వేట....!! - డాక్టర్ టి.జితేందర్ రావు

Veta

షో రూం ముందు కారు ఆగింది. డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకుంటే మోహన్ రావు కారులో నుండి దిగాడు. మోహనరావు కారు ప్రక్కనే మరో కారు ఆగింది. అందులోనుండి మల్లారెడ్డి దిగాడు. "హలో మోహన్ రావు బాగున్నావా? నీ కారు చూసి గుర్తుపట్టి నువ్వే అనుకొని నీ కారు వెనకాలే వస్తున్నాను" అన్నాడు. "హలో మల్లారెడ్డి బావున్నాను. నువ్వు అంతా కులాసానే కదా?" షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు మోహన్ రావు. "ఏమిటీ మళ్లీ కారు మారుస్తున్నావా? కొత్త కారు కొంటున్నావా ?" అడిగాడు మల్లారెడ్డి. " అవును మారుద్దాం అనుకుంటున్నాను ఏదైనా కొత్త మోడల్ వస్తే వెంటనే కొంటానని నీకు తెలుసు కదా ?" అన్నాడు. " తెలుసు తెలుసు కానీ మరీ సంవత్సరం క్రితమేగా ఈ కారు కొన్నది అప్పుడే అమ్ముతున్నావా ? అని అడుగుతున్నాను. అయినా ఇలా కార్లు మార్చడం వల్ల ఇన్కమ్ టాక్స్ విషయంలో కూడా కొంత లాభం వస్తుంది కదూ" అడిగాడు మల్లారెడ్డి. అవును ఆ లాభం కూడా కొంత ఉంటుంది అందుకే అమ్ముతున్నాను నా భార్యకు సెంటిమెంట్లు కొంత ఎక్కువ ఈ కారు కొన్న అప్పటినుండి ఏదో మంచి అయింది, ఇంకొంతకాలం ఉంచుకుందామనీ అన్నది, కానీ మంచి ధర వస్తుందని అమ్మితే వచ్చే లాభాల గురించి చెప్పిన తర్వాత తాను వొప్పుకుంది అన్నాడు మోహన్ రావు ఇద్దరు షో రూమ్ లోకి వెళ్లారు కొత్త కారు చూద్దామంటే ఎవరో టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకు పోయారు ఇంకో 20 నిమిషాలు ఆగాలి అంటూ వాళ్ళిద్దరినీ ఓ రూములో కూర్చోబెట్టి ఇద్దరికీ కూల్ డ్రింక్ ఇచ్చాడు ప్రొప్రైటర్ "మీ పెద్దబ్బాయి ఏం చేస్తున్నాడు లెక్చరర్ కదూ" అడిగాడు మోహన్రావు మల్లారెడ్డిని " కాదు కాదు లెక్చరర్ కాదు. ఇంజనీరు దుబాయ్ లో 5 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాడు" అన్నాడు మల్లారెడ్డి "అదేమిటి మీ వాడికి టీచింగ్ అంటే ఇష్టమని వాడికి లెక్చరర్ కావాలని ఉందని చెప్పినట్టు గుర్తు" అన్నాడు మోహన్ రావు. "నిజమే, వాడికి టీచింగ్ అంటే చాలా ఇష్టమే, కానీ ఆ జాబు లో ఏం లాభం ఉంటుంది ఎప్పుడూ ఆ జీతం తప్ప మరి ఏమీ రాదు అని నేనే వాడిని ఇంజనీరింగ్ చదవమని బలవంతం చేశాను. అప్పుడు అలా చేయడం చాలా లాభం అయింది. ఇప్పుడు సంపాదించే సంపాదన కంటే రెండు రెట్లు ఎక్కువే ఇంటికి పంపిస్తున్నాడు" గర్వంగా చెప్పాడు మల్లారెడ్డి. "అయితే మీ అమ్మాయి కూడా ఇంజనీరే కదూ" అడిగాడు మోహన్ రావు. "నో నో మా అమ్మాయికి ఇంజనీరింగ్ చదవాలని చాలా ఇష్టం ఉండేది కానీ లేడీస్ కు డాక్టర్ కోర్స్ అయితేనే చాలా లాభం ఉంటుందని నేనూ, మా ఆవిడ దానితో డాక్టర్ కోర్స్ చేయించాము. పోయిన సంవత్సరమే అమెరికాకు పోయింది. అక్కడకు పోవడం చాలా లాభమైంది" ఆనందంగా అన్నాడు మల్లారెడ్డి. "మీ అల్లుడు కూడా అమెరికాలోనే డాక్టర్ కదూ" అడిగాడు మోహన్ రావు. "అల్లుడు డాక్టరే, కానీ, అమెరికాలో కాదు. పెళ్లయిన నెల రోజులకే ఆస్ట్రేలియా నుండి పెద్ద ఆఫర్ వస్తే పది సంవత్సరాల కాంట్రాక్ట్ మీద అక్కడికే వెళ్ళమని మేమే బలవంతం చేసి పంపించాము. అమెరికా లో వచ్చే దానికంటే మూడు రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుంది. చాలా లాభం అయింది" మరింత ఆనందంగా చెప్పాడు మల్లారెడ్డి. "మంచిపని చేసావు. చాలా తెలివైన నిర్ణయాలు తీసుకున్నావు." అభినందిస్తున్నట్టుగా అని "నీ భార్య ఎలా ఉంది?" అడిగాడు మోహన్ రావు. "ఆమెకు ఈ మధ్య బిజినెస్ మీదకు ధ్యాస మళ్లింది. ఊరికే ఇంట్లో ఉంటే ఎం లాభం ఏదైనా బిజినెస్ చేయాలని, ఇక్కడికంటే బొంబాయిలో అయితే బావుంటుందని అక్కడికి వెళ్ళింది".అన్నాడు. "మరి నువ్వు కూడా బొంబాయికి పోతావా?" అడిగాడు మోహనరావు. నో నో నేను కూడా పోతే ఇక్కడ నేను చేసే కాంట్రాక్ట్ పనులెలా అవుతాయి..బొంబాయికి పోతే నాకేం లాభం?" అన్నాడు. "అదీ నిజమే..".సమర్థించాడు మోహన్ రావు. " అవునూ, మోహన్ రావ్ మన కాలేజిలో మనతో పాటు చదివిన నీరజ గుర్తుందా?"అడిగాడు మల్లారెడ్డి. "ఆ గుర్తుంది. ఏమయింది ఆమెకు? అడిగాడు. "ఆమెకేమీ కాలేదు. పైగా బోలెడంత రాజయోగం పట్టింది ఆమెకు."అన్నాడు మల్లారెడ్డి. "అదేమిటి?". అర్థం కానట్టు అడిగాడు మోహన్ రావు. "ఆమె భర్త ఎవరో తెలుసా?" అడిగాడు మల్లారెడ్డి. " ఊహూ తెలియదు ఎవరు ?" అన్నాడు మోహన్ రావు "మినిస్టర్ గూండా కొండయ్య……...మొన్న నెల రోజుల క్రితం చనిపోయాడు చూడూ అతడే" చెప్పాడు మల్లారెడ్డి. "మినిస్టర్ గూండా కొండయ్య భార్యనా మన నీరజ" ఆస్ట్చర్యంగా అంటూ మళ్ళీ అతనే. "కానీ పేపర్లో ఇంకేదో కొండయ్య అని రాసినట్టు గుర్తు" అన్నాడు. "అదా గూండా అన్నది అతని ఇంటి పేరు కాదు. కానీ మన చిన్నప్పుడు అతను అన్నీ గూండా పనులే చేస్తూంటే అతన్ని అందరూ గూండా కొండయ్య అని పిలిచే వాళ్ళు. చాలా మందికి అతను అలానే తెలుసు. అంతే కాక పేపర్లో అలా ఎలా వ్రాస్తారు. ….. పైగా మంత్రాయే…."అన్నాడు మల్లారెడ్డి. "అరె ….అయితే నీరజ చాలా దురదృష్టవంతురాలు" అన్నాడు మోహన్ రావు సానుభూతిగా. "దురదృష్టమా? నీ మొఖమా ? ఇవాళ పేపర్లో ఆమె ఫోటో చూడలేదా? ఎంత సంతోషంగా ఉందో చూసావా?" అన్నాడు మల్లారెడ్డి. "సంతోషంగా ఉందా? ఎందుకు ?" అయోమయంగా అడిగాడు మోహన్ రావు. "ఎందుకేమిటి ఆమె భర్త నియోజక వర్గం నుండి పోటీ చేయమని ఆమెకు పార్టీ టికెట్ కూడా ఇచ్చారట, సానుభూతి ఓట్లతో తప్పకుండా గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు తెలుసా?.....ఇంక సంతోషంగా ఉండ కుండా ఎలా ఉంటుంది?" అన్నాడు మల్లారెడ్డి "ఓహో అలాగా…..అయితే నీరజ నిజంగా చాలా అదృష్టవంతురాలే….ఒక్కసారి మినిస్టర్ అయినా ఎంతో లాభం" అన్నాడు మోహనరావు. మినిస్టర్ గూండా కొండయ్యకు . మినిస్టర్ భో జారావుకు ఏ మాత్రం పడదన్న సంగతి తెలుసు కదా. …. వాళ్లిద్దరికీ అన్ని విషయాల్లోనూ పోటీయే. నీరజకి టికెట్ ఇచ్చినప్పటి నుండి బోజా రావు భార్య మండిపడుతోందట. యేదో వొక మొండి సమస్త లేవనెత్తి అది తీర్చేదాకా అమరణ నిరాహార దీక్ష చేయమని మొగుణ్ణి రోజూ పోరుతుందట. కాశ్మీరు సమస్యో,. శ్రీలంక సమస్యో, ఇరాక్ సమస్య నో, ఏదో వొకటి త్వరగా తేల్చుకోమనీ చెప్పిందని అక్కడ పని చేసే పనిమనిషి చెప్పిందట. ఆ నోటా ఈ నోటా తెలిసీ అందరూ అనుకుంటున్నారు " చెప్పాడు మల్ల రెడ్డి. "నిజమా? అయితే తొందర్లోనే ఏదో వొక రోజు భోజారావు భార్య కూడా మినిస్టర్ అవుతుంది . బోలెడంత సంపాదించుకుంటుంది. చాలా లాభం కదా?" అన్నాడు మోహన్ రావు "అది సరే, నువ్వీ విషయం విన్నావా? మనతోపాటు క్లబ్ కొచ్చే నిరంజన్ కొడుకూ కోడలు ఆక్సిడెంట్లో చనిపోయ్యారట. ఓసారి పోయి పలకరించి వద్దాము. పాపం ఆ వయసులో అతనికి పెద్ద షాక్ " అన్నాడు మోహన్ రావు. "పెద్ద షాకే అయ్యేది…...కానీ కొడుకూ కోడలు ఓ తెలివైన పని చేశారు. ఇద్దరూ చెరో పది లక్షలకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. వాళ్ళు చనిపోయిన పదిహేను రోజుల్లోనే మొత్తం డబ్బు చేతికి అందిందట. వాళ్ళ కష్టాలు పోయాయి. ఆ డబ్బుతో వచ్చే వడ్డీతో కూడా హాయిగా బ్రతకొచ్చు. అయినా ఏదో వొక బిజినెస్ కూడా చేయ బోతున్నట్టు చెప్పాడు". అన్నాడు మల్లారెడ్డి. "అలా అయితే చాలా లాభం."అన్నాడు మోహన్ రావు " అందుకే నేను కూడా మా ఇంట్లో అందరి పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుందామనుకుంటున్నాను. ప్రీమియం కట్టేస్తీ మధ్యలో యేమైనా జరిగినా బోలెడంత డబ్బు వస్తుంది" అన్నాడు మల్లారెడ్డి. "అవునూ నేనూ అలాగే చేద్దామనుకుంటున్నాను. కానీ అలా యేమీ జరగకపోతే ఈ ప్రీమియంలకు కట్టిన డబ్బంతా వేస్ట్ అవుతుంది. పెద్దగా లాభం ఉండదు కదా అని ఆలోచిస్తున్నాను." అన్నాడు మోహన్ రావు. "నిజమే యేమీ కాకపోతే ఏ లాభం ఉండదు. కానీ ఏదైనా జరిగితే ఎంత లాభమో ఆలో చించు. నిరంజన్ విషయమే చూడు ఆ ఇన్సూరెన్స్ లు లేకపోతే ఎంతో నష్టపోయే వాడు. అయినా ఇపుడు చాలా రకాల ఇన్సూరెన్స్ లు వచ్చాయి.ఏదో వొక దాని ద్వారా ఎప్పుడో ఓకప్పుడయినా మనకు లాభం రాకుండా పోదు". నమ్మకంగా అన్నాడు మల్లారెడ్డి. "అవును నిజమే నీతో పాటు నేనూ వస్తాను .ఇద్దరం పోయి ఆ పనులన్నీ చేసుకుందాం. ఇంకా నయం ఇప్పటి వరకు మనకు కానీ మన వాళ్లకు కానీ యేమీ కాలేదు. యేమైనా అయితే చాలా నష్ట పోయేవాళ్ళం. ఇంకా ఆలస్యం చేయొద్దు రేపే చేసేద్దాం" అన్నాడు మోహన్ రావు. " అవును రేపు తప్పకుండా చేద్దాం" అంటూ గట్టిగా తలూపాడు మల్లారెడ్డి. ******** .

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి