స్వేచ్ఛకు చిరునామా..!! - డా.టి.జతేన్దర్ రావు

Swechchaku chirunama

అంతా హడావుడి. ఫంక్షన్ అయిపోయేదాకా ఎవరికి నిద్ర పట్టట్లేదు. పదిహేను రోజుల నుండి ఒకటే హడావిడి. ఈ హడావిడి ఇంకో 15 రోజుల దాకా ఉంటుంది. స్వేచ్ఛా, స్వాతంత్రాల మీద పెద్ద సెమినార్. ప్రముఖ వ్యక్తులు వస్తున్నారు.వాళ్లంతా స్వేచ్ఛా, స్వాతంత్రం మీద మాట్లాడతారు. ఎవరూ మరొకరి స్వే చ్చకు భంగం కలిగే విధంగా ప్రవర్తించ గూడదు. ఒక్క మనుషుల స్వేచ్చ కే కాదు, జంతువులు, పక్షులు, పాములు అన్ని జీవరాశులు స్వే చ్ఛగా బ్రతకాలనే ఆశయాన్ని తెలిపేందుకే ఈ సెమినార్. పిల్లలకు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాల మీద చక్కని అవగాహన కుదిరేందుకు పిల్లలను కూడా ఇందులో భాగస్వామ్యులను చేస్తున్నారు. అందుకే పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా పొమ్మనే దాకాస్కూల్ లోనే ఉండాలని టీచర్లు ఇతర ఉద్యోగస్తులు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నెల రోజులు సెలవు పెట్టకూడదని,అవసరమైతే రాత్రిళ్ళు కూడా పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కావద్దన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్లు భోజనాల విషయంలో కూడా చాలా సంతోష పడాలనే ఉద్దేశ్యంతో నాన్ వెజిటేరియన్ వంటలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వాలనుకోవడంతో చాలా పెద్ద సంఖ్యలో కోళ్లను, గొర్రెలను, మేకలను, చేపలను ముందే కొనుక్కొచ్చి ఊరికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన ఇంట్లో వాటిని వేరు వేరు గదుల్లో ఉంచారు. ఉండేది కోళ్లు, గొర్రెలు, మేకలే కాబట్టి ఆ గదుల్లో కరెంటు లేకున్నా కిటికీలు లేకున్నా పరవాలేదనే ఉద్దేశంతో వాటిని ఆ చిన్న చిన్న గదుల్లోకి బలవంతంగా తోసి ఇరికించారు. ఆ గదులు వాడక చాలా సంవత్సరాలైంది. అయినా ఇప్పుడు వాటికి కరెంటు, గాలి, వెలుతురలతో పనేంటి, మహా అయితే అవి బ్రతికేది ఇంకో పదిహేను రోజులు. కోళ్లు, గొర్రెలు, మేకలు పని పాట లేకుండా అరుస్తుంటాయి. అలా అరిస్తే చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలగకుండా వాటి మూతులను కట్టి వేశారు. అందుకని అవి వచ్చినప్పటినుండి చాలాసార్లు తెల్లవారినా ఒక్క కోడి కూడా కొక్కొరకో అనలేదు. మేకలు, గొర్రెలు మేత మేయలేదు. మేమే అనలేదు. మొదట్లో మూతులు కట్టేసారు కాబట్టి అనలేదు. ఆ తర్వాత తిండి లేకపోవడం వల్ల అనేందుకు శక్తిలేక పోవడం వల్ల అనలేదు. ఏదైతేనేం చుట్టుపక్కల వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఏ ఇబ్బంది లేకుండా ఫంక్షన్ జరుగుతుంది. ఓ డ్రమ్ము లాంటి దాంట్లో నీళ్లు పోసి తెచ్చిన చేపలను అందులో కుమ్మరించారు. డ్రమ్ము చిన్నదవడం వల్ల చేపలు మొదటిసారిగా ఈదకుండానే కాదు కదలకుండా కూడా ఉండడం నేర్చుకున్నాయి. ఇన్విటేషన్ల విషయం ఎంత వరకు వచ్చిందో తెలుసుకునేందుకు క్లర్కును పిలిచాడు అధికారి. మీటింగ్ లో పాల్గొనే వాళ్లంతా చాలా చాలా ప్రముఖులు కాబట్టి అందరికీ ప్రముఖమైన స్థానాలు ఇవ్వాలి. కేవలం ఏ ఒక్కరిద్దరినో అధ్యక్షుడు, ముఖ్య అతిధి అంటే సరిపోదు. మిగిలిన వాళ్లకు కోపం వస్తుంది. అందుకే కొంతమందిని రకరకాల అధ్యక్షులుగా మరి కొంతమందిని రకరకాల అతిథులుగా రెండు గ్రూపులుగా చేశారు. ముఖ్య అతిధి, అతి ముఖ్య అతిథి, మహా ముఖ్యఅతిథి, విశిష్ట అతిథి, విపరీత విశిష్ట అతిథి, గౌరవ అతిథి, మర్యాద అతిధి, అతి ప్రియమైన అతిథి, ప్రియాతి ప్రియమైన అతిథి, మధురమైన అతిధి, మధురాతి మధురమైన అతిథి, అని రకరకాల అతిథులనూ, అధ్యక్షుడు, నిర్వాహక అధ్యక్షుడు, నిర్ణయ అధ్యక్షుడు, అలంకార అధ్యక్షుడు, నిలబడే అధ్యక్షుడు, కూర్చునే అధ్యక్షుడు, మాట్లాడే అధ్యక్షుడు, మౌన అధ్యక్షుడు, పిలిచే అధ్యక్షుడు,పలికే అధ్యక్షుడు, ముఖ్య అధ్యక్షుడు, మహా ముఖ్య అధ్యక్షుడు, అని కొన్ని రకాల అధ్యక్షులుగా వర్గీకరించి ఒక్కొక్కళ్ళ పేరు కింద యేదో ఒకటి పెట్టి చూసినా ఇంకా ఇరవై మందికి పదవులు తక్కువ పడుతున్నాయి. అందుకని ఈ పదవుల స్థానాలను రెండింతలు చేస్తే మరికొందరికి కుర్చీలు దొరుకుతాయని, ముఖ్య ముఖ్య అతిథి అతి ముఖ్య అతి ముఖ్య అతిథి, ముఖ్య ముఖ్య అతి ముఖ్య అతిథి….. హమ్మయ్య….. ఎలాగో సరిపోయింది. ఇన్విటేషన్ ఇరవై పేజీలు వచ్చింది. ఇంకో వారం గడిచింది. ఆ సభలో వేదిక మీద ఉన్న వాళ్లంతా స్వే చ్చా స్వాతంత్ర్యాలకు గుర్తుగా పావురాలను ఎగరేస్తారు కాబట్టి, పావురాలు కనీసం వందయినా కావాలి. కాస్త ధర ఎక్కువైనా వారం రోజుల ముందే అనుకున్నన్ని పావురాలు దొరికాయి. వాటిని కూడా ఎగరకుండా కాళ్లు కట్టేసి ఓ చిన్న గుట్టలా చేర్చి ఓ పెద్ద గంపలాంటి దాని కింద పెట్టారు. వేదిక మీద ఉండే ముఖ్యులే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, సగం హాలును వేదిక చేసి, నాలుగో వంతు హాలును సామాన్యజనానికి వదిలిపెట్టారు. ఈ ఇద్దరి మధ్యన ఉన్న ఇంకో నాలుగో వంతు భాగాన్ని ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు నిలబడేందుకు, మీడియా వ్యక్తులు కూర్చునేందుకు ఏర్పాటు చేశారు. ఆరోజు కూడా వచ్చేసింది. నిర్వాహకులకు ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండటం లేదు. కోళ్లు, గొర్రెలు, మేకలు, పావురాలు అన్నింటినీ లారీలో వేసుకొని ఫంక్షన్ హాల్ దగ్గరికి తెచ్చారు. ఎవరో వచ్చి అడిగితే గొర్రెల బోచ్చును అమ్మేందుకు నిర్వాహకులు ఒప్పుకున్నారు. అందువల్ల ఆ అడిగిన వాళ్ళు వచ్చి గొర్రెల బొచ్చును కత్తిరించుకొని గంపల్లో నింపుకొని ఆ గంపలను అక్కడే పెట్టి తెల్లవారి వచ్చి డబ్బులు ఇచ్చి వాటిని తీసుకుపోతామని చెప్పి వెళ్ళిపోయారు. నిర్వాహకులు వాళ్ల వాళ్ల పనుల్లో బిజీ బిజీగా ఉండడంవల్ల కొంత, ఎలాగూ చచ్చేవే కదా అనవసరపు ఖర్చు, శ్రమ ఎందుకు అనుకోవడం వల్ల కొంత, ఈ వారం రోజుల నుండి వాటి తిండి తిప్పలు ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని చనిపోయాయి. చాలా కొనఊపిరితో ఉన్నాయి. కాళ్లు చచ్చు పడిపోయి కళ్ళు నిలబడి పోయి, చాలా పావురాలకు రెక్కలు విరిగి పోయి ఉన్నాయి. వంటవాళ్లు పీకిన కోళ్ల ఈకలను కూడా ఓ పెద్ద గంపలో పెట్టి అక్కడే ఉంచారు. తెచ్చిన అన్ని మేకల, గొర్రెల, కోళ్ల తలలు తెగాయి. శరీరాలు ముక్కలు ముక్కలయ్యాయి. ఇప్పుడు చచ్చే బాధ కంటే ఈ వారం రోజుల నుండి బ్రతికిన బాధే ఎక్కువ అనిపించిందేమో ఒక్కటంటే ఒక్కటి కూడా అరవలేదు. కనీసం మూలగ లేదు. మీటింగ్ మొదలైంది. వేదిక మీద ఉన్న పెద్దలు ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడే ఇచ్చేందుకు నిర్వాహకులు పావురాలను గంట నుండి గట్టిగా పట్టుకుని వేదిక పక్కనే నిలుచున్నారు. ఇంచుమించు అన్ని పావురాలు తలలు వాల్చేసాయి.అది చూసే సరికి నిర్వాహకుల తల ప్రాణం కాళ్లకు రావడం వల్ల గబగబా ఒకరి దగ్గర ఒకరు పోయి చెప్పుకున్నారు. వాళ్లు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితే, కానీ చేతులు ఖాళీ లేక పట్టుకోలేక, ఏం చేయాలో తోచక, ఆ పావురాల గొంతుల్నే మరింత గట్టిగా పట్టుకున్నారు. వాటి గొంతులు నలిగి చీలిపోయాయే మో వాటి రక్తంతో వాళ్ళ చేతులు ఎరుపెక్కాయి. స్వేచ్ఛ స్వతంత్రాల మీద మక్కువతో పిలవగానే వచ్చిన ఇంతమంది పెద్దలను తిలకం దిద్ది గౌరవించాలని ఓ సగం మంది నిర్వాహకులు అనుకోవడం వల్ల, అప్పటికప్పుడు తిలకం దొరకక పోవడం వల్ల ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో కూడా ఓ అద్భుతమైన ఆలోచన రావడంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా చేతికంటిన పావురాల రక్తాన్ని తిలకంగా పెట్టారు. ప్రతి సన్నివేశానికి చప్పట్లు కొట్టాలని ముందే చెప్పి ఉంచడం వల్ల, రక్త తిలకం దిద్దినప్పుడు కూడా, విషయం తెలియని వాళ్లు పెద్ద ఎత్తున చప్పట్లు కొడితే విషయం తెలిసిన వాళ్లు తలలు కొట్టుకున్నారు ఏమైతేనేం హాలంతా మార్మోగిపోయింది. ఇక తరువాత సీన్ పావురాలను ఎగర వేయడమే. చచ్చిన పావురాలు ఎగరలేవు. ఎగరేయలేరు. కానీ ఎగిరి నట్టుగా, ఎగరేసినట్టుగా చూపించకపోతే ఫంక్షన్ ఫెయిల్ అవుతుంది. పరువు పోతుంది. అతిథులకు కోపం వస్తుంది. ఎలా ఎలా నిర్వాహకుల మెదడు పాదరసంలా పరుగులు పెట్టింది. పావురాలను పైన మేడ మీద నుండి ఎగురవేయాలనీ, అలా పై నుండి ఎగరేస్తున్న పావురాలను ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, కింది నుండి ఫోటోలు తీస్తే పావురాలు గాలిలో ఎగురుతున్నట్టు ఫోటోలో వస్తాయి కాబట్టి పావురాలను పైనుండి ఎగురవేయాలని కోరారు. పెద్దలు, అతిధులు, నిర్వాహకులు అందరూ మేడ మీదకు చేరుకున్నారు. ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్ లు వాళ్ల వాళ్ల కెమెరాలతో రెడీగా ఉన్నారు. అందరూ పావురాలను చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నారు. ఒక్కసారిగా అందరూ తమ తమ చేతుల్లోని పావురాలను పైకి గాల్లోకి విసిరేశారు. అప్పుడే ఆ క్షణంలో అనుకోకుండా పెద్ద గాలి దుమారం, వర్షం వచ్చింది. ఆ వర్షంలో, ఆ గాలికి కింద గంపలో ఉన్న గొర్రె బొచ్చు, కోళ్ల ఈకలు ఎగిరిపోయాయి. ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు తమ కళ్లల్లో దుమ్ము పడకుండా కళ్ళు మూసుకొనే తమ తమ కెమెరా లను మాత్రం క్లిక్ క్లిక్ అనిపించారు. ఆ వర్షం,ఆ గాలి దుమారం చప్పుడులో పావురాలు డబ్బు డబ్బున పక్కన ఉన్న సమాధుల మీద పడటం ఎవరికీ వినపడలేదు. కనబడలేదు. కెమెరాల గాలానికి కూడా అందనంత వేగంగా పావురాలు కింద పడిపోయాయి. పావురాలు జారిపోయినా, గాలికి ఎగురుతున్న కోడి ఈకలను, గొర్రె బొచ్చును కెమెరాలు అంది పుచ్చుకున్నాయి. ఇంత గాలి వానలో మీటింగ్ నడపడం చాలా కష్టం కాబట్టి అందరూ భోజనాలు వైపు వెళ్లారు. చికెన్ మటన్ ల తో భోజనాలను అందరూ భేష్ భేష్ అని మెచ్చుకున్నారు. తెల్లారి పేపర్లలో స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతున్న పావురాలు, మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అంటూ పేపర్లలో ప్రముఖంగా వార్తలు,ఫోటోలు చూసిన అందరూ భేష్ భేష్ అన్నారు. అవి చాలా ఎత్తుకు ఎగరడం వల్ల చాలా చిన్నగా కనిపించాయని అంటే అవి చాలా స్వ్యేచ్చగా , ఆనందంగా ఎంతో ఎత్తులో ఎగరడం మీటింగ్ సక్సెస్ కు రుజువు అంటూన్న అందరి నోటి వెంట వస్తున్న వోకే వొక మాట భేష్! భేష్!!. ********.

మరిన్ని కథలు

Nijamaina ratnam
నిజమైన రత్నం
- బోగా పురుషోత్తం.
Snehamante Ide
స్నేహమంటే ఇదే
- కందర్ప మూర్తి
Andamaina muddu
అందమైన ముద్దు
- వారణాసి భానుమూర్తి రావు
Aparadhulu
అపరాధులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Prema lekha
ప్రేమ లేఖ
- వెంకటరమణ శర్మ పోడూరి
Adrusta chakram
అదృష్ట చక్రం
- కందర్ప మూర్తి
Sishya dakshina
శిష్య దక్షిణ
- వెంకటరమణ శర్మ పోడూరి
Pelliki mundu
పెళ్ళికి ముందు .....
- జీడిగుంట నరసింహ మూర్తి