మనుషులు అంతా మంచోళ్ళుకారు ! - తటవర్తి భద్రిరాజు

Manushulantaa manhollu kaaru

సంక్రాంతి పండగకి ఊరు అంతా సిద్ధం అవుతూ ఉంది. నెల ముందు నుండే ఇంటి ముందు పేడతో కల్లాపు చల్లి రకరకాల ముగ్గులతో వాకిళ్ళు అన్నీ చూడముచ్చటగా ఉన్నాయి. వాటర్ ట్యాంక్ పక్కనే ఉండే పెరుగు మోహన రావు గారి ఇంట్లో కూడా సంక్రాంతి సందడి కనపడుతూ ఉంది. వారం రోజుల ముందే కొడుకు కోడలు మనవరాలు హైద్రాబాద్ నుండి వచ్చారు. మోహనరావు గారి భార్య , జానకమ్మ గారు క్షణం తీరిక లేకుండా పిండి వంటలు చేస్తూ ఉంది. జానకమ్మ గారికి కోడలు సౌమ్య అంటే చాలా ఇష్టం. ప్రతీ ఏడు పండగకు కోడలు సౌమ్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సౌమ్య హైద్రాబాద్ లో చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజషన్ అనే ఒక సంస్థ లో పని చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న వారం రోజులు అత్తగారి వెనకాలే ఉంటూ అత్తగారితో కబుర్లు చెప్తూ, తనకి తెలియని ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటుంది. మోహనరావు గారు , జానికమ్మ గారు ఎన్నో సార్లు కూతురు లేని లోటు సౌమ్య వల్ల తీరింది అని సంబర పడ్డారు. భోగి పండగ ముందు రోజు మోహనరావు గారు , కొడుకు అప్రమేయ ని తీసుకుని పొలాలని చూపించడానికి తీసుకుని వెళ్లారు. జానకమ్మ గారు వంట పనిలో ఉండగా , సౌమ్య , తన 7 ఏళ్ల కూతురు హారిక కి యూట్యూబ్ లో వీడియో లు చూపిస్తూ బాడ్ టచ్, గుడ్ టచ్ గురించి వివరిస్తూ ఉంది. తల్లి మాటలను ఆ వీడియో లు చూస్తూ చాలా శ్రద్ధ గా వింటూ ఉంది హారిక. వంట గదిలో నుండి బయటకు వచ్చిన జానకమ్మ గారు సౌమ్య చెప్తున్న మాటలు వింటూ... 'సౌమ్య , ఈ వయసులో దానికి అవి అన్నీ ఏమి తెలుస్తాయి. అది ఇంకా చాలా చిన్న పిల్ల కదా..! ' పెద్ద అయ్యాక దానికే తెలుస్తాయి. అన్నారు. కాదు అత్తయ్య...పిల్లలకు ఈ వయసు నుండే గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి చెప్పాలి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళే అర్ధం చేసుకుంటారు. అసలే రోజులు ఎలా ఉన్నాయో తెలుసు కదా .! అందుకే చెప్తున్నాను అత్తయ్య. నా ఉద్యోగం లో నేను ప్రతీ రోజు ఇలాంటి సంఘటనలు ఎన్నో వింటూ ఉంటాను. ఎంతో మంది పిల్లలు భయం తోనే, అమ్మ నాన్న ఏమనుకుంటారో అనే ఆలోచన తోనే కొంత మంది మృగాలు చేసే అకృత్యాలు ను మౌనం గా భరిస్తున్నారు. చిన్న వయసులో ఆ పసి మనసుల పై పడే ప్రభావం వారి జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. సౌమ్య , జానకమ్మ గారితో మాట్లాడుతూనే ఉంది కానీ తన ఆలోచనలు మాత్రం తన పిన్ని కూతురు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సౌమ్య చెప్పడం ఆపింది కానీ , తనకు తెలియకుండానే తన కళ్ళ వెంట కన్నీరు కారుతూనే ఉంది. జానకమ్మ గారికి సౌమ్య ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాలేదు. " కాదు సౌమ్య నేను ఇప్పుడు ఏమి అన్నాను అని నువ్వు అంతలా ఏడుస్తున్నావు. ? 7ఏళ్ళ వయసులో దానికి ఏమి అర్ధం అవుతుంది ? అనే కదా అన్నాను. అని ఓదారిస్తున్నట్టు గా సౌమ్య పక్కనే కూర్చుని తల నిమురుతూ అన్నారు జానకమ్మ గారు. 'నేను బాధ పడుతున్నది మీరు అన్నందుకు కాదు అత్తయ్య. మా పిన్ని కూతురు నీరజ గుర్తుకు వచ్చింది'. అంది సౌమ్య. తనకి ఏమయ్యింది ? ఎప్పుడో నీ పెళ్లిలో చూసాను. ఆరోగ్యం బాగోలేదా ? అంటూ కొంచం అతృతతో అడిగారు జానకమ్మ గారు. 'ఏమీ కాలేదు అత్తయ్య. రేపు మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తాను. మీకు అక్కడే అన్నీ చెప్తాను 'అంది సౌమ్య. అనుకున్నట్టు గానే తరువాత రోజు ఉదయమే , సౌమ్య , అప్రమేయ, జానకమ్మ గారు కలిసి కాకినాడ లోని భానుగుడి సెంటర్ రెండో వీధిలో ఉండే సౌమ్య పిన్ని ఇంటికి చేరుకున్నారు. వీరు వస్తున్నారు అని ముందుగానే సమాచారం అందుకున్న సౌమ్య పిన్ని రాధిక , బాబాయ్ రామారావు ప్రేమగా ఆహ్వానించారు. కాసేపు అన్నీ మాట్లాడుకున్నాక , సౌమ్య ' పిన్ని నీరజ ఎక్కడుంది ? అని అడిగింది . పైన మేడ మీదగదిలో ఉంది రండి చూద్దురు గాని అని మేడ మీదకు తీసుకువెళ్లింది రాధిక. మేడ మీద రెండు గదులు చిన్న హాల్ చూడడానికి చాలా బావున్నాయి. మెట్లు ఎక్కగానే గోడపై ఉన్న బుద్ధుని పెయింటింగ్ ఎరుపు ఆకుపచ్చ రంగులో చాలా బావుంది. ఆ పెయింటింగ్ కి కిందుగా కొన్ని పూల కుండీలు ఉన్నాయి. వాటిలో రెండు గులాబీ మొక్కలు మొగ్గలు తో ఉన్నాయి. కొంచం ముందుకు వెళ్తే ఎడమ వైపు ఉన్న గది గుమ్మానికి ముందుగా చిన్న ఎక్వేరియం , అందులో బుల్లి బుల్లి చేపలు ఆడుతూ కనిపిస్తున్నాయి. తలుపు తీసి ఉన్న ఆ గదిలోకి ముందుగా రాధిక ' నీరూ' అని పిలుస్తూ వెళ్ళింది. ఆ తరువాత సౌమ్య, అప్రమేయ, జానకమ్మ గారు కూడా వెళ్లారు. గదిలో ఒక పక్కగా వేసి ఉన్న మంచం పై కూర్చుని ఎటువైపో చూస్తూ ఉంది నీరజ. నీరూ అని సౌమ్య పిలిచిన ఒక్కసారి తన కేసి చూసి మళ్లీ ఆ గోడల పైన తన చూపులు తిప్పేసుకుంది. అప్రమేయ ఒక్క అడుగు ముందుకు వేసి , చేతిని నీరజ తల పై ప్రేమ గా నిమురుతూ 'నీరు ఎలా ఉన్నావు రా ' అన్నాడు . నీరజ ఒక్కసారిగా తన ఎడమ చేతి పక్కన ఉన్న పుస్తకాన్ని అందుకుని అప్రమేయ చెంప పై గట్టిగా అరుస్తూ కొట్టింది. ఇలా జరుగుతుంది అని ముందుగా ఊహించని అప్రమేయ, సౌమ్య, జానకమ్మ ఏం జరుగుతుందో అర్ధం కాక కొంచం వెనక్కి జరిగారు. రాధిక వెంటనే నీరజ చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకుని దూరంగా విసిరేసింది. నీరజ అలా అరుస్తూనే ఉంది. ***** ***** ***** **** చూసారు కదా అత్తయ్య మా నీరజ పరిస్థితి. ఇప్పుడు చెప్తాను తనకు ఏమయ్యిందో. మా పిన్ని , బాబాయ్ కి ఒక్కగాని ఒక్క కూతురు నీరజ అది మీకు కూడా తెలుసు. తనని బాగా చదివిద్దాం అని కలలు కన్నారు. తనను డాక్టర్ చదివించాలని మా బాబాయ్ కోరిక. 6వ తరగతి వరకు చదువు లో బాగా వెనకబడి ఉండేది నీరజ. ఇంట్లో ఉంటే మా పిన్ని గరాబం తో నీరజ అస్సలు చదవడం లేదు అని మా బాబాయ్ అనుకున్నాడు. ఇంటికి దూరం గా బంధువుల ఇంట్లో ఉంచి చదవడానికి ఏర్పాట్లు చేసాడు. విజనగరం లోని మహారాజ కాలేజ్ పక్కనే ఉండే శ్రీనివాస మెడికల్ షాప్ వెనకాల ఇంట్లో ఉన్న బంధువుల ఇంట్లో నీరజ ను ఉంచారు. నెలకి ఒక్కసారి వెళ్లి పిన్ని బాబాయ్ , నీరజని చూసి తనకి ఏమైనా కావాలంటే ఇచ్చి వచ్చేవారు. కొంతకాలం బాగానే ఉంది నీరజ. కానీ ఆ తరువాత బాబయ్ పిన్ని వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉండను అని చెప్పేది. తనకు చదవడం ఇష్టం లేక అలా అంటుంది ఏమో అని అర్ధం చేసుకున్న బాబయ్ పిన్ని తనని బలవంతం గా అక్కడే ఉంచారు. మా బాబాయ్ ఎలాగైనా నీరజ ని డాక్టర్ గా చూడాలి అని కలలు కన్నాడు. బంధువులు ఇంట్లో ఉండే బాబయ్ , అన్నయ్య అనబడే మృగాళ్లు తనపై చేసే అకృత్యాలు ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో తెలియక తనలో తానే కృంగి పోయింది నీరజ. తల్లి తండ్రులకి ఈ ఇంట్లో ఉండను అని చెప్తే చదువుకోవడం ఇష్టం లేక ఉండను అని అంటుంది అని అనుకున్నారే కానీ ,ఎందుకు ఉండను అని అంటుంది అనేది ప్రేమ గా అడిగి తెలుసుకోలేకపోయారు. దానితో మానసికంగా కృంగి పోయిన నీరజ పూర్తిగా ఆరోగ్యం పాడుచేసుకుంది. తరువాత ఎప్పుడో నీరజ వంటిపై ఉన్న గాయాలు చూసి విషయం తెలుసుకున్న పిన్ని, బాబాయ్ నీరజ ను అక్కడి నుండి తీసుకువచ్చేశారు. కానీ నీరజ ఇప్పుడు మగాళ్లు కనపడితేనే భయం తో వణికి పోతూ అరుస్తూ ఉంటుంది. చివరకి తన తండ్రి ని కూడా చూసి భయపడుతుంది. విజయనగరం లో తాను భరించిన అకృత్యాలు తన శరీరం పై కంటే కూడా, తన మనసు పై చాలా ప్రభావాన్ని చూపాయి. రాజమండ్రి లో ఉన్న శ్రావణి హాస్పిటల్ లో డాక్టర్ కి జరిగింది అంతా చెప్తే నీరజ కొలుకోవడానికి చాలా ఏళ్ళు పట్టచ్చు, ఒక్కోసారి జీవితాంతం ఇలానే ఉండవచ్చు అని చెప్పారు. డాక్టర్ ని చదించాలి అనుకున్న కూతురు ఇలా మానసిక రోగిలా కళ్ళ ముందు ఉంటే, కన్న కలలు అన్నీ కన్నీళ్ల తో నిండిపోయాయి. అని సౌమ్య చెప్పడం ఆపింది. మౌనం గా నీరజ గురించి విన్న జానకమ్మ గారు 'సౌమ్య నువ్వు మన హరికకి చిన్నతనం లొనే గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి చెప్పి మంచి పని చేస్తున్నావు అమ్మా ! ప్రతీ అమ్మా నాన్న చిన్నప్పటి నుండి పిల్లల చదువులు, మార్కులే కాకుండా వాళ్ళతో ప్రేమగా మాట్లాడి, స్నేహపూర్వకంగా ఉంటూ వాళ్ల మనసులో మాటలు తెలుసుకుంటూ నీలా అన్ని విషయాలు వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పాలి . అది మగ పిల్లలు ఐనా ఆడ పిల్లలు ఐనా ఎందుకంటే "మనుషులంతా మంచోళ్ళు కాదు" అన్నారు జానకమ్మగారు. - సమాప్తం౼

మరిన్ని కథలు

Kurukshetra sangramam.14
కురుక్షేత్ర సంగ్రామం. 14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.13
కురుక్షేత్ర సంగ్రామం .13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.12
కురుక్షేత్ర సంగ్రామం .12.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.11
కురుక్షేత్ర సంగ్రామం . 11.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.10
కురుక్షేత్ర సంగ్రామం .10.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Iddarammalu
ఇద్దరమ్మలు
- తిరువాయపాటి రాజగోపాల్
Modu chiguru todigindi
మోడు చిగురు తొడిగింది
- బి.రాజ్యలక్ష్మి
Pellaina kottalo
పెళ్ళైన కొత్తలో
- తాత మోహనకృష్ణ