దొరికిపోయాడు - డాక్టర్ కెఎల్వి ప్రసాద్

Dorikipoyadu

డిగ్రీ కాలేజీలో శ్రావణ్ మూడు సంవత్సరాలు హాయిగా గడిపేసి మొత్తం మీద డిగ్రీ సంపాదించి ,అదృష్టావశాత్తు మంచి బాంక్ ఉద్యోగంలో స్థిరపడిపో-- యాడు . ఉద్యోగం వచ్చిందికాబట్టి అనుకోకుండా డిగ్రీలో తన సహాధ్యాయిని అందాల సుందరి పద్మజ తనకు జీవితంలో తోడుగా ఉండడానికి పెద్దల నిశ్చయంతోనే శ్రావణ్ అడుగులో అడుగువేసి అతనికి అర్ధాంగి అయింది . కాలేజీలో చదువుతున్నప్పుడు ,శ్రావణ్ ఎవరికీ ,ముఖ్యంగా ఆడపిల్లలకి అసలు అర్ధం అయ్యేవాడుకాదు . మగపిల్లలతో ఎంతగా చనువుగా ఉంటాడో ఆడపిల్లలతోనూ అంతే చనువుగా ఉండేవాడు . తన క్లాస్ ఆడ పిల్లలతోనే కాక తన సీనియర్స్ తోనూ ,జూనియర్స్ తోనూ ఒకేలా సరదాగా హాస్యాలాడుతూ నవ్విస్తూ కవ్విస్తూ ఉండేవాడు . ఈ నేపథ్యంలో ప్రతి అమ్మాయీ తనతోనే శ్రావణ్ చనువుగా వుంటున్నాడన్న భావనలో ఉండేవారు . కానీ ఎప్పుడూ ఎవరికీ వారే అతని విషయంలో తికమక పడేవారు . అలాంటి వారిలో పద్మజ కూడావుంది . అయితే ఆమె అతని విషయంలో పెద్దగా ఆలోచించింది లేదు . శ్రావణ్ ఎప్పుడూ అమ్మాయిలను తనచుట్టూ తిప్పుకుంటాడని మాత్రం ఆమె అనుకుంటుండేది . అయితే అతని జీవిత భాగస్వామిని అవుతానని అమె కలలో కూడా ఊహించలేదు . కాపురానికి వచ్చినతరువాత పద్మజ అతని గురించి బాగా తెలుసుకుంది . సాధ్యమైనంత వరకూ శ్రావణ్ అభిరుచుల మేరకు సర్దుకుపోవడానికే ప్రయత్ని స్తున్నది . ఉదయం బ్యాంకుకు వెళ్లిపోయి ,రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకునే శ్రావణ్ కి చాలా కొద్ది సమయమే దొరుకుతుంది భార్యతో గడపడానికి . ఆ కొద్ది సమయంలో మళ్ళీ బోలెడు ఫోన్ కాల్స్ . ఇదంతా మౌనంగా భరిస్తూనే వుంది పద్మజ . ఇలాంటి విషయాలతో తగువు పెట్టుకోవడం వల్ల మనః స్పర్ధలు తప్ప ఒరిగేది ఏమీ ఉండదని ఆమెకు బాగా తెలుసు . అందుకే ఎంతో సంయమనం తో ఏమీ తెలియనట్టుగా నటిస్తూ సర్దుకు పోవడానికి ప్రయత్నం చేస్తోంది . సమయం వచ్చినప్పుడు తనప్రతాపం చూపిద్దామని కాస్త ఓపిగ్గా ఎదురుచూ స్తున్నది . ఒకరోజు ఆ సమయం రానేవచ్చింది . ఆ అదనుకోసమే ఇప్పటివరకూ ఎదురు చూసిందామె .ఆ రోజు భర్త కాస్త స్పెషల్ గా వెరైటీగా తయారయి బ్యాంకుకు వెళ్ళిపోయాడు . పద్మజ అది చూసి తనలో తాను నవ్వుకుంది తప్ప బయటి కి ఏమీ మాట్లాడలేదు . కనీసం ఎప్పటిలా ప్రశంశ కూడా చేయలేదు . ఆతను కూడా ఆరోజు ఆమెనుండి ఎలాంటి ప్రశంశలూ ఆశించలేదు . పద్మజ మాత్రం ఆ రోజు తనకు చెప్పని స్పెషల్ ఏదోవుందని మాత్రం గ్రహించింది . తొందరపడే మనః స్తత్వం కాదుకనుక ఈజీగా తీసుకుంది . సాయంత్రం రోజూకంటే ముందు కాస్త బయటికి పోవాలని మేనేజర్ ను పర్మిషన్ అడిగాడు శ్రావణ్ . మేనేజర్ అనవసర ప్రశ్నలు వేయకుండానే పర్మిషన్ ఇచ్చాడు శ్రావణ్ కి . బ్యాంకు లోనే కాస్త ఫ్రెష్ అయి ఇక బయటికి వెళదామనుకుంటుండగా టేబుల్ మీద వున్న మొబైల్ మోగింది . చూస్తే ఏదో తెలీని నంబర్ లా వుంది అయినా ఎందుకైనా మంచిదని మొబైల్ ఆన్ చేసి .. ‘’ హలో… ‘’ అన్నాడు . అవతల ఒక స్త్రీమూర్తి కంఠం ,’’ హలో .. ‘’ అంది ,కోకిల కంఠం లా ఆడగొంతు వినపడగానే సరిగా సర్దుకుని అటెన్షన్ లో నిలబడి ‘’ హలొ … మీరూ ..!’’అన్నాడు శ్రావణ్ . ‘’ మీరు నాకు తెలుసు , నేను మీకు తెలిసే అవకాశం లేదు ,మీ పక్క ఆఫీసులోనే పని చేస్తున్నాను ‘’ అంది ఆ అమ్మాయి కంఠం . ‘’ అవునా .. చాలా సంతోషమండీ . ఇంతకీ ఎందుకు ఫోన్ చేసారో చెప్పారు కాదు !’’ అన్నాడు ఆతృతగా . ‘’ అంటే .. రెండు నిముషాలు కూడా నాతో మాట్లాడడం ఇష్టం లేదా ?’’ అంది కాస్త నిష్ఠూరంగా ,ఎంతకాలంగానో స్నేహితులైనట్టు . ‘’ అదికాదండీ .. ఏదైనా పనివుండి … ‘’ శ్రావణ్ పూర్తిచేయక ముందే … ‘’ పనివుండే చేసాను .. మీ గురించి తెలిసాక ,మీతో కాసేపు మాట్లాడి బయట ఒక కప్పు కాఫీ తాగి … !’’ ‘’ అలాగే .. . . తప్పకుండా .. నిజానికి ఈ వాళ ఒక పని మీద బయటకి వెళ్లాల్సి వుంది ,కానీ మీ కోసం ఇవాళ్టి కి అది కాన్సిల్ చేసుకుంటాను ‘’ అన్నా డు , ఎక్కడ ఈ చాన్సు చేజారిపోతుందోనని . ‘’ ఓహో .. అలా అయితే వద్దులెండి , తర్వాత కలుద్దాం ‘’ అంది . ‘’ నో .. నో .. తప్పక కలుద్దాం ,ఎక్కడో చెబితే నేను అక్కడికి వచ్చేస్తాను ‘’ అన్నాడు కాస్త హడావిడిగా . ‘’ మీరు ఏమీ అనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా ‘’ అంది ఏదో తికమక పెట్టే ధోరణిలో . ‘’ తప్పకుండా .. అడగండి ‘’ అన్నాడు ‘’ నేను విన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదూ .. !’’అంది ముద్దు ముద్దుగా వెంటనే సమాధానం చెప్పకుండా ఒక నిముషం ఆగి … ‘’ అవును .. అవును .. మీరు విన్నది నిజమే !నాకు ఇంకా పెళ్ళికాలేదు . ‘’ అన్నాడు ఎలాంటి తడబాటు లేకుండా . ‘’ అలాగా .. అయితే త్వరగా రండి ఇంటికి ,మీ సంగతి ఏమిటి తేలుస్తాను ‘’ అంది మామూలు మాటల్లో పద్మజ . ‘’ ఆ .. నువ్వా .. పద్దూ … !’’ అంటూ ఏదో చెప్పబోయేంతలో అవతల ఫోన్ కట్ చేసింది పద్మజ . ‘’ ఈవిడ .. ఇంత మిమిక్రీ ఎప్పుడు నేర్చుకుందిరా బాబూ .. ‘’ అని తనలోతాను గొణుక్కుంటూ .. ఇంటి దగ్గర యుద్ధ భూమిని ఊహించుకుంటూ హడావిడిగా ఇంటిముఖం వైపు బండి పోనిచ్చాడు శ్రావణ్ . ***

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి