తం కమీషన్ గా తీసుకునే వాడు. ఎప్పుడూ చుట్టూ ఉన్న గ్రామాలలో తిరుగుతూ అందరితో మాట్లాడుతూ పరిచయాలు బాగా పెంచుకుని తన వ్యాపారం బాగా ఉండేలా చూసుకునేవాడు. ఓ వర్షాకాలం ఆకాశానికి చిల్లులు పడ్డాయి ఏమో అన్నట్టు గా వర్షం పడుతూ ఉంది. బాషా సైకిల్ షాప్ లో కూర్చుని వర్షాన్ని చూస్తూ ఉన్నాడు. తాటి ఆకుల పాకలో ఉండే ఆ షాప్ లోపల ఉన్న చిన్న గదిలో తాటి ఆకుల మధ్య నుండి కొంచం కొంచం గా నీరు కారుతూ ఉంది. కుడి వైపు పాత సైకిల్ చైన్ లు ఒక కర్రకు వేలాడుతూ ఉన్నాయి. ఓ పక్కాగా విప్పేసిన పాత సైకిల్ సామానులు చిందర వందర గా పడి ఉన్నాయి. సగం బిగించి వదిలేసిన కొత్త సైకిల్ ఒక సైకిల్ చైన్ తో వేలాడుతూ ఉంది. ఆ వర్షం లో గొడుగు వేసుకుని బాషా సైకిల్ షాప్ దగ్గరకి వచ్చాడు కందుల రాంబాబు. ఆ పాక లో బాషా పక్కనే కూర్చుంటూ .... చొక్కా జేబులో నుండి సైకిల్ బ్రాండ్ బీడీ ఒకటి తీసుకుని వెలిగించాడు. ఏ పని లేనపుడు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి బాషా తో ముచ్చట్లు పెట్టుకోవడం కందుల రాంబాబు కు అలవాటు. అలా వాళ్ళు ఇద్దరూ తెలియకుండానే స్నేహుతుల అయి పోయారు. ఎప్పుడప్పుడో జరిగిన సంఘటనలు అన్నీ దండ కు పూసలు గుచ్చి నట్టు గా వివరంగా బాషా కు చెప్తూ ఉంటాడు. 'ఒరే బాషా ఈ వర్షాన్ని చూస్తే నాకు ఏం గుర్తుందో తెలుసా ? ' అని ఆపాడు. నోట్లో ఉన్న బీడీ ని పక్కకు తీసి పెడుతూ. ఉదయాన్నే పొలాలకు మేత కోసం వెళ్లిన పశువులు వర్షం లో తడుస్తూ ఇంటికి అప్పుడే చేరుకుంటున్నాయి. వాటి వెనకాలే వాటిని తోలుకు వెళ్లిన పాలేరులు తలపై ఒక ప్లాస్టిక్ సంచి ని కప్పుకొని వర్షం లో తడవకుండా నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. ఏం గుర్తుకు వస్తుంది ? అని అడిగాడు బాషా. ' 'కొన్నేళ్ల క్రితం ఇలానే చాలా పెద్ద వాన పడింది. నేను మర్రిపూడి నుండి సైకిల్ మీద వర్షమ్ లో తడుస్తూ వస్తున్నాను. మన ఊరి గొల్లపేట దగ్గర ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్ దగ్గరకి వచ్చేసరికి ' అని ఆపి పక్కనే ఉన్న బీడీ ని తీసుకుని ఒక దమ్ము పీల్చి మళ్లీ చెప్పడం కొనసాగించాడు... రాంబాబు ఏమి చెప్తాడా అని రాంబాబు మొహం కేసే చూస్తూ ఉన్నాడు బాషా. రైస్ మిల్ దగ్గర ఉన్న బస్టాప్ లో ఎవరో ఒక కొత్త వ్యక్తి కనిపించాడు. ఎవరా అని అనుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత రోజు అదే వ్యక్తి మన ఊరు మొదట్లో ఉన్న రామ టూరింగ్ టాకీస్ దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. చేతిలో ఒక బ్యాగ్ , కొంచం పెరిగిన గెడ్డం 45 ఏళ్ల వయసు ఉండే అతను అదే చెట్టు కింద ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. అప్పుడప్పుడు తనలో తానే అరవం లో మాట్లాడుకునే వాడు, ఆ మాటలు పైకి అందరికీ వినబడేలా . ఇక్కడ ఉన్న ఎవరికీ అరవం రాకపోవడం తో అతను ఏమి మాట్లాడుతున్నాడో కూడా ఎవరికీ తెలిసేది కాదు. ఆకలి వేసినప్పుడు సత్తెయ్య హోటల్ ముందు నించుంటే సత్తెయ్య భార్య జాలి వేసి తినడానికి ఎదో ఒకటి పెట్టేది. ఊళ్ళో వాళ్ళు అతని పేరు తెలియక పోయినా పిచ్చి సుబ్బడు అని పిలుచుకునే వారు. రోజూ స్కూల్ తెరిచే సమయానికి స్కూల్ ముందుకు వెళ్లి నుంచునే వాడు. ఎవరితో ఏమీ మాట్లాడే వాడు కాదు. ఎవరికీ ఏమి హాని చేసేవాడు కాదు . అలా కొంతకాలం ఆ మర్రి చెట్టుకిందే వాడు. వర్షం వస్తే తడిసి పోతున్నాడు అని జాలి వేసి rmp డాక్టర్ హరిగోపాలం గారు , రామ టూరింగ్ టాకీస్ కి అటుకుల మిల్లుకి మధ్య లో ఉండే కాళీ స్థలం లో చిన్న పాక వేసి అందులో ఉండమన్నారు. ఎక్కడికి వెళ్లినా చేతిలో ఉన్న బ్యాగ్ మాత్రం వదిలే వాడు కాదు ఆ పిచ్చి సుబ్బడు. సుబ్బడు ను చూసిన ప్రతీ వాళ్ళు ఆ బ్యాగ్ లో ఏముంది అని తెలుసుకోవాలి అనుకునే వారు. ఎవరినీ ఆ బ్యాగ్ దగ్గరకు రానిచ్చేవాడు కాదు సుబ్బడు. ఓసారి ఊళ్ళో ఉండే కొంత మంది కుర్రాళ్ళు క్రికెట్ అడుకోవడానికి చెరువు పక్కనే ఉండే క్రికెట్ గ్రౌండ్ కి వెళ్తూ పిచ్చి సుబ్బడు ను చూసి ఆగారు. ఆ పిల్లల్లో ఉన్న రాగం కామేశ్వరరావుగారి అబ్బాయి నరేష్ సుబ్బడు చేతిలో ఉన్న బ్యాగ్ లో ఏమి ఉందొ తెలుసుకుందామని ఆ బ్యాగ్ సుబ్బడు దగ్గర నుండి లాక్కుని చూద్దాం అనుకున్నాడు. ఆ బ్యాగ్ తీసుకుందాం అనుకున్న నరేష్ ని బాగా కొట్టి, తన గోర్ల తో బాగా రక్కేసాడు పిచ్చి సుబ్బడు. అక్కడ , ఇక్కడా అని కాకుండా చుట్టూ ఉన్న అన్ని ఊళ్ళోలో తిరుగుతూ ఉండే పిచ్చిసుబ్బడు ఎక్కడ ఉన్నా ఆ ఊర్లో స్కూల్ వదిలే టైం కి మాత్రం స్కూల్ ముందు కి వచ్చి నుంచునే వాడు. పిచ్చి సుబ్బడు మీద కోపం పెంచుకున్న రాగం కామేశ్వరరావు గారి అబ్బాయి నరేష్ ఓ అమావాస్య నాటి అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా చీకట్లో వెళ్లి పిచ్చి సుబ్బడు పడుకున్న తాటి ఆకు పాకకి మంట పెట్టేసాడు. మంచి నిద్రలో ఉన్న పిచ్చిసుబ్బడు కి మెలుకువ వచ్చేసరికి సగం పాక కాలిపోయింది. నిద్ర లొంచి సడెన్ గా లేచిన సుబ్బడు ఆ చీకట్లో ఎటు వెళ్లలో తెలియక ఆ మంటల్లో కాలిపోయాడు. కానీ తన చేతిలో ఉన్న బ్యాగ్ ని మాత్రం కాలకుండా బయటకి విసిరేశాడు. సుబ్బడు తన ఉన్న పాకకి మంట పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని కొంత మంది అనుకున్నారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఉంటాయని మరికొంత మంది అనుకున్నారు. తరువాత రోజు సుబ్బడు బయటకి విసిరేసిన బ్యాగ్ తెరిచి చూసిన ఊళ్ళో వాళ్ళు నోరు వెళ్ళబెట్టారు. ఆ బ్యాగ్ లో ఉన్న సర్టిఫికెట్స్ చూసి. ఉన్నత చదువులు చదివిన సుబ్బడు ఎందుకు ఇలా అయిపోయాడు అని అందరికీ సందేహం కలిగింది. పోస్టుమాస్టర్ వెంకటేశం గారు సుబ్బడు గురించి మరింత తెలుసుకోవాలి అనుకున్నారు. సేలం నుండి వచ్చి సగ్గుబియ్యం ఫ్యాక్టరీ లో పని చేసే సెల్వం అనే అతని దగ్గరకి ఆ సర్టిఫికెట్స్ తీసుకెళ్లి తమిళనాడు లో ఉన్న సుబ్బడు ఊరు వెళ్ళడానికి కూడా వచ్చి సహాయం చేయమని అడిగారు. సెల్వానికి తమిళ్ తెలుగు రెండూ వచ్చు. సెల్వం తో వెళ్లిన వెంకటేశం గారు సుబ్బడు అసలు పేరు బాల మురుగన్ అని, బాగా చదువు కోవాలి అనే తపన తో చదివి చదివి బాల మురుగన్ కి మతి స్థిమితం పోయింది అని తెలుసుకున్నారు. ఆ సర్టిఫికెట్స్ బాల మురుగన్ ఇంట్లో ఇచ్చేసి జరిగింది అంతా చెప్పి వచ్చేసారు. పెద్దాపురం పాండవుల మెట్ట మీద ఉన్న పోలీసు కంట్రోల్ రూమ్ వెనకాల రాగం కామేశ్వరరావు గారి అబ్బాయి నరేష్ పేరుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు....సుబ్బడు ని చంపేసాను అనే పశ్చాత్తాపం తో. సుబ్బడు కథ విన్న బాషా కళ్ళవెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. బయట పడుతున్న వర్షం తో పోటీ పడుతూ.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి