కలం - స్నేహం - venu gopal maddu

Kalam-Sneham

రాజేశ్వరరావు ( రాజా) మృదు స్వభావి, మొహమాటస్తుడు. దేన్నయినా శాంతము గా సౌమ్యము గా పరిష్కరించుకోవాలి అనుకునే నైజం. అరుచుకోవటాలు కొట్లాటలు అంటే సుతారము ఇష్టం వుండదు. అందరితో సర్దుకు పోతే సరి అనుకుంటాడు. కొంత మంది మేధావులు వాళ్ళ జీవిత నిఘంటువులు తిరగేసి, " చేతకాని తనము " అని పరమార్ధం చెబుతారు. గంభీరమయిన ముఖ వైఖరి తో , చల్లగా వ్యంగ్యం తో కూడుకున్న పరిహాసం చెసే అతని జీవితం లో మిగతా విషయాలు పక్కన పెడితే , అతను అతి గా ఇష్టపడే రెండు అంశాల కలయికే ఈ కథా మూలం .

మొదటిది క్రికెట్ ఆట. తను యవ్వనం లో వున్నప్పుడు బాగా ఆడిన ఆట, ఇప్పుడు వయసు మళ్ళడం తో టి.వి లో వాళ్ళు ఆడుతుంటే చూడటం తో సరి పెట్టుకుంటున్నాడు. రెండోది అతనికి పెన్ను లు అంటే ప్రాణం. వెళ్ళిన ప్రతి చోట కీ , కలం దుకాణానికి వెళ్ళడం , కొత్త పెన్నులు సేకరించటం అతని కి రివాజు. రాజా వారి శ్రీమతి రమణి దగ్గర జీవితాన్ని కాచి వడబోసే నిఘంటువు లేదు గానీ, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకొని మరీ "మీకు క్రికెట్టు ఆట వుంటే గాబరా , మీ పెన్ను ల ఖర్చు పెద్ద దుబారా" అని దండకం పాడుతుంది. రాజా రమణిలకి ఇద్దరు పిల్లలు , ఇద్ధరూ పై చదువులకి అమెరికా వెళ్ళారు.

**********************

ఒకసారి ఆఫీసు పని మీద రాజమండ్రి వెళ్ళడం జరిగింది మన రాజా. ప్రతి రోజూ ఆఫీసు పని ముగిసాక, తనలాగే మిగతా ప్రాంతాలనుంచి వచ్చిన ఆఫీసు వాళ్ళతో , ఊరిలో వున్న ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రదేశాలు చూడటం తనకి ఆహ్లాదం కలిగించింది. సతీమణి తో ఎక్కడి కి వెళ్ళినా గుడి గోపురాలే , ఇలా చారిత్రక లేదా ప్రకృతి ప్రదేశాలు ఆవిడకి అంతగా రుచించవు. గోదావరి నది , పాత కొత్త బ్రిడ్జిలు , సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం, పుష్కర ఘాట్ , మారేడుమిల్లి తో పాటు చుట్టుపక్కల వున్న ఒకటి రెండు గుడులు కూడా తిరిగారు. వీటితో పాటు తన కలం వేట కూడా ప్రారంభించాడు. తను ఎప్పుడో ఎక్కడో పేపర్ లో చదివిన జ్ణాపకం , రాజమండ్రి లో రత్నం పెన్నుల గురించి. అక్కడ వాకబు చేసి ఆ దుకాణానికి వెళ్ళాడు. తానొక్కడే.

" నమస్కారం సార్ , వెల్కం టు రత్నం స్టోర్ " సాదరంగా ఆహ్వానించాడు నవ్వుతూ యువకుడు. పాతిక పైబడిన వయసు, చక్కటి ముఖ వర్చస్సు, నల్లటి నిగ నిగ లాడే జుట్టు, బాగా నూనె పట్టించి సైడు పాపిడి దువ్వి బొట్టు పెట్టుకున్నాడు.

"నమస్కారం బాబు , మీ పెన్నుల గురించి చాలా విన్నాను, ఇప్పుడే మొదటి సారి రావటం. కొన్ని చూపించమ్మా" రాజా

"సార్ మీరు లోకలా" కాదే అన్న అనుమానంతో

"లేదమ్మా నేను హైదరాబాదు.." అని ముగించేంతలో

"అనుకున్నా సార్. గెస్స్ చేసా. అసలు టూరిస్టులకి ఒక ఫేమస్ స్పాట్ లా అవుతుంది సార్ మా షాప్. విదేశాలనుంచి కూడా వస్తున్నారు సార్"

"నన్ను కూడా ఫారన్ వెళ్ళి , మళ్ళీ రమ్మంటావా " రాజా నెమ్మదిగా అన్నాడు . ఆ షాప్ కుర్రవాడి బడాయి ప్రకటన దోరణి లో, ఈ వ్యంగ్యం వినపడలేదు

బయట ఊరి ఖాతాదారుని చూసి కొత్త ఉత్సాహం పూనుకొచ్చింది కుర్రాడికి "రండి లోపలకి రండి " అని కౌంటర్ కి ఇవతల ఒక కుర్చి చూపించి , ఫాన్ ఆన్ చేసి, తను కౌంటర్ కి అవతలకి వెల్తూ

"నా పేరు రామ్మూర్తి సార్ చెప్పండి, మా వద్ద అన్ని రకాల పెన్నులు వుంటాయి సార్. మీకు ఎలాంటివి కావాలి"

"అన్ని రకాలు వొద్దు లే బాబు, నాకు రాసేవి చూపించు" రాజా గంభీరం గా

"భలే వారే, మా పెన్నులు అన్ని రాస్తాయి, లైఫ్ టైం గారంటీ కూడా " ప్రకటించాడు ఆ స్టోర్ బాయ్ " మీరు ఎమీ అనుకోకపోతే ఈ పేపర్ మీద ఎదన్నా రాయండి సార్ , ఇదిగో ఈ పెన్ తో రాయండి" అని ఒక పేపరు ఒక పెన్ ముందు పెట్టాడు.

"ఎమిటయ్యా ఇప్పుడు రామ కోటి రాయమంటావా ఎంటి, అంటే నాకు పెన్ను వాడటం వచ్చో రాదో అనా నీ అనుమానం" రాజా ఎగా దిగా ఆ కుర్రాడి వైపు చుసాడు

"లేదు సార్ , నన్ను మన్నించి మీరు రాయండి , ఒక వాక్యం తెలుగు లో, ఒకటి ఇంగ్లీష్ లో రాయండి, ఎందుకో నేను చెబుతాగా" కుర్రాడు ఒదిలేలా లేడు

సందేహిస్తూనే రాజా పేపర్ మీద రాసాడు రెండు బాషల్లో

' ఎదో ఒకటి రాస్తే గాని వదిలేలా లేడు ఈ అబ్బాయి '

' met a graphology expert in Ratnam pen store '

"సార్ మీరు సాదారణ కస్టమర్ కాదు సార్, మీరు పెన్ను పట్టుకునే విధానము , అసలు మీ చేతి రాత.. ఆ దస్తూరి.. ఆహా.... చేతి రాత బాగున్న వాడు తన తలరాత కూడ చక్కదిద్దుకోగలడు అనేవారు మా తాత గారు. అసలు మీది కాలిగ్రఫి లా వుంది. మీకు మా వి.ఐ.పి కలక్షన్ చూపించాలి సార్"

అని ఆ కౌంటర్ నుంచి బయటకి వచ్చి , లోపలకి రండి అన్నట్టు చేయి చూపించాడు

రాజా కి ఎమీ అర్ధం కాలేదు

'ఒరెయ్ సీనూ" గట్టి గా అరిచాడు రామ్మూర్తి " నువ్వు షాప్ చూసుకో, ఎవరయినా వి.ఐ.పి వస్తే నన్ను పిలువు. ఈ సార్ ని నేను లోపలకి తీసుకెళ్తున్నా

అప్పటి దాకా ఎదో మూల కుక్కిన పేను లా వున్న శ్రీను, హుషారు గా వచ్చి మెయిన్ కౌంటర్ సీటు లో కూచున్నాడు టివీ గా.

ఒక కర్టన్ తీసి ఇంకో పెద్ద గది లోకి తీసుకెళ్ళాడు రామ్మూర్తి. లోపలకి వెళ్ళాక అనుమానం పోయి ఆశ్చర్యం లో మునిగాడు రాజా. అదేదో పెద్ద పెన్ మ్యూసియం లా వుంది

"మ్యూసియం లా కాదు సార్, ఇది పెన్ మ్యూసియమే , సార్ మీరు పెన్ను లు కలక్ట్ చేస్తారు కదా"

అవును అన్నట్టు తల ఆడిస్తూనే , చంటి పిల్లాడు చాక్లెట్ ఫాక్టరీ కి వచ్చినట్టు నోరు వెళ్ళబెట్టి చుట్టూ చూస్తున్నాడు రాజా.

"రండి సార్ లోపలకి రండి" ప్రవేశ ద్వారానికి మూడడుగులే వేసి ఆగి పోయిన రాజా వారి తో మిగతా నాలుగు అడుగు లూ వేయించి పాణి గ్రహణం చేయించాడు రామ్మూర్తి.

రాజా ఇంకా ఈ లోకం లోకి రాలేదు

"సార్" అని గట్టి గా అరచి , ఇంకా వెళ్ళబెట్టి వున్న రాజా నోటి ని తన చేత్తో మూసాడు రామ్మూర్తి " రండి సార్ మనం ఈ చివరన మొదలు పెడదాము"

"ఇది చూడండి సార్ మన జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వయం గా మా తాత గారికి రాసిన లేఖ. గాంధీ గారే స్పూర్తి. అప్పటి దాకా మన దేశంలో విదేశీ పెన్నులే వాడేవారుట, మా తాత గారు మొట్ట మొదట 1932 లో గాంధీ గారి పిలుపు నందుకొని స్వదేశీ ఉద్యమం లో భాగం గా ఈ పెన్ను లు చేసారు సార్. గాంధీ గారు దేశాటనలో ఇటు వచ్చినప్పుడు మా తాత గారి పెన్ను వాడి, బాగుంది కాని దీనిలో అన్ని ముడిసరుకులూ విదేశీ దిగుమతి లేకుండా మన దేశపు వస్తువులతో చెయ్యమని ప్రేరేపించారట. అలా మొదలయింది సార్"

రాజా అలా ఆ లేఖ పక్కనే వున్న పెన్ను ముట్టుకో బోయాడు. ఇంతలో రామ్మూర్తి " సార్ ఎమీ అనుకోవద్దు, ఇవన్ని ప్రదర్సన కి మాత్రమే , డు నాట్ టచ్"..వాటి మీద ఒక తెల్లటి వస్త్రం కప్పుతూ " మరోలా అనుకోకండి సార్, మరమ్మత్తు కి , శుభ్రం చెయ్యడానికి తీసివుంటారు ... పొరపాటున బయట వదిలేసారు వెధవలు"..

"మీరు ఇటు రండి, కస్టమర్ కొనే వాటి విభాగం, ఇదిగో ...ఇక్కడ ప్రారంభం" అని ఒక నాలుగు వరసలు దాటించి చూపించాడు. " మీరు అన్నీ ఎంత సేపయినా చూడొచ్చు, కొనడానికి మాత్రం ఇక్కడనుంచే"...

రాజా మెల్లగా అన్ని చూసుకుంటూ వస్తున్నాడు "మీ దగ్గర ఇంకా ఏ పెన్నుల కలక్షన్ వుంది " ఆరా తీసాడు రామ్మూర్తి

"ఆ .. వున్నాయి, నేను ఏ ఊరు వెళ్ళినా పెన్నులు షాప్ చేస్తూ వుంటా.. పార్కర్, మోంట్ బ్లాంక్, షేఫ్ఫర్ , సెల్లో , అరోరా ఇలా...అంటే నాకు బంధువులు విదేశాల్లో వున్నారు, వాళ్ళు కూడా గుర్తు పెట్టుకొని తెస్తూ వుంటారు, అలా పోగు అయినవే, దాదాపు ఒక ఐదు వందలు వుంటాయి..ఇక పోతే పైలట్, పెంటెల్, యుని బాల్, రెయ్ నాల్డ్స్ ఇలాంటివి కూడా...."

"సెభాష్ గ్రేట్ సార్, వుండాలి సార్, మీలాంటి కళా పోషకులు వుండాలి. సార్ మీరు కొంపదీసి రచయిత కాదు కదా, నేను గుర్తు పట్టలేదేమో, నన్ను మన్నించాలి"

"అబ్బే అదేం లేదయ్యా, ఎదో చిన్న బోటి ప్రభుత్వ ఉద్యోగం వెలగ బెడుతున్నా, ఎంచేతనో తెలీదు ఇదో పిచ్చి అనుకో" రాజా తనని తాను సమర్దించుకున్నాడు

"ఇటు రండి, ఇప్పుడు మనం సాంకేతిక పరిభాష లోకి వెళ్దాం. మావి అన్నీ ప్యూర్ ఎబొనైట్ తో చేసినవి సార్. ఇక్కడ చూడండి పెన్ మోడల్ నంబర్ కి నిబ్ మరియు పెన్ సైజ్ కి ఒక రెలేషన్ వుంటుంది... అవును ఇంతకీ మీకు ఏ సైజ్ నిబ్ ప్రెఫర్ చేస్తారు "

"బాబు అంత పరిజ్ఞానం లేదమ్మా, ఎదో పట్టుకొని రాసి చూస్తే కొన్ని పెన్నులు నచ్చుతాయి అంతే, వీటిల్లో ఇంత వివరాలు నాకు తెలియవు"

"ఒకే సార్, నొ ప్రోబ్లం , ఇదిగో ఇక్కడ పెన్ మోడల్స్ అండ్ ధరలు వున్నాయి, లో మోడల్ 12 మీకు నూట యాబయి రుపీస్ , అలా మోడల్ పెరుగుతున్న కొద్ది మీకు రేటు పెరుగుతుంది . మీరు వర్కు గమనించండి, ఇదిగో ఈ మోడల్ 302 చూడండి అది మీకు ఐదు వందలు పడుతుంది, కాని చాలా వర్కు, ఆ నిబ్ సైజ్ అన్ని గమనించాలి మీరు. మీకు ఏది నచ్చితే అది తీసి రాసి చూడండి సార్" అని రెండు మూడు తెల్ల కాగితాలు అందించాడు

రాజా మళ్ళీ చంటి పిల్లాడయి పోయ్యాడు. వందలాది దీపావళి సామాను ముందు పెట్టి అన్నీ కాల్చుకో అంటే , దేనితో మొదలెట్టాలో తెలియని సతమతం

"ఇక మా సుప్రేం అండ్ టార్పిడో టాప్ షెల్ఫ్ మోడల్స్... కొంచెం ఖరీదు కాని, ఒకసారి పట్టుకోండి సార్ , ఈ వర్క్ చూడండి చూడటానికి లావు గా కనిపిస్తుంది టార్పిడో, కానీ 17 గ్రాంస్ కాప్ లేకుండా అంటే , చాలా తేలిక సార్, కాప్ తో కలిపి 28 గ్రాంస్ అంతే. పెన్ను , కేపు ల నిష్పత్తి గమనించండి, పెర్ఫెక్ట్ బేలన్స్, ఫీల్ అవ్వండి "

టార్పిడో మోడల్ పెన్ అందించాడు రామ్మూర్తి. రాజా అతనిచ్చిన తెల్ల కాగితాల మీద రాసి టెస్ట్ చేస్తున్నాడు.

"సార్ మీరు ఎమీ అనుకోకపొతే , అక్షరాలే కాకుండా, కొన్ని గీతలు కూడ గీయండి, వరుసగా 8 కుడి నుంచి ఎడమకి మరియు ఎడమ నుంచి కుడి కీ ... అలానే నిలువు గీతలు అడ్డం గీతలు...నిబ్ పైకి లేపకుండా గీయండి. అప్పుడు మీకు ఇంక్ ఫ్లో కంటిన్యూటీ తెలుస్తుంది"

కొత్త విద్య నేర్పిన మాస్టారు వైపు వినమ్రత గా చూసి అతను చెప్పినది పాటించాడు రాజా విధేయత తో.

ఒక పావు గంట రాజా ని వొదిలేసి , పనివాళ్ళు బయట వొదిలేసిన ప్రదర్సన వస్తువులు అన్నీ శ్రద్ధ గా తుడిచి, గాజు అద్దాల్లో బద్రం చేసి అన్నిటికీ తళాలు వేసాడు.

"ఏమి నిర్ణయించారు సార్. ఇంకో విషయం మరచా , మా వద్ద గోల్డ్, సిల్వర్ కోటెడ్ పెన్స్ కూడా వుంటాయి"

"వొద్దులే బాబు, నా నెలజీతం చాలదు" అని సరి పెట్టాడు రాజా

ఎదో ఒక రకం గా రాజా ని మొహమాట పెట్టి, పొగడ్తలతో తబ్బిబ్బి చేసి ఒక రెండు వేలు బిల్లు చేయించాడు మాటకారి రామ్మూర్తి.

"సీనూ రావాలమ్మా" రామ్మూర్తి గట్టి గా కేక వేసాడు. ఆ పిలుపు లో ఆంతర్యం గమనించిన శ్రీను కూల్ డ్రింకు , గిఫ్టు రాప్ చేసే కాగితము తో సహా మ్యూసియం గదిలోకి వచ్చాడు.

" ఆ సార్ కి డ్రింకు ఇవ్వు, ఇవి గిఫ్టు రాప్ చెయ్యి. " అని రాజా కొన్న పెన్నులు సీను కి ఇచ్చాడు.

"సార్ మీరు రిలాక్స్ అవ్వండి, నేను బయట కౌంటర్ లో మీ బిల్లు తో రెడి గా వుంటా"

రాజా కుర్చీ లో కూచిని డ్రింకు తాగుతున్నాడు శ్రీను తన పనిలో తాను వున్నాడు

"బాబూ.. మీకు గోదావరి కాకుండా పెన్నా నది వుంటే బాగుణ్ణు కదా"

పని లోంచి తల పైకెత్తి ఎమీ అర్ధం కాలేదు అన్నట్టు చూసాడు శ్రీను

"ఆ అంటే ..ఎమీ లేదు పెన్నా నదిలో అయితే, ఇలా కర్చు లేకుండా పెన్ను లు దొరుకుతాయెమో అని"

ఇంకా అర్ధం కాలేదు అని తన పనిలోకి తాను వెళ్ళిపోయాడు శ్రీను.

*****************************

మరుసటి రోజు ఆఫీసు కి వెళ్ళగానే , రాజా కి తన బాసు ఒక మంచి వార్త ఒక చెడ్డ వార్త చెవిన వేసాడు. మొదట ప్రణాలిక మేరకు ఆ ఆడిట్ వారం రోజులే. వచ్చిన వారికి అందరికీ ఆ శనివారం తిరుగు టపా రైల్ టికట్ట్లు కూడా బుక్ చేసింది సర్కారు. కానీ ఆడిట్ లో ఎదో చిన్న పొరపాటు దొర్లిందనీ, రాజా ఇంకో రెండు రోజులు అదనం గా వుండి అవి తేల్చి గానీ హైదరాబాదు రావడానికి వీలు లేదని తన బాసు చెప్పాడు. ఇక మంచి వార్త ఎంటంటే, ఇలా ఇక్కట్ట్లు పాలయినందుకు గాను , తిరుగు టిక్కట్టు తనకి రాజమండ్రి నుంచి హైదరాబాదు కి ఫ్లైట్ లో వేయించాడు. కొంతలో కొంత నయ్యం అనుకున్నాడు రాజా. అందరిలో మొహమాటస్తుడి ని పట్టి బలే బుక్ చేసా అనుకుని సంతోషించాడు బాసు.

రాజా , రమణి కి ఫోను చేసి తను లేటు గా వస్తున్న విషయం వివరించాడు.

***************************************

రాజా బేగ్స్ చెక్ ఇన్ చేసి, సెక్యూరిటీ ముగించుకొని, గేట్ దగ్గరకి నడిచాడు. బుధవారం మధ్యాన్నం కావడం వల్ల అనుకుంటా, విమానాశ్రయం నిర్మానుష్యం గానే వుంది. ఇంకా తన ఫ్లైట్ కి గంట సమయం వుంది. ఆఫీసు పని ముగించి సరాసరి ఎయిర్ పోర్ట్ కే వచ్చే తొందర లో అస్సలు బోజనం చేసే సమయం లేకపోయింది, ఒక స్టాల్ లో సమొసా చాయి కొనుక్కొని ఒక మూల గా కూచ్చుని తింటున్నాడు రాజా. తినటం ముగిసాక ఆ పేపర్ కప్ , ప్లేటు వేయటానికి డస్ట్ బిన్ వైపు వెళ్తున్న మన రాజా దృష్టి, దూరంగా ' నన్నంటు కోకు నామాలా కాకి ' అన్న దోరణి లో దాక్కున్న ఒక మనిషి వైపు మళ్ళింది. అతను నెత్తికి టోపి ,బాగా పెరిగిన గెడ్డము. రాజా కి మొహాలు బాగా ఆనవాలు పట్టే అలవాటు. పాత సినిమాల్లొ కూడా ఒకే నటుడు రెండు పాత్రలు వేసినా కూడా, వాళ్ళ పేర్లు బంగారం సింగారం అయినా కూడా, వాళ్ళలో ఒకడికి పుట్టుమచ్చ లేకపోయినా కూడ ఇట్టే గుర్తుపట్టేసేవాడు . ఈ సదరు మనిషి తన అభిమాన క్రికెట్ ఆటగాడు రాహుల్ వాలన్ లా వున్నాడు. ఎందుకయినా మంచిది అని అటు వైపు అలా వెళ్ళి అనుమానం రాకుండా పరికించి చూసి తను నిర్దారించుకున్నాడు.

'హలో , మీరు హైదరాబాదు కేనా' పలకరించాడు రాహుల్ వాలన్ కి ఒక్క సీటు అవతల కూర్చోబోతూ రాజా

రాహుల్ కొంచెం కంగారు పడ్డాడు, ఒంటరి గా ఇంత దూరం గా కూచున్న తనని ఎవరూ పలకరిస్తారని ఊహించని రాహుల్. ఈ వైటింగు ఏరియా లో ఇన్ని సీట్లు కాళీ గా వున్నా ఇక్కడికే దాపురించాడు వీడెవడు రా బాబు అన్న ఒక ముఖ వైఖరి తో " అవును" అన్నట్టు తల ఊపాడు

"మీరు రాహుల్ వాలన్ కదా " అన్నాడు మెల్లగా దగ్గరగా జరిగి, ఎదో రహస్యం చెబుతున్నట్టు ... "కంగారు పడకండి మీ ప్రైవసి కి భంగం కలిగించను. మీకు గెడ్డం వున్నా , కాపు పెట్టినా నేను గుర్తు పట్ట గలను" అన్నాడు భొలా గా

అటు ఇటు చూసి , సరే ఎవరూ లేరు అనుకొని "అవును" అన్నాడు రాహుల్ మెల్లగా.

"మీకు నేను పెద్ద అభిమానిని సార్, మీ అన్ని క్లాసిక్ ఇన్నింగ్స్ నాకు గుర్తున్నాయి సార్, యు ఆర్ క్లాస్ అపార్ట్....ఇంతకీ మీరు ఏంటి ఇక్కడ రాజమండ్రి లో ?" తన అభిమానాన్ని ప్రకటించుకుంటూనే అడిగాడు.

మొహమాటం గా సరే సరే అన్నట్టు అటు పక్క వాలిన తలని ఇటు పక్కకి తిప్పి " ఆ...ఎదో పెర్సనల్" అన్నాడు వాలన్.

అతని ఇబ్బంది గమనించిన రాజా " సార్ మీకు ఇబ్బంది గా వుంటే మనము అదిగో, దూరంగా ఆ చివర గోడ దగ్గరకు వెల్దాము అక్కడకి ఎవరూ రారు"

"ఆ వొద్దు నాకు గోడలు అంటే పడదు" అన్నాడు రాహుల్ బెదిరిపోతూ.

రాజా కి అర్ధం కానట్టు చూసాడు

"అదేమి లేదండీ, నా ఇంటి పేరు వాలన్ కదా అందుకే నన్ను అందరూ వాల్ వాల్ అంటారు. నాకు కంపరం. నేను బెంగళూరు లో కట్టించుకున్న ఇంట్లో కూడా , అసలు గోడలు తక్కువ గ్లాస్ డోర్లు ఎక్కువ"

సర్లే పాపం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రాజా అక్కడే కూర్చుని "మీరు కలకత్తా లో ఫాలో ఆన్ లో రామన్న తో ఆడిన ఆట.. ఆహ.. ఆ గేము మన దేశపు క్రికెట్ నే మార్చేసింది అంటే అతిసయోక్తి కాదేమో. మీరు అడిలైడు లో చేసిన 200.. అది 2003 అనుకుంటా..ఇంగ్లాండ్ లో 2002 లో లీడ్స్ లో ఆ 148 అది కూడా గ్రీన్ టాప్ సర్ఫేసు మీద.. అహా యు ఆర్ గ్రేట్ సార్. మీ లాంటి వారిని ఇంత దగ్గరగా చూడటం... గాడ్ ఈజ్ గ్రేట్"

"అబ్బో మీకు చాలా గుర్తున్నాయే " వాలన్ కొంత పొంగిపోతూ ఆశ్చర్య పోయాడు.

"గొప్ప చెప్పుకోవటం కాదు గానీ, నాకు కొంచెం మెమొరీ ఎక్కువే అండి. ఇప్పుడివే కాదు, 1975 నుంచి జరిగిన చాలా ఆటలు నాకు స్టాట్స్ ఇంకా గురుతే సార్... నాకు మిత్రుల బంధువుల జన్మదినాలు ఆనివర్సరీ లు కూడా గుర్తు వుంటాయి" సంభరం గా చెప్పాడు రాజా "మీరు ఎమీ అనుకోకపోతే నాకు ఒక్క చిన్న ఆటొగ్రాఫ్ ప్లీజ్ సార్" అని తన బేగ్ లోంచి ఒక నోటు బుక్ మరియు తన జేబులో వున్న రత్నం టార్పిడొ మోడల్ పెన్ను తీసి గర్వంగా అందించాడు

తప్పకుండా అన్నట్టు వాలను అందుకున్నాడు. ఆ తరవాత వాళ్ళిద్దరూ ఫ్లైట్ సమయం అయ్యే వరకూ క్రికట్ కబుర్లతో కాలక్షేపం చేసారు.

********************

విమానం గగన తలం లోకి టేక్ ఆఫ్ చెయ్యగానే అలసి పోయి వున్న రాజా బడలిక తీర్చుకోడానికి కునుకు తీసాడు. ఉలిక్కి పడి లేచే సరికి ఎయిర్ హోస్టస్ ద్రవ్యాలు సరఫరా చేస్తుంది. తను మంచి నీళ్ళు తీసుకుని జేబులో తడిమి చూసుకుంటే ఇంకేముంది. పెన్ను మాయం. గుండె జారినంత పని అయ్యింది రాజా కి. తను నిద్ర పోతున్నప్పుడు కింద గాని పడిందెమో అని పరికించి చూసాడు. కంగారు మొదలయింది. తన జేబులు తడిమాడు, కిందన , పక్కనా, సీట్ ముందర వుండే సంచీ లో అన్నీ వెతికాడూ. చెమటలు పట్టడం ప్రారంభమయింది రాజాకి.

చుట్టూ కలియజూసాడు. పక్క ఆయన జోబి లో ఎదో పెన్ను కనబడింది. నా పెన్ను ఎమన్నా తీసారా అని పక్క ప్రయాణికుడి ని అడిగే ధైర్యం చెయ్యలేదు గాని.

"మాస్టారూ ఒక సారి మీ పెన్ను ఇస్తారా పేపరు పజిల్ చేసుకోవాలి" అన్నాడు రాజా తెలివిగా, తన అనుమానం తొలగించుకోడానికి.

పక్క సీటు ఆయనవి అడవి బాపిరాజు లా బారెడు మీసాలు. వాటి కిందన పెదాలు వున్నాయో లేవో అన్నట్టు చిన్ని మూతి. "పెన్ను నాదగ్గర వుంది, పేపర్ మీ దగ్గర లేదుకదండే ?" బొంగురు గొంతు తో అడిగాడు, మీసాలు రెండూ ' అవును ' అని వత్తాసు పలుకుతూ పైకీ కిందకీ ఊగాయి.

"ఆ అంటే.. అదే.. ఇదే..." అని ముందున్న ఫ్లైట్ సంచీ లోంచి ఒక మేగజైన్ తీసాడు రాజా...పేజీలు తిరగేస్తే లక్కీ గా ఒక క్రాసు వర్డ్ పజిల్ కనపడింది. "ఇదన్నమాట.. ఆ ...." మొహమాటం గా ఎత్తి చూపించాడు మీసాలకి

సరే అన్నట్టు తన జోబి లోంచి పెన్ను జాగ్రత్త గా తీసి , ఆ పెన్ను కేపు మాత్రం తన కుడి చేతి పిడికిలి లో బిగించి, ఎడమ చేతితో పెన్ను ని రాజా కి ఇచ్చాడు.

చంటి పిల్లాడి కి ఐసు క్రీము ఇచ్చి స్పూన్ ఇవ్వలేదేంటి అన్నట్టు ' ఇంకా ఎదో రావాలి ' అన్న దోరణి ముఖంలో వ్యక్తీకరించాడు రాజా.

'ఏటి చూస్తున్నారండే , మేము కేపు ఇవ్వమండి, అహలే ఇది మాకు సెంటిమెంటు పెన్ను అండి ఆయ్" మీసాల గోదావరి యాస ఉట్టిపడింది "అయినా మీకు రాయడానికి కేపు ఎందుకండే, నాకు అర్ధం కాక అడుగుతున్నా, కేపు వుంటే గానీ పజిలు ఇడదీయలేరేటండే " గోదావరి చమత్కారం కూడ జాలువారింది ఆ మీసాల్లోంచి.

అయ్యో అదేం లేదండి , ఐసు క్రీము నాకేస్తా స్పూను అక్కరలేదు మనసులో అనుకున్నాడు రాజా. అయినా తను ఐసు క్రీము అడిగింది తినడానికి కాదు , కేవలం ఇది తన ఐసు క్రీమా కాదా అని చూడటానికి మాత్రమే. పెన్ను ని నోటి కి దగ్గరగా తీసుకొచ్చాడు ఐసు క్రీము అలోచనల్లో పడి పోయిన రాజా

"అమ్మో " గట్టి గా అరిచాయి మీసాలు "నా పెన్ను తినేత్తారా ఎటండే " నవ్వాడు.

రాజా కూడా ఐసు క్రీము లోకం లోంచి ఇహ లోకం లోకి వచ్చి, తను కూడా ఆ నవ్వు లో పాలు పంచుకొని, పెన్ను ని కిందా మీదా పరికించి చూసాడు. ఇది తనది కాదు . తన పెన్ను మీద రత్నం పెన్ను మరియు ఆ మోడల్ పేరు టార్పిడో అని కూడ చెక్కబడి వుంటుంది. ఎదో రెండు నిమషాలు పజిల్ చేసినట్టు నటించి పెన్ను వెనక్కి ఇచ్చేసాడు.

"అదేటి అప్పుడే చేసేసారా" పెన్ను ఇచ్చినప్పటి నుంచీ తన వైపే చూస్తున్న మీసాలకి తెలుసు పజిల్ చెయ్యలేదని, కానీ వెటకారం. కుడి చేతి గుప్పుట్లో వున్న పెన్ను కేపు రాజా ఇచ్చిన పెన్ను కి తగిలించి తన జోబి లో బధ్రం చేసుక్కున్నాడు.

పెన్ను లు సేకరించే తనకి ఈ పాటి జాగ్రత్త వుండాలి అని మనసులో అనుకొని " ఆ .. ఆ... అంటే బాతు రూము" రాజా లేచాడు.

లేచి ఒక్క సారి చుట్టుపక్కల వెతుకుతున్నాడు. ఒక వేళ తన జోబి లోంచి టొర్పిడో కింద పడి వుంటే, అది ఎటువంటి వింద్వంసం చేసి వుంటుంది. ఎటు ఎగిరిపడి వుంటుంది అనే అంచనాతో చుట్టు పక్కల సీట్లు కింద కూడా కలియచూసాడు.

"సార్ ఎమాన్నా వెతుకుతున్నారా, మీకు నేను ఎలా సహాయపడగలను " అంది ఎయిర్ హోస్టస్ మృదువుగా

"ఆ అంటే బాతు రూం" రాజా

"అయ్యో బాతు రూము ఆ ...ఆల్ ద వే డవున్ ద అయిల్ " చేతి తో దారి చూపించింది ,

"హ హ.. ఆ అనుకున్నా ఎక్స్ పెక్ట్ చేసా... ఆ ..ఆ.. అంటే మునుపటి సారి వచ్చినప్పుడు ఇక్కేడే వుండేది " పళ్ళు ఇకిలించి జోకాడు.

ధన్యవాదాలు లిపి తన పనిలోకి తను వెళ్ళిపోయింది రాజా హాస్యం అర్ధం కాని ఆ ఎయిర్ హోస్టస్

రాజాకి బాగా తెలుసు వాలన్ బిసినెస్స్ క్లాస్ లో వున్నాడు. సో తను ఈ వెనక కి వెళ్ళి లాభం లేదు. ముందడుగు వేయాలి. తను వుండే మద్య తరగతి కీ అటు వైపున వుండే బిసినెస్స్ తరగతి కీ మద్య ఒక ఎయిర్ హొస్టస్ కాపలాదారు లా నుంచుంది. రాజా కి తను సూర్పణక లా కనిపించింది. ముక్కు లు చెవులు కోసయినా సరే ఆ తరగతి లోకి వెళ్ళాలి. చాలా ఆలోచనలు బుర్ర లో తిరిగాయి. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ సూర్పణక దగ్గరగా వెళ్తున్నాడు. తను ఆపుతుందని తెలుసు. అందుకే ఎదో కాళ్ళు తిమ్మిరెక్కినట్టు కాళ్ళు స్ట్రెచ్ చేస్కుంటునట్టు, నడుం పట్టినట్టు అది సాగదీస్తున్నట్టు నటిస్తూ నత్త నడక నడుస్తున్నాడు. వెనకాల వున్న మధ్య తరగతి బాతు రూము వైపే తన చూపు వుంది. సరిగ్గా అదే సమయం లో ఎవరో లేచి దానిలోకి దూరారు. ఆ బాతు రూం పైన ఎర్రటి ఇంటూ మార్కు వెలిగింది. దాని కోసమే వేచి చూస్తున్న రాజా , తన నడక వేగం పెంచాడు. ద్వారపాలకి ని సమీపించాడు

"సూర్పీ " అన్నాడు ఆదమరుపులో సూర్పణకని స్మరిస్తూ.

" వాట్ సార్ , మీకు నేను ఎలా సహాయపడగలను" అంది ఆమె.

"సోరీ అనబోయి.. అ ఆదే ఆ వెనకాల బాతు రూం కాళీ లేదు, నాకెమో కొంచెం డయాబెటీస్ అమ్మా, కొంచెం అత్యవసరం , ఎమీ అనుకోక పోతే ఆ బిసినెస్స్ క్లాస్స్ బాతు రూం వాడుకుందామని"

"సోరీ సార్ రూల్స్ ..." అంటూనే అటు ఇటూ చూసి ఇంత కాళి గా వున్న ఫ్లైట్ లో ఎముందిలే అనుకుని " సరే సార్, ఒక్క సారికి, పెద్ద వారు కాబట్టి " అని ఆ రెండు తరగతుల మధ్య వున్న కర్టెన్ తొలగించి దారి చూపించిది రాజా కి

చాలా ఆనంద పడ్డాడు రాజా. మెల్ల మెల్ల గా అడుగులు వేసుకుంటూ డిటెక్టివ్ నవలలో కధానాయకుడి లా అన్నీ దిక్కులా గమనిస్తూ ముందు వెనకలు పర్యవేక్షిస్తూ, బాతు రూము దగ్గరకి వెళ్ళి నికబడ్డాడు. వెనక్కి తిరిగి మళ్ళి ఆ బిసినెస్స్ క్లాస్స్ అంతా కలియజూసాడు. రాహుల్ వాలన్ మొట్ట మొదటి వరుసలో నే, కునుకు తీస్తున్నాడు.

ఇంతలో సూర్పణక ఒకసారి కర్టెన్ తీసీ , మీరు నిర్భయం గా వెళ్ళి మూత్ర విసర్జన కానివ్వండి సార్ నా అండ మీకుంది అంది కని సైగ తో

రాజా బాతు రూము లోకెళ్ళి తలుపు వేసుకున్నాడు. సినిమాల్లొ హేరో లాగా అద్దం ముందు తనతో తాను మాట్లాడు కోవటం మొదలెట్టాడు. ఈ అభ్యాసం హీరోలకి ఎక్కడ లేని ధైర్యం తెచ్చిపెడుతుంది.

వాలన్ కావాలని తీసుకొని వుండరు ఏ మాత్రం మాటల్లో పడి పొరపాటున తన పెన్ను అతని జోబి లో పెట్టేసు కొని వుంటారు. లేదా కొంత మంది ఫేమస్ వ్యక్తులకి వున్నట్టు ఇతనికి క్లెప్టో మానియా వుందా ? కావాలనే దొంగలించారా ? ఏది ఏమయినా తనది తాను దక్కించు కోవాలి. కాని ఎలా , అబాసు పాలు కాకుండా , పెద్ద సీను అవ్వకుండా , కర్ర విరగ కుండా పాము చాకుండా ...

ఒక్కసారి బిసినెస్స్ క్లాస్ అంతా గుర్తుకి తెచ్చుకున్నాడు కళ్ళు మూసుకొని. సినిమాల్లో మల్లే తను నడిచి వస్తున్నప్పటి దృశ్యాలు తన మూసివున్న కళ్ళల్లో ఫ్లాష్ అయ్యాయి...జూబ్ జూబ్ జూబ్..ఈ అద్దం ముందు మాట్లాడే సాధన పని చేస్తునట్టు వుంది. బిసినెస్స్ క్లాస్స్ లో ముచ్చట గా మూడే వరుసలు. ఒక్కో వరుసలో 4 సీట్లు , దారి కి రెండు అటు రెండు ఇటు.. బుర్ర పాదరసం లా పనిచేసింది గణిత గుణింతం గబ గబా చేసాడు. మొత్తం పన్నెండు సీట్లు. అందులో నిండుకున్నవి కేవలం నాలుగే. వాలన్ వరుసలో ఎవ్వరూ లేరు. నిద్ర పోతున్న అతని జేబులో తన రత్నం పెన్ను కొట్టొచ్చి నట్టు కనబడుతుంది. వెనకాల వరుసల్లో ఇంకో ముగ్గురు. రెండో వరుసలో ఒక ముసలావిడ , ఆవిడ తో మనకి పెద్ద గా ప్రమాదం లేదు. మూడో వరుసలో ఒక పెద్ద గుండు బాసు అతని పక్కన చిన్న పిల్ల. తండ్రి కూతుళ్ళు అనుకుంట. ఈ సినిమాలో విలన్ గానీ కాదు కదా, కాదులే. విలన్ కి కూతురులు వుండరు, ఒక వేళ వున్నా హీరో కి వరసయిన వయసులో వుంటారు, ఆ పిల్లకి ఆరేడు ఏళ్ళ కంటే ఎక్కువ వుండవు.

ఒక్క సారి కళ్ళు తెరిచి తన లెంప మీద తనే కొట్టుకొని " ఫోకస్ రాజా ఫోకస్" అన్నాడు అద్దం లో వున్న రాజా తో

ఇది చాలా సులభం, మెల్ల గా వెళ్ళి, రాహుల్ జోబిలోంచి శబ్దం రాకుండా బధ్రంగా , తన పెన్ను తీసుకొని , ఏమీ జరగనట్టు తన సేటు కి వెళ్ళిపోవడమే. ఒక వేళ లేచాక తనకి తెలిస్తే. పొరపాటున తన జోబిలో పెట్టుకొని వుంటే, అతను అసలు గమనించే అవకాసమే లేదు. ఒకవేళ రాహులు కావాలని దొంగిలిస్తే తగిన సాస్తి. టిట్ ఫర్ టాట్ .

యుద్ధ వ్యూహం ముగించి , విజయ శంఖం మనసులోనే పూరించుకొని , బాతు రూము తలుపు తీసి బయట కి వచ్చాడు. మూడు అడుగులు వేయగానే రాహుల్ తన ముందే , ఇంకా నిద్ర లోనే వున్నాడు. రాజా తను కొంచెం ముందుకి వంగి, చేయి చాచి రాహుల్ జేబి దగ్గరకి మెల్లగా తీసుకెళ్ళాడు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది కానీ గుండెల్లో నూటొకటి కొట్టుకుంది.

అకశ్మాత్తుగా "దొంగ దొంగ .. బాబోయి దొంగ దొంగ" అరుపులు. రెండో వరుసలో నిద్ర పోతున్నది అనుకున్న ముసలావిడ కేకలు. వెనకాల వున్న గుండు బాసు ఒక్క సారి రాజా మీద కి దూకటం, పొట్ట లో గిబీ మని గుద్దడం రాజా స్పృహ కోల్పోవడం అన్ని ఒక్క సెకనులో జరిగిపోయాయి.

******

తన కళ్ళ మీద ఎదో వర్షం పడినట్టు అయింది రాజా కి. మెల్ల గా కళ్ళు తెరిచాడు , తను ఆ బిసినెస్స్ క్లాసు లో మొదటి వరుసలో రాహుల్ వాలన్ పక్కన కూచున్నాడు. రాహుల్ గారే తన కళ్ళ మీద నీళ్ళు జల్లుతున్నారు.

"సార్ ఎమి జరిగింది సార్" మెల్ల గా తేరుకున్న రాజా

"సారీ , పెద్ద గందరగోళం అయింది. ఆ వెనకాల వున్న ఆవిడకి తెలియదు మనకి ముందరే పరిచయం వుందని, నాకు తెలిసి మీరు నన్ను పలకరించ టానికి నను తట్టి లేపబోయి వుంటారు, ఆవిడ కంగారు పడ్డారు"

ఇంతలో ఆ ముసలావిడ లేచి వచ్చి " నన్ను మన్నించాలి, అసలే రాహుల్ గారు ప్రఖ్యాతి గాంచిన సెలెబ్రిటీ కదా ఈ రోజుల్లో ఎదీ చెప్పలేకుండా వున్నాము , అందుకే తొందరలో "

"అయ్యో ఎమీ పరవాలేదు మీరు ముందు జాగ్రత్త వహించారు" అన్నాడు రాజా , తన యుక్తి పన్నాగాలను పటాపంచలు చేసిన ముసలావిడని మనసులో తిట్టుకుంటూ

"ఆర్ యు ఒకే " అన్నాడు రాహుల్

ఇంతలో ఆ గుండు బాసు వచ్చి " సారీ బ్రదర్ , ఆవేశ పడ్డా" అని నవ్వాడు, గుండు నిమురు కుంటూ.

నువ్వు కచ్చితము గా నాకు విలన్ వేరా అని మనసులో నిందించు కొని "అయ్యో నో ప్రోబ్లెం" అన్నాడు రాజా బయటకి

ఇంతలో ఎయిర్ హోస్టస్ వచ్చి " హమ్మయ్య మీకెమన్నా జరిగిందేమో అని చాలా కంగారు పడ్డాము , మళ్ళి కేసు లు గట్రా.... ఈవిడ డాక్టరు కావడం తో , మీ పల్సు , వైటల్స్ అన్నీ చూసి మాకు ధైర్యం చెప్పారు" అని ఆ రెండో వరుసలో వున్న ముసలావిడని చూపించింది " మీకు ఎమన్నా కావలా ? వాటర్, కాఫీ ?"

ఎమీ వొద్దు అన్నట్టు చెయ్యి అడ్డం గా ఊపాడు రాజా.

"పోని లెండి గండం గడిచింది" రాహుల్ "తిరిగి చూసుకుంటే ఇదేదో కామెడి సినిమా లో బిట్ లా వుంది " నవ్వు కున్నారు ఇద్దరూ.

ఎవరొచ్చి ఎన్ని మాటలాడినా, రాజా కళ్ళు మాత్రం రాహుల్ వాలన్ జోబి లో వున్న తన రత్నం పెన్ను వైపే ఆత్రం గా చూస్తున్నాయి.

ఇంతలో ఆ ఎయిర్ హోస్టస్ మళ్ళి వచ్చి "సార్ మన్నించాలి, ఫ్లైట్ కింద కి వెళ్ళే సమయం వచ్చింది, ఎవరు సీటు లో వాళ్ళు కూర్చోవాలి.."

"షూర్ మాకు ఒక్క ఐదు నిమషాలు ఇవ్వండి" అన్నాడు రాహుల్ బతిమలాడుతూ. సరే అన్నట్టు ఆవిడ వెళ్ళిపోయింది.

"మీరు మాములు అభిమాని కాదు రాజా గారు. మీకు క్రికెట్ ఆట పట్ల వుండే ఇష్టము, అవగాహన.. ఆ పాషన్..యు ఆర్ యునిక్. అసలు మీకు పాత ఆటల గురించిన తెలిసిన వివరాలు గణాంకాలు, హాట్స్ ఆఫ్. మీలాంటి వారి తో మాట్లాడుతుంటే నా జ్ఞాపకాల తోటల వీధుల్లో నడుస్తున్నట్టు, ఆహ్లాదం గా వుంది. మనలో మన మాట ...నాతో ఆడిన ఆటగాళ్ళకు కూడ ఇంత నాలెడ్జి వుండదు, నిజంగా ... మీరు నమ్మాలి" అభిమానం వొలకబోసాడు రాహుల్

"ఎదో సార్ మీ అభిమానం అంతే , గాడ్ ఈజ్ గ్రేట్" అన్నాడు రాజా. తన చూపు ఇంకా పెన్ను మీదే వుంది.

"నాకో అయిడియా వచ్చింది. మీరు చూస్తే చాలా మర్యాదస్తుడి లా వున్నారు, దుర్వినియోగం చెయ్యరని అనుకుంటునా"

"అయ్యో ఎంత మాట చెప్పండి , ఎమిటా ఆలోచన" రాజా కళ్ళు పెన్ను మీదనుంచి రాహుల్ మొహం పైకి మారుస్తూ

"ఎమీ లేదు. నాకు మీతో క్రికెట్ ఆట గురించి మాట్లాడటం ఇష్టం, వి షుడ్ హేవ్ అ బీర్ సరదాగా. నా పెర్సనల్ ఫోను నంబర్ మీకు ఇస్తా, ఎవ్వరికీ మీరు అది షేర్ చెయ్యకూడదు. మీరు బెంగలూరు వచ్చినప్పుడు, ఒక వేళ.. రిటయిరు అయినా కూడా నేను చాలా బిజి గా వుంటా , ఒక వేళ నేను కాళి గా వుంటే, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి, ఫామిలీ ని కూడా తీసుకు రండి"

రాజా ఆనందానికి అవదులు లేవు. తను అభిమానించే క్రికెట్టు ఆటగాడి ఇంటికి తనకి ప్రత్యేక ఆహ్వానం. కళ్ళు చెమ్మగిల్లాయి.

చేతులు రెండు ఎత్తి నమస్కరించాడు. రాహుల్ కాదన్నట్టు ఇద్దరి చేతులూ జోడించి దాన్ని కరచాలము గా మార్చి "ఇది ఒక సరి కొత్త స్నేహానికి ఆరంభం" అన్నాడు “ మీ ఫోను తీయండి నా నంబర్ నోటు చేసుకుందురు గాని "

రాజా తన చొక్కా, పాంట్ జోబీలు తడిమి చూసుకున్నాడు.. "ఆ.. ఫ్లైట్ ఎక్కగానే ఫోను ఆపేసి , నా బేగు లో పెట్టేసా ... సారీ"

"అయ్యో దానికి సారి ఎందుకండి, ఇదిగో నా విసిటింగు కార్డు , దీని మీద ఈ పెర్సనల్ నంబర్ వుండదు ..నేను రాసి ఇస్తా , పెన్ను.." అని అటు ఇటు వెతికాడు

రాహుల్ చూపులో ఎదో కొంటెతనము దొర్లింది రాజా కి. అర్ధం కాలేదు , అపార్ధం చేసుకో దల్చుకో లేదు . ఒక పక్క తనకు ప్రీతి పాత్రమయిన పెన్ను , మరో పక్క అభిమాన క్రికెట్టు ఆటగాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి

“ మీ జోబిలో పెన్ను వుంది సార్ " గుర్తు చేసాడు ఆశ గా ఆ పెన్ను పక్క చూస్తూ

రాహుల్, ఇది ఎలా వొచ్చింది చెప్మా అన్న ఒక రీతి లో ముహం పెట్టి "హు ఒహ్ యా" అని ఎదో గుర్తుకు వచ్చినట్టూ , ఆ రాజా వారి రత్నం పెన్ను తో తన నంబర్ ఆ విసిటింగు కార్డు మీద రాసి ఇచ్చాడు.

రాహుల్ ఇంతకీ కావాలనే దొంగలించాడో, లేక పొరపాటు గా తన జోబిలో వేసుకొని మరచిపోయాడో అన్నది మాత్రం ఒక తీరని రహస్యం గానే మిగిలిపోయింది. ఇంతలో అయిర్ హోస్టస్ వచ్చే సరికీ రాజా వడి గా లేచి తన సీటు వైపు బయలుదేరాడు. ఇది తన కలం వల్ల పుట్టిన స్నేహం కాబట్టి ఇది “ కలం-స్నేహం “ కి సరి కొత్త నిర్వచనము అనుకున్నాడు రాజా.

=============== సమాప్తం ===========

ఈ కథ నా మేనమామ కి అంకితం. కేవలం నవ్వుకోటానికి చేసిన కల్పిత ప్రయత్నం. ఎవరినీ నొప్పించటానికి కాదు. క్రికెట్టు ఆట , ఆటగాళ్ళ అభిమానులు మన్నించ గలరు.

మరిన్ని కథలు

Jeevitaniki maro vaipu
జీవితానికి మరోవైపు ......
- జీడిగుంట నరసింహ మూర్తి
Sumangali
సుమంగళి
- మద్దూరి నరసింహమూర్తి
Yagnam
యజ్ఞం
- శింగరాజు శ్రీనివాసరావు
Chandra vamsham
భాగవత కథలు – 15 చంద్ర వంశం
- కందుల నాగేశ్వరరావు
Chinni aasha
చిన్ని ఆశ..!
- ఇందుచంద్రన్
Taraalu antaranga raagaalu
తరాల అంతరంగ రాగాలు
- సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు
Sneha dharmam
స్నేహ ధర్మం
- వెంకటరమణ శర్మ పోడూరి