మరీచిక - B.Rajyalakshmi

Mareechika
చీకటి పడుతున్నది .నల్లగా మబ్బులు కుంభవృష్టిని సూచిస్తున్నాయి .గాలి మొదలయ్యింది . వేగం పెరిగి కొమ్మలూ ,ఆకులూ వూగుతున్నాయి .వసుంధర తన యింటిముందు చిన్న వరండా లో నించుని చినుకులు సన్నగా చెంపలకు తగుల్తుంటే కొద్దిగా వెనక్కి జరిగింది .ఇంటెదురుగా వున్న చెట్లు గాలికి వూగుతూ వాన తుంపర్లను చిమ్ముతున్నాయి .చినుకులు కాస్తా పెద్ద ధారయ్యింది,చిరుగాలి కాస్తా ప్రచండ వాయువై విజృభింస్తున్నది .వసుంధర గదిగుమ్మం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంది .లోపలికి వెల్దామనుకుంది కానీ కిటికీ ,వీధిగుమ్మం తలుపు మూసుకుంటే తనల్ని తానే బంధించుకున్నట్టవుతుందని ఒంటి పక్షి కదా అందుకే వాన చూస్తూ కూర్చుంది .
వసుంధర ఆ వూళ్లో జిల్లాపరిషత్ బళ్లో పంతులమ్మ ,బదిలీ మీద యేడాది క్రిందట వచ్చింది .అంతకు ముందు వున్న వూళ్లో అందరూ అడిగే తన వ్యక్తిగత జీవితాన్ని అన్నీనిజాలే చెప్పేది .భర్త నించి విడిపోయానని ,వదిలేసాడని ,తనకెవ్వరూ లేరని .కానీ వూళ్లోవాళ్లు నానారకాల పెడర్ధాలూ ,అవహేళనలూ వసుంధరను బాధించాయి .అందువల్ల యెవరైనా యెదురు పడ్డా,యింటికి వస్తారన్నా భయం గా ,బిడియం గా వుండేది .మొగుణ్ణి వదిలేసి యిష్టారాజ్యం గా తిరుగుతుందని ఆక్షేపణలూమొదలయ్యాయి .
ఇప్పుడు యీ వూళ్లో అందమైన అబద్హాలను తన జీవితం లో అల్లుకుంది .మాటల మర్మాలు మొదలు పెట్టింది .ముఖానికి ,పెదవులకు కృత్రిమ నటనలు నేర్పింది .తన భర్త పెద్ద వుద్యోగం లో విదేశాలలో వున్నాడని,తను సెలవుల్లో అక్కడికి వెళ్తానని ,పిల్లలకు చదువు చెప్పడం తనకిష్టమని పల్లెటూళ్లు అంటే తనకు చాలా యిష్టమనీ అందమైన అబద్హాలు చెప్పింది .పైగా తను డబ్బుకోసం వుద్యోగం చెయ్యడం లేదని ,కేవలం తన తృప్తి కోసమే చేస్తున్నానీ వూళ్ళోవాళ్ళకు చెప్పింది .ఇప్పుడు అందరికీ వసుంధర అంటే గౌరవం !ఇప్పుడు వసుంధరకు యే భయమూ ,బిడియమూలేదు .ఒకటి మాత్రం అర్ధమయ్యింది .నిజం కన్నా అబద్హాలకే తనబోటి వాళ్లకు క్షేమం ,గౌరవం అనీ .ఇప్పుడు ఎవరితోనూ యెక్కువ గా మాట్లాడకుండా సాధ్యమైనంతవరకూ ముభావం గా వుండడానికి యిష్టపడుతున్నది .ఎవరిని గురించీ పట్టించుకోవడం మానేసింది .క్రమం గా వసుంధర యింటికి అందరూ రావడం మానేసారు .
కానీ యీ వర్షం లో యీ చీకటి రాత్రి లో ఒక తోడుండి కబుర్లు చెప్పేవాళ్ళు వుంటే యెంత బాగుంటుంది అనిపించింది వసుంధరకు .కానీ తన మనసుకి తెలుసు యెవరూ రారని .వర్షం యెక్కువయ్యింది .వీధితలుపు మూసి లోపలికి వచ్చింది .ఏదో అర్ధం కాని దిగులు ,నిర్లిప్తత ,యెన్నాళ్ళు. తన బతుకిలా !! కానీ తప్పదు .రాత్రి పదయ్యింది ! ఆకలి గా వుంది .భోజనం చేద్దామని వంటింట్లో కి వెళ్లింది .
వీధి తలుపు చప్పుడయింది .వానా ,గాలీ ,చప్పుళ్లనుకుంది .కానీ గట్టిగా చేత్తో తలుపులు యెవరో బాదుతున్నట్టు అనిపించింది .తలుపు తీసింది .తడిసి ముద్దయిన ఒక వ్యక్తి వణికిపోతూ నించున్నాడు .వసుంధరను చూస్తూ మాట రాకుండా అలాగే నిలువెల్లా వణికిపోతూ చూస్తున్నాడు .
“ఎవరు కావాలండీ “ప్రశ్నించింది వసుంధర .
అతను వీధి నీ ,యింటి పరిసరాలనూ పరికించి పరీక్ష గా చూసాడు .
“శేఖరం వున్నాడా అండీ “ అతను ప్రశ్నించాడు .
“శేఖరం ఎవరండీ”అయోమయం గా ప్రశ్నించింది వసుంధర .
“ఇక్కడ జిల్లా పరిషత్ బళ్లో నా స్నేహితుడు రాజశేఖరం యిల్లే కదా యిది ? శేఖరం లెక్కలు బోధించే పంతులు “అన్నాడు ఆ వ్యక్తి .
అప్పుడు గుర్తుకొచ్చింది వసుంధరకు . రాజశేఖరం పంతులు గారు బదిలీ. అయ్యారు .అయన వున్న యిల్లు ఖాళీ అయితే తను చేరిందని .బహుశా యీయనకు తెలియదేమో ,పాపం వర్షం లో తడిసిపోతూ నించున్నాడు .
ఆయన్ను ఆ స్థితి లో చూసి “లోపలికి రండి .బాగా తడిసిపోయారు కూడా ,మీరు చెప్తున్న శేఖరం. గారు యేడాది క్రిందటే బదిలీ మీద వెళ్లిపోయారు . వారు యీ యింట్లో నే వుండేవారు .ఆయన. ఖాళీ చేసిన తర్వాత నేను యీ యింట్లో చేరాను .ముందు మీరు లోపలికి రండి “అన్నది వసుంధర .
“పర్వాలేదండీ ,శేఖరం ,నేనూ తరచుగా కలుస్తుండే వాళ్లం.రెండేళ్ల నించీ నా కుటుంబపరిస్థితులలో మునిగిపోయి పట్టించుకోలేదు ! నా భార్య అనారోగ్యం తో చనిపోయింది .ఇల్లంతా అల్లకల్లోలం గా వుంది .మనసు బాగాలేక శేఖరం దగ్గర కొన్నాళ్ళు వుందామని వచ్చాను .శేఖర్ బదిలీ సంగతి నాకు తెలియదు .క్షమించండి మీకు శ్రమిచ్చాను “ అంటూ ఆ వ్యక్తి వానలో వెళ్ళబోయాడు .
“యీ కుంభవృష్టి లో యెక్కడికి,యెలా వెళ్తారు ?”వసుంధరకు ఆ వ్యక్తి ని చూస్తే జాలేసింది .
“అదే ఆలోచిస్తున్నాను ,మా ఊరెళ్లే బస్సులు తెల్లారితే గానీ లేవు .”అంటూ చిన్న పిల్లాడిలాగా అమాయకం గా వసుంధరను చూసాడు .వసుంధర ఒక క్షణం ఆలోచించింది .
“ లోపలికి రండి వాన. జోరెక్కువయ్యింది .”అన్నది వసుంధర .
ఆ వ్యక్తి వీధి. తలుపు దగ్గరగా వేసి లోపలికి వచ్చాడు .వసుంధర తుడుచుకోవడానికి తువ్వాల యిచ్చింది .
“వర్షం కొద్దిగా తగ్గితే వెళ్ళిపోతాను ,లారీ అయినా దొరక్కపోదు “తల తుడుచుకుంటూ అన్నాడు అతను .
“అలాగే వెల్దురు గాని ,యీ కుర్చీ లో కూర్చోండి “అన్నది వసుంధర .
“ఏమనుకోకండి, యీ రెండు దుప్పట్లు తీసుకుని మీ తడి బట్టలు ఆ తీగె మీద ఆరేసుకోండి .మీరు వెళ్ళేటప్పటికి కాస్తో కూస్తో ఆరుతాయి నా దగ్గర లుంగీలు లేవు “అంటూ అతనికి జవాబు చెప్పే అవకాశం కూడా యివ్వకుండా అక్కడినించి వెళ్లిపోయింది .అప్పటికే ఆ వ్యక్తి గది పరిసరాలను గమనించి వసుంధర ఒక్కతే. వుంటుందని గ్రహించాడు .మారు మాట్లాడకుండా ఒక దుప్పటి ఒంటికి చుట్టుకుని ఒక దుప్పటి కప్పుకున్నాడు .తడి బట్టలు పిండి తీగె మీద ఆరేసుకున్నాడు .
“మీరెలా వుంటున్నారో తెలియదు కానీ ఒంటరితనం మహా భయంకరమండీ “అన్నాడు ఆ వ్యక్తి .వసుంధర నవ్వుకుంది .
మీరు ఆలా మంచం మీద వాలండి .వంట చేస్తాను .ఇద్దరం కలిసి తిందాం “అన్నది వసుంధర .
“ భోజనం యేమి వద్దండీ ! ఇప్పటికే మిమ్మల్ని చాలా యిబ్బంది పెట్టేసాను .” అన్నాడు అతను .
“ భలే వారే ! యిబ్బందేముంది ! నేనూ తినాలి కదా ! మీ ముఖం చూస్తేనే తెలుస్తున్నది . ఎప్పుడు తిన్నారో యేమో ! “ అన్నది వసుంధర .
అతను నవ్వేసి వూరుకున్నాడు .వంట అయ్యింది .వేడి వేడి పప్పుచారు ములక్కాయ ముక్కలతో ఘుమ ఘుమ వాసనలు ,ఆవకాయ యిద్దరికీ వడ్డించింది వసుంధర .కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తిన్నారు .చాలా. రోజుల తర్వాత యెంతో తృప్తిగా తిన్నట్టుగా ఫీలయ్యింది వసుంధర .అతనుకూడా మంచి ఆకలిమీద వున్నాడో యేమో ఆవురావురుమని తినేసాడు .భుక్తాయాసం అనిపించింది .
“ఆశ్రయం యిచ్చారు .రుచి రుచి గా భోజనం పెట్టారు ‘అన్నదాత సుఖీభవ ‘భుక్తాయాసం గా వుంది .ఒక చాప యిస్తే వరండాలో పడుకుంటాను .వర్షం తగ్గగానే వెళ్లిపోతాను “ అంటూ వసుంధరను చూసాడు .ఇప్పుడతని మొహం లో కొంత హాయి కనిపించింది వసుంధరకు .చాపా ,దుప్పటీ ,తలగడా యిచ్చింది .వీధి తలుపు తీసింది .వర్షం జల్లు యీడ్చి ముఖాన కొట్టుకుంది .వర్షం. యింకా యెక్కువయ్యింది ! హోరు గాలి కూడా !
“అయ్యో ! వరండా తడిసిపోయింది ,మీరెలా పడుకుంటారు ?లోపల మంచం పైన పడుకోండి “అన్నది వసుంధర .
అతను లోపలికి వచ్చి మంచం పైన. పడుకున్నాడు .వసుంధర అక్కడే కుర్చీ లో కూర్చుంది .కాసేపు కబుర్లు చెప్పుకున్నాక అతను అలాగే నిద్రలోకి జారాడు .వసుంధర. కు యింకా యింకా మాట్లాడాలని వుంది నిద్ర. పట్టడం లేదు కానీ అమాయకం గా పసిపిల్లాడిలాగా ప్రశాంతం గా నిద్ర. పోతున్న అతనిని నిద్ర భంగం కాకూడదని వసుంధర వంటింట్లో చాప వేసుకుని పడుకుంది .ఒళ్లంతా బాగా అలిసినట్టుగా వుండడం వల్ల. వెంటనే నిద్ర. పట్టింది .
తెల్లవారుతున్నది .వసుంధర లేచింది .కిటికీ తెరచింది .వర్షం తగ్గింది .సూర్యోదయం మెల్లగా తెల్ల మబ్బులోనించి కనిపిస్తున్నది .చల్లటి గాలి మెల్లగా విస్తున్నది .వీధి లో నీళ్లు ప్రవహిస్తూ పల్లం లోకి పోతున్నాయి .అతను. యింకా లేవలేదు .గడచిన రాత్రి. అతని ప్రవర్తన గుర్తుకొచ్చింది .వర్షపు రాత్రి యిద్దరం ఒక యింట్లో వున్నా అతని. సంస్కారం ,అతని. పద్దతి నచ్చింది .అసలు యిప్పుడు ఆలోచిస్తే అనిపిస్తున్నది ,ఎవరినీ రానియ్యని ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని తను కొత్త వ్యక్తికి ఆశ్రయం యిచ్చి భోజనం. పెట్టి రాత్రంతా పడుకోమని బలవంతం చెయ్యడం ఆలోచిస్త్ర తనకే ఆశ్చర్యం గా వుంది .కానీ. యేదో తృప్తి ,హాయి ,ఆనందం ,సంతోషం !! ఎందుకో తనకే అర్ధం కావడం లేదు ,లేదా అర్ధం అయ్యికూడా మనసుకు తెర కప్పేసిందా !!
అతనిని నిద్ర. లేపింది .అతను కార్యక్రమాలు ముగించుకున్నాక కాఫీ యిచ్చింది .
అతను బట్టలు మార్చుకున్నాడు .వెళ్లడానికి. తయారయ్యాడు .
“నేను వెళ్తానండీ ! మీ ఆతిథ్యాన్ని మర్చిపోలేను ! వర్షం లో వేడి వేడి అన్నం ఆవకాయ జన్మలో ఆ కమ్మని రుచి మర్చిపోలేను .” అంటూ వసుంధరకు నమస్కరిస్తూ గుమ్మం దగ్గరగా వచ్చాడు .
వసుంధర కాసేపు. అలాగే. అతనిని చూస్తూ వుండిపోయింది.ఏదో చెప్పాలని ఆరాటం !అప్పటికే అతను వీధిలోకి వెళ్లిపోయాడు.పరుగున వీధి బయటకు వచ్చింది ,కానీ అతను వీధి మలుపు దాటేశాడు .
సగటు ఆడమనసు తపన !పిరికితనం !తరతరాల సామజిక కట్టుబాట్లు ! నరనరాల జీర్నిన్చుకున్న సంప్రదాయాలు ,వసుంధర మనసును వెనుకంజ వేయించాయి .ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసుంటే ,వసుంధర. భవిష్యత్తు మరో లాగా మలుపు తిరిగేదేమో !

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి