భాగవత కథలు-6 : కపిల మహర్షి జన్మ వృత్తాంతం - కందుల నాగేశ్వరరావు

Kapila maharshi janma vruttantam

కర్దమ మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మదేవుని నీడ నుండి జన్మించాడు. కృతయుగంలో బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించడానికి కర్దమ మహర్షిని నియమించాడు. దానికి కర్దముడు ఎంతో సంతోషించి పదివేల సంవత్సరాలు శ్రీమహావిష్ణువు గురించి ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసాడు. ఆ శ్రీహరి కర్దముని కరుణించి పచ్చని పట్టువస్త్రం ధరించి సుందర మందహాసంతో, కటాక్షవీక్షణాలతో ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ శ్రీహరిని దర్శించిన కర్దముని కనుల నుండి జారిన ఆనందబాష్ప బిందువులతో అక్కడ ‘బిందు సరస్సు’ ఏర్పడింది. కర్దమ మహర్షి ఆనందంతో స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసాడు. భక్తిభావంతో ఇలా అన్నాడు. “ గొప్ప యోగీశ్వరులకు దొరకని నీ దర్శనం ఈ రోజు నాకు దొరికింది. అందువలన నా జన్మ ధన్యమయ్యింది. నా తండ్రిగారైన బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం నేను గృహస్థాశ్రమం స్వీకకరించ దలచాను. నేను ఒక ఉత్తమురాలైన వధువును పరిణయమాడాలనే కోరికతో మిమ్ములను ధ్యానించాను. నన్ను కరుణించి నాకు మీ అనుజ్ఞను ఈయండి” అని ప్రార్థించాడు. విష్ణుమూర్తి చల్లని చూపులతో ఆ మునీంద్రుణ్ణి చూస్తూ నీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఎల్లప్పడూ నన్ను స్మరిస్తూ ఉండే స్వాయంభువ మనువు శతరూప దంపతుల కుమార్తె దేవహూతి నిన్ను పెండ్లాడి నీవల్ల సౌందర్యవతులగు తొమ్మండుగురు కుమార్తెలకు జన్మనిస్తుంది. ఆ కన్యలు గొప్ప మునీశ్వరులను పరిణయమాడి ఉత్తమ కుమారులకు జన్మనిస్తారు. తరువాత నా అంశతో నీకు కుమారుడనై జన్మించి, తత్త్వవిద్యను భోదిస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. కర్దముడు సంతోషముతో తన ఆశ్రమానికి తిరిగి వెళ్లాడు. స్వాయంభువ మనువు భార్యతో కలిసి పెండ్లికి ఎదిగిన తన కుమార్తె దేవహూతిని వెంట బెట్టుకొని ఆమెకు తగిన వరుణ్ణి అన్వేషించుతూ తన బంగారు రథంలో లోకాలన్నింటినీ తిరిగాడు. ఎక్కడా ఆమెకు తగిన వరుడు దొరక లేదు. తిరిగి భూలోకానికి వచ్చి, సరస్వతీ నది దగ్గర ఉన్న ‘బిందు సరోవరం’ పరిసరాల్లోని కర్దముని ఆశ్రమం దగ్గిరికి వచ్చాడు. ఆ ఆశ్రమం రకరకాల చెట్లతో పూల మొక్కలతో, పక్షుల కలకల ధ్వనులతో అతి సుందరంగా ఉంది. స్వాయంభువ మనువు కొద్దిమంది పరివారంతో లోనికి ప్రవేశించి కర్దమ ప్రజాపతిని దర్శించి ఆయన పాదాలకు నమస్కరించాడు. కర్దముడు తన ఇంటికి వచ్చిన అతిథిని సత్కరించి రాకకు కారణమేమిటని స్వాయంభువ మనువును అడిగాడు. అప్పుడు స్వాయంభువుడు ఇలా అన్నాడు. “విష్ణు స్వరూపుడవయిన నీ దర్శనం కలగడం నా భాగ్యం. నా కుమార్తె దేవహూతి అన్ని లోకాలలో మిక్కిలి సౌందర్యవంతులైన పురుషులను ఎవ్వరినీ వరించడానికి ఇష్టపడ లేదు. నారదమహర్షి వలన నీ గుణగణాలను ఆలకించి నిన్నే వివాహమాడాలని నిశ్చయించింది. అందువలన నీవు నా కుమార్తెతో వివాహమునకు అంగీకరించి ఆమెను స్వీకరించమని ప్రార్థిస్తున్నాను.” కర్దమ మహర్షికి వివరించాడు పూర్వము విష్ణుమూర్తి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. మునీంద్రుడు మిక్కిలి సంతోషంతో ఇలా అన్నాడు. ఓ రాజా! తనంత తాను వలచి వరించి నాకోసం వచ్చిన ఈ సౌందర్యవతిని నేను తప్పక భార్యగా స్వీకరిస్తాను. అయితే నాకు ఒక నియమం ఉంది. ఈమెకు సంతానం కలిగే వరకే నేను గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తాను. తర్వాత నేను సన్యాసం స్వీకరిస్తాను. ఇది శ్రీహరి ఆజ్ఞ. దానిని నేను తప్పక శిరసావహించ వలసినదే. ఆ మాటలు విన్న స్వాయంభువుడు తన భార్యాకుమార్తెల అభిప్రాయాలు అడిగి తెలుసుకొని, కర్దముని నియమానికి ఒప్పుకొన్నాడు. ఆ మునివరేణ్యునకు తన కుమార్తెనిచ్చి యథావిధిగా వివాహం జరిపించాడు. అనంతరం అల్లుడి వీడ్కోలు అందుకొని తన అర్థాంగితో రథాన్ని అధిరోహించి సపరివారంగా తన రాజ్యానికి వెళ్ళాడు. దేవహూతి పతిభక్తితో కర్దమునికి సేవ చేయసాగింది. భర్త మనస్సులోని అభిప్రాయాలకు అనుగుణంగా ప్రవర్తించింది. తండ్రి ఇంట సుకుమారంగా పెరిగి, తన కోసం కష్టపడుతూ చిక్కిపోయిన ప్రియసతి దేవహూతిని చూచి కర్దమప్రజాపతి జాలి పడ్డాడు. ప్రేమతో ఇలా అన్నాడు. “నీ సపర్యలకు నేను ఎంతో సంతృప్తి చెందాను. విష్ణుకటాక్షం కారణంగా నాకు దొరికిన దివ్య భోగాలు, అనంతములైన శుభాలు, సమస్త సంపదలూ నిరంతరం నన్ను సేవించిన నీకు దక్కుతాయి. అంతేకాదు, నీకు తిరుగులేని దివ్యదృష్టిని కూడా అనుగ్రహిస్తాను. ఈ సుఖాలను నీవు సమబుద్ధితో అనుభవించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది”. ఆమె మోము వంచుకొని తన భర్తవంక చూస్తూ ముద్దుముద్దుగా ఇలా అంది. “నీవు సంతానం కలిగేంతవరకు మాత్రమే నాతో సంసార జీవితం గడుపుతానని ఆనాడు నియమం పెట్టావు. రతి రహస్యాన్ని ప్రకాశింప చేసే కామశాస్త్రాన్ని నాకు నేర్పు. అందుకు తగిన వస్త్రాలు, అలంకారాలు, ఉద్యానవనాలు, శయన మందిరాలు మొదలైనవి సమకూర్చి నన్ను కనికరించు. నాకు సంతాన భిక్ష పెట్టు, నామనోరథం తీర్చు.” భార్య కోరిక విన్న కర్దముడు ఆ క్షణంలోనే ఒక దివ్యవిమానాన్ని సృష్టించాడు. ఆ విమానం అందమైన అలంకారాలతో అన్ని సుఖాలు అనుభవించడానికి యోగ్యమైనదిగా ఉన్నది. కర్దముని ఆజ్ఞతో ఆమె స్నానానికై బిందుసరోవరంలో దిగింది. అందున్న దేవతాస్త్రీలు దేవహూతికి తలంటి బంగారు బిందెలతో స్నానాలు చేయించారు. మంగళహారతులిచ్చి, చక్కగా అలంకరించారు. తరువాత కర్దముడు సతీసమేతంగా దివ్యవిమానాన్ని అధిరోహించి అందమైన ప్రదేశాలెన్నో సందర్శించాడు. అనంతరం శృంగారకేళీ విలాసాలకు అభిముఖురాలైన ఇల్లాలి హృదయాన్ని గుర్తించిన కర్దముడు రతిక్రీడా పరాయణుడై కాలగమనం గమనించకుండా వంద సంవత్సరాలు గడిపాడు. ఆ కారణంగా కర్దముని వల్ల దేవహూతి ఒకే కాన్పులో తొమ్మండుగురు పుత్రికలను కన్నది. అనంతరం కర్దముడు సన్యసింప దలిచాడు. ఆ విషయం తెలుసుకొన్న దేవహూతి తన భర్తతో ఇలా అన్నది. “నాథా! సంతానం కలిగే వరకూ నాతో ఉంటానని పూర్వం నీవు చెప్పావు. తొమ్మండుగురు పుత్రికలను అనుగ్రహించావు. ఈ యువతులు తమకు తగిన భర్తలను తామే ఎలా వెదుక గలరు. అందుకని ఈ నీ కుమార్తెలకు తగిన వరులను అన్వేషించి, వారికి వివాహం చేసి, నాకు వేదాంత విషయాలను తెలియజెప్పగలిగిన కుమారుణ్ణి ప్రసాదించి నన్ను కటాక్షించు. ముక్తి మార్గాన్ని చెప్పేవారు లేక ఇంతకాలం వ్యర్థంగా గడిచిపోయింది.” ఆమె పలుకులు ఆలకించిన కర్దమునికి విష్ణుదేవుని వాక్యాలు గుర్తుకువచ్చి ఆమెతో ఇలా అన్నాడు. “దేవీ ఆ పరమేశ్వరుడైన విష్ణుభగవానుడు కొలది కాలంలోనే నీ గర్భంలో కుమారుడిగా జన్మిస్తాడు. నీవు ఉత్తమ నియమాలతో వ్రతాలను నిష్టతో ఆచరించు.” ఇది విన్న దేవహూతి ఎంతో సంతోషపడింది. మహావిష్ణువును పూజిస్తూ ఉండగా కొన్నేళ్ళు గడిచాయి. అప్పుడు భగవంతుడు కర్దమ మునీశ్వరుని తేజస్సును ధరించి దేవహూతి గర్భంలోనుండి ఆవిర్భవించాడు. ఆ శుభసమయంలో ఆకాశంలో దివ్యమంగళ వాద్యాలు ధ్వనించాయి. తత్త్వజ్ఞానాన్ని బోధించడానికి ఆమె గర్భంలో పుట్టిన పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువును దర్శించండం కోసం మరీచి మొదలైన మునీశ్వరులతో కూడి బ్రహ్మదేవుడు విచ్చేశాడు. ఆ మహాత్ముడి దర్శనం చేసుకున్న అనంతరం బ్రహ్మదేవుడు ఆ పుణ్యదంపతులను చూసి ఇలా పలికాడు. మీ జన్మ సార్ధకం అయింది. మహాత్ముడూ, మహా తేజోవిరాజితుడూ అయిన ఈ నీ కుమారుడు స్వయంగా పుండరీకాక్షుడే. అమ్మా! దేవహూతి! జ్ఞానవిజ్ఞాన యోగాలనే ఉపాయాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికై కమలాక్షుడు నీ కడుపున ఉదయించాడు. నీ గర్భాన్ని జన్మించిన ఈ మహాత్ముడు నీకు తత్త్వ బోధ చేస్తాడు. దానితో నీ హృదయంలోని సంశయాలన్నీ తీరి పోతాయి. ఈ నీ కుమారుడు ప్రసిద్ధులైన సిద్ధపురుషులచే సేవింపబడుతూ మహనీయమైన సాంఖ్యయోగంతో ప్రకాశించే పరతత్త్వమందు సుస్థిరుడై “కపిలుడు” అనే పేరుతో ఈ మూడు లోకాలనూ సంచరిస్తాడు. ఈ విధంగా పలికి బ్రహ్మదేవుడు నారదుడు, సనకుడు మొదలైనవారితో తన నివాస స్థానానికి తిరిగి వెళ్ళాడు. కర్దముడు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం తన కుమార్తెలైన కళను మరీచి మహర్షికి, అనసూయను అత్రి మహర్షికి, శ్రద్ధను అంగీరసునకూ, అవిర్భువును పులస్త్యునకూ, గతిని పులహువునకూ, క్రియను క్రతువునకూ, ఖ్యాతిని భృగువునకూ, అరుంధతిని వసిస్ఠునకూ, శాంతిని అధ్వర్యునకూ ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత కర్దముడు ఏకాంత ప్రదేశంలో శ్రీమహావిష్ణువు అంశంతో పుట్టిన తన పుత్రుడు కపిలునకు నమస్కారం చేసి ఇట్లా అన్నాడు. “ఓ మహాత్మా! నిష్ఠాగరిష్టులైన యోగి శ్రేష్ఠులు ఏమరుపాటు లేక ఏ మహానుభావుణ్ణి దర్శిస్తారో అటువంటి దేవాదిదేవుడవు నీవు నా ఇంటిలో జన్మించావు. నన్ను అనుగ్రహించడానికి నా కుమారుడవై పుట్టావు. ఓ పుణ్యపురుషా! నీకు నమస్కరిస్తున్నాను. నీవు నాకు పుత్రుడవై పుట్టడం వల్ల నేను దేవ, ఋషి, పితృ ఋణాలు మూడింటి నుండీ విముక్తి పొందాను”. కర్దమ మునీంద్రుని మాటలు ఆలకించి కపిలుడు ఆయనను చూసి అనురాగ పూర్వకంగా ఇలా అన్నాడు. నేను నీ తపస్సుకు మెచ్చి ఇంతకు పూర్వం నీకు ఇచ్చిన వాగ్దానం మేరకు నీ యింట పుట్టాను. నేను ఈ ముని వేషం ధరించిండం నాకోసం కాదు. మహాత్ములైన మునులకు పరమ వివేకంతో కూడిన తత్త్వజ్ఞానాన్ని ప్రభోధించడం కోసం ధరించిన దేహంగా దీనిని తెలుసుకో. భక్తి పూర్వకంగా నా పాదాలను ధ్యానించు. మహిమతో విరాజిల్లే నీ బుద్ధిని నాయందు లగ్నం చెయ్యి. పరమేశ్వరుడనూ పరంజ్యోతినీ అయిన నన్ను కదలకుండా నీహృదయ కమల మధ్యంలో పదిలంగా నిలిపి, ఇంద్రియాలను జయించి మనోనేత్రంతో సూటిగా దర్శించు. అలా ఆచరిస్తే నీవు మోక్షాన్ని పొందుతావు అని పలుకగా కర్దముడు కపిలునకు ప్రదక్షిణం చేసి, నమస్కరించి మునిజనయోగ్యమైన అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ భక్తియోగంతో భాగవతులు పొందే పరమపదాన్ని అందుకున్నాడు. అనంతరం కర్దముని సతీమణి దేవహూతి బిందు సరోవరం వద్దనున్న తన కుమారుడు కపిలుని దర్శించి ఇలా అడిగింది. “ నాకు ఈ అంతులేని అజ్ఞానాంధకారం లోనుంచి బయటపడే అవకాశం ఏ ఉపాయంవల్ల కలుగుతుంది? జ్ఞానవంతులలో అగ్రగణ్యుడైన నిన్ను శరణు వేడుతున్నాను. నన్ను కాపాడు.” అలా అడిగిన తల్లి దేవహూతి మాటలకు మందహాసం చేస్తూ, కపిలమహర్షి భక్తి స్వరూపాన్ని, యోగవిద్యనూ, అందలి విభాగాలనూ, అందులోగల తత్త్వార్థాలనూ సాంఖ్యయోగాన్ని అనుసరించి భక్తియోగ మహత్త్వాన్ని, ప్రకృతి పురుషుల భేదాన్ని, పురుషుడు భక్తియోగం ద్వారా సమస్త ప్రపంచం నుండి విరక్తుడయ్యి మోక్షం సాధించే మార్గాన్ని భోధించాడు. కపిలమహర్షి ఉపదేశం ఆలకించిన దేవహూతికి మోహం తొలగిపోయింది. అప్పుడు ఆమె కపిల మహర్షిని ఉద్దేశించి ఇలా అంది. “మహా ప్రళయ సమయంలో సమస్త భువనాలను నీ ఉదరంలో పదిలంగా దాచుకొని మహాసాగర మధ్యంలో మర్రి ఆకు మీద మాయా శిశువువై ఒంటరిగా శయనించిన వటపత్రశాయివి, ఆదినారాయణమూర్తివి అయిన నీవు నా పూర్వ పుణ్య విశేషంవల్ల నా కడుపున పుట్టావు. నా జన్మ తరించింది. అనంతకల్యాణగుణ సంపన్నుడవు అయిన నీ మహత్త్వాన్ని అభివర్ణించడం బ్రహ్మదేవునకు కూడా సాధ్యం కాదు. నిన్ను తెలుసుకొని సన్నుతించడం నాకు శక్యం గాని పని. అందువల్ల పరబ్రహ్మవూ, పరమపురుషుడవూ, సకల జీవుల పాపాలను పటాపంచలుచేసేవాడవూ అయిన నీకు నమస్కరిస్తున్నాను.” ఈ విధంగా దేవహూతి స్తుతించగా మాతృప్రేమ నిండిన కపిలుడు కన్నతల్లితో ఇట్లా అన్నాడు. “తల్లీ ! సుఖ స్వరూపమూ, మోక్షప్రదమూ అయిన ఈ యోగమార్గాన్ని నీకు తేటతెల్లంగా వెల్లడించాను. దీనిని నీవు దృఢమైన భక్తితో అనుష్ఠించు.” అనంతరం కపిలుడు తల్లి అనుజ్ఞ గైకొని తండ్రిగారి తపోవనాన్ని వదలి ముల్లోకాలకు సాంఖ్యశాస్త్రాన్ని ప్రభోధించి శాంతిని ప్రసాదించాడు. కపిలుడు వెళ్ళిపోయిన అనంతరం దేవహూతి తన కడుపున కపిలమూర్తియై అవతరించిన శ్రీమన్నారాయణుని ఏకాగ్రచిత్తంతో అనేక విధాలుగా ధ్యానం చేయడం మొదలెట్టింది. ఆమె ఎదలో అఖండమైన వైరాగ్యం కుదురుకొంది. పరిశుద్ధ మనస్కురాలైన దేవహూతికి బ్రహ్మజ్ఞానం ప్రాప్తించింది. నిర్మలమైన తత్త్వజ్ఞానం అలవడింది. దైవభావం కలిగింది. పరబ్రహ్మతో సమాధి సిద్ధించింది. తన అస్తిత్త్వాన్ని మరచిపోయింది. అఖండ యోగప్రభావం వల్ల ఆమె మనస్సు ఆకాశానికి ఎగసి పరమ కరుణా మయుడైన వాసుదేవుని చరణకమలాలలో విలీన మయింది. ఆ సతీమతల్లి మోక్షాన్ని అందుకున్న పవిత్రక్షేత్రం ‘సిద్ధిపదం’ అనే పేరుతో ప్రసిద్ధి వహించింది. ఈ కపిల దేవహూతి సంవాదం అతి పవిత్రమైనది. ఈ సంవాదాన్ని విన్నవారు, చదివినవారు శ్రీపతి పాదపద్మాలను చేరుకుంటారని మైత్రేయుడు విదురునకు చెప్పినట్లుగా, శుక యోగీంద్రుడు పరీక్షిత్తుకు చెప్పాడని, సూతమహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాడు. ****************

మరిన్ని కథలు

Sumangali
సుమంగళి
- మద్దూరి నరసింహమూర్తి
Yagnam
యజ్ఞం
- శింగరాజు శ్రీనివాసరావు
Chandra vamsham
భాగవత కథలు – 15 చంద్ర వంశం
- కందుల నాగేశ్వరరావు
Chinni aasha
చిన్ని ఆశ..!
- ఇందుచంద్రన్
Taraalu antaranga raagaalu
తరాల అంతరంగ రాగాలు
- సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు
Sneha dharmam
స్నేహ ధర్మం
- వెంకటరమణ శర్మ పోడూరి
Nirnayam
నిర్ణయం
- జీడిగుంట నరసింహ మూర్తి