వీడు మారడు - సి హెచ్. వి.యస్. యస్. పుల్లం రాజు

Veedu maaradu

కొత్తగా పెళ్లయ్యిందా ? ఒక్కటి పాటించండి. కరోనాని తన్ని అత్తగారింటికి పంపండి. ఏమిటా ఒక్కటి?, ప్రముఖ డాక్టర్ జర భద్రం గారితో ముఖాముఖిలో, తెలుసుకోండి. ఈరోజు రాత్రి 8 గంటలకు. టీవిలో తరువాత వచ్చిన ప్రకటన సుబ్బారావుని ఎంతగానో ఆకట్టుకొంది. "కరోనాతో ఆసుపత్రికి రావద్దు. మీరు కోరుకున్న డాక్టర్ తో ఫోన్ లో సంప్రదించవచ్చు, సందేహాలు తీర్చుకోవచ్చు. డాక్టర్ చెప్పిన మందులు వాడుతూ, ఇంట్లోనే ఉంటూ వ్యాధిని నివారించుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం?ఇక ఫొన్ తీయండి, ఇక్కడ కనిపించే నెంబర్ నొక్కండి."

రెండు రోజులుగా జలుబు, జ్వరంతో బాధ పడుతున్న సుబ్బారావులో అధ్బుతమైన ఆలోచన మొలకెత్తింది. ఏమి చేయాలో తెలియక సతమతమవుతూ, భార్యకు దూరంగా వుండలేక లోలోపల భయాందోళనకు లోనవుతూ కాలం దొర్లిస్తున్నాడు. ఆసుపత్రికి రావద్దన్న పాయింట్ బాగా నచ్చింది. అందుకే, ప్రకటనలో ఇచ్చిన నెంబర్ కి చకా చకా ఫోన్ చేయడం, డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఫోన్ ద్వారా చెల్లింపు చేయడం క్షణాల్లో జరిగింది.

నిర్ణయించిన సమయానికి ఫోన్ మ్రోగడం, "హలో సుబ్బారావు గారు, ఎలా వున్నారు, చెప్పండి మీ సమస్యలు…" ఎంతో హుందాగా డాక్టర్ గొంతు వినబడింది. "రెండు రోజుల నుంచి జ్వరం, జలుబు, కళ్ళు మంటలు……" సుబ్బారావు ఏకరువు పెడుతున్నాడు. మధ్యలోనే డాక్టర్ అందుకున్నాడు."మీరు చెబుతున్న లక్షణాలు బట్టి, కరోనా వ్యాధి కాదని చెప్పలేము. మందులు, పరీక్షలు వ్రాస్తున్నా, రిపోర్టులు వచ్చిన తరువాత కలుద్దాం.'" ఫోన్ కట్టయింది. వాట్సప్ లో మందుల చీటి, చేయించవలసిన పరీక్షలు, డయోగనిస్టిక్ సెంటర్ వివరాలు వచ్చాయి.

పరీక్షలు చేయించుకొని, రిపోర్టులు వాట్సప్ లో పెట్టి ,మళ్ళీ డబ్బులు చెల్లించి డాక్టర్ తో మాట్లాడాడు సుబ్బారావు. రిపోర్టుల గురించి, ఆరోగ్య సమస్యల గురించి అడగాలనుకొన్నాడు. కానీ నిరాశ ఎదురైంది. " మందులు వాడండి. రిపోర్టులు నార్మల్ గానే వున్నాయి. సి.టి.స్కాన్ చేయించండి…"డాక్టర్ చిరునవ్వుతో ఫోన్ కట్టయింది. పెరుగుతున్న ఆరోగ్య సమస్యల గురించి చెప్పాలనుకొన్నాడు. వాసన, రుచి తెలియడంలేదు. ఒక్కసారి మాట్లాడాలంటే వెయ్యి రూపాయల కట్టాలి. ఏమీ పాలుపోని పరిస్థితి. డాక్టర్ తన సమస్యలు వింటాడాని, సందేహాలు తీరుస్తాడాని భావించాడు. రెండు వేల రూపాయలు ఫీజు చెల్లించాడు. సుబ్బారావులో అసంతృప్తి. ఏదో జరుగుతోంది. ఏమిటో అంతు పట్టడం లేదు. జరిగిన మోసం అర్థం కాలేదు.

నిజానికి సుబ్బారావుతో మాట్లాడింది డాక్టర్ కాదు. ఆది రికార్డు చేయబడిన వాయిస్. సులువుగా డబ్బులు సంపాదించడానికి,కరోనాని కూడా ఒక వనరుగా, ఎంచుకున్న మార్గమిది. చదువు కొన్న చదువు వాడికి సమాజంపట్ల బాధ్యతని నేర్పాలి. కానీ వాడి విషయంలో మోసం నేర్పింది. అందుకే వాడు మారడు. ఆంతే...

💐💐💐💐

మరిన్ని కథలు

mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి
Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati