తప్పనితప్పు - శింగరాజు శ్రీనివాసరావు

Tappani tappu

నెల్లూరుకు సుమారు రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన తిరుపతి నుంచి విశాఖపట్టణం వెళ్ళే స్పెషల్ ట్రైనును విసుక్కుంటూ ఎక్కాడు తేజ. బ్యాంకు మేనేజరు గారు సెలవులో ఉన్న కారణంగా డెబిట్ రికవరి ట్రిబ్యునల్ లో తమ శాఖలో వున్న పారు బకాయిల సమాచారాన్ని తీసుకుని విశాఖపట్టణం బయలుదేరాడు. మొదటి తరగతి బోగి ఎక్కి తన సీటులో వెళ్ళి కూర్చున్నాడు. కరోన పూర్తిగా కనుమరుగు కాకపోవడం మూలాననో లేక రెగ్యులర్ రైలు కాకపోవడం మూలాననో కానీ, అతను ఎక్కిన కూపెలో ఒక అమ్మాయి తప్ప ఎవరూ లేరు. రిజర్వేషన్లను పూర్తిగా ఇవ్వకపోవడం కూడ ఒక కారణమేమో కూడ. తను తెచ్చుకున్న బ్యాగును పై సీటులో పెట్టి కింద బెర్తులో కూర్చుని, యాధాలాపంగా ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు. పచ్చని పసిమివన్నెతో తీర్చిదిద్దిన అవయవసౌష్టవంతో చక్కదనానికి బ్రాండు అంబాసిడరుగా అనిపించింది. అలాగే చూడాలనిపించినా సంస్కారం అడ్డొచ్చి తన చేతిలోని పుస్తకాన్ని తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. చిన్నగా ఊపందుకుంది రైలు. తల పుస్తకం వైపు ఉన్నా చూపులు మాత్రం ఆమె అందాన్ని జుర్రుకుంటున్నాయి. పలకరిస్తే బాగుండునని మనసు మొరాయిస్తున్నా, అభిమానం అడ్డువచ్చింది తేజకు. మూతికి వేసుకున్న మాస్కును పక్కకు పెట్టి వాటర్ బాటిల్ లోని నీళ్ళు తాగసాగాడు. అది దాహమయి కాదు. ఆ వంకతోనైనా నేరుగా ఆమెను చూడవచ్చు అని. కిటికీలో నుంచి వెలుపలకు చూస్తున్న ఆమె తేజ వైపు చూసి " ఎక్కడిదాకా సర్" అని అడిగింది. చేతిలో బాటిల్ వణికి నీళ్ళు చొక్కా మీద చిందులుగా పడ్డాయి. తమాయించుకుని సితార మ్రోగినట్లుగా తోచి "విశాఖపట్టణం అండీ" అన్నాడు. "అంటే మీరు కూడ నాతోపాటు రైలు చివరి మజిలీ వరకు వస్తారన్నమాట. ఎవరైనా సీనియర్ సిటిజన్ ఎదురుగా తిష్టవేసి మెదడు తింటాడేమో అనుకున్నా. థాంక్ గాడ్, నా అదృష్టం కొద్దీ మీలాంటి యూత్ ఐకాన్ జర్నీమేట్ గా దొరికాడు" "సేమ్ టు సేమ్. నేను అలాగే భయపడ్డానండీ. రాయితీలు ఇవ్వడం మొదలెట్టాక మొదటి తరగతి బోగీలలో సగం ముసలివాసనే. ఇప్పుడు కరోన కారణంగా అన్ని రాయితీలు రద్దుచేశారు కదా. అందుకని ఆ సుగంధం కాస్త తగ్గినట్టుంది" అని నవ్వాడు తేజ. "అంతేకాదండోయ్. కరోనా కిరాతకుడికి కూడ భయపడి ఎవరూ తొందరపడి ప్రయాణాలు పెట్టుకోవడం లేదు. ఏదయితేనేం మనలాంటి యూత్ కు కొద్దో, గొప్పో ప్రైవసి దక్కుతున్నది. ఏమంటారు?" నవ్వుతో నవ్వు కలిపింది ఆమె. "అందాల చందమామ ముత్యాలు వదిలితే ఏరుకోవడమే తప్ప ఎదురుచెప్పడం ఉండదండీ" కొంచెం ధైర్యం చేశాడు తేజ. "మరి మన్మథుడు ఎదురుపడేసరికి అదేమిటో మాటలు సునామీలా వచ్చేస్తున్నాయి నాకు" అంటూ కొంటెగా చూసింది ఆ అమ్మాయి. అమ్మో ఈ పిల్ల చాలా ఫాస్టే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు తేజ. ఏ మాటకు ఆమాట చెప్పుకోవాలి గానీ, తేజ మాత్రం తక్కువ అందగాడేమీ కాదు. చదువుకునే రోజులలోనే అమ్మాయిల మనసులో హీరోగా ముద్ర వేయించుకున్నాడు. మంచి ఎత్తు, పసిమి రంగుతో అటుయిటుగా మహేష్ బాబులా ఉంటాడు. "ఇంతకూ మీ పేరు చెప్పనేలేదు" అడిగాడు తేజ. "మీరు అడిగితే కదా కృష్ణతేజ గారు" " అరె నా పేరు మీకు ఎలా తెలుసు?" " ఆరవజ్ఞానం అంటే అదే మరి" " అర్థమయింది. ఛార్టులో నా పేరు చూశారు కదా" "అసలు ఛార్టు ఎక్కడ ఉందండీ" "అవును నిజమే కదా. మరి ఎలా?" " మీరు మరీ గొట్టపుదీపంలా ఉన్నారే" " అదేమిటి కొత్తగా" " ట్యూబ్ లైట్ కు ట్రూ ట్రాన్సిలేషన్ లెండి. అయినా మెడలో ఐడెంటిటి కార్డు వేలాడేసుకుని తిరుగుతుంటే, మీ పేరు నాకే కాదు లోకమంతా తెలుస్తుంది" అరనవ్వు నవ్వింది. "అవును కదా. ఏమిటో మిమ్మల్ని చూసేసరికి ఉన్న మతి కాస్తా మడతబడి పోయింది. ఇంతకూ మీ పేరు చెప్పనే లేదు" "కృతి" "మీ ఆకృతి ఎంత అందంగా వుందో, మీ పేరు కూడ అంత అందంగా ఉంది" " కవిత్వం వచ్చేస్తున్నదే హీరోగారికి" " మనసు మీద వయసు అదుపు తప్పితే ఇలాగే ఉంటుందేమో" " చాల్లెండి. ఎనిమిది కావస్తున్నది మరి గతకడానికి ఏమైనా తెచ్చుకున్నారా?" " అమ్మ పులిహోర చేసి పంపింది" " మరి మీ శ్రీమతి ఏంచేసి పంపింది" " ఒకమ్మాయి మతి చెడగొట్టింది గానీ, ఇంకా శ్రీమతి కాలేదు" " ఏమిటో అందులో నర్మగర్భమైన భావం" " ఏమిలేదండీ. నిశ్చితార్థమయింది. కానీ ఇంకా పెళ్ళికాలేదు" "ఓ కంగ్రాట్స్. ఇంతకూ అమ్మాయిది ఏవూరు?" "సింహాచలం" " అక్కడికి వెళుతున్నారా. మరి చెప్పరేం. త్వరగా తినేసి పడుకోండి. రేపంతా శివరాత్రే కదా ముచ్చట్లతో" ఏదో వెలితి కనిపించింది ఆమె మాటలలో. " లేదండీ. విశాఖపట్నంలో బ్యాంకు పని వుండి వెళుతున్నాను. ఆ పని పూర్తయిన తరువాత అటునుంచి సింహాచలం వెళ్ళి వస్తాను. మరి మీ భోజనం సంగతి" "ఇదిగో వెజిటబుల్ పలావు. మా అత్తయ్య చేసి పంపింది" అని బాక్సు చూపించింది. "మరి మీవారేమీ ఇవ్వలేదా" కొంటెగా అడిగాడు. "ఎక్కడినుంచో ఇస్తుండే ఉంటాడు" "అదేమిటండీ..అలా అంటున్నారు" వెంటనే పాదాలు చూపించి "అర్థమయిందా" అని అడిగింది. తల అడ్డంతిప్పాను. "నిజంగా మీరు గొట్టపుదీపమేనండీ. కాలికి మెట్టెలు లేవంటే అర్థమేమిటి. పెళ్ళి కాలేదనేగా. ఇది మా మేనత్త చేసి పంపింది" నవ్వింది కృతి బుర్రగోక్కున్నాడు తేజ. ఇంత అందాలరాశికి ఇంకా పెళ్ళి కాకపోవడమేమిటి. ఏమోలే... " ఇక కడుపులో వేసుకుందామా. బాక్సులలో భోజనం షేర్ చేసుకుని తిందాం" అని తన బాక్సు తీసి తేజ బాక్సు మూతలో పలావును ఉంచింది. అదే సమయంలో అప్రయత్నంగా జారిన కొంగు ఆమె ఎదసంపదను తేజ కళ్ళలో వేసింది. ఆమె ఎద మధ్యలోయలో పడి తేజ కళ్ళు అతని గుండె లోతులలో తుఫాను సృష్టించాయి. సభ్యత కాదని తల పక్కకు తిప్పుకున్నాడు. ఆమె అదేమీ పట్టించుకోకుండా, అతని బాక్సులోని పులిహోరను తన బాక్సు మూతలో పెట్టుకుంది. జారిన పైటను సర్దుకుని తినడంలో నిమగ్నమయింది. మనసును అదుపులో పెట్టుకుని తను కూడ తినడం ప్రారంభించాడు. ఆమె చొరవ, కలుపుగోలుతనం అతనికి బాగా నచ్చాయి. ఆమెను ఎంతసేపు చూసినా తనివితీరడం లేదు తేజకు. ఇద్దరూ తినడం పూర్తిచేసిన తరువాత చేతులు కడుక్కుని వచ్చి మరల మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మాటల మధ్యలో ఒకరి గురించి మరోకరు ఆరాలు తీసుకుంటూనే రెండు గంటలు గడిపేశారు. మాటల మధ్యలో అడిగింది కృతి " ఇంతకూ మీ కాబోయే శ్రీమతిని చూడడానికి వెళ్తూ ఉత్త చేతులను ఊపుకుంటూ వెళ్ళడమేనా, ఏదైనా గిఫ్టు లాంటిది కొన్నారా?" " ఇంకా అడగలేదేమిటా అనుకున్నాను. అడగనే అడిగారు. మీ ఆడవారికి ప్రేమ ఉంటే చాలని పైకి అంటున్నా, నగల మీద మోజే ఎక్కువ. అందుకే ఈ బిస్కెట్ వేసి ఓ ముద్దును రిటన్ గిఫ్ట్ గా కొట్టేద్దామని" అంటూ బ్యాగులో నుంచి నెక్లెస్ తీసి చూపించాడు తేజ. "వావ్.. సూపర్. ఎంత బాగుందో. ఇంత మంచి బహుమతికి తిరుగు బహుమతిగా ఒక్క ముద్దేమి ఖర్మ, నేనయితే చిరుతిండి కూడ పెట్టేదాన్ని" " అయితే తీసుకోండి" అంటూ ముందుకు వంగాడు తేజ. "ఏయ్" అంటూ చెంప మీద సుతారంగా కొట్టింది కృతి నవ్వుతూ. "ఆశ పెట్టి తప్పుకోవడం న్యాయమా" అని మూతి ముడుచుకున్నాడు తేజ. "చేసిన అల్లరి చాలు. శృతి మించితే ఇద్దరికీ ఇబ్బందే. ఇక ఎంచక్కా ఓ కునుకు వేసి తెల్లవారిన తరువాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఈ రైలు విశాఖపట్టణం చేరేసరికి ఉదయం కనీసం ఎనిమిది గంటలయినా అవుతుంది. ఓకె శుభరాత్రి" అంటూ బెర్తు మీద వాలింది కృతి. ఆమె మాటలకు నవ్వుకుంటూ నెక్లెస్ బ్యాగులో పెట్టి తను కూడా బెర్తును ఆక్రమించాడు తేజ. ******* పడుకున్న అరగంటలోనే నిద్రలోకి జారుకుంది కృతి. తేజకు నిద్రపట్టడం లేదు. సగం కన్ను తెరచి కృతి వైపు చూశాడు. ఆమె గాఢనిద్రలో ఉందనిపించింది తేజకు. నిద్రలో పక్కకు తొలగిన ఆమె పయ్యెద, ఎద పొంగులను అతని కళ్ళముందు పరిచింది. ఆమె తీరైన సౌష్టవాన్ని చూసి తేజ మనసు వశం తప్పుతున్నది. ఇంతలో ఆమె కదిలింది. కళ్ళు మూసుకుని నిద్ర నటించాడు. ఒక అయిదు నిముషాలు ఆగి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఒక కాలు పైకి మడిచి నిద్రపోతున్నది కృతి. ఆమె చీరకొంగు పూర్తిగా కిందకు జారిపోయింది. నున్నని ఉదరభాగం, మోకాలి పైకి జరిగిన చీరె కింద పిక్కల వరకు కనిపించే ఆచ్ఛాదన లేని కాలు, తేజలో సరికొత్త చలనాన్ని కలిగించాయి. మెల్లగా లేచి కూర్చున్నాడు. నవ్వీ నవ్వనట్లుగా విచ్చుకుని ఉన్న ఆమె లేత అధరాలను అదేపనిగా చూస్తున్నాడు. అతనిలో తమకం పెరగసాగింది. పైకిలేచి ఒక అడుగు ముందుకు వేసి ఆమె అధరాలను అందుకోబోయాడు. ఒక్క సెకను కాలంలో ఆమె అధరాల మధువులను అందుకుంటాడనే లోపు షాక్ కొట్టినట్టుగా వెనక్కులేచాడు. తల విదిలించుకున్నాడు. 'ఏమయింది నాకు. తల్లి నేర్పిన సంస్కారం ఎటు పోయింది. పెళ్ళి కుదిరి, ఇలా పరాయి ఆడపిల్లతో....ఛీ.ఛీ..తప్పు' అని అనుకుంటూ తన మనసును అధీనంలోకి తెచ్చుకుని, కిందపడిన చీరకొంగును తీసి ఆమె ఎదపై కప్పి వచ్చి తన బెర్తు మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు తేజ. ****** "సార్. లేవండి. వైజాగ్ స్టేషను వచ్చింది" అని టిక్కెటు కలెక్టరు లేపడంతో లేచి పక్క బెర్తు వైపు చూశాడు. కృతి కనిపించలేదు. బెర్తు కిందకు చూశాడు. ఆమె లగేజి కూడ లేదు. కానీ బెర్తు మీద క్లిప్పు పెట్టిన ఒక కాగితం రెపరెపలాడుతున్నది. టెన్షనుతో దాన్ని తీసి చదవసాగాడు. " క్షమించండి తేజగారు. నేను మంచిదాన్నని, బాగా కలిసిపోయేదాన్నని తలచి మీరు నాతో మనసు విప్పి మాట్లాడారు. నేను మీకు చెప్పినవన్నీ అబద్ధాలు. నేనొక వేశ్యను. అర్థరాత్రి వేళ మీరు నావైపుకు వంగి నన్ను తదేకంగా చూస్తున్నపుడు, మీరు నన్ను ఆక్రమించుకుంటారని అనుకున్నాను. కానీ అది జరగలేదు. అప్పుడే అర్థమయింది. మీరెంత సంస్కారవంతులో. మీలాంటి ఉత్తముడిని పొందబోతున్న మీ కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు. అవకాశం ఉండి కూడా అందిన అందాన్ని వదిలివేసిన మీలాంటి మంచివాడిని మోసం చేయకూడదనే నిజం చెబుతున్నాను. నేను నా అందాన్ని నమ్ముకుని సినీతారను కావాలని అడుగు బయటపెట్టాను. అందలం ఎక్కాలనుకుని అగాథంలోకి జారిపోయాను. అనుకున్నది నెరవేరక, జల్సాలకు డబ్బు చాలక, దారితప్పాను. ఒకపక్క జూనియర్ ఆర్టిస్టుగా కాలం వెళ్ళదీస్తూ, మరోపక్క పక్కను పంచుతూ కాలం వెళ్ళదీస్తున్నాను. సంవత్సరం నుంచి అందరి జీవితాలను అతలాకుతలం చేస్తున్న కరోన, మాలాంటి వాళ్ళ జీవితాలమీద కూడ తన ప్రభావాన్ని చూపింది. సినిమాలు లేవు. మరోవైపు భయంతో విటులు రావడం మానేశారు. దాచుకున్న డబ్బుతో కొంతకాలం ఎలాగో గడిపాను. రానురాను తిండికి కూడ కష్టమయింది. ఎలా బ్రతకాలో అర్థంగాక విశాఖకు మకాం మార్చాలనుకున్నాను. అందానికి లొంగని మగాళ్ళు కూడ ఉంటారని మిమ్మల్ని చూస్తేనే అర్థమయింది. మీకు సుఖాన్నిచ్చి, మీ దగ్గర నుంచి నెక్లెస్ తీసుకుని, దాన్ని అమ్మి కొంతకాలం జీవితం వెళ్ళదీద్దామనుకున్నాను. అది జరుగలేదు. కానీ నేను బ్రతకాలి కదా. అందుకే ఆ నెక్లెసును తస్కరించుకుని వెళుతున్నాను. ఇది తప్పని తెలుసు. కానీ తప్పలేదు. ఇది నేను చేస్తున్న తప్పనితప్పు. నన్ను క్షమించండి. మొదటిసారిగా నాకు ఈరోజు ఏమనిపించిందో తెలుసా తేజ గారు. ఎంతకాలమిలా శరీరాన్ని అమ్ముకుని బ్రతికేది. ఎంతకాలమిలా మగవాడి బలహీనతకు ఎరవేసి గడిపేది. ఇదీ ఒక బ్రతుకేనా అనిపించింది. ఇన్నాళ్ళూ అందాన్ని అమ్ముకుని కాలం గడిపిన నేను, ఇప్పుడు శ్రమను నమ్ముకుంటే ఎలా వుంటుంది అనే ఆలోచన వచ్చింది. అందుకే ఈ నెక్లెసు అమ్మగా వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం పెట్టుకుంటాను. ఇదేమిటి, ఇంతలో ఇంత మార్పు ఏమిటని అనుకుంటున్నారా. నా జీవితంలో ఇంతవరకు నా అందాన్ని అందుకోవాలనుకునే వాళ్ళు తప్ప, మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తారసపడలేదు. మార్పు రావడానికి ఎన్నో సంవత్సరాలు అక్కరలేదు. ఒక్క క్షణం చాలు అంటారు. అదే నా విషయంలో కూడ నిజమైంది తేజగారు. నేను ఇకనుంచి వేశ్యావృత్తికి చరమగీతం పాడి గౌరవప్రదంగా గడుపాలనుకుంటున్నాను. నన్ను నమ్మండి. నాకు అన్నీ అనుకూలిస్తే మీ నగ మీకు చేయించి ఇస్తాను. నాకు కేరాఫ్ అడ్రసు లేకున్నా, బ్యాంకు ఉద్యోగివి కనుక మిమ్మల్ని కనుక్కోవడం కష్టం కాదు. ఒకవేళ అలా జరగకపోతే, ఓ అభాగ్యురాలికి దానం చేశాననుకోండి. ఉంటాను తేజగారు. మరొక్కసారి మీకు క్షమాపణలు చెప్పుకుంటూ..... ........ ఓ అభాగ్యురాలు." ఉత్తరం చదివిన తేజకు కళ్ళు చెమర్చాయి. పరిస్థితికి తలవంచి తన శీలాన్ని అమ్ముకుంటుందే గానీ, ఏ ఆడపిల్ల తనకు తానుగా దిగజారిపోవాలనుకోదు. నీకు మేలు జరగాలి కృతి.. నా నెక్లెసు పోయినా ఫర్వాలేదు నీ జీవితం బాగుపడితే అదే చాలు. కళ్ళు తుడుచుకుంటూ బ్యాగు తీసుకుని రైలు దిగాడు తేజ. ******** అయిపోయింది *********

మరిన్ని కథలు

Pakkinti Anitha
పక్కింటి అనిత
- తాత మోహన కృష్ణ
Vruthi dharmam
వృత్తిధర్మం
- - బోగా పురుషోత్తం
నది తోసుకుపోయిన  నావ!
నది తోసుకుపోయిన నావ!
- కొత్తపల్లి ఉదయబాబు
Kadivedu neellu.2
కడివడు నీళ్ళు . ముగింపు
- రాము కోలా.దెందుకూరు.
Kadivedu neellu.1
కడివెడు నీళ్ళు. మొదటి భాగం.
- రాము కోలా.దెందుకూరు.
Lat Lat aar
లట లట ఆర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ettuku pai ettu
ఎత్తుకు పైఎత్తు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Devudu soottaantadu
దేవుడు సూత్తాంటడు..! (క్రీమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్