స్నేహబంధం - యు.విజయశేఖర రెడ్డి

Snehabandham

భాస్కర్,ఆనంద్ మంచి మిత్రులు.భాస్కర్ చదువులో ఎంతో ముందుండేవాడు. ఆనంద్ తండ్రికి వ్యవసాయంలో సాయపడుతుండేవాడు అందువల్ల చదువులో కాస్త వెనుకబడ్డాడు. కాలచక్రం గిర్రున తిరిగింది.భాస్కర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడ్డాడు.తండ్రి అనారోగ్యంతో చనిపోవడం వల్ల తల్లి,చెల్లి బాధ్యత మీద పడింది దానితో ఆనంద్ చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

చదువు పూర్తి చేశాక ఒక రోజు భాస్కర్,ఆనంద్‌ను కలిసి ఉద్యోగం కాలంటే పదివేలు లంచం అడుగుతున్నారు అని చెప్పాడు. ఆనంద్ వద్ద సాయం చేయడానికి డబ్బు లేదు.అమ్మను ఒప్పించి పాలిచ్చే ఆవును అమ్మి భాస్కర్‌కు పదివేలు ఇచ్చాడు ఆనంద్.వీలైనంత త్వరలో డబ్బు ఇస్తానని భాస్కర్ చెప్పాడు.

భాస్కర్‌కు ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. తరువాత బదిలీల మీద ఊరూరు మారేవాడు.ఆనంద్ వ్యవసాయం చేస్తూ ఇబ్బంది లేకుండా కుటుంబపోషణ చేస్తున్నాడు కానీ చెల్లి పెళ్లి చేయాలని సంబంధాలు చూడసాగాడు.

పెళ్లిళ్ల పేరయ్య ఆనంద్ ఇంటికి వచ్చి ఒక సంబంధం చెప్పాడు, కుర్రాడు సీతాపురంలో ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌‌గా పని చేస్తున్నాడని ఫోటో చూపించాడు.ఆనంద్ ఆ ఫోటో చూసి కంగారు పడ్డాడు అది ఎవరిదో కాదు భాస్కర్‌ది.

కట్నం ఎంత అడుగు తున్నాడు అన్నాడు పేరయ్యతో ఆనంద్. “ఆ.. లక్ష రూపాయలు” అన్నాడు పేరయ్య. “ఈ సంబంధం ఖాయం చేద్దామా?” అని తల్లితో అన్నాడు ఆనంద్. తల్లి సీతమ్మ చెల్లి కమల ఎంతో బాధ పడ్డారు.అందుకు కారణం లక్ష రూపాయలు కట్నంగా ఇవ్వాలంటే ఇల్లు గానీ, పొలం గానీ తాకట్టు పెట్టాలి.

పేరయ్య భాస్కర్ కుటుంబాన్ని కలిసి కమల ఫోటో చూపించి వివరాలు చెప్పాడు.భాస్కర్ ఒక మంచి రోజు చూసుకుని తల్లిదండ్రులతో ఆనంద్ ఇంటికి వచ్చాడు.”మీ చెల్లి కమలను వివాహం చేసుకోవడానికి నేను మా అమ్మానాన్నలు ఇష్టపడుతున్నాము” అని చెప్పాడు భాస్కర్.

“కట్నంగా లక్షరూపాయలు ఇప్పుడే ఇచ్చుకోలేను... కాస్త సమయం పడుతుంది” అన్నాడు ఆనంద్. “నువ్వు నాకు చేసిన సాయం మరిచిపోయేంత మూర్కుణ్ణి అనుకున్నవా? పేరయ్యలు వారి కమీషన్ కోసం ఇంత డబ్బు ఇచ్చేవారున్నారు అని చెబుతారు...నా మనసులో మీ చెల్లెల్ని చేసుకోవాలని ఏనాడో నిర్ణయించుకున్నాను, ఉద్యోగం సద్యోగం లేకుండా ఆ విషయం ప్రస్తావించ కూడదు అనుకున్నాను” అన్నాడు భాస్కర్.

“నాకు కాణీ కట్నం అక్కర లేదు” అని భాస్కర్ మాట్లాడుతుండగా ఒకతను ఆవును,దూడను తీసుకొచ్చాడు. “నువ్వు ఆరోజు ఇంటికి లక్ష్మి లాంటి ఆవును అమ్మి నాకు డబ్బు సర్దావు...ఇప్పుడు అదే ఆవును కాదు కానీ మరో ఆవును, దూడను మనింటి కోసం కొన్నాను .. మీ ఇంటి అమ్మాయిని మా ఇంటికి లక్ష్మిలా తీసుకు వెళతాను నీకు సమ్మతమేనా?” అని అన్నాడు భాస్కర్.

ఆనంద్ కళ్ళు చెమ్మగిళ్ళాయి. సీతమ్మ ఎంతో సంతోషించింది, అక్కడే ఉన్న కమల బుగ్గలు ఎరుపెక్కి అక్కడ నుండి మరో గదిలోకి పరుగు తీసింది.

ఆరోజు మంచి ముహూర్తం ఉందని తాంబూలాలు తీసుకున్నారు ఇరు కుటుంబాల వారు.ఒక వారం తరువాత లగ్నపత్రిక వ్రాయించుకున్నారు. నెల రోజుల తరువాత భాస్కర్ వివాహం కమలతో అంగరంగ వైభవంగా జరిగింది.భాస్కర్‌తో స్నేహబంధం, పెళ్లి సంబంధంతో బలపడినందుకు ఆనంద్ ఎంతో సంతోషించాడు.

****

మరిన్ని కథలు

Sumangali
సుమంగళి
- మద్దూరి నరసింహమూర్తి
Yagnam
యజ్ఞం
- శింగరాజు శ్రీనివాసరావు
Chandra vamsham
భాగవత కథలు – 15 చంద్ర వంశం
- కందుల నాగేశ్వరరావు
Chinni aasha
చిన్ని ఆశ..!
- ఇందుచంద్రన్
Taraalu antaranga raagaalu
తరాల అంతరంగ రాగాలు
- సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు
Sneha dharmam
స్నేహ ధర్మం
- వెంకటరమణ శర్మ పోడూరి
Nirnayam
నిర్ణయం
- జీడిగుంట నరసింహ మూర్తి