భాగవత కథలు – 14 క్షీరసాగర మధనం - కందుల నాగేశ్వరరావు

Ksheerasagara madhanam

భాగవత కథలు – 14

క్షీరసాగర మధనం

అది ఐదవ మనువు రైవతుడు పాలించే మన్వంతరం. శ్రీ మహామష్ణువు శుభ్రుడు వికుంఠ దంపతులకు “వైకుంఠుడు” అనే పేరుతో జన్మించాడు. అన్ని లోకాల కంటే ఉత్తమమైన “వైకుంఠం” అనే లోకాన్ని సృష్టించాడు. అతనిని లక్ష్మీదేవి స్వయంగా పెండ్లి చేసుకుంది.

బలి చక్రవర్తి నేతృత్వంలో రాక్షసులువిజృంభించి దేవతలతో పోరాడి వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. దేవేంద్రుడు కొంతమంది ముఖ్యులతో కలిసి బ్రహ్మదేవుడి వద్దకువెళ్ళి తమ కష్టాన్ని విన్నవించుకున్నాడు. బ్రహ్మదేవుడు “లోకాలకు తండ్రి, పరమాత్ముడూఅయిన స్వామిని దర్శనం చేసుకొని ప్రార్థిస్తే మన కష్టాలు తప్పక తీరుస్తాడు” అని చెప్పి దేవతలను భగవానుని నివాసానికి తీసుకొని వెళ్ళాడు.దేవతలతో కలిసి విష్ణువును పలు విధాలుగా స్తోత్రం చేసాడు. కరుణించిన మహావిష్ణువు ప్రత్యక్షమై వారికి దర్శనం ఇచ్చాడు.

బ్రహ్మాదులు ప్రార్థించగా సంతోషించినభగవంతుడు గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు. “దేవతలారా నిర్మలమైన మనస్సుతో మీరు అమృతాన్ని తయారు చేయడానికి ప్రయత్నించండి. అమృతాన్ని త్రాగితే ఆయుస్సు పెరుగుతుంది. మరణం లేని జీవితం దొరుకుతుంది. అప్పుడు మీరు రాక్షసులను జయించి మరల స్వర్గాన్ని పొందగలుగుతారు. మీరందరూ పాలసముద్రంలో రకరకాల వనమూలికలను, తీగలను, ఔషదులనూ అధికంగా తెచ్చి వేయండి. సర్పరాజైన వాసుకిని కవ్వపు త్రాడుగా చేసుకొని జాగ్రత్తగా పాలకడలిని చిలకండి. మీకు లాభం కలుగుతుంది. సకల సంపదలూ సిద్ధిస్తాయి. ఆ సమయంలో సముద్రం నుండి విషం పుడుతుంది. మీరు భయపడరాదు” అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు.

దేవతలు యుద్ధం మాని రాక్షసరాజైన బలి చక్రవర్తి పట్ల స్నేహాన్నీ భక్తిని ప్రదర్శించారు. దేవేంద్రుడు రాక్షసవీరులతో “మనం అక్కచెల్లెండ్ర బిడ్డలం. మనకింక విరోధం వద్దు. బలి చక్రవర్తి ఆజ్ఞకు కట్టుబడి ఉందాం. కలిసికట్టుగా బ్రతుకుదాం” అని నచ్చ చెప్పాడు. మంధర పర్వతాన్ని మథిస్తే మనం అందరం సుఖపడతామని చెప్పి ఒప్పించాడు. దేవతల సమూహానికి ఇంద్రుడూ, రాక్షసుల సమూహానికి బలి చక్రవర్తీ నాయకులై అందరూ కలిసి ఐకమత్యంతో, అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుని మందర పర్వతం దగ్గర చేరారు.

దేవతలు దానవులు కలిసి దేవతల శిల్పియైన త్వష్ట తయారు చేసి పదునుపెట్టిన త్రవ్వుగోలలతో త్రవ్వి , గునపాలతో కదిపి, పొడిగాటి త్రాళ్ళు బిగించి చుట్టి మందర పర్వతాన్ని సముద్రం వైపుతీసుకు వచ్చారు. కాని దాని బరువు మోయలేక పోవడంతో ఆ పర్వతం పక్కకు ఒరిగి పోయింది. కొంత మంది దేవతలు రాక్షసులు దాని క్రింద నలిగి చనిపోయారు. కష్టాన్ని ఓర్చుకోలేక అందరూ దుఃఖించారు. ఈ పని ఎందుకు మొదలు పెట్టామా అని తమని తాము నిందించుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి దయతో వారి ఆపద గ్రహించి గరుడునిపై కూర్చొని గదతో బంతివలె ఆ మందర పర్వతాన్ని నేర్పుగా నిలబెట్టాడు. గరుడుడు సముద్రం గట్టు వరకూ విష్ణుమూర్తిని, మందర పర్వతాన్ని తన మోపుపై తీసుకు వచ్చి వదిలి పెట్టాడు.

దేవతలూ రాక్షసులూ సర్పరాజైన వాసుకిని పిలిచి, అమృతంలో బాగం ఇస్తామని నచ్చచెప్పి, కవ్వపుత్రాడుగా ఉండడానికి ఒప్పించారు. నొప్పి తెలియకుండా మందర పర్వతాన్ని చదునుచేసి, వాసుకిని త్రాడుగా చుట్టి పాలసముద్రాన్ని కుండలాగా చిలకడం మొదలెట్టారు. ఇరుగు వర్గాల వారు వాసుకి తలవైపున పట్టుకోవడానికి వాదులాట ప్రారంభించారు. “మాకూ పౌరుషం ఉంది. మేము వాసుకి పడగ పట్టుకుంటాం మీరు తోక పట్టుకోండి” అని రాక్షసులు దేవతలతో గర్వంగా చెప్పేసరికి, విష్ణుమూర్తి నవ్వుతూ అంగీకరించాడు. దేవతలు వినయంతో తోక పట్టుకున్నారు.

ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మందర పర్వతాన్ని చిలకడం మొదలెట్టారు. కాని కొండ అడుగున కుదురు లేనందువలన పర్వతం బరువై సముద్రంలో మునిగింది. రాక్షసులు దేవతలూ అందరూ గడగడ వణికారు, మందర పర్వతాన్ని మళ్ళీ పైకి ఎత్తడానికి ప్రయత్నించి ఓడిపోయారు. సిగ్గుతో సముద్రం గట్టున నిలబడి బాధ పడ్డారు.

సముద్రపు నీళ్ళల్లో మునిగిపోతున్న మందర పర్వతాన్ని చూసిన విష్ణుయూర్తి సముద్రంలో దిగాడు, మహా కూర్మంగా మారిపోయాడు. ఆ తాబేలుకు లక్ష ఆమడల వెడల్పైన చదునైన వీపుడిప్ప, బ్రహ్మాండాన్ని సైతం మ్రింగగల పెద్ద నోరు, లోకంలోని ప్రాణులన్నింటినీ ఇముడ్చుకోగల కడుపు, కమలాల లాంటి కళ్ళు, లోపలకూ బయటకు కదలాడే పెద్ద మూతి, బలమైన పాదాలు ఉన్నాయి. ఆ కూర్మం సముద్రంలో ప్రవేశించి నేర్పుగా వాసుకితో బాటు మందర పర్వతాన్ని పైకెత్తింది. అందరూ జేజేల పలికారు. విచిత్రమైన విష్ణులీలలు విష్ణువుకే తెలుసు. దేవ దానవులు ఆనందంతో పోటీపడి సముద్రాన్ని మధించసాగారు. అలా మధించగా అల్లకల్లోలమైన సముద్రం నుంచి జలచరాలన్నీ ఎగిరి గట్టుపై పడ్డాయి. తరువాత కొద్ది సేపటికి మొదట అగ్నిజ్వాలలు, తరువాత హాలాహలం అనే విషం పుట్టాయి. అది చూసిన రాక్షసులు దేవతలు వాసుకిని వదలిపెట్టి పరుగులు పెట్టారు.

ఆ హాలాహలం బ్రహ్మాండం పేలిపోయేటట్టు అంతటా విస్తరించింది. ఆ పెను మంటల వేడికి ఎంతో మంది దేవతలు రాక్షసులు బస్మమయ్యారు.అప్పుడు బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి మహేశ్వరుడికి తమ కష్టాన్ని మొర పెట్టుకున్నారు.“స్వామీ, చంద్రశేఖరా, నీవే మాకు దిక్కు. ఆపదలను తొలగించడానికీ, ఆనందాన్ని చేకూర్చడానికీ, జయాన్ని సంపాదించడానికీ నీకే సాధ్యం అవుతుంది. విషజ్వాలను పరిగ్రహించి దయతో ప్రాణికోటిని అనుగ్రహించు” అని కోరారు.

మహాశివుడు వారి ప్రార్థన సావకాశంగా విన్నాడు. తన పక్కనే ఉన్న పార్వతీదేవి వైపు చూస్తూ చిరునవ్వుతో “సతీ ప్రాణభయంతో ఆశ్రయించిన ప్రాణులను కాపాడడం ప్రభువుల లక్షణం అని అంటారు కదా ” అన్నాడు. అప్పుడు పార్వతీ దేవి. “ స్వామీ, మీ మనస్సుకు నచ్చినట్లు నిశ్చయించుకోండి.” అంది.

మ్రింగేవాడు తన భర్త అని తెలిసీ, మ్రింగేది విషమని తెలిసీ దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో సర్వమంగళ అయిన పార్వతీదేవి తన భర్తను ఆ విషాన్ని మ్రింగమని చెప్పింది. వెంటనే దేవతలందరూ జయజయ ద్వానాలు చేసారు.

పరమేశ్వరుడు అంతటా వ్యాపించిన మహా విషాన్ని తన చేయి చాచి పట్టుకొని ముద్దగా చేసినేరేడు పండువలె భుజించాడు. పరమేశ్వరుని కడుపు సమస్త లోకాలకు నివాస స్థానం. అందుకని శివుడు ఆ విషాగ్నిని మ్రింగకుండా గొంతులో పట్టి ఉంచాడు. మ్రింగకుండా ఆ హాలాహలం గ్రొంతులో ఉంచడం వలన ఈశ్వరుని కంఠంపై నలుపు రంగు ఏర్పడి అది ఒక కంఠాభరణంలా ఒప్పింది. అలా ధరించడం చూసి విష్ణువు, బ్రహ్మ, పార్వతి, దేవేంద్రుడు మొదలైన వారంతా “మేలు మేలు” అంటూ మెచ్చుకున్నారు. అనంతరం దేవతలూ, రాక్షసులూ సముద్ర మధనం మరల కొనసాగించారు.

ఇలా చిలుకుతున్న పాలసముద్రం నుండి మొదట "కామధేనువు" పుట్టింది. దానిని దేవ మునులు తీసుకున్నారు. తరువాత “ఉచ్చైశ్రవం” అనే గుఱ్ఱం పుట్టింది. దానిని బలి చక్రవర్తి తీసుకొన్నాడు. తరువాత వరుసగా “ఐరావతం” అనే ఏనుగు, “కల్పవృక్షం” పుట్టాయి. వాటిని ఇంద్రుడు తీసుకున్నాడు. దాని వెనుక మెరుపు తీగల వంటి శరీరాలు గల “అప్సరసలు” ఉదయించారు. ఆ వెనుక “చంద్రుడు” జన్మించాడు. ఆ వెంట సముద్రం నుండి అందచందాలకు పెన్నిది అయిన లక్ష్మీదేవి అవతరించింది.

క్షీరసాగరమధన సమయంలో, పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవికి ఇంద్రుడు వెలలేని రత్నాలపీఠం, సముద్రుడు పట్టుబట్టల జతను, వరుణుడు వైజయంతీ మాలను, విశ్వకర్మ బంగారు అలంకారాలను, సరస్వతి మంచిముత్యాల హారాన్ని, బ్రహ్మదేవుడు చేతిలో ధరించే లీలాకమలాన్ని, నాగరాజు కర్ణాభరణాలు ఇచ్చి దీవించారు.లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనకు తగిన భర్త అని ఎంచుకుంది. కలువపూల మాలతో విష్ణుమూర్తి కంఠాన్ని అలంకరించింది. లోకాలకు తండ్రియైన విష్ణువు లోకాలకు తల్లియైన లక్ష్మీదేవిని తన వక్షాన్న చేర్చుకొన్నాడు. అల్లుడైన శ్రీమహావిష్ణువుకు సముద్రుడు కౌస్థుభమనే అమూల్యరత్నాన్ని ఇచ్చాడు. దానిని విష్ణువు తన వక్షాన్న ధరించాడు. అప్పుడు శ్రీవత్సమూ, కౌస్థుభమూ, వైజయంతిమాలికా, ముత్యాలహారమూ వాటితో కూడిన సొగసైన విష్ణువు ఎదపై లక్ష్మీదేవి నివసించింది.

ఆ తరువాత పాలసముద్రం నుండి “వారుణి” అనే అందగత్తె పుట్టింది. ఆ కన్యను విష్ణువు అనుమతితో రాక్షసులు తీసుకున్నారు. చిలకగా చిలకగా చివరకు ఆ సముద్రం నుండి “అమృతపాత్రతో సహా ధన్వంతరి” అనే దివ్య పురుషుడు ఉదయించాడు. ధన్వంతరి సముద్రం నుండి రాగానే అతని చేతిలోని అమృత కలశాన్ని రాక్షసులు చూచారు. ఎగబడి ఆయన చేతులలో నుంచి కలశాన్ని లాగుకొని దానిని అపహరించారు. అప్పుడు భయంతో దేవతలువెళ్ళి విష్ణువుతో మొరపెట్టుకున్నారు.

దేవతల దుఃఖాన్ని చూచిన పరమాత్మ “ మీరు బాధ పడకండి. నా మాయతో మీ కోరికను నేను సాధిస్తాను” అన్నాడు. అమృతభాండాన్ని ఎత్తుకు వెళ్ళిన తరువాత రాక్షసుల మధ్య చీలిక వచ్చింది. కొంత మంది ఇలాగ ఎత్తుకు రావడం తగదు. ఒడంబడిక ప్రకారం దేవతలతో కలిసి పంచుకోవాని అని వాదించారు. అలా వాదించుకుంటూ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు లాక్కుంటూ గొడవ పడుతూ ఉన్నారు. అప్పుడు విష్ణువు మెల్లగా తనలో తాను నవ్వుకున్నాడు. అమరుల కోరిక నెరవేర్చడం కోసం మోహిని రూపం ధరించాడు.

మోహిని వేషదారిణియైన శ్రీమహావిష్ణువు లోకాలన్నిటినీ మోహంలో ముంచగల మోహన రూపం కలిగి ఉన్నాడు. జిగేలుమనే కడగండి చూపులతో చూసి మళ్ళీ రెప్పలు మూసేది. అందంగా చిరు నవ్వులు చిలకరించి ఎర్రని పెదవిని మెలిక పెట్టేది. పైటను రాల్చి నెమ్మదిగా సర్దుకొనేది. ఆమె దూరం దూరంగా తిరుగుతుంటే రాక్షస వీరులు చూసారు. “జవరాలా నీపేరేమిటి? ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చావు? నీలాంటి అందచందాలున్న కన్నెలను మేము దేవతలలోనూ మానవులలోనూ కూడా ఇదివరకు చూడలేదు. మేము కశ్యపుని సంతానం. దేవతల సోదరులము. మాలో మాకు పంపకం కుదరకుండా ఉన్న ఈ పదార్థాన్ని మాకు పంచిపెట్టు. పరాయివారు తమవారు అనే బేధంగా లేకుండా అందరికీ సమానంగా పంచు” అని అర్థించారు.

మోహిని రూపంలోనున్న విష్ణువు అందమైన తన వాలుచూపులతో చూస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు. “ఓ రాక్షసులారా! నా పై మీకు నమ్మకం ఉందా? పరిచయంలేని అందగత్తెలను నమ్మరాదని పెద్దలు అంటారు కదా! అయినా సరే మీరు నన్ను నమ్మారు కాబట్టి శక్తి వంచన లేకుండా చక్కగా పంచుతాను లెండి”. అలా అనగానే విష్ణుమాయలో పడ్డ రాక్షసులు అమృత కలశాన్ని మోహినికి ఇచ్చివేశారు. మోహిని అమృతకలశాన్ని తీసుకొని నేను పంచిన విధంగా “ఔను-కాదు” అనకుండా ఒప్పుకోవాలి అంది. దానికి దేవతలు రాక్షసులు అందరూ “సరే” అన్నారు. అందరూ స్నానాదికాలు ముగించుకొని, అందంగా అలంకరించుకొని బంగారు మండపంలో తూర్పు ముఖంగా బారులుతీరి ఆసీనులయ్యారు.

ఆ సమయంలో మోహిని పద్మం వంటి హస్తంతో అమృత కలశాన్ని పట్టకొని అరుదెంచింది. లక్ష్మీదేవికి సాటియైన అందంతో మెరిసిపోతున్న ఆమెను చూసి దేవతలకూ రాక్షసులకు మతి పోయింది. వారిని రెండు వరుసలుగా ఏర్పాటు చేసి రాక్షసులను దేవతలను దూరం దూరంగా కూర్చో పెట్టింది. నెరజాణతనంతో రాక్షసులను కవ్విస్తూ వారికి తెలియకుండా దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చింది. దేవతలు సంతృప్తిగా అమృతాన్ని ఆరగించారు. రాక్షసులు మోహిని అందానికి దాసులై తొందరగా తీసుకురా అని పిలువ లేకపోయారు. ఆ సమయంలో దేవతలకు అమృతం పోవడం చూసిన రాహువు అనే రాక్షసుడు దేవతా వేషంతో దేవతల వరుసలో జేరి అమృతం త్రాగాడు. అది చూసిన సూర్య చంద్రులు మోహినికి సైగ చేసారు. వెంటనే విష్ణుమూర్తి చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు. అమృతంతో కూడిన తల నిర్జీవం కాలేదు. మొండెం నేలపై కూలిపోయింది.

విష్ణువు ఒక్క చుక్క కూడా వదలకుండా అమృతమంతా దేవతలకు పోసి తన నిజరూపాన్ని దాల్చాడు. ఇది చూసిన రాక్షసులు అమృతాన్ని త్రాగడం కోసం కష్టపడి సముద్రాన్ని చిలికి చివరకు అమృతం పొందలేకపోయామని దుఃఖించారు. విష్ణుభక్తిలేని వివేకహీనులు తాము కోరిన సంపదలను పొంద లేరు. విష్ణుమూర్తి దేవతలను హెచ్చరించి గరుత్మంతుడిపై కూర్చొని తన నివాసానికి వెళ్ళిపోయాడు. తరువాత జరిగిన దేవాసుర యుద్ధంలో దేవతలు విజయం సాధించి మరల స్వర్గాన్ని సంపాదించుకున్నారు.

సముద్రాన్ని చిలికేటప్పుడు సముద్ర మధ్యంలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని మోయడంకోసం కూర్మావతారాన్ని ధరించిన విష్ణువు కథను వినినా, పాడినా, చదివినా సంసార సముద్రంలో మునిగిపోయే జనులు గొప్ప పుణ్యాన్ని, సుఖాన్నీ పొందుతారు.

శివుని “హాలాహలభక్షణం” కథను విన్నా, వ్రాసినా, చదివినా వారు భయానికి గురికారు. పాముల వల్లనూ, త్రేళ్ళ వల్లనూ, అగ్ని వల్లనూ కష్టాన్ని పొందరు.

మోహిని రూపం ధరించి ఆపదలో ఉన్న దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన ఆ విష్ణురూపాన్ని ఊహించి స్మరిస్తే, అది మన జీవితంలోనిపాపపు చీకట్లను రూపుమాపుతుంది.

*శుభం*

మరిన్ని కథలు

Chinni aasha
చిన్ని ఆశ..!
- ఇందుచంద్రన్
Taraalu antaranga raagaalu
తరాల అంతరంగ రాగాలు
- సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు
Sneha dharmam
స్నేహ ధర్మం
- వెంకటరమణ శర్మ పోడూరి
Nirnayam
నిర్ణయం
- జీడిగుంట నరసింహ మూర్తి
Toli prema
తొలి ప్రేమ..!
- ఇందుచంద్రన్
Nakka vaibhogam
నక్క వైభోగం
- నిశ్చలవిక్రమ శ్రీ హర్ష