బాపు బొమ్మ - వెంకటరమణ శర్మ పోడూరి

Bapu bomma

ఇన్టర్ పూర్తి అవగానే ఎంసెట్ మార్కులు బట్టి, గీతం ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చింది కృష్ణ కి. అందరూ కొత్త స్నేహితులు. వాడితో ఇంటర్ చదివినవాళ్ళు ఎవరు గీతం లో చేర లేదు. పదో క్లాస్ నుంచీ ఇంజనీరింగ్ కోచింగ్ పెరు చెప్పి, కాలేజీ క్లాసులు పేరు చెప్పి, క్షణం తీరిక ఉండేది కాదు. వాడిని చదువుకోమని చెప్పి, తల్లి ,తండ్రి, చెల్లెలు ని మాత్రం తీసుకుని సినిమాలకి వెళ్లేవారు. చదువు లో వత్తిడి వల్ల, కృష్ణ కూడ సినిమాలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎంసెట్ అయిన తరువాత అందరూ కలిసి సినిమాకి వెళ్లారు. అయితే దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. గీతం లో చేరిన మొదటి నాలుగు రోజులు , పరిచయాలు, సిలబస్, పుస్తకాల సేకరణ, తప్ప క్లాసులు సీరియస్ గా ప్రారంభం కాకపోవడం తో , కొత్త గా పరిచయం అయిన స్నేహితులతో బాగా గడిచిపోయింది. అతని బ్రాంచ్ లో చేరిన హర్ష అతనికి బాగా దగ్గర ఆయాడు. ఆవేళ మధ్యాహ్నం హర్ష ప్రోద్బలం తో దగ్గర లోనే ఉన్న లక్ష్మీ టాకీస్ లో మ్యాట్నీకి వెళ్లారు. ఆ సినిమా లో హీరో చెల్లెలు వేషం వేసిన మాలిని ఎందుకో చాలా బాగా నచ్చింది కృష్ణ కి. చెల్లెలు కి చదువు చెప్పించడానికి అన్నగారు కష్టపడటం, చివరికి ఒక డబ్బున్న డాక్టర్ ఇంట్లో పనిచేస్తుండగా, ఆ డాక్టర్ ఆమెని పెళ్లి చేసుకోవడం, మొత్తం అంతా బాగా నచ్చింది . అది అక్కడితో అయిపోలేదు. ఆ రాత్రి కలలో కి మాలిని రావడం జరిగింది. అదీ ఎలాగంటే , మాలిని కూడా వీళ్ళ కాలేజీ లో చేరింది. ఆమెని సీనియర్స్ రాగింగ్ చేస్తూ ఉంటే, కృష్ణ ప్రిన్సిపాల్ ని తీసుకు వచ్చి ఆ రాగింగ్ ఆపడం - ఇలా కలలో చాలా సేపు మాలినిని చూశాడు. ప్రొద్దుట లేవగానే, ఆ కల మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చి మాలిని మీద ఎదో తెలియని భావం అతని మనసు లో నిలిచిపోయింది. అప్పట్నుంచి అతను నెట్లో ను, యూట్యూబ్ లోను మాలిని ఫోటోలు, ఆమె వేసిన సినిమాలు చూడడమే పని. అతను చూసిన సినిమాలో చెల్లెలు వేషం వేసినా, ఆతరువాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా వేసింది. కాలేజీ లో ఏ అమ్మాయిని చూసినా మాలిని తో పోల్చుకోవడం అలవాటాయింది. ఒక పక్క చదువు సాగుతూ ఉన్నా, మాలిని పట్ల అతని ఆరాధన ముదురుతూ నే ఉంది. హర్ష లాంటి మిత్రులద్వారా మాలిని ఉన్న కొన్ని పోస్టర్లు తన రూములో గోడల నిండా చేర్చాడు. తండ్రి ఇచ్చిన పాకెట్ మని అయిపోతే, తల్లిని బతిమాలి డబ్బులు తీసుకుని, మాలిని సినిమా రిలీజ్ రోజున మొదటి ఆటకే వెళ్లడం జరుగుతోంది. చిన్నప్పటి నుంచి కృష్ణ చదువు లో ఎప్పుడూ బ్రైట్ గా ఉండడం, మంచి మార్కులు వస్తూ ఉండడం తో అతని మీద ఎమీ నిఘా పెట్టవలిసిన అవసరం తండ్రి రామారావు కి కలగ లేదు. అందు చేత కృష్ణ కి ఏర్పరిచిన రూమ్ లోకి తక్కువ గా వెడుతూ ఉండేవాడు ఆయన. ఒక రోజు కృష్ణ ఇంట్లో లేనప్పుడు తన పెన్ను కనపడక, కృష్ణ పెన్ను తీసుకుందామని అతని రూమ్ లోకి వెళ్లి అక్కడ గోడల నుండా మాలిని పోస్టర్లు చూసి ఆయనకి మతి పోయింది. వెంఠనే భార్య జానకి ని పిలిచి చూపించి, " నువ్వు గమనించావా ? " అన్నాడు " ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఇలా ఎవరో ఒకర్ని ఫాన్ గా ఆరాధించడం చూస్తూనే ఉన్నాము కదా. చదువు సవ్యం గా చదువుతూ ఉంటే పరవాలేదేమో అని, అప్పుడప్పుడు సినిమాలకి డబ్బులు ఇస్తున్న సంగతి కూడా చెప్పింది. అది ఆ స్థాయి లో ఆగితే వాళ్ళకి ఆందోళన పెద్ద లేకపోనేమో. కానీ కొద్ధి రోజుల తరవాత ఆ అభిమానం, వాళ్లిద్దరూ ఉహించని మలుపు తిరిగింది. ఒక రోజు హర్ష కృష్ణ తో బాటు వచ్చాడు. ఇద్దరు రాగానే, రామారావు , కొడుకుని కొంచం దూరం లో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి , తాను సుగర్ కి వాడేమందులు తీసుకురమ్మన్నాడు. కృష్ణ హర్ష కేసి చూసి " రారా వెళ్ళొద్దాం" అన్నాడు హర్షతో అప్పటికే ,జానకి తెచ్చిన కాఫీ తాగుతున్నాడు హర్ష. " అతనిని కాఫీ తాగనీయి. నువ్వు వెళ్ళిరా " అన్నాడు కృష్ణ తో రామారావు. కృష్ణ వెళ్లిన తరవాత , హర్ష కి దగ్గరగా కుర్చీవేసుకుని " నువ్వు వాడి స్నేహితుడివి కదా వాడి చదువు ఎలా ఉంది ? " అడిగాడు రామారావు హర్ష ని, డైరెక్ట్ గా విషయం ఎందుకని " చదువు బాగా ఉంది అంకుల్. వాడికి క్లాసులో విన్నది చాలు. వేరే ప్రిపేర్ అవక్కరలేదు. మా అందరికి సందేహాలు తీరుస్తాడు." అన్నాడు హర్ష ఇది విన్న రామారావు , వెనకాల గుమ్మందగ్గర నుంచుని వింటున్న జానకి లోలోపలే ఆనందించారు. " మరి ఈ మాలిని గొడవ ఏమిటయ్యా? ఎప్పుడూ ఆ మాలిని గురించే ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు " అడిగాడు రామారావు హర్ష కొంచం సేపు తట పటాయించి, " మేము ఎవరో ఒకరు హీరో నో , హీరోయిన్ నో ఇష్టపడటం జరిగి, వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు మొదటి షో కు వెళ్లడం మామూలే అంకుల్. కానీ కృష్ణ విషయం లో కొంచం ఆశ్చర్యం గా ఉంది. వాడు మాలిని ని పిచ్చగా లైక్ చేస్తున్నాడు" అని కొంచం ఆగి చెప్పాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించి " వాడు మీకు తెలియకుండా మాలిని సినిమా వస్తే, ఇంచుమించు రోజూ వెళ్లి పోతున్నాడు. మలాగా ఎదో ఒకమాటు చూడటం కాకుండా " అన్నాడు. *** ఆతరువాత దంపతులు ఇద్దరు కృష్ణ లేనప్పుడు వాడి విషయం చర్చించుకుని, ఇది ఇంకా ముదిరితే చదువు కూడా పాడవుతుందేమో నని ఆందోళన పడ్డారు. జానకి, రామరావు కంటే ఎక్కువ ఆందోళన పడింది . ఆమె ఆరోజు వంట చేస్తున్నంత సేపు అదే విషయం ఆలోచిస్తూ, ఈ సమస్య ఎవరితో చర్చించాలా అని ఆలోచిస్తోంటే ఆమెకి ఆఖరి తమ్ముడు శేఖర్ గుర్తుకు వచ్చాడు. జానకి తల్లి తండ్రులకి నలుగురు మగ పిల్లలు తరవాత , జానకి, మళ్లీ తరవాత ముగ్గురు మగ పిల్లలు. ఆఖరి తమ్ముడు శేఖర్. ఎంబీబీఎస్ పూర్తి అయి ఢిల్లీ లో ఎండి లో చేరేదాక అతను , అక్క బావల దగ్గర ఉండే చదివాడు. కృష్ణకి కూడా అతని వద్ద చనువు ఎక్కువ. ఇప్పుడు, బిజీ గా ఉంటాడు, రాత్రి మాట్లాడాలి అనుకుంది ఆవిడ. ఆ రాత్రి ఆమె తమ్ముడితో మాట్లాడి మొత్తం వివరాలు అన్ని చెప్పింది అంతా విని " అక్కయ్యా OCD ( అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ) అని చిన్న దే అయినా మనం అశ్రద్ధ చేయకూడదు. వచ్చేవారం మా ఫ్రెండ్ పెళ్లి ఉంది. నేను వస్తున్నాను. అపుడు నేను వాడితో మాట్లాడతాను. మీరేమి ఆందోళన చెందక్కర లేదు. " అని ఫోన్ పెట్టేశాడు . *** శేఖర్ ఢిల్లీ నుంచి ఆ రోజు ప్రొద్దుటే వచ్చాడు . ఆ సాయంత్రం , కృష్ణ, శేఖర్ ఇద్దరు క్యాబేజీ పకోడీ తింటూ కబుర్లలో పడ్డారు. శేఖర్ కి ఇష్టమని జానకి ఆ పకోడీ చేసింది. " చిన్న మావయ్య వస్తే గాని నువ్వు ఇవి చేయవు. నాకు కూడా ఇష్టమయినా ఎప్పుడూ చేయవు " అని నిష్టూరం గా అని పకోడీ మళ్ళీ వేయించుకున్నాడు కృష్ణ. శేఖర్ ఇక్కడ ఉండే చదువు కున్నాడు కనుక కృష్ణ అతని తో చాలా చనువు గా ఉంటాడు. వయసు తేడా కూడా మరీ ఎక్కువ కాదు కాబట్టి ఇంకా చనువు. " ఎరా సినిమాలు ఏమన్నా చూశావా ఈ మధ్య? క్లాసులు బంగ్ కొట్టి సినిమాలు చూస్తున్నవా ?" అన్నాడు కృష్ణ పక్కకి వచ్చి కూర్చుని. " ఎవరు యాక్టర్లు? నువ్వు ఎవరినయినా లైక్ చేస్తావా ?" అడిగాడు క్యాస్యుయల్ గా ఆడిగినట్టు " మవయ్యా మాలిని ని ఈ మధ్యన నేను చాలా లైక్ చేస్తున్నాను. అన్నట్టు ఇవాళ ఓటిటి లో ఆమె సినిమా ఒకటి రిలీజ్ అవుతోంది. చూద్దామా? ఇంకో రెండు గంటలు లో మొదలవుతుంది. " అన్నాడు హుషారు గా " ఏమిటి రా ఈ మాలిని లో స్పెషల్ ? నీకు బాగా నచ్చినట్టుందే " ఏ స్థాయి లో ఉన్నాడో అంచనా కోసం అడిగాడు " ఒకప్పుడు నేను బాపు బొమ్మలు చాలా లైక్ చేసేవాడిని. ఆ బొమ్మ అమ్మాయి గా మారితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మాలిని. మొత్తం అన్ని భావాలు కళ్ళల్లో చూపిస్తుంది. ఆ కళ్ళు చూసే పడిపోయాను. అంతకు మించి ఆమె నడుము. దేవాలయాల మీద శిల్పాలలో నే అటువంటి నడుము చూస్తాము" అన్నాడు మళ్ళి మాలినిని ఊహించు కుంటూ బాగానే ముదిరింది అనుకుంటూ " అసలు నీకు ఎప్పటి నుంచి నచ్చిందిరా ఈ మాలిని ? " అడిగాడు ఎప్పుడు ట్రిగ్గర్ అయిందో తెలుసు కోవడానికి. చిన్నప్పటి నుంచి క్లోజ్ గా శేఖర్ తో మసలడం వల్ల స్నేహితులతో పంచుకోని విషయాలు కూడా అతని తో పంచుకోవడం అలవాటే కృష్ణ కి. " మొదట ఒక సినిమాలో ఒక చెల్లెలు వేషం లో చూశాను. ఒక బీద అన్నగారికి చెల్లెలు గా వేసింది. ఆ సినిమాలో ఆమె ఎవరినయిన డబ్బు ఉన్నవాడిని చేసుకుంటే బాగుండును అని పించింది. చివరికి సినిమాలో అదే జరిగింది. ఆ రాత్రి కలలో చాలా సేపు మాలిని కనపడింది. మయం లో మెలకువచ్చి మళ్లీ నిద్రపడితే మళ్లీ ఇంకో కలలో కూడా ఆమె నే. ఆ తరవాత ఎందుకో తెలియదు ఆమె అంటే తెగ ఇష్టం ఏర్పడింది" వివరించాడు క్రిష్ణ. కానీ తాను చూసిన సినిమానే మళ్లీ మళ్ళీ చూస్తున్న సంగతి చెప్ప లేదు. "నీ హీరోయిన్ ఓటిటి సినిమాకి ఇంకా టైం ఉంది కదా , టివి పెట్టరా ఒక సీరియల్ చూడాలి. రెండు ఎపిసోడ్స్ మిస్ ఆయాను అన్నాడు " అన్నాడు శేఖర్ " అదేమిటి ? నువ్వు సీరియల్స్ చూస్తావా ?" అన్నాడు . శేఖర్ ని తన రూం లో ఉన్న టివి దగ్గరకి తీసుకు వెడుతూ. " మామూలు గా చూడను. ఈ మధ్య నాలుగు రోజులు ఒక స్నేహితుడి ఇంట్లో భోజనం చేయాలిసి వచ్చింది. అప్పుడు వాళ్ళవిడ భోజనం పెట్టేముందు ఈ సిరియల్ చూసేది. అది అయిన తరువాతే భోజనం. అప్పుడు అంటుకుంది. ట్యూబ్ లో అన్ని పెడుతున్నారు కదా ? " అని తను చూడవసలిసిన డేట్స్ చెప్పాడు. కృష్ణ యూ ట్యూబ్ లో ఆ సీరియల్ పెట్టాడు. మావయ్యని ఆకట్టుకున్న ఆ సీరియల్ ఏమిటా అని తాను కూడా చూడడం మొదలు పెట్టాడు. సీరియల్ కొంత సేపు నడిచిన తరవాత హీరయిన్ అత్తగారు సీన్ లోకి వచ్చింది. ఆవిడ చాలా లావుగా తెరని ఇంచుమించు సగం కవర్ చేసింది . ఆవిడ రాగానే " ఒరేయి కృష్ణ ఆవిడ ఎవరో తెలుసా నీకు ? " అన్నాడు " తెలియదు. ఎందుకు ?" అన్నాడు " ఆవిడ విజయశ్రీ అని ఒకప్పుడు పెద్ద హీరోయిన్. మా చిన్నప్పుడు, మా బాపు బొమ్మ అన్నమాట. అప్పట్లో ఆవిడ అందాన్ని తలుచుకుని ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడిపాము. ఇపుడు నీకు మాలిని ఎలాగో నాకు ఈ విజయశ్రీ అలాగన్న మాట " శేఖర్ అలా అనగానే కృష్ణ ఒక్క మాటు షాక్ తిన్నట్టు అయ్యాడు. ఇనుము కాలుతూ ఉండగానే దెబ్బ వేయాలని " నీ మాలినిని పదేళ్ల తరవాత ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకో. ఇలాగే ఉంటుంది. కానీ ఇకముందు మాలిని సినిమాలు చూసేటప్పుడు పదేళ్ల తరవాత ఇప్పటి విజయశ్రీ లా ఉంటుందన్నది ఊహించకు" అన్నాడు. కృష్ణ షాక్ ఫీలయి ఆలోచనలో పడ్డాడు. అయితే, తను కాలేజీ కి వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన కృష్ణకి తెలియదు. శేఖర్ ఢిల్లీ నుంచి రాగానే ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వచ్చిన తరవాత జానకి కృష్ణ గదికి తీసుకెళ్లి, అక్కడ పోస్టర్లు అవీ చూపించింది. ఆ సమయం లో కృష్ణ కాలేజీ కి వెళ్ళాడు. " అక్కయ్యా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పు నాకు. గతం లో సినిమాలలో హీరోయిన్ గా వేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరయినా సీరియల్స్ లో , తల్లి లేదా అత్తగారి పాత్రలు వేస్తున్నారా ?" అడిగాడు శేఖర్ అలా ఎందుకు అడిగాడో ఆమెకి అర్థం కాలేదు. ఆమెకి తాను రోజూ చూసే " తరంగాలు" సీరియల్ గుర్తుకు వచ్చింది. అందులో అత్తగారు వేషం గతం లో హీరోయిన్ గా వేసిన విజయశ్రీ వేస్తోంది. అదే విషయం శేఖర్ కి చెప్పింది. ఈ సమాచారాన్ని శేఖర్ కృష్ణ తో సంభాషణ లో వాడుకున్నాడు. **** కృష్ణ, శేఖర్ తో జరిగిన సంభాషణ గురించిన ఆలోచనలో ఉండగానే హర్ష వస్తే, అతను రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కృష్ణ బయటికి వెళ్ళగానే హాలు లో కూర్చున్న అక్క బావల దగ్గరికి వచ్చాడు శేఖర్. " ఏరా వాడితో మాట్లాడావా ?" అంది జానకి గారు ఆందోళన గా. " ఆ మాట్లాడాను. చిన్న రివర్స్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చాను . అది హోమియో మందులాగా పని చేస్తుంది." ఆనాడు శేఖర్ " అదేమిటి ? నువ్వులు మెడికల్ కిట్ కూడా తెచ్చావా ?"అంది " ఇది ఇంకో రకం ఇంజెక్షన్ లే. దీనికి కిట్ అక్కరలేదు" అన్నాడు నవ్వుతూ. రామారావు ఆతృతగా ఇదంతా వింటుండడం చూసి " బావ గారు జయ బాధురి మొదటి సినిమా గుడ్డి చూశారా? అందులో ఇలాంటి సమస్యనే ఇంకోలాగా ట్రీట్ చేశాడు. కానీ కృష్ణని తీసుకుని మాలిని షూటింగులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్లలేము కదా. అందు చేత చిన్న చిట్కా వైద్యం చేశాను. ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్. చూద్దాం " అన్నాడు. " అసలు ఈ అబ్సెషన్ సమస్యలు ఏమిటయ్యా ? ఏమన్నా ప్రమాద కరమా ? అడిగాడు రామా రావు. " అబ్సెషన్ డిసార్డ్సర్లు సరి అయిన సమయంలో సరి చేస్తే పరవా లేదు. అవి అనేక రకాలు. ఒక్కొక్కప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా చిన్న చిన్న అబ్సెషన్స్ ఉంటాయి. మేము చదువుకునేటప్పుడు జన్యుపరమయిన విషయాల మీద సిద్ధాంతాలు చేసిన మెండెల్ గురించి చెబుతూ మా ప్రొఫెసర్ ఒక విషయం చెప్పారు. ఆయనకి పెళ్లి ముందు ఒక అబ్సెషన్ ఉండేదట. అదేమిటంటే పెద్దయన తరవాత కూడా లావెక్కకుండా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేదట. అప్పటికి ఆయన చదివిన దాని బట్టి అమ్మాయిలకి శారీరికంగా మేనత్తలు పోలికలు రావచ్చని. ఒక మిత్రుడి పెళ్లికి వెళ్లి అక్కడ ఒక అమ్మాయి సన్నంగా చాలా బాగుంది అని ఇష్టపడ్డారు. ఆ అమ్మాయిని పరిచయం చేసుకుని పెళ్లి కి మీ మేనత్త ఎవరయినా వచ్చారా అడిగితే " ఆ వచ్చిందండి" అని ఆవిడని పిలిచి పరిచయం చేసిందట. ఆ అమ్మాయి మేనత్త వయసు వచ్చినా సన్నం గానే ఉందట. మిత్రుడి ద్వారా పెద్ద వాళ్ళని సంప్రదించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మా ప్రొఫెసర్. " అని ఆగాడు శేఖర్. " ఇదేదో బాగానే ఉందే. అయితే మీ ప్రొఫెసర్ భార్య ఇప్పటికి సన్నం గానే ఉందన్న మాట" అన్నాడు రామారావు. " నేను అలాగే అనుకున్నాను. మొన్న ఆ మధ్యన వాళ్ళ ఇంటికీ వెళ్ళినప్పుడు ఆయన భార్య ఇద్దరికి టీ తీసుకు వచ్చింది. ఆమె విపరీత మయిన లావు గా ఉంది " ఆమె లోపలికి వెళ్లిన తరవాత " మాకు మీరు ఎలా పెళ్లి చేసుకున్నారో చెప్పినది గుర్తు ఉంది సార్" అన్నాను నవ్వుతూ " ఓ ఆదా ! అప్పటికి మనది మిడి మిడి జ్ఞానం కదా మెండెల్ ని పూర్తి గా అర్థం చేసుకోలేదు ఆ పెళ్లికి రాని ఇంకో మేనత్త ఉన్న సంగతి చెప్పలేదు" అని గట్టిగా నవ్వాడు రామారావు, జానకి తో సహా ముగ్గురూ నవ్వుకున్నారు. " అసలు ఆ మెండల్ ఏమి చెప్పాడయ్యా" అడిగాడు రామారావు కుతూహలంగా " అదో పెద్దసిద్ధాంతం. సింపుల్ గా చెబితే, భార్య, భర్త ఇద్దరు పొడుగు గాని, సన్నం గా గాని ఉంటే పిల్లలు అలాగే ఉండాలని లేదు. అంత క్రితం వాళ్ళ జన్యువుల ప్రభావం కూడా ఉంటుంది" అని లేచి ఫ్లయిట్ కి టైం అవడం తో శేఖర్ , కృష్ణ రాకుండానే వెళ్ళిపోయాడు. వెడుతూ "ఏమి ఆందోళన అక్కరలేదు. వాడు కొద్దిరోజులలోనే మామూలు అయిపోతాడు" అని ధైర్యం చెప్పాడు. అలా నయమవడం ప్రారంభం అయిన సంగతి రామారావు, జానకీలకి కొన్ని రోజులకి కాదు కొద్ధి గంటల లొనే తెలిసింది. కృష్ణ ఇంటికి రాగానే, భోజనం చేసి ఓటిటి లో ఆవేళ ప్రారంభం అయిన మాలిని సినిమాని కొంచం సేపు చూసి కట్టేసి హాలు లో కూర్చున్న తల్లి తండ్రి దగ్గరకి విసురు గా వచ్చాడు. " ఏమిటమ్మా చిన్న మావయ్య బుర్ర అంతా పాడుచేశాడు. మాలినిని సినిమాలో చూసేటప్పుడు పదేళ్ల తర్వాత విజయశ్రీ లాగా ఉంటుందని ఊహించ వద్దన్నాడు. అదేదో జోక్ లో మందు వేసుకునే ముందు కోతి ని తలుచుకోవద్దు అన్నట్టు. మాలినిని చూసినప్పుడల్లా ఇప్పటి విజయశ్రీ లాగా కనపడి బుర్ర పాడవుతోంది " అన్నాడు శేఖర్ ట్రీట్మెంట్ అప్పుడే పని చేయడం ప్రారంభ మయింది అనుకుని ఊపిరి పీల్చుకున్నారు భార్యా భర్తలు ఇద్దరు.

సమాప్తం

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ